వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులలో ఏముంది?

వక్ఫ్ ఆస్తులు, వక్ఫ్ సవరణ చట్టం, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

వక్ఫ్ సవరణ చట్టం 2025పై మొత్తంగా స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు చట్టంలో కొన్ని కీలకమైన ప్రొవిజన్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 100 మందికి పైగా పిటిషన్లు దాఖలు చేశారు.

కొత్త చట్టం వక్ఫ్ బోర్డుల్లో సంస్కరణలు, పారదర్శకత తీసుకువస్తాయని ప్రభుత్వం చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వక్ఫ్ ఆస్తులు, వక్ఫ్ సవరణ చట్టం, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల సంఖ్య మూడు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ఆ సంఖ్య నాలుగుకు మించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మే నెలలో వరుసగా మూడు రోజుల పాటు ఈ కేసును విచారించింది. మే 22న తీర్పును రిజర్వ్ చేసింది.

తాజాగా వక్ఫ్ సవరణ చట్టాన్ని పూర్తిగా నిషేధించడానికి నిరాకరిస్తూనే, కొన్ని విభాగాల రక్షణ అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

  • రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల సంఖ్య ముగ్గురిని మించరాదని, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ఆ సంఖ్య నలుగురిని మించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.
  • వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తి ప్రభుత్వ ఆస్తా, కాదా అనేది నిర్ణయించడానికి జిల్లా మేజిస్ట్రేట్‌కు అధికారం ఉన్న సెక్షన్‌ను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది.
  • పౌరుల వ్యక్తిగత హక్కులపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్‌కు అనుమతి లేదని తెలిపింది. అది అధికారాల వికేంద్రీకరణను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
  • ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే ముందు ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించి ఉండాలన్న షరతుకు కూడా కొత్త నియమాలు రూపొందించే వరకు స్టే వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
వక్ఫ్ ఆస్తులు, వక్ఫ్ సవరణ చట్టం, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

ఏప్రిల్‌లో ఏం జరిగింది?

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు విచారించింది. ఈ విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పలు అభిప్రాయాలను రికార్డు చేసింది.

ఈ చట్టానికి సంబంధించిన కొన్ని సెక్షన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని కూడా అప్పట్లో ధర్మాసనం తెలిపింది.

హిందూ మతానికి చెందిన ట్రస్టులో ముస్లిం లేదా హిందూయేతర వ్యక్తికి స్థానం కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు తన అభిప్రాయాలను కూడా వినాలని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి వంటి సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.

వక్ఫ్ సవరణ చట్టంలో చేసిన అనేక సవరణలు మతపరమైన విషయాల నిర్వహణలో ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయని ఈ న్యాయవాదులు వాదించారు.

అదే సమయంలో, వారు వక్ఫ్ బై యూజర్ నిబంధనలను, అంటే ఒక ఆస్తి ప్రభుత్వానిదా, కాదా అని నిర్ణయించే ప్రభుత్వ అధికారిని, అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను చేర్చడాన్ని సవాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సవరించిన చట్టాన్ని సమర్థించారు.

ఈ అంశాలన్నీ పార్లమెంటులో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముందు చర్చకు వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుందని ఆయన వాదించారు.

వక్ఫ్ ఆస్తులు, వక్ఫ్ సవరణ చట్టం, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌లో ఆందోళనలు జరిగాయి.

పిటిషన్ ఎవరు దాఖలు చేశారు?

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో

ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఆల్ కేరళ జమియతుల్ ఉలేమా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా వంటివారున్నారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధత గురించి వారు ప్రశ్నించారు.

ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత బీజేపీ పాలిత ఆరు రాష్ట్రాలు ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిలో హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం ఉన్నాయి.

చట్ట సవరణ వల్ల జరిగే పరిణామాలను పేర్కొంటూ ఈ రాష్ట్రాలన్నీ వివిధ పిటిషన్లు దాఖలు చేశాయి.

మైనారిటీల మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం, వక్ఫ్ బోర్డుకు భారత్‌లో దాదాపు 8,72,351వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇది దాదాపు 9 లక్షల40వేల ఎకరాల్లో ఉన్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)