భారత్, అమెరికా సంబంధాలు ఇకపై ఎలా మారబోతున్నాయి?

ట్రంప్ , మోదీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ‘అంచనావేయలేని వ్యక్తి’ అని చాలామంది విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే ఆయన ఊహించలేని నిర్ణయాలు తీసుకుంటుంటారు.

అధ్యక్షునిగా రెండో పదవీకాలంలో ట్రంప్ ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకుంటున్నారని భావిస్తున్నారు.

భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించారు. ఈ అంశం భారత దౌత్యాన్ని, రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిరంతరంగా దీనిపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శనివారం(సెప్టెంబరు 6)న ట్రంప్, ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రశంసించారు. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రకటనను మోదీ కూడా అభినందించారు.

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపడం ద్వారా భారత్ ఏ ఒక్కరిపైనా ఆధారపడలేదన్న సంకేతాలిచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఈ సందర్భంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్ విషయంలో ట్రంప్‌పై అమెరికాలో ఏమైనా ఒత్తిడి ఉందా? భారత సంతతి అమెరికా పౌరులపై ఇది ఎంత ప్రభావం చూపుతుంది?

ఎస్‌సీఓ సమావేశానికి సంబంధించిన ఫోటోలు అమెరికాను ఎంత అసౌకర్యానికి గురి చేస్తాయి? ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఒకప్పుడు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు లేదా?

ఈ అంశాలన్నీ ‘ది లెన్స్’ ఎపిసోడ్‌లో చర్చకు వచ్చాయి.

ఈ చర్చలో, కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మతో పాటు అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన సీనియర్ మాజీ దౌత్యవేత్త నవతేజ్ సర్నా, వాషింగ్టన్ జర్నలిస్ట్, రచయిత్రి సీమా సిరోహీ పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ వ్యవహారశైలి అంచనాలకు అందని రీతిలో ఉంటుంది.

రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ కొత్త రాజకీయాలు

డోనల్డ్ ట్రంప్‌లోని అంచనా వేయలేని వ్యక్తిత్వం పెరుగుతూ వస్తోందని నవతేజ్ సర్నా అభిప్రాయపడ్డారు.

"రెండో టర్మ్‌లో ట్రంప్ పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పరిస్థితి చాలా మారింది. సలహాదారులందరూ ఆయనకు పూర్తి విధేయులుగా మారారు. ఆయనకు సలహా ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అసలు చాలా మందికి ఆయన వ్యూహం కూడా అర్థం కాకపోవచ్చు" అని సర్నా అన్నారు.

సీమా సిరోహీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. ఆయన పాలన ఏకపక్షంగా నడుస్తోందని అన్నారు.

"అమెరికాలో రూపొందిస్తున్న విధానాలన్నీ, ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్నారు. ఇంతకంటే వేరే నిర్ధరణ అవసరం లేదు. ఈ విధానం అధికార పరిధి స్థాయిలో కింది నుంచి పైకి కాదు..పైనుంచి కిందకు రూపొందుతోంది'' అని ఆమె చెప్పారు.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌ను ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడంపై అమెరికాలో విమర్శలున్నాయి.

భారత్‌పై ట్రంప్ కోపానికి కారణాలు

సరైన కారణం లేకుండానే, ట్రంప్ ఇటీవల భారతదేశంతో సంబంధాలను తీవ్రస్థాయిలో లక్ష్యంగా చేసుకున్నారు.

"మనం ఆయన్ను ఆపరేషన్ సిందూర్‌లో మధ్యవర్తిగా పరిగణించలేదు. నోబెల్ బహుమతికి సిఫార్సు చేయలేదు" అని నవతేజ్ సర్నా చెప్పారు.

వాణిజ్య ఒప్పందంలో, ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలలో తన అభ్యంతరాలను వదులుకోవడానికి భారత్ నిరాకరించడం కూడా ఇంకో ప్రధాన కారణం.

