WiFi: ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందా, రోజుకు ఎన్ని గంటలు ఆన్‌లో ఉంచాలి?

వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఇంక నిద్రపో, ఇప్పటికే రాత్రి పన్నెండయింది. ఆ ఫోన్ ఎంత సేపు చూస్తావ్’’

‘‘అమ్మా నేనిప్పుడే సినిమా చూడడం అయింది. పగలు వైఫై సరిగా రావడం లేదు’’

‘‘ఈ వైఫైని ఏదో ఒకటి చేయాలి’’

హైదరాబాద్‌లో నివసించే సరితకు, ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె కొడుకు అక్షర్‌కు ఇలాంటి మాటలు రోజూ ఉండేవే. రాత్రి పూట వారానికి మూడు, నాలుగు రోజులు వాళ్లిలా మాట్లాడుకుంటుంటారు.

వైఫై అంటే కొందరు వైర్‌లెస్ ఫిడిలిటీ అని చెబుతుంటారు. హైఫై అంటే హై ఫిడిలిటీ ఎలాగో అలా అన్నమాట. కానీ వైఫైకి ఫుల్ ఫామ్ ఏమీ లేదని ఇండస్ట్రీ బాడీ వైఫై అలయన్స్ చెప్పింది.

సింపుల్‌గా చెప్పాలంటే వైర్ల గుట్ట, కనెక్టర్లు లేకుండా ఇంటర్నెట్‌ను అనుసంధానించే టెక్నాలజీనే వైఫై. దీని ద్వారా మనం ఇంటర్నెట్ నుంచి సమాచారం పొందుతాం. ఒకరితో ఒకరం కమ్యూనికేట్ అవుతాం.

మరి అలాంటి వైఫైని నిరంతరం ఆన్ చేసి ఉంచడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లవంటి వాటిని కేబుల్స్‌లో పనిలేకుండా నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తుంది వైఫై.

వైర్‌లెస్ రూటర్ ద్వారా అది వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్(డబ్ల్యుఎల్ఏఎన్)‌ను క్రియేట్ చేస్తుంది.

మొబైల్ ఫోన్‌లకు విపరీతంగా అలవాటు పడడం గురించి మనకు తెలుసు. ఇప్పుడు వైఫై కొత్త వ్యసనంలా మారుతోంది. అయితే ఇప్పటిదాకా అంతగా చర్చకు రాని అంశం, ఇప్పుడిప్పుడే అందరి దృష్టికొస్తున్న విషయం ఒకటుంది.

పనిమీదయినా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసమైనా ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటివి రాత్రి పూట చాలాసేపు చూస్తుంటే రాత్రంతా వైఫై రూటర్ కూడా పని చేస్తూ ఉండే అవకాశం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాత్రిపూట వర్క్ చేయాలన్నా, టీవీలు, ఫోనుల్లో ఏమన్నా చూడాలన్నా వైఫై ఆన్‌లో ఉంచాల్సి వస్తుంది.

రాత్రిపూట వైఫైని ఆపేయాలా...ఉంచాలా?

రాత్రి వేళల్లో వైఫైని ఆన్ చేసి ఉంచడం మనిషి శరీరం, మెదడుకు సంబంధించిన నాడీవ్యవస్థకు హాని కలిగిస్తుందా?

''ఇలా జరుగుతుందని గ్యారంటీగా చెప్పలేం. ఎందుకుంటే శాస్త్రీయంగా ఇదింకా నిరూపితం కాలేదు'' అని దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని యశోద మెడిసిటీ కన్సల్టెంట్ (మినిమల్లీ ఇన్‌వాసివ్ న్యూరో సర్జరీ) డాక్టర్ దివ్య జ్యోతి చెప్పారు.

''బ్రెయిన్ ఇంపల్సెస్(మెదడు సంకేతాలు-న్యూరాన్ల మధ్య జరిగే ఈ సంకేతాల ప్రసారం వల్లే మనం ఆలోచించడం, గుర్తుంచుకోవడం, అటూఇటూ కదలడం, భావోద్వేగాలు ప్రదర్శించడం వంటివి జరుగుతాయి) అనేవి ఎలక్ట్రికల్ సంకేతాలు. వైఫై లేదా ఇతర పరికరాలు ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్స్ (ఈఎంఎఫ్)మీద ఆధారపడి ఉంటాయి. అందుకే వైఫై ప్రభావం మనపై పడుతుందని లాజికల్‌గా మనకనిపిస్తుంది'' అని డాక్టర్ తెలిపారు.

