లోక్‌సభకు నేడు వక్ఫ్ బిల్లు, దీని చుట్టూ ఉన్న వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
వక్ఫ్ ( సవరణ) బిల్లు 2024 బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ( బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది.
ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించామని, అవసరమైతే దీన్ని పొడిగిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.
ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు.
వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కోరుకుంటోంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని కేంద్రం చెబుతోంది.
సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని దీన్ని వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ అంటే ఏంటి, వాటి ఆస్తుల మీద ఉన్న వివాదాలు ఏంటి, కేంద్రం చెబుతున్న సంస్కరణలు ఏంటి, వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలు ఏంటో తెలుసుకుందాం.

వక్ఫ్ అంటే ఏమిటి?
ఇస్లాం సంప్రదాయంలో, ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు.
విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతం అయ్యాయి.
భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన దిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది.
ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు.
దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 8,72,351వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9లక్షల 40వేల ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
సంస్కరణల అవసరం ఉందా?
వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేకమంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు.
భారత దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరం అని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది.
వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా లక్షా 20వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం 2 వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది.
“వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చెయ్యడం సాధారణంగా మారింది” అని సచార్ కమిటీ పేర్కొంది. “గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది” అని అధికారులే రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఉన్న వందల కొద్దీ సంఘటనలను తన నివేదికలో నమోదు చేసింది.
దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13వేల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు.
సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది.
ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త బిల్లులోని వివాదాలు ఏంటి?
గడిచిన రెండేళ్లలో వక్ఫ్‌కు సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టులలో 120కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ చట్టంలో సవరణలు ప్రతిపాదించిన తరువాత ఈ పిటిషన్లు దాఖలు అయ్యాయి.
వక్ఫ్ యాక్ట్ చెల్లుబాటును సవాలు చేస్తూ ఈ పిటిషన్లు దాఖలు అయ్యాయి. జైనులు, సిక్కులు, ఇతర మైనార్టీలకు ఇటువంటి చట్టాలు వర్తించినప్పుడు, వక్ఫ్ చట్టం మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందని పిటిషన్లు సవాల్ చేశారు.
కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లలో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చో వివరించారు. తనకు యాజమన్య హక్కులు ఉండి, ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయడానికి అర్హుడని పేర్కొన్నారు.
వక్ఫ్ చట్టలో రెండు రకాల ఆస్తులను ప్రస్తావించారు. ఇందులో అల్లా పేరుతో ఉన్న వక్ఫ్ ఒకటి. అల్లాకు అంకితం చేసిన, వారసత్వ హక్కులు లేని ఆస్తులను వక్ఫ్ అల్లాగా పేర్కొన్నారు.
రెండోది వక్ఫ్ అలాల్ ఔలద్... అంటే వక్ఫ్ ఆస్తులను దాని వారసులు చూసుకుంటారు. అయితే వారసత్వ హక్కులలో మహిళల వారసత్వ హక్కులను రద్దు చేయకూడదని కొత్త బిల్లులో నిబంధనలు విధించారు.
విరాళంగా ఇచ్చిన ఆస్తి ప్రభుత్వఖాతాలోకి వస్తే జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు, అనాథల సంక్షేమానికి వినియోగించగలుగుతారు.
ఒకవేళ ఆ ఆస్తి లేదా భూమి ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉండి, వక్ఫ్ బోర్డు కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొన్నట్లయితే, కొత్త బిల్లు ప్రకారం, వక్ఫ్ హక్కు జిల్లా కలెక్టర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వ అధీనంలోని వక్ఫ్ క్లెయిమ్ చేసిన భూమిపై కలెక్టర్ తన నివేదికను ప్రభుత్వానికి పంపే అధికారి కొత్త బిల్లు కల్పించింది.
కలెక్టర్ నివేదిక తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగా నమోదవుతుంది.
ఇక ఈ కొత్త ప్రతిపాదిత బిల్లులో వక్ఫ్ బోర్డుకున్న సర్వేహక్కులను రద్దు చేశారు. ఈ బిల్లులోని నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి వక్ఫ్‌దో కాదో చెప్పడానికి వీల్లేదు.