"రష్యా నుంచి చైనా ఎక్కువ చమురు కొంటోంది. యూరప్ గ్యాస్ కొంటోంది. ట్రంప్ ప్రస్తుతం భారతదేశంపై చాలా కోపంగా ఉన్నారు. ఆయన తన కోపాన్ని వెళ్లగక్కుతున్నారు" అని సర్నా అన్నారు.

పరిస్థితి అకస్మాత్తుగా మారిందని అనేక సంఘటనలు దీనికి దోహదపడ్డాయని సీమా సిరోహీ కూడా చెబుతున్నారు. "గత 3-4 నెలల్లో, భారత్-అమెరికా సంబంధం పూర్తిగా మారిపోయింది, స్నేహం నుంచి శత్రుత్వంలా అయింది" అని ఆమె అన్నారు.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ను కలవడానికి భారత్ ప్రయత్నించిందని, కానీ అది సాధ్యం కాలేదని ఆమె గుర్తుచేశారు.

ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర లేదని భారత్ స్పష్టంగా చెప్పింది.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, SAUL LOEB/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ గొప్ప ప్రధాని అని ట్రంప్ అన్నారు.

సంబంధాలు ఏ దిశగా వెళ్తున్నాయి?

గత రెండు దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య చాలా సన్నిహితమైన, విశ్వసనీయమైన సంబంధాలు పెంపొందాయి.

"20-25 సంవత్సరాల కృషి ద్వారా రెండువైపులా ఏర్పడిన నమ్మకం, ఈ సంబంధానికి ఆధారమైన వ్యూహాత్మక తర్కం ఇప్పుడు చాలావరకు విచ్ఛిన్నమైంది. ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండానే భారత ఆర్థిక వ్యవస్థ, రెండుదేశాల సంబంధాలను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు" అని సర్నా విశ్లేషించారు.

వాషింగ్టన్‌లోని వ్యూహాత్మక వర్గాల్లో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘‘మొత్తం సంబంధాలను ఆయన నాశనం చేస్తున్నారని గత 25 ఏళ్లుగా భారత్-అమెరికా సంబంధాలపై పనిచేసిన వ్యక్తులు చెబుతున్నారు" అని సీమా సిరోహీ తెలిపారు.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Sergio Flores/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత సంతతి అమెరికన్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా విధానాలపై భారత సంతతి ప్రజల ప్రభావం?

అమెరికాలోని భారత సంతతి ప్రజలు రాజకీయంగా ప్రభావం చూపిస్తున్నారు, రెండు దేశాల సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అన్న విషయంలో నవతేజ్ సర్నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది.

"భారతీయ సమాజం రాజకీయంగా చాలా శక్తివంతంగా, చాలా చురుగ్గా మారిందని పదే పదే చెబుతుంటారు. మనం కూడా దానిని నమ్ముతున్నామనుకుంటా. వాస్తవానికి చాలామంది భారతీయ-అమెరికన్లు వారి వారి వృత్తులు, జీవితాల్లో బిజీగా ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు రాజకీయ నాయకులకు విరాళాలు ఇస్తారు. కానీ ఒక వ్యవస్థీకృత రాజకీయ శక్తిగా వారి ప్రభావం పరిమితం'' అని నవతేజ్‌సర్నా అన్నారు.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ, ట్రంప్ స్నేహంపై ఒకప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరిగింది.

అమెరికాలో కూడా నిరసన స్వరాలు

అమెరికాలో కూడా, చాలామంది ప్రభావవంతమైన వ్యక్తులు, మాజీ అధికారులు భారతదేశంతో సంబంధాలను చెడగొట్టుకోవడం సరికాదని ట్రంప్‌ను హెచ్చరిస్తున్నారు.

జాన్ బోల్టన్, జేక్ సలివన్, నిక్కీ హేలీ వంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు.

