చంద్రమౌళి నాగమల్లయ్య: అమెరికాలో హత్యకు గురైన ఈయన ఎవరు, ట్రంప్ ఆయన గురించి ఎందుకు మాట్లాడారు?

ఫొటో సోర్స్, Chandramouli Nagamallaiah
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
అమెరికాలోని టెక్సస్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు.
50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్యపై అక్కడి ఉద్యోగి ఒకరు పదునైన ఆయుధంతో దాడి చేశారు. చంద్రమౌళి మృతిపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
చంద్రమౌళి బెంగళూరులో పెరిగారు. నగరంలోని తిప్పసంద్ర, ఆర్టీ నగర్‌లో ఉండేవారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం విచారకరమని బెంగళూరులో ఆయన నివాసం ప్రాంతంలో ఉండే కొందరు వ్యాఖ్యానించారు.
"అతనిపై మీకు కోపం రాదు. మీకు కోపం వస్తుందంటే ఆయన వెంటనే మీ చేయి పట్టుకుని నవ్వుతారు" అని చంద్రమౌళి స్నేహితుడు బీఎస్ వెంకటేష్ బీబీసీతో చెప్పారు.
"క్యూబా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారుడు చంద్రమౌళిని అతని భార్య, కొడుకు కళ్ల ముందే దారుణంగా హత్య చేశాడు. మన దేశంలో ఇలా ఎప్పుడూ జరక్కూడదు" అని ట్రంప్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
చంద్రమౌళి గురించి తెలిసినవారు ఏం చెప్పారు?
డాలస్‌లోని మోటెల్‌లో పని చేస్తున్న యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్, మోటెల్‌లోనే చంద్రమౌళిపై కత్తితో దాడి చేసి, దారుణంగా హత్య చేసినట్లు డాలస్ నుంచి వెలువడిన రిపోర్ట్‌లు చెబుతున్నాయి.
మోటెల్‌లోని ఒక గదిలో వాషింగ్ మెషీన్ పాడైందని, అది ఉపయోగించవద్దని మార్టినెజ్‌కు చెప్పాలని చంద్రమౌళి అక్కడి మహిళా ఉద్యోగికి చెప్పారు.
తనకు నేరుగా చెప్పకుండా మరో ఉద్యోగి ద్వారా చెప్పడంతో ఆగ్రహించిన మార్టినెజ్, పదునైన ఆయుధంతో చంద్రమౌళిపై దాడి చేసి చంపారని పోలీసులు తెలిపారు.
"మేము ఆ వీడియో చూశాం. అది చాలా భయంకరంగా ఉంది" అని చంద్రమౌళి ఇంటి పొరుగున ఉండే వ్యక్తి చెప్పారు.
చంద్రమౌళి బెంగళూరులో ఉన్నప్పుడు తిప్పసంద్రలో చిన్న రెస్టారెంట్ నడిపేవారు. తర్వాత ఆర్టీ నగర్‌కు మారి అక్కడ పేయింగ్ గెస్ట్ బిజినెస్ ప్రారంభించారు.
‘‘అతను మా అందరికీ తెలుసు. మంచి వ్యక్తి. ఆయనను హత్య చేశారని తెలిసి మేమందరం షాకయ్యాం. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాం" అని తిప్పసంద్ర మాజీ కార్పోరేటర్ అభిలాష్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘చంద్రమౌళిని హత్య చేశారంటే నమ్మశక్యంగా లేదు. అతను ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అదేంటో అర్థం కావడం లేదు" అని చంద్రమౌళి స్నేహితుడు వెంకటేష్ అన్నారు.
‘‘చంద్రమౌళి చాలా మంచి వ్యక్తి. అతనిని చంపేశారని తెలిసి చాలా బాధ కలిగింది. వాళ్లబ్బాయి, మా అబ్బాయి స్నేహితులు" అని ఆర్టీనగర్‌లో ప్రభుత్వ ఉద్యోగైన చంద్రమౌళి స్నేహితుడు చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.
చంద్రమౌళి వదిన, ఆమె భర్త కూడా డాలస్‌లో స్థిరపడ్డారనీ, అక్కడ మోటెల్ వ్యాపారం చేస్తున్నారని ఆ ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు.
బెంగళూరులో ఉంటున్న చంద్రమౌళి తల్లి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆమె తిప్పసంద్రలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ ఏమన్నారు?
ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది కేవలం హత్య మాత్రమే కాదని, అమెరికన్ల భద్రత, వలస విధానానికి సంబంధించి తీవ్రమైన సమస్య అని అన్నారు.
‘‘అతను గౌరవనీయమైన వ్యక్తి. క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఆయనను హత్య చేశాడు. ఇలాంటి వ్యక్తులు మన దేశంలో ఉండకూడదు’’ అని ట్రంప్ తన మెసేజ్‌లో పేర్కొన్నారు.
నిందితుడు గతంలోనూ అనేక నేరాలు చేసి అరెస్టైనట్లు ట్రంప్ చెప్పారు.
‘‘అతను గతంలో పిల్లలపై వేధింపులు, కారు దొంగతనం, అక్రమ నిర్బంధం వంటి భయంకరమైన నేరాల్లో అరెస్టయ్యాడు. అసమర్థ జో బైడెన్ పాలనలో క్యూబా అలాంటి వ్యక్తిని తమ దేశంలోకి రానీయలేదు. దీంతో అతను అమెరికాలోనే ఉన్నాడు’’ అని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ విడుదల చేసిన ప్రకటనలో అక్రమ వలసదారులపై కఠిన వైఖరి గురించి మరోసారి స్పష్టం చేశారు.
‘‘నేరాలకు పాల్పడుతున్న అక్రమ వలసదారుల పట్ల మెతకగా వ్యవహరించే సమయం ముగిసింది’’ అని అన్నారు.
చంద్రమౌళిని హత్య చేసిన కోబోస్ మార్టినెజ్ అక్రమ వలసదారుడని అతనిని అమెరికా నుంచి పంపించి వేయడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.
మార్టినెంజ్ ప్రస్తుతం డాలస్ నిర్బంధ కేంద్రంలో తమ అదుపులో ఉన్నాడని వెల్లడించింది.
అతని "నేరచరిత్ర కారణంగా" ఈ ఏడాది జనవరిలో క్యూబా అతన్ని తమ దేశంలోకి తీసుకోవడానికి అంగీకరించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














