స్కిన్ క్యాన్సర్: ఎండలో ఎక్కువసేపు పనిచేస్తే చర్మ క్యాన్సర్ వస్తుందా, ముందుగా కనిపించే లక్షణాలేంటి?

స్కిన్ క్యాన్సర్, లక్షణాలు, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చందన్ కుమార్ జజ్వారే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రముఖ బ్రిటిష్ చెఫ్ గోర్డాన్ రామ్సే ఇటీవల తాను స్కిన్ క్యాన్సర్ (చర్మ క్యాన్సర్‌)కు చికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు. గత వారం, ఆయన తన బేసల్ సెల్ కార్సినోమా (ఒక రకమైన నాన్-మెలనోమా క్యాన్సర్)ను తొలగించిన వైద్యులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా స్కిన్ క్యాన్సర్ సర్జరీ అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

స్కిన్ క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

నిజానికి, చర్మ క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్ల కొత్త చర్మ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2040 నాటికి వీటి సంఖ్య దాదాపు 50 శాతం పెరుగుతుందని అంచనా.

ఇంతకీ చర్మ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎలా, ముందుగా కనిపించే లక్షణాలేంటి? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
స్కిన్ క్యాన్సర్, లక్షణాలు, చికిత్స

ఫొటో సోర్స్, Vishal Bhatnagar/NurPhoto via Getty Images

స్కిన్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలేంటి?

సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలే ప్రపంచవ్యాప్తంగా స్కిన్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఈ కిరణాలలో క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాలు ఉంటాయి.

ఈ విషయంపై దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ )లో చర్మవ్యాధి నిపుణులు (డెర్మలాలజిస్ట్), ప్రొఫెసర్ సోమేశ్ గుప్తా మాట్లాడుతూ "ఎండలో పనిచేసే వారిలో స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏళ్ల తరబడి శరీరం.. ప్రతిరోజూ ఎక్కువసేపు ఎండలో ఉంటే, కొంతమందికి ఈ ప్రమాదం ఉండొచ్చు’’ అన్నారు.

ఎండలో పనిచేయడం అంటే పొలాలు, బహిరంగ ప్రదేశాలు ఇతర ప్రదేశాలలో పనిచేసే వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.

"చర్మం తక్కువ మందంతో ఉండే వ్యక్తులలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముదురురంగు చర్మం ఉపరితలంపై సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తుంది. కానీ, అది లోపలికి చేరుకోలేకపోతుంది. అందుకే ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత ప్రజలలో స్కిన్ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే, వారి చర్మం ఉత్తర భారతదేశ ప్రజల కంటే కొంచెం ముదురు రంగులో ఉంటుంది" అంటున్నారు డాక్టర్ సోమేశ్.

మన చర్మం పరిమితమైన అతినీలలోహిత కిరణాలను పొందితే, దాని కణాలు విటమిన్ 'డీ'ని ఉత్పత్తి చేస్తాయి. అదే ఎక్కువ సూర్యకాంతికి గురైతే మెలనిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో, అది టానింగ్ (చర్మం రంగు మారడం) కావడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.

క్రికెటర్ మైఖేల్ క్లార్క్ విషయంలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అతను చాలాకాలం బయట ఆడాడు. పైగా తెల్లగా ఉంటాడు.

ఇది కాకుండా, ఓజోన్ పొర అత్యధికంగా దెబ్బతిన్న దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి.

ఓజోన్ పొర దెబ్బతినడం అంటే, సూర్య కిరణాలతో వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు అడ్డుకునే వ్యవస్థ లేకపోవడమే. దీనివల్ల చర్మానికి ఎక్కువ నష్టం కలుగుతుంది.

సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులు గాజు కిటికీల ద్వారా వచ్చే సూర్యకాంతికి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

స్కిన్ క్యాన్సర్, లక్షణాలు, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

స్కిన్ క్యాన్సర్ లక్షణాలు..

స్కిన్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం అంత సులభం కాదు. ఈ వ్యాధితో బాధపడేవారిలో చాలామంది.. తొలుత ఈ లక్షణాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారని చెప్పవచ్చు.

ఎక్కువసేపు ప్రత్యక్ష సూర్యకాంతికి గురయ్యే శరీరంలోని ఏదైనా ఒక భాగంలో (ముఖం వంటివి) దద్దుర్లు లేదా గాయం లేదా పుండు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

"ఎత్తైన ప్రదేశాలలో, అంటే పర్వతాలపై నివసించే వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వారు ఎక్కువ యూవీ కిరణాలకు గురవుతారు. ఒకప్పుడు వారు ఉపయోగించిన కాంగ్రీ (కుంపటి లాంటిది) వల్ల కూడా ఈ వ్యాధి సంక్రమించేది" అని ఎయిమ్స్‌లో చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ కౌశల్ వర్మ తెలిపారు.