"భారత్ ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్ వద్దకు వెళ్లి విధానాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పగల వారెవరూ ట్రంప్ సన్నిహిత సలహాదారుల్లో లేరు. బోల్టన్, హేలీ వంటి వ్యక్తులు ఇప్పుడు దూరంగా ఉన్నారు. టీవీలో ప్రకటనలు ఇవ్వడం తప్ప, వారి మాటలు ట్రంప్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవు. ఎవరికీ అంత ధైర్యం లేదని నేను అనుకుంటున్నా" అని నవతేజ్ సర్నా అన్నారు.

"భారత్, అమెరికా మధ్య సంబంధాలను చాలా కష్టపడి పెంపొందించారు. దీనికి ప్రధాన కారణం చైనాను సమతుల్యం చేయడం. కానీ అధ్యక్షుడు ట్రంప్ దానిని పట్టించుకోవడం లేదని 25 ఏళ్లుగా ఈ సంబంధాలపై పనిచేసిన వ్యక్తులు చెప్పారు. అమెరికాకు అతిపెద్ద దౌత్యవేత్త అయిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారతదేశంతో సంబంధాలు ముఖ్యమని అనిపించేలా ఏదో ఒకటి చెబుతూ ఉండటం గమనించి ఉంటారు. కానీ ఎవరూ ఆయన మాట వినడం లేదు" అని సీమా సిరోహీ చెప్పారు.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, narendramodi/x

ఫొటో క్యాప్షన్, పుతిన్, జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ

ఎస్‌సీఓ సమావేశం ద్వారా ఎలాంటి సంకేతం వెళ్లిదంటే...

ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లను భారత ప్రధాని మోదీ కలిశారు.

"ఎస్‌సీఓ సమావేశం షెడ్యూల్ ప్రకారం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ అక్కడికి వెళ్లి ఈ నాయకులతో నవ్వుతూ కనిపించడం భిన్నమైన దౌత్య సంకేతంగా మారింది" అని నవతేజ్ సర్నా అన్నారు.

"భారత్‌ను ట్రంప్ అకారణంగా లక్ష్యంగా చేసుకుంటే, మనం కోరుకునే వారితో మాట్లాడటానికి, మనం కోరుకునే వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనకు హక్కు ఉంది" అని సర్నా అన్నారు.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏ ఒక్కదేశంపైనయినా ఎక్కువగా ఆధారపడడాన్ని భారత్ తగ్గించాలని నిపుణులు అంటున్నారు.

భారత్ వ్యూహం ఏంటి?

అమెరికా ఇటీవలి ప్రవర్తనపై భారతదేశంలో కూడా ఆగ్రహం ఉంది. అమెరికా 50శాతం సుంకం విధిస్తే, భారత్ కూడా ప్రతీకార సుంకం విధించాలనే డిమాండ్ వినిపించింది. దీనిని నవతేజ్ సర్నా ఎలా చూస్తున్నారు?

"ఈ ప్రతీకార చర్య కొంత భావోద్వేగ ప్రతిచర్యని నేననుకుంటున్నా. భారత్, అమెరికా మధ్య పెంపొందిన సంబంధాలను, సాధించిన ప్రయోజనాలను, సాధ్యమైనంతవరకు పరిరక్షించాలన్నది మన దీర్ఘకాలిక వ్యూహంగా ఉండాలి.

రష్యా అయినా, అమెరికా అయినా, ఏ ఒక్క దేశంపైనా అంతగా ఆధారపడకూడదు. చైనాపై కూడా చాలా ఆధారపడుతున్నాం. సమస్య తలెత్తినప్పుడు, అది మనకు సంక్షోభంగా మారేంతగా ఆధారపడటం ఉండకూడదు" అని సర్నా అంటున్నారు.

"ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకుంటే, సంభాషణ ఏ దిశలో వెళ్తుందో చెప్పలేం. అది చెడ్డగా మారవచ్చు లేదా మంచిగా ఉండొచ్చు.

