ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలు: పీపీపీ అయితే నష్టమేంటి? ప్రభుత్వంలో ఉంటే లాభమేంటి?

మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్, పీపీపీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్ర ప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలను అధికార పక్షం తిరస్కరిస్తోంది.

ఇంతకీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతికి మెడికల్ కాలేజీలు అప్పగిస్తే ఎవరికి నష్టం?

సామాన్యుడి వైద్యంపైన, ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలపైన ఇది ఎటువంటి ప్రభావం చూపుతుంది?

వీటిలో జగన్ హయాంలో ఏవి మొదలయ్యాయి? చంద్రబాబు హయాంలో ఏం జరుగుతోంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రైవేటు మెడికల్ కాలేజీల మధ్య తేడా ఏంటి?

ఇది అర్థమైతే ఈ కాలేజీల వ్యవహారం సామాన్యులకు కూడా ఎందుకు ముఖ్యమో తెలుస్తుంది.

రోగుల వైద్యం ఖర్చు

  • ప్రభుత్వ కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందుతుంది.
  • ప్రైవేటు కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో వైద్యానికి ఫీజు ఉంటుంది. అది ఆ సంస్థ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. (విద్యార్థులకు ప్రాక్టీసు కోసం రోగులు రావాలి కాబట్టి కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని సందర్భాల్లో తక్కువ ఖర్చు పెడుతుంటాయి. అలాగని అది నిబంధన కాదు. అయితే ఇది అన్ని సేవలూ ఉచితంగా ఇవ్వాలని కాదు. సాధారణంగా ఔట్ పేషెంట్ సేవలు మాత్రం ఇలా చవగ్గా అందిస్తారు. ఇన్ పేషెంట్ సేవలకు ఉచితాలు ఉండవు లేదా అన్ని విభాగాల వైద్యులూ ఉండకపోవచ్చు.)

వైద్య విద్య ఖర్చు

  • ప్రభుత్వానిదైతే సాధారణ సీటు పొందిన వారికి ఫీజు వేలల్లో ఉంటుంది. అంటే తక్కువ ఆదాయం ఉన్న వారు కూడా ఎంబీబీఎస్ సులువుగా చదవగలరు.
  • ప్రైవేటు అయితే సాధారణ సీటుకు కూడా ఫీజు లక్షల్లో ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వారు ఎంబీబీఎస్ చదవడానికి కష్టపడాల్సి ఉండొచ్చు.

దీంతో, కొత్తగా కట్టబోయే మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలని, అప్పుడే రోగులకు చవగ్గా వైద్యం, పేద, మధ్య తరగతి పిల్లలకు తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ సీట్లు వస్తాయనేది పీపీపీని వ్యతిరేకించే వారి వాదన.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో మెడికోస్ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఆల వేంకటేశ్వర్లు విభేదించారు.

''వైద్య విద్యలో ప్రభుత్వాన్ని కొట్టేది లేదు. ప్రభుత్వ రంగంలో అత్యంత తక్కువ స్థాయి కాలేజీలో, ప్రైవేటు రంగంలోని బెస్ట్ కాలేజీ కంటే మంచి విద్యార్థులు చేరతారు. ఈ రంగంలో ప్రభుత్వానికి ఉన్న క్రేజ్ అలాంటిది.

పీపీపీ పద్ధతిలో ఒకరు ఎంబీబీఎస్ చదవాలంటే రూ.75 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ అవుతుంది. అంత డబ్బు పెట్టగలిగేవారు ఎందరు? అంటే ఈ కాలేజీల్లో సీట్లన్నీ అలాంటి వారికి కట్టబెడుతున్నట్టే కదా?'' అని ఆరోపించారు వేంకటేశ్వర్లు.

తాము 17 మెడికల్ కాలేజీలు తెస్తే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తే, అసలు వైసీపీ అన్ని కాలేజీలు కట్టలేదని, వాటిలో చాలా వరకూ ఇప్పటికీ పునాదులు కూడా దాటలేదని టీడీపీ అంటోంది.

ఆ లోతుల్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం ఆంధ్రలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి? ఏ కాలేజీల చుట్టూ వివాదం నెలకొందో చూద్దాం.

ఈ 19లో చివరి 6 కాలేజీలు తాజాగా వివాదానికి కారణమైన 17 జాబితాలో ఉన్నాయి.