అంటే సూర్యరశ్మికి మాత్రమే కాదు, నిరంతరం వేడికి గురయ్యే వారికి కూడా సాధారణ ప్రజల కంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

చాలామంది వ్యాధి ముదిరిన తరువాత వస్తున్నట్టు ఎయిమ్స్‌లో పరిస్థితులు తెలుపుతున్నాయి. ఈ వ్యాధి ప్రారంభదశను ప్రజలు పెద్దగా పట్టించుకోరు.

స్కిన్ క్యాన్సర్, లక్షణాలు, చికిత్స

ఫొటో సోర్స్, AIIMS

ఎంత ప్రమాదకరం?

"ఇతర క్యాన్సర్ వ్యాధుల మాదిరిగానే, స్కిన్ క్యాన్సర్ ముదిరితే ప్రాణాంతకంగా మారుతుంది. రోగి త్వరగా వైద్యుడిని సంప్రదించి, ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభిస్తే, రక్షించడం సులభం" అని డాక్టర్ కౌశల్ వర్మ తెలిపారు.

స్కిన్ క్యాన్సర్‌లో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మెలనోమా. ఈ రకమైన క్యాన్సర్ కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. భారతదేశంలో ఈ కేసులు చాలా అరుదు. అంటే, ఈ రకమైన క్యాన్సర్ సాధారణంగా భారతదేశంలోని ప్రజలలో కనిపించదు.

ఇది ప్రాణాంతకం. సాధారణంగా, ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెలనోమా క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. ఇలా ప్రారంభ దశలో వచ్చే రోగులలో 90 శాతం మందికి నయమవుతుంది. కానీ, అదే వ్యాధి చివరి దశకు చేరుకుంటే, అలాంటి వారిలో 90 శాతం మందిని రక్షించడం కష్టమవుతుంది.

"ఇది కాకుండా, నాన్-మెలనోమా కూడా ఉంది. వీటిలో ఒకటి బేసల్ సెల్ కార్సినోమా. ఇది అంత వేగంగా వ్యాపించదు. మరొకటి స్క్వామస్ సెల్ కార్సినోమా, ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. బాగా ప్రమాదకరం కూడా " అని డాక్టర్ సోమేశ్ వివరించారు.

స్కిన్ క్యాన్సర్, లక్షణాలు, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

చికిత్స ఏమిటి?

నోయిడాలోని కైలాష్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్, డెర్మటాలజిస్ట్ డాక్టర్ అంజు ఝా మాట్లాడుతూ, "దేశంలో టైప్ 5 టైప్ 6 స్కిన్ క్యాన్సర్‌లు వస్తుంటాయి. ఇవి తక్కువ ప్రమాదకరమైనవి. అయితే, తెల్లటి చర్మం ఉన్నవారు టైప్ 1 టైప్ 2 పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది"అన్నారు.

"సాధారణంగా స్కిన్ క్యాన్సర్ లక్షణాలలో నొప్పి, మంట లేదా దురద ఉండవు, కాబట్టి ప్రజలు వాటిని గుర్తించలేరు. శరీరంలోని ఏదైనా భాగంలో సూర్యరశ్మికి ప్రత్యక్షంగా గురైన పుండు (గాయం) ఎక్కువ కాలం నయం కాకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి" అని ఆమె చెప్పారు.

రోగి చర్మంపై కనిపించే లక్షణాలు 'క్యాన్సర్' కు ప్రారంభ దశ అని మొదట్లోనే తెలిస్తే, దాని చికిత్స సులభం అవుతుంది. స్కిన్ క్యాన్సర్‌కు మోస్ సర్జరీ చేస్తారు.

  • సూర్యుని హానికరమైన కిరణాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ ఉపయోగించడం ఉత్తమ మార్గాలలో ఒకటని సాధారణంగా నమ్ముతుంటారు.
  • ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మెలనోమా స్కిన్ క్యాన్సర్ కేసులు హానికారక కిరణాల వల్ల సంభవిస్తాయి.
స్కిన్ క్యాన్సర్, లక్షణాలు, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

డాక్టర్ అంజు ఝా ప్రకారం, "చాలా సందర్భాలలో స్కిన్ క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. ప్రభావిత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు, కానీ దానిని నివారించడానికి ఉత్తమ మార్గం సన్‌స్క్రీన్ ఉపయోగించడం."

కానీ సన్‌స్క్రీన్‌ను ఎలా, ఎప్పుడు వాడాలో సాధారణ ప్రజలలో సరైన కచ్చితమైన సమాచారం లేదు.

"ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి దాదాపు 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి, ఎందుకంటే, ఇది వెంటనే పని చేయదు. దీనితో పాటు, రోజుకు కనీసం 2 లేదా 3 సార్లు ఉపయోగించడం అవసరం. ఎందుకంటే, ఇది దాదాపు 4 గంటలు మాత్రమే పనిచేస్తుంది" అని డాక్టర్ సోమేశ్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)