‘‘మీరు సిద్ధమైతే, నేనూ సిద్ధమే’’ అని నేటో దేశాలతో ట్రంప్ ఎందుకు చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, రాచెల్ ముల్లర్-హెన్డిక్, జో ఇన్వుడ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే నేటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపడం సహా కొన్ని షరతులను పాటించాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
రష్యాపై కఠిన చర్యలు తీసుకుంటామని డోనల్డ్ ట్రంప్ తరచూ బెదిరిస్తున్నారు. కానీ, తన గడువులు, ఆంక్షల హెచ్చరికలను క్రెమ్లిన్ విస్మరించినా ఆయన ఇప్పటివరకు ఎలాంటి చర్యా తీసుకోలేదు.
ట్రూత్ సోషల్‌లో డోనల్డ్ ట్రంప్ పెట్టిన ఒక పోస్ట్‌లో 'రష్యన్ చమురు కొనుగోలు చేయడం షాకింగ్' అని అభిప్రాయపడ్డారు.
చైనాపై నేటో 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని, అప్పుడే రష్యాపై చైనా ప్రభావం తగ్గుతుందని ట్రంప్ సూచించారు.

నేటో దేశాలకు లేఖ
"మీరు సిద్ధమైతే నేనూ సిద్ధమే. ఎప్పుడు చేయాలో చెప్పండి" అని నేటో దేశాలకు రాసిన లేఖలో ట్రంప్ తెలిపారు.
"కొంతమంది రష్యన్ చమురు కొనుగోలు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది! ఇది రష్యాపై మీ చర్చల స్థానాన్ని, బేరసారాల శక్తిని బలహీనపరుస్తుంది" అని ఆయన చెప్పారు.
రష్యన్ ఇంధన కొనుగోళ్లను నిలిపివేయడం, యుద్ధం తర్వాత ఎత్తివేయాలనుకుంటున్న చైనా భారీ సుంకాలు ఘర్షణకు ముగింపు పలకడానికి గొప్పగా సహాయపడతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు, యుక్రెయిన్‌పై మాస్కో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ ఇంధనంపై యూరప్ ఆధారపడటం తగ్గింది. 2022లో ఈయూ తన గ్యాస్‌లో దాదాపు 45 శాతం రష్యా నుంచి పొందింది. ఈ సంవత్సరం అది దాదాపు 13 శాతానికి తగ్గుతుందని అంచనా. అయితే ట్రంప్ మాటలు పరిశీలిస్తే ఈ గణాంకాలు సరిపోవని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బుధవారం డజనుకు పైగా రష్యన్ డ్రోన్‌లు పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత నేటో మిత్రదేశాలు, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన వచ్చింది.
ఈ చొరబాటు ఉద్దేశపూర్వకంగా జరిగిందని పోలాండ్ అంటోంది. కానీ, రష్యా ఈ సంఘటనను తక్కువ చేస్తూ, పోలాండ్‌ను 'లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు' లేవని ప్రకటించింది.
మరోవైపు, నేటో కూటమి తూర్పు దిక్కును బలోపేతం చేయడానికి డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ ఒక కొత్త మిషన్‌లో చేరాయి. సైనిక సామగ్రిని తూర్పు వైపునకు తరలించబోతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
రష్యాతో ఒప్పందాలు వద్దు: జెలియన్ స్కీ
యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తుండటంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీ గతవారమే తన అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో జెలియన్ స్కీ మాట్లాడుతూ "రష్యా నుంచి వచ్చే ఎలాంటి ఇంధనాన్నైనా (కొనుగోలు చేయడం), ఎలాంటి ఒప్పందాలనైనా మనం ఆపాలి. వాళ్లను ఆపాలనుకుంటే, మనకు వాళ్లతో ఎటువంటి ఒప్పందాలు ఉండకూడదు" అన్నారు.
రష్యన్ చమురు, గ్యాస్ కోసం 2022 నుంచి యూరోపియన్ దేశాలు దాదాపు రూ.21.7 లక్షల కోట్లు ఖర్చు చేశాయని సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అనే థింక్ ట్యాంక్ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం యుక్రెయిన్‌తో యుద్ధానికి నిధులుగా మారాయి.
రష్యా చమురు కొనుగోలును 2028 నాటికి నిలిపివేస్తామని ఈయూ తెలిపింది. ఇది త్వరగా జరగాలని, బదులుగా వాషింగ్టన్ నుంచి కొంత చమురు కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటోంది.
అయితే, ట్రంప్ సందేశం తుర్కియే వంటి దేశాలను కలిగి ఉన్న ఈయూకు కాదు, నేటోకి. రష్యన్ చమురును తుర్కియే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. అంతేకాదు, చాలావరకు నేటో సభ్యుల కంటే మాస్కోతో సన్నిహిత సంబంధాలను ఆ దేశమే కలిగి ఉంది. రష్యన్ చమురు కొనుగోలును ఆపాలని తుర్కియేని ఒప్పించడం కష్టం కావచ్చు.
ఇటీవల యుక్రెయిన్‌పై క్రెమ్లిన్ భారీ బాంబు దాడితో కఠిన ఆంక్షలు విధించచోతున్నట్లు ట్రంప్ హెచ్చరించారు.
అయితే, రష్యాను శిక్షించడానికి 'రెండో దశ' ఆంక్షలకు సిద్ధంగా ఉన్నారా? అని ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా 'అవును సిద్ధంగా ఉన్నా' అని బదులిచ్చారు. కానీ, దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలను విధించింది. ఇందులో రష్యన్ చమురు కొనుగోలు చేస్తుండటంపై 25 శాతం సుంకం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