''మెదడు సంకేతాలపై వైఫై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి మనకు ఎలాంటి శాస్త్రీయ కారణాలు, వివరణలు, నిర్థరణ లేదు. మనం వీలయినంత మేర రాత్రిపూట వైఫై ఉపయోగించకూడదనేది లాజిక్'' అని అని దివ్య జ్యోతి చెప్పారు.

వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేడియేషన్ ప్రభావం పగలు, రాత్రీ తేడా ఉంటుంది.

బ్రెయిన్ ఇంపల్సెస్ అంటే ఏంటి?

బ్రెయిన్ ఇంపల్సెస్ అంటే న్యూరాన్లు సమాచారాన్ని కమ్యూనికేట్ చేసే, ప్రాసెస్ చేసే ఎలక్ట్రోకెమికల్ సంకేతాలు. ఈ నరాల ప్రేరణను యాక్షన్ పొటెన్షియల్స్ అని కూడా పిలుస్తారు.

ఈ సంకేతాలను మెదడుకు తీసుకువెళ్ళే నాడిని ఇంద్రియ నాడి అంటారు. ఇది మెదడుకు సందేశాన్ని చేరవేస్తుంది. అప్పుడే మనం చూపు, స్పర్శ, రుచి, వాసన వంటివి అనుభవించగలం.

వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో ఫోన్‌లు వచ్చి 30 ఏళ్లయింది.

పగలు, రాత్రి వేళల్లో వైఫై రూటర్ ప్రభావం ఎలా ఉంటుంది?

వైఫై రూటర్లను పగలు తప్ప రాత్రిపూట వాడకూడదా?

"పగటిపూట, రాత్రి వేళల్లో శరీరం, అది పని చేసే తీరులో తేడా ఉంటుంది. రాత్రిపూట, శరీర తరంగాలు భిన్నంగా ఉంటాయి. అవి నిద్ర తరంగాలు. రాత్రిపూట మంచి నిద్ర పోవడం చాలా ముఖ్యం" అని డాక్టర్ దివ్య జ్యోతి బీబీసీతో చెప్పారు.

"మెదడు విశ్రాంతి తీసుకోవడానికి, గాఢ నిద్ర పోవడానికి, శరీరం పూర్తి విశ్రాంతి పొందడానికి రాత్రిపూట వైఫైని ఆపివేయాలని అంటారు. పగటిపూట మనం పని చేయాలి కాబట్టి నిద్రకు భంగం కలగదు. అయితే లాజిక్ ఏంటంటే రూటర్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది'' అని దివ్యజ్యోతి చెప్పారు.

వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిద్రపోయేటప్పుడు ఫోన్ పక్కనపెట్టుకోకపోవడమే మంచిది

నిద్రించేటప్పుడు ఫోన్‌లు దగ్గర పెట్టుకోవచ్చా?

రాత్రిపూట వైఫైకి దూరంగా ఉండటం ఓకే. మరి మనం నిద్రపోయేటప్పుడు దిండు దగ్గర ఉంచుకునే ఫోన్ సంగతేంటి?

మొబైల్ ఫోన్లు కూడా మైక్రోవేవ్‌లపై ఆధారపడి ఉంటాయి. అవి కూడా ఒక రకమైన రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వాటి ఫ్రీక్వెన్సీ మాత్రమే భిన్నంగా ఉంటుంది. లాజికల్‌గా ఆలోచిస్తే అవి కూడా మనపై ప్రభావం చూపుతాయి. మనం ఫోన్ ఉపయోగించకపోయినప్పటికీ విద్యుదయస్కాంత తరంగాలు యాక్టివ్‌గా ఉంటాయి.

"ఫోన్లు, వై-ఫై నుంచి వెలువడే రేడియేషన్‌తో పోలిస్తే బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్(మన చుట్టూ సహజంగా ఉండే రేడియేషన్) చాలా ఎక్కువ. ఈ రెండింటి వల్ల ఎక్స్‌పోజర్ మరీ ఎక్కువ పెరుగుతుందా అని అడిగితే లేదనేదే సమాధానం. దీంతో పోలిస్తే, బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్‌కు మన ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువ" అని డాక్టర్ దివ్య జ్యోతి అన్నారు.