ట్రంప్ ఆలోచనలో కొంత మార్పు తీసుకురావాలనుకుంటే, సంప్రదాయేతర పద్ధతుల ద్వారా పని చేయాల్సి ఉంటుంది" అని అని సీమా సిరోహీ అంటున్నారు

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ సిందూర్ విషయంలో ట్రంప్ ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు.

మోదీ, ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపింది?

మోదీ, ట్రంప్ మధ్య సాన్నిహిత్యంపై ఒకప్పుడు చాలా చర్చ జరిగింది.

'హౌడీ మోడీ' వంటి కార్యక్రమాల నుంచి పెద్ద వేదికలపై ఒకరినొకరు ప్రశంసించుకోవడం వరకు, ఈ బంధం ప్రత్యేక గుర్తింపు పొందింది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు.

"వ్యక్తిగత సంబంధం, సాన్నిహిత్యం పోయిందని స్పష్టంగా తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు ప్రధానమంత్రి గురించి వ్యక్తిగతంగా ఏమీ చెప్పలేదు. అది కొంత వరకు మంచిదే. కానీ ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తిగత సంబంధం తిరిగి ఏర్పడడం కాస్త అసాధ్యమేమో అనిపిస్తుంది" అని నవతేజ్ సర్నా అన్నారు.

"దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి కావు. కొంతవరకు, వ్యక్తిగత సంబంధాలు ముఖ్యమైనవే. ఇద్దరు నాయకుల మధ్య చాలా సాన్నిహిత్యం ఉందనుకుంటారు. కానీ దేశ ప్రయోజనాలకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు, ట్రంప్ దానిని ముందుకు తెస్తారు" అని సీమా సిరోహీ అంటున్నారు.

''ఆపరేషన్ సిందూర్‌లో, భారత్ తన పాత్రను అంగీకరించాలని ట్రంప్ కోరుకున్నారు. కానీ భారత్ చాలా కఠినమైన వైఖరిని అవలంబించింది. పాకిస్తాన్ కోరినందున కాల్పుల విరమణ జరిగిందని చెప్పింది. అమెరికాతో ఎలాంటి చర్చలూ జరగలేదు. ట్రంప్ వ్యక్తిగత జోక్యం కూడా జరగలేదు" అని ఆమె తెలిపారు.

భారత్, అమెరికా, రష్యా, చైనా, ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ వ్యవహారశైలిపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తమైంది.

భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి?

"ఇది చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన సంబంధం. చాలా విస్తృతమైన సంబంధం, రక్షణ, భద్రత, వాణిజ్యం, ప్రజా సంబంధాలు, విద్య, ఆరోగ్యం, అంతరిక్షం వంటివి ఇందులో ఉన్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఏ రంగాలు కొనసాగుతాయో చూడాలి. అవి ఉత్పాదక రంగాలు. కానీ పురోగతి జరగాల్సిన చోట, అది ఇప్పుడు జరగకపోవచ్చు" అని నవతేజ్ సర్నా అన్నారు.

"ఒకవేళ వాణిజ్య ఒప్పందం జరిగితే, అది గౌరవప్రదమైన నిబంధనలపై ఉండాలి. మన నిబంధనలను దాటకూడదు. ఇప్పుడు తన ప్రాథమిక ప్రయోజనాలపై భారత్ రాజీ పడలేని వాతావరణం ఏర్పడింది. అలాగే ట్రంప్‌కు భారత్ భయపడుతుందనే అభిప్రాయం ఏర్పడనివ్వకూడదు" అని సర్నా సూచించారు.

"అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలో కొంత మార్పు తీసుకురావాలంటే, సంప్రదాయేతర పద్ధతుల ద్వారా పని చేయాల్సి ఉంటుంది. ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు సరైన ఫలితాలు కనిపించలేదు" అని సీమా సిరోహీ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)