ప్రస్తుత చట్టంలో వక్ఫ్ బోర్డుకు చెందిన సర్వే కమిషనర్‌కు వక్ఫ్ క్లెయిమ్ చేసిన ఆస్తులను సర్వే చేసే అధికారం ఉందని, అయితే ప్రతిపాదిత బిల్లులో సవరణ తర్వాత ఈ అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తారు..
అభ్యంతరాలు లేవనెత్తిన ప్రతిపాదిత బిల్లులోని ఇతర నిబంధనలు వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినవి.
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండటం తప్పనిసరి, అయితే ప్రతిపాదిత బిల్లులో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల నిబంధనను కూడా చేర్చారు.
దీంతో పాటు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిం సభ్యుల్లో ఇద్దరు మహిళా సభ్యులు తప్పనిసరి చేశారు.
షియా, సున్నీలతో పాటు బోహ్రా, అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని బిల్లులో ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి.
ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి, ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15 శాతం వాటా ఉంటేనే షియా వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయవచ్చు.
అయితే, దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులన్నింటిలో ఉత్తరప్రదేశ్, బిహార్‌లో మాత్రమే షియా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ప్రతిపాదిత సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందనే భయం ప్రజల్లో ఉంది.
ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సంబంధిత వివాదాలను పరిష్కరించడం సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
'షిక్వా-ఇ-హింద్: ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్' రచయిత డాక్టర్ ముజిబుర్ రెహ్మాన్ మాట్లాడుతూ వక్ఫ్‌లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ముస్లిం ప్రాపర్టీ మేనేజ్ మెంట్‌లొ ముస్లీమేతరులు జీవించగలిగితే, ముస్లిమేతర ఆస్తుల నిర్వహణలోనూ ముస్లింలను కూడా నివసించడానికి అనుమతించాలని ముజీబుర్ రహ్మాన్ చెప్పారు.
వక్ఫ్‌ను ప్రభుత్వం నియంత్రిస్తే అది ఎప్పటికీ ముస్లింలకు ఉపయోగపడదని న్యాయవాది ముజిబుర్ రెహ్మాన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన ప్రతినిధిని నియమించడం ద్వారా వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుని తన ఇష్టానుసారం ప్రజలకు ఇస్తుందన్నారు.
''వక్ఫ్ ను రాజకీయాల నుంచి బయటకు తీసుకురావాలని, ముస్లింలు కూడా గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి'' అన్నారు.
మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్శిటీ మాజీ ఛాన్సలర్ జాఫర్ సరేష్వాలా మాట్లాడుతూ వక్ఫ్‌కు చాలా ఆస్తి ఉందని, దానిని సక్రమంగా ఉపయోగించి ఉంటే, ఈ దేశంలోని ముస్లింలే కాకుండా హిందువులు కూడా పేదలుగా మిగిలిపోయేవారు కాదన్నారు.
కనీసం పది లక్షల ఆస్తి వ్యవహారాలు కూడా చూడనివారు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి కూర్చుంటున్నారని, ఈ ఆస్తులను మెరుగ్గా నిర్వహించగలిగేవారు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
వక్ఫ్ చట్టానికి చేస్తున్న మార్పులపై అనేకమంది ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవు. మరి కొన్నింటిని నోటి మాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు.
పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్( వినియోగించుకుంటున్న వ్యక్తి) కేటగిరీ కిందకు వస్తాయని 1954 వక్ఫ్ చట్టం గుర్తించింది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది అగమ్యగోచరంగా మారింది.
"అలాంటి ఆస్తుల యాజమాన్య హక్కులను తేల్చడం సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే వాటి యాజమాన్య హక్కులు మొఘలుల కాలం నాటివి. అవి మొఘలుల నుంచి బ్రిటిషర్లకు వారి నుంచి నేటి తరం వరకు వచ్చాయి" అని షిక్వా-ఎ- హింద్: ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ పుస్తక రచయిత ప్రొఫెసర్ ముజిబుర్ రెహమాన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