ప్రతిపాదిత 17 కాలేజీల జాబితా

  • విజయనగరం
  • నర్సీపట్నం
  • అమలాపురం
  • రాజమహేంద్రవరం
  • పాలకొల్లు
  • ఏలూరు
  • బాపట్ల
  • మార్కాపురం
  • మదనపల్లె
  • పెనుకొండ
  • నంద్యాల
  • ఆదోని
  • మచిలీపట్నం
  • పిడుగురాళ్ల
  • పులివెందుల
  • పాడేరు
  • పార్వతీపురం
మెడికల్ కాలేజీ, విజయనగరం
ఫొటో క్యాప్షన్, విజయనగరం మెడికల్ కాలేజీ

జిల్లాకో మెడికల్ కాలేజీ ఆలోచనతో..

2014లో కేంద్రం ఒక పథకం తీసుకువచ్చి జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాలని ప్రతిపాదించింది. అందులో కొన్నింటికి 60 శాతం ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చింది.

ఆ క్రమంలో ప్రతి పార్లమెంటు నియోజకర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించాలని, మొత్తం 17 మెడికల్ కాలేజీలకు రూ.8,480 కోట్ల ఖర్చు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం భావించింది.

వీటిలో పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఖర్చును సాయంగా అందిస్తుంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల కాలేజీలకు ఎస్ఏఎస్‌సీఐ పథకం కింద కేంద్రం నిధులు, మిగిలిన 11 కాలేజీలు నాబార్డు నిధులతో నిర్మించాలని అప్పటి ప్రభుత్వ ఆలోచన.

అయితే వీటిలో వైసీపీ హయాంలో 5 కాలేజీలను మాత్రమే ప్రారంభించగలిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పాడేరు కాలేజీ ప్రారంభమైంది. అంటే మొత్తం 6 పూర్తయ్యాయి.

విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలకు 2023లో అనుమతి రాగా, 2023-24 విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. పాడేరు కాలేజీకి 2024లో అనుమతి రాగా, 2024-25లో మొదలైంది.

అయితే మిగిలిన వాటిలో 10 కాలేజీలు.. అంటే పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కాలేజీలను మొదటి విడతలోను, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలను రెండో విడతలోను పీపీపీకి ఇవ్వాలనేది ఇప్పటి ఏపీ ప్రభుత్వ ఆలోచన.

పిడుగురాళ్ల కాలేజీకి కేంద్ర సహాయం ఉన్నందున దాన్ని ప్రభుత్వమే నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీటిలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను యాన్యువల్ కన్సెషన్ ఫీ మోడల్ పద్ధతిలో ఫేజ్ 1లో పీపీపీకి ఇవ్వాలని కేపీఎంజీ సంస్థ సూచించింది. మిగిలినవి అధ్యయనాలు పూర్తయ్యాక ఇస్తారు. ఈ మేరకు జీవో నంబర్ 590 విడుదలైంది.

మెడికల్ కాలేజీ, పులివెందుల

ఫొటో సోర్స్, X/@YSRCParty

ఫొటో క్యాప్షన్, పులివెందుల మెడికల్ కాలేజీ కోసం అనుబంధ ఆసుపత్రి (ఫైల్ ఫోటో)

చంద్రబాబు – జగన్.. ఎవరెన్ని కట్టారు?

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2014-2019 మధ్య ఒక్క రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్ మాత్రం ప్రారంభమైంది.

2019-2024 మధ్య ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు జరిపాయి.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్మిషన్లు జరిపిన పాడేరు కాలేజీ కూడా వైసీపీ ఖాతాలో చూపితే, బాబు హయాంలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా, జగన్ హయాంలో 6 మెడికల్ కాలేజీలు ప్రారంభమైనట్లు.

సాంకేతికంగా పాడేరు మెడికల్ కాలేజీ సాంకేతికంగా టీడీపీ హయాంలో ప్రారంభమైనప్పటికీ, పనులు పూర్తయింది మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే.

అదే సమయంలో వైసీపీ చెప్పుకుంటున్నట్టు 17 కాలేజీలను వారి హయాంలో పూర్తి చేయలేదు. అందులో 11 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలావరకూ పునాదుల దగ్గరే ఉండిపోయాయి. పూర్తయిన 6 కాలేజీల్లో కూడా సిబ్బంది కొరత ఉంది.

