ఎప్‌స్టీన్‌కు డోనల్డ్ ట్రంప్ రాసినట్లుగా చెప్తున్న లేఖలో ఏం ఉంది? అందులోని మహిళ శరీరం బొమ్మ గీసింది ట్రంపేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నార్డిన్ సాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారం అమెరికాలో మరోసారి చర్చనీయమైంది.
ఎప్‌స్టీన్‌కు డోనల్డ్ ట్రంప్ రాసినట్లు ఆరోపిస్తున్న నోట్(పత్రం) వాస్తవమంటూ వస్తున్న కథనాలను వైట్‌హౌస్ తిరస్కరించింది. అధ్యక్షుడు "ఈ చిత్రాన్ని గీయలేదు, ఆయన దానిపై సంతకం చేయలేదు" అని తెలిపింది.
2003లో ఎప్‌స్టీన్‌కు ట్రంప్ ఇచ్చిన ‘బర్త్‌డే బుక్’లో ఉందంటూ ఒక 'మహిళ శరీరం డ్రాయింగ్ ఉన్న లేఖ'ను అమెరికా చట్టసభ సభ్యులు విడుదల చేశారు.
అమెరికా హౌస్ కమిటీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో ఈ పుస్తకం ఒకటి. వీటిలో ఎప్‌స్టీన్ వీలునామా, రాజకుటుంబ సభ్యులు, ప్రముఖులు, మోడల్‌లు, రాజకీయ నాయకుల పేర్లతో కూడిన ఆయన పర్సనల్ అడ్రస్ బుక్ (వ్యక్తిగత చిరునామా పుస్తకం) ఉన్నాయి.
ఆ బర్త్‌డే బుక్‌లో అమెరికాలోని యూకే రాయబారి అయిన లార్డ్ పీటర్ మాండెల్సన్ నుంచి ఒక సందేశం కూడా ఉంది, అందులో ఎప్‌స్టీన్‌ను "నా బెస్ట్ ఫ్రెండ్" అని సంబోధించారు మాండెల్సన్.
బర్త్‌డే బుక్ సహా పలు డాక్యుమెంట్లను అందజేయాలని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ గత నెలలో ఎప్‌స్టీన్ ఎస్టేట్ కార్యనిర్వాహకులను ఆదేశించింది.

ఎప్‌స్టీన్‌పై దర్యాప్తులో ఏం కనుగొన్నారో బహిరంగంగా చెప్పాలని రిపబ్లికన్ పార్టీ సభ్యులతో పాటు తన మద్దతుదారుల నుంచి కూడా అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి పెరగడంతో వీటిని విడుదల చేశారు.
డోనల్డ్ ట్రంప్ తన 2024 ఎన్నికల ప్రచారంలో ప్రజలతో సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. కానీ, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసును మూసివేసినట్లు చెప్పారు.
కాగా, గతవారం ఎప్‌స్టీన్ బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపులపై మాట్లాడటంతో పాటు, 'ఎప్‌స్టీన్ ఫైల్స్' విడుదల చేయాలని డిమాండ్ చేసి, మరింత ఒత్తిడిని పెంచారు.
238 పేజీలున్న ఈ పుస్తకంలో డజన్ల కొద్దీ సందేశాలున్నాయి. ఎప్‌స్టీన్ ఒక తెలివైన, చురుకైన వ్యక్తి అని, ఆయన తన జీవితంలోకి అకస్మాత్తుగా ప్రవేశించారని లార్డ్ మాండెల్సన్ చెప్పినట్లు అందులో ఉంది.
ఈ పుస్తకం గురించి బీబీసీ ప్రశ్నించగా లార్డ్ మాండెల్సన్ ప్రతినిధి మాట్లాడుతూ, ఎప్‌స్టీన్ పరిచయంపై మాండెల్సన్ చింతిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, US Department of Justice/PA
ఆ పుస్తకం ఎక్కడిది?
ఈ పుస్తకాన్ని 2003లో ఎప్‌స్టీన్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్రిటిష్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన గిస్లైన్ మాక్స్‌వెల్ రూపొందించారు. ఎప్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు బహిరంగంగా తెలియడానికి మూడేళ్ల ముందు ఇది జరిగింది.
అమ్మాయిలను సెక్స్ కోసం రవాణా చేయడంలో ఎప్‌స్టీన్‌కు సహాయం చేసినందుకు గిస్లైన్ 2021లో దోషిగా తేలారు.
ఈ పుస్తకంలో పేరుమోసిన రాజకీయ నాయకులు, వ్యాపారులు సహా ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల సందేశాలు(సబ్‌మిషన్స్) ఉన్నాయి.
ఇందులో, ఆ సమయంలో ఎప్‌స్టీన్ స్నేహితుడు డోనల్డ్ ట్రంప్ నుంచి వచ్చినట్లుగా చెప్తున్న నోట్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి వచ్చినట్లు చెబుతున్న మరొక నోట్ ఎప్‌స్టీన్ "చిన్నపిల్లాడి ఉత్సుకత" గురించి ప్రస్తావించింది.
క్లింటన్‌కు ఎప్‌స్టీన్ తెలుసునని, అయితే ఆయన నేరాల గురించి తెలియదని క్లింటన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. నోట్ గురించి క్లింటన్ ఫౌండేషన్, క్లింటన్ న్యాయవాదిని కూడా బీబీసీ సంప్రదించింది.
ఎప్‌స్టీన్ స్నేహితుడైన ప్రిన్స్ ఆండ్రూ గురించి కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ప్రస్తావించారు.