మన ఇంట్లో లేదా ఆఫీసులో ఉండే ప్రతీ ఉపకరణం రేడియేషన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు. టీవీ, ఫ్రిజ్, ఏసీ ఇలా ఏ విద్యుత్ ఉపకరణానికి అయినా విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి.

ఎక్కువగా ఈఎంఎఫ్‌ (ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్) బారిన పడే ప్రమాదం ఉందంటే మనం నిద్రించే గదిలో రూటర్‌ను ఉంచుకోవద్దని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, రూటర్‌ను మనం పడుకునే చోటు నుంచి దూరంగా ఉంచొచ్చని తెలిపారు.

వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పదేళ్లకాలంలో వైఫై వాడకం బాగా పెరిగింది.

టెక్నాలజీ నిపుణులు ఏమంటున్నారు?

ఆరోగ్య నిపుణులతోనే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన నిపుణులతో కూడా ఈ అంశాన్ని చర్చించాం.

దీని గురించి కచ్చితమైన సమాచారం లేదని, చాలా గందరగోళం నెలకొందని దివ్యజ్యోతి అంటున్నారు. ఈ తరంగాలు లేదా ఈఎంఎఫ్ వల్ల ఎంత హాని కలుగుతుందో దాని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడానికి ఒక అధ్యయనం చేయాలి.

''రాత్రిపూట మనం బాగా నిద్రపోవాలంటే వైఫైని ఆఫ్ చేయాలని, వైఫైని ఆన్‌లో ఉంచడం వల్ల మన నాడీ వ్యవస్థ లేదా మరే ఇతర వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని నిరూపించగల అధ్యయనం ఏదీ లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. ఏ రకమైన రేడియో తరంగాల ప్రభావానికైనా అతిగా లోనుకావడం వల్ల దీర్ఘకాలంలో ప్రభావాలు ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు'' అని టెక్నాలజీ నిపుణులు మొహమ్మద్ ఫైసల్ అలీ చెప్పారు.

"మొబైల్ మొదలైన 1995-96 నుంచి చూసుకుంటే, మొత్తం ప్రయాణం ముప్పై సంవత్సరాలు. గత పదేళ్లలో భారత్‌లో మొబైల్, వైఫై పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది" అని అలీ బీబీసీకి చెప్పారు.

"కాబట్టి భవిష్యత్తులో ఈ వస్తువులు ఈ హానిని కలిగిస్తాయని, అందువల్ల వాటిని పరిమితుల్లోనే ఉపయోగించాలని ఏదైనా ఒక అధ్యయనం తేల్చొచ్చు. ప్రస్తుతానికైతే అలాంటిదేమీ లేదు" అని అలీ తెలిపారు.

వైఫై, మొబైల్ ఇంటర్నెట్, రూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

మొబైల్ ఇంటర్‌నెట్ సంగతేంటి?

"అది విద్యుదయస్కాంత క్షేత్రాలైనా లేదా రేడియో తరంగాలైనా, వాటికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం సరికాదనే భావన ఉంది. ఇప్పుడు మన దగ్గర మెరుగైన డేటా ఉంది కాబట్టి, దీనిపై కచ్చితంగా అధ్యయనం చేయాలి. నా జ్ఞానం, అవగాహన ప్రకారం, ఇవి కొన్నిసార్లు మనం భయపడేంత హాని కలిగించవు" అని ఫైసల్ అలీ చెప్పారు.

రేడియేషన్, తరంగాలు లేదా ఈఎంఎఫ్...శరీరంపై ఎలాంటి చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులను ప్రశ్నించాం.

"మామూలుగా ఇది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల పగటిపూట మనం పనిచేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత, దృష్టి పెట్టడం తగ్గుతాయి. దీంతో పాటు శరీరంలో కణుతుల నిర్మాణం, పెరుగుదలకు రేడియేషన్‌కు సంబంధం ఉంది" అని డాక్టర్ దివ్యజ్యోతి అన్నారు.

వైఫైతో పాటు, మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. భారతదేశంలోని చాలా మొబైల్ ఫోన్లు ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌లో నడుస్తున్నాయి. ఆరు సంవత్సరాల కిందట యూరప్‌లో 5జీ ప్రవేశపెట్టినప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)