ఇక్కడ ప్రారంభం అంటే 'అడ్మిషన్లు జరగడం' అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఆయా కాలేజీలకు పూర్తి స్థాయి భవనాలు, పూర్తి స్థాయి సిబ్బంది ఇంకా కొన్ని చోట్ల లేకపోవచ్చు.

''జగన్ హయాంలో పాడేరులో పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడం వల్లనే ఎన్ఎంసీ 150కి బదులు 50 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది. గత ప్రభుత్వం వలన 100 సీట్లు కోల్పోయినట్టు అయింది'' అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ విమర్శించారు.

''17 కాలేజీలకు రూ.8,480 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, జగన్ ఐదేళ్లలో కేవలం రూ.476 కోట్లే ఖర్చు చేశారు. కేంద్రం మరో రూ.975 కోట్లు ఇచ్చింది. ఇందులో 75% నిధులు నాబార్డు నుంచి, కేంద్రం నుంచి అందాయి. గత ప్రభుత్వం దిగే సమయానికి నిర్మాణాలు చేపట్టిన సంసలకు రూ.650 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 5 వైద్య కళాశాలల నిర్మాణాలకు రూ.2,525 కోట్లకుగాను కేవలం రూ.631 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. పులివెందుల వైద్య కళాశాలలో రూ.168 కోట్ల విలువైన బిల్లులను పెండింగులో పెట్టారు'' అని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.

వైఎస్ జగన్ నిర్మించినట్లు చెబుతున్న మెడికల్ కాలేజీల్లో కనీసం సిబ్బందిని కూడా నియమించలేదని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు.

''గత ప్రభుత్వంలో మార్కాపురం కాలేజీని 17 శాతం, మదనపల్లె కాలేజీని 12 శాతం, పులివెందుల కాలేజీని 77 శాతం, ఆదోని కాలేజీ 15 శాతం మాత్రమే పూర్తి చేశారు. అన్ని కాలేజీలకు కలిపి చేయాల్సిన ఖర్చులో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు.

గత ప్రభుత్వ హయాంలో ఐదు కాలేజీలు నిర్మించినట్లు చెప్పుకొంటున్న వాటిల్లోనూ కనీసం సిబ్బందిని కూడా నియమించలేదు. హాస్టళ్లు అందుబాటులో లేవు. అడ్మినిస్ట్రేషన్ విధానం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో అరకొర వసతులతోనే కళాశాలలు ప్రారంభమయ్యాయి.

పులివెందుల కాలేజీకి రూ.500 కోట్ల అంచనాలో రూ.412 కోట్ల ప‌నులు పూర్తి చేసి, మార్కాపురం, మ‌ద‌న‌ప‌ల్లె, ఆదోని కాలేజీలు మూడూ కలిపి రూ.126 కోట్ల పనులు మాత్రమే చేశారు'' అని మంత్రి అన్నారు.

ఈ వాదనలను వైసీపీ తప్పు పట్టింది.

''17 మెడికల్ కాలేజీలను ఒక్క రాత్రిలో ఎవరూ నిర్మించలేరు. అందుకే ఒక ప్రణాళిక వేసుకుని ఆ దిశగా కార్యాచరణను అమలు చేస్తూ వచ్చారు.

17 కొత్త మెడికల్ కాలేజీల్లో 2023-24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించారు.

2024-25లో మరో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ కాలేజీల్లో తొలి ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించడానికి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చంద్రబాబు సర్కారు ప్రైవేటుకు కట్టబెట్టాలన్న కుట్రతో ఎన్ఎంసీకి లేఖ రాసి ఆ సీట్లను రద్దు చేయించింది నిజం కాదా? ఫలితంగా పాడేరు మెడికల్ కాలేజీ మాత్రమే ప్రారంభమైంది. పులివెందుల కాలేజీకి కూడా సీట్లు వద్దని లేఖ రాశారు'' అని వైసీపీ ఒక ప్రకటనలో ఆరోపించింది.

పులివెందుల కాలేజీ విషయంలో వైసీపీ ఆరోపణపై ప్రస్తుత వైద్య శాఖ మంత్రి కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది. వారి నుంచి సమాధానం రావాల్సి ఉంది.