అందులో ఒక గుర్తుతెలియని మహిళ రాసిన నోట్ ప్రకారం, తాను ఎప్‌స్టీన్ ద్వారా ప్రిన్స్ ఆండ్రూ, క్లింటన్, ట్రంప్, పలువురు ప్రముఖులను కలిసినట్లు ఆమె చెప్పారు. తాను బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రైవేట్ గదులను చూసినట్లు, ఇంగ్లాండ్ రాణి సింహాసనంపై కూర్చున్నట్లు కూడా ఆమె రాశారు.
ఎప్‌స్టీన్ విషయంలో ప్రిన్స్ ఆండ్రూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, తాను ఎటువంటి తప్పు చేయలేదని ప్రిన్స్ ఆండ్రూ బదులిచ్చారు, తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Reuters
నోట్ గురించి ముందే చెప్పిన 'వాల్ స్ట్రీట్'
డోనల్డ్ ట్రంప్‌దిగా ఆరోపిస్తున్న నోట్(పత్రం)ను జులైలో వాల్ స్ట్రీట్ జర్నల్ మొదటిసారి రిపోర్టు చేసింది. అయితే, ఆ నోట్ నకిలీదని, తాను అది రాయలేదన్నారు ట్రంప్. అంతేకాదు, న్యూస్ కార్ప్ యజమాని రూపర్ట్ మర్డోక్ సహా పేపర్ రిపోర్టర్లు, ప్రచురణకర్త, ఎగ్జిక్యూటివ్స్‌పై 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.88 వేల కోట్లు) దావా కూడా వేశారు.
ఆ సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ నోట్‌ను చూపించలేదు కానీ, అది వివరించిన వివరాలు సోమవారం విడుదలైన చిత్రంతో సరిపోలుతున్నాయి.
కమిటీ పుస్తకాన్ని, ఇతర ఎప్‌స్టీన్ డాక్యుమెంట్లను విడుదల చేయడానికి ముందే డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు ఎక్స్‌లో 'బర్త్ డే నోట్' చిత్రాన్ని పంచుకున్నారు.
డోనల్డ్ ట్రంప్ నుంచి వచ్చినట్లు ఆరోపిస్తున్న ఆ నోట్‌లో, ఆయనకు, ఎప్‌స్టీన్ మధ్య సంభాషణలాగా కొన్ని పంక్తులు ఉన్నాయి. చివరి పంక్తి ఇలా చెబుతోంది: "పుట్టినరోజు శుభాకాంక్షలు - ప్రతిరోజు మరొక అద్భుతమైన రహస్యంగా ఉండాలని ఆశిస్తున్నా"

ఫొటో సోర్స్, Getty Images
వైట్‌హౌస్ ప్రకటన
నోట్ విడుదలపై డోనల్డ్ ట్రంప్ నేరుగా స్పందించలేదు. అయితే, ట్రంప్ పుస్తకం కోసం ఏమీ రాయలేదని(ప్రొడ్యూస్ చేయలేదని), నోట్‌లోని సంతకం ట్రంప్ సంతకంతో సరిపోలడం లేదని వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది.
ఆ 'పుట్టినరోజు లేఖ' రాయలేదని ట్రంప్ వాదిస్తున్నారని, "డోనల్డ్ ట్రంప్ అబద్ధం చెబుతున్నారని, సత్యాన్ని కప్పిపుచ్చడానికి చేయగలిగినదంతా చేస్తున్నారని మనకు తెలుసు" అని రిపబ్లికన్ నేతృత్వంలోని హౌస్ ఓవర్‌సైట్ కమిటీలో సీనియర్ డెమొక్రాట్ రాబర్ట్ గార్సియా అన్నారు.
ఎప్‌స్టీన్ ఎస్టేట్ నుంచి డెమొక్రాట్లు"వారికి కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకొని రాజకీయం చేస్తున్నారని" రిపబ్లికన్ చైర్మన్ జేమ్స్ కమర్ ఆరోపించారు.
ఎప్‌స్టీన్ బాధితులు, ప్రజలకు "పారదర్శకత, జవాబుదారీతనం" తీసుకురావడానికి రిపబ్లికన్ కమిటీ సభ్యులు పూర్తి దర్యాప్తుపై దృష్టి సారించారని జేమ్స్ చెప్పారు.
చట్టసభ సభ్యులు ఈ పుస్తకంతో పాటు, ఎప్‌స్టీన్, ఫ్లోరిడాలోని ఫెడరల్ ప్రాసిక్యూటర్ల మధ్య జరిగిన 2007 నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ కూడా విడుదల చేశారు. అలాగే ఎప్‌స్టీన్ 30 ఏళ్ల పాటు తన 'పర్సనల్ అడ్రస్ బుక్'లో రాసిన సమాచారాన్ని(ఎంట్రీలను) కూడా విడుదల చేశారు.
డెమొక్రాట్లు సోమవారం ఈ నోట్‌ను విడుదల చేసిన తర్వాత, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ " ప్రెసిడెంట్ ట్రంప్ న్యాయబృందం వాల్ స్ట్రీట్ జర్నల్‌పై వ్యాజ్యాన్ని వేగంగా తీసుకెళుతోంది" అన్నారు.
ఎప్‌స్టీన్ ఏమయ్యారు?
డోనల్డ్ ట్రంప్, ఎప్‌స్టీన్ చాలా ఏళ్లు స్నేహితులుగా ఉన్నారు. కానీ, 2000ల ప్రారంభంలో ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్ నుంచి ఉద్యోగులను నియమించుకోవడానికి ఎప్‌స్టీన్ ప్రయత్నించిన తర్వాత, ఇద్దరూ విడిపోయినట్లు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
వ్యభిచారం చేయమన్నందుకు 2006లో ఫ్లోరిడాలో ఎప్‌స్టీన్‌పై మొదటిసారి అభియోగం నమోదైంది. కొత్త ఆరోపణలపై విచారణ జరగాల్సి ఉండగా ఆయన 2019లో జైలులో మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