మెడికల్ కాలేజీ, ఏపీ, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'జగన్ ఐదు కాలేజీలే తీసుకొచ్చారు'

కేంద్రం విస్తృతంగా మెడికల్ కాలేజీలు ఇస్తున్న సమయంలో అంటే, 2019-24 మధ్య తెలంగాణ 38, తమిళనాడు 29, కర్ణాటక 16, ఉత్తరప్రదేశ్ 40, అస్సాం 8, మహారాష్ట్ర 28, రాజస్థాన్ 21 మెడికల్ కాలేజీలు సాధించుకోగా జగన్ నాయకత్వంలోని ఏపీ మాత్రం కేవలం 5 మాత్రమే సాధించిందని టీడీపీ విమర్శిస్తోంది.

అన్ని రాష్ట్రాలూ అన్నేసి కాలేజీలు పూర్తి చేస్తే జగన్ చేయలేకపోయారంటూ బాపట్ల, ఆదోని, పెనుకొండ, అమలాపురం, మదనపల్లె, పాలకొల్లుల్లో పునాదుల దశల్లో ఉన్న మెడికల్ కాలేజీల వీడియోలను టీడీపీ పోస్ట్ చేసింది.

అయితే ఆ ప్రశ్న వేసిన టీడీపీ ఆ మిగిలిన 11 కాలేజీలనూ తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మాత్రం చెప్పడం లేదు. నిధులు లేవు కాబట్టి ప్రైవేటుకు ఇస్తామని అంటోంది.

''కేవలం పాడేరులో మాత్రమే ప్రవేశాలు జరిపి, పులివెందుల ప్రవేశాలను చంద్రబాబు ప్రభుత్వం ఆపింది. 2025లో అడ్మిషన్స్ జరిపేందుకు మదనపల్లె, ఆదోని, పిడుగురాళ్ల, పులివెందులలో అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం ప్రయత్నించలేదు. పాడేరులో సీట్ల పెంపుదలకు ఉన్న మార్గం కూడా వదిలేసింది'' అని ఆరోపిస్తోంది వైసీపీ.

మరోవైపు ఇప్పటికే నిర్మించిన కాలేజీల్లో వసతులు లేవని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. పులివెందుల కళాశాలలో 47.51%, మార్కాపురం కళాశాలలో 41.51%, ఆదోని కళాశాలలో 36.47% చొప్పున బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు ఎన్ఎంసీ పేర్కొందని తెలిపారు.

అంత ఖర్చు పెట్టలేం అంటున్న ప్రభుత్వం

కొత్త కాలేజీలపై ప్రభుత్వం సుమారు రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అంత ఖర్చు తాము పెట్టలేమని ప్రభుత్వం తేల్చింది. జగన్ పెట్టిన వేగంతో ఖర్చు చేయాలంటే, కాలేజీలు పూర్తి చేయడానికి 16 ఏళ్ళు పడుతుంది అంటున్నారు సత్య కుమార్.

''ఇంకా పూర్తి చేయాల్సిన 12 క‌ళాశాల‌ల్లో 150 సీట్లు చొప్పున మొత్తం 1650 సీట్ల కోసం రెండేళ్ళలో రూ.6,000 కోట్ల విలువైన నిర్మాణ ప‌నులు చేయ‌డంతో పాటు, భారీగా బోధ‌నా సిబ్బందిని నియ‌మించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమా'' అని సత్యకుమార్ అన్నారు.

''సదుపాయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా 2022 వ‌ర‌కు జాతీయ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. ఆ ప్రకారమే జగన్ హయాంలో 5 కాలేజీలకు అనుమతి వచ్చింది. కానీ 2023లో స‌వ‌రించిన నిబంధ‌న‌ల మేర‌కు 2024-25 ఏడాదికి పాడేరులో 150 సీట్లు అడిగితే, మౌలిక వసతులు లేవని 50 సీట్లకే అనుమతించారు'' అని మంత్రి సత్య కుమార్ అన్నారు.

ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్యం అందే రంగంలో ప్రభుత్వం తాము ఖర్చు పెట్టలేమని ప్రకటన చేయడం చర్చనీయాంశంగా ఉంది.

ప్రస్తుత పీపీపీ మోడల్ ఎలాంటిది?

సాధారణంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి కలసి ఉంటాయి. మెడికల్ విద్యలో పీపీపీని కేంద్రం అనుమతిస్తోంది. గుజరాత్, కర్ణాటకలు ఈ పద్ధతిలోకి వెళ్లాయి.

తాజాగా కూటమి ప్రభుత్వం చెబుతున్న పీపీపీ మోడల్ గురించి మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన ఇచ్చారు.

''మెడికల్ కాలేజీను ప్రభుత్వాల కన్నా ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తేనే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. నిర్మాణం పూర్తైన కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. నిధులు లేక మూలనపడ్డ కాలేజీలను పీపీపీ విధానంలో నడిపిస్తాం. ఒక ఆసుపత్రిని నిర్మించి, నిర్వహించి, ఆ తర్వాత నిర్ణీత కాలానికి ప్రభుత్వానికి తిరిగి అప్పగించేలా ఒప్పందం చేసుకుంటాం. ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మాణ సంస్థలు 420 పడకల ఆసుపత్రులను నిర్వహించి, వాటిని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసేలా ఒప్పందం ఉంది'' అన్నారాయన.

''పీపీపీ విధానంలో నిర్మించిన ఆసుపత్రుల్లో అందరికీ అందుబాటులో, తక్కువ ఖర్చుతో వైద్యం ఉండేలా నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందులో ఓపీ పూర్తిగా ఉచితం. రోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇన్-పేషెంట్ సేవల్లో 70 శాతం పడకలకు పీఎంజేఏవై, ఎన్టీఆర్ వీఎస్టీ, సీజీహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. ఓపీడీ రోగులకు ఉచితంగా జనరిక్ మందులను అందజేస్తాం'' అని వివరించారు మంత్రి దుర్గేష్.

ఈ కాలేజీలను లాభార్జన లేని సొసైటీలు, ట్రస్టులకు లేదా సెక్షన్ 8 (లాభాపేక్ష లేని) కంపెనీలకు మాత్రమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.

'ప్రైవేటు సంస్థలు సేవ చేస్తాయా?'

''ప్రైవేటు మెడికల్ కాలేజీ వారు సిబ్బందిని పెట్టుకోరు. తనిఖీల సమయంలో ఒక రోజు కోసం వైద్యులను తీసుకువచ్చి, చూపించి అనుమతులు తెచ్చుకుంటారు. అది కూడా లాభం వచ్చే కొన్ని డిపార్ట్‌మెంట్లనే నడిపిస్తారు. దగ్గర్లోని ఏదైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు వెళ్లి చూడండి. మీకే అర్థమవుతుంది జనం ఎక్కడ ఉన్నారో. ఇక ట్రస్టులకు ఇస్తామనడం ఉపయోగం లేనిది. అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలనూ ట్రస్టులే నడుపుతాయి. అంతమాత్రాన వారు లాభం కోసం పనిచేయరని కాదు. ఆ ట్రస్టులకు ఇచ్చే బదులు వారే నడపవచ్చు కదా?'' అని డాక్టర్ ఆల వేంకటేశ్వర్లు అన్నారు.

ప్రైవేటు సంస్థలు లాభం కోసం పనిచేస్తాయి తప్ప, సేవ చేయవు కదా అన్నది వారి ప్రశ్న.

అదే నిజమైతే ఇంకా పునాదుల దశంలో ఉన్న పార్వతీపురం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల కాలేజీలు కాకుండా ఎక్కువ మొత్తంలో పనులు జరిగిన ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికే అనేది పీపీపీ వ్యతిరేకుల ఆరోపణ.

ఈ క్రమంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ ప్రభుత్వం వస్తే పీపీపీలను రద్దు చేస్తామని, ఎవరూ ముందుకు రావద్దని సూచించారు.

మెడికల్ సీట్లు, ఏపీ

ఫొటో సోర్స్, Getty Images

సగం సీట్లు ప్రైవేటు చేసిన జగన్, మొత్తం ప్రైవేటు అంటున్న బాబు

వాస్తవానికి ప్రభుత్వం నిర్మించే కాలేజీల్లో కూడా పేద, మధ్య తరగతికి అందని రీతిలో ఎంబీబీఎస్ ఫీజు రూ. లక్షల్లో ఉండేలా సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాలో ఇవ్వడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

2023 నాటి ఆ ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ సీట్లను 50 శాతం చేశారు. వీటిలో 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కింద ఇస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ ఫీజు రూ.20 లక్షలు ఉంటుంది.

ఇప్పుడు ప్రభుత్వ తాజా ప్రతిపాదనలతో సగం కాదు, మొత్తం సీట్లు ప్రైవేటుకు వెళ్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)