రీల్స్ తెగ చూస్తున్నారా...

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఈ మధ్య నా బ్రెయిన్ ఎందుకు పని చేయడం లేదు? ఏదీ గుర్తుండటం లేదు ఎందుకు?’’ అని అప్పుడప్పుడు మీకు అనిపిస్తోందా?

ఫోన్ మాట్లాడుతూ, మరో చేత్తో ఫోన్ ఎక్కడ పెట్టానా అని వెతకడం, నీళ్లు తాగడం కోసం వంటగదిలోకి వెళ్లి అది మర్చిపోయి ఇంకో పని చేసి రావడం, వెంటనే మీరు చేసిన పని గుర్తొచ్చి నవ్వుకుంటున్నారా?

అయితే, మీ బ్రెయిన్‌లో ఏదో జరగరానిది జరుగుతున్నట్లే...

ఇంకో సందర్భం చూద్దాం.

ఫ్రెండ్‌తో లేదా ఇంట్లో వాళ్లతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే రీల్స్ ఓపెన్ చేస్తారా? క్షణం ఖాళీగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ తెరవడం, బయట రోడ్డు మీద నడుస్తూ, క్యూలైన్లలో నిల్చున్నప్పుడు కూడా రీల్స్ చూస్తూ వాటిని ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తున్నారా?

అయితే, ఇలా రోజూ ఉద్యమంలా రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్నది మీరొక్కరే కాదు. వీడియో వీక్షణకు సంబంధించి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా 3500 మందిపై సర్వే నిర్వహించగా, అందులో 97 శాతం మంది ఇదే పని చేస్తున్నారని తేలింది. అయితే, యావరేజ్ వాచ్ టైమ్‌ను మాత్రం ఈ సర్వే వెల్లడించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రోజూ రీల్స్ చూస్తే ఏమవుతుంది?

ఇన్‌స్టా రీల్స్, టిక్‌టాక్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్‌లు చూడటం మంచిది కాదని న్యూరో సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఒకదాని తర్వాత మరొకటి రీల్స్ స్క్రోల్ చేస్తుండటం వల్ల దాన్ని ప్రాసెస్ చేయడానికి మెదడు వేగంగా పనిచేయాల్సి వస్తుందని, ఈ క్రమంలో దాని ఫోకస్ సామర్థ్యం దెబ్బతింటుందని, ఓవరాల్‌గా కాగ్నిటివ్ ఫంక్షనింగ్‌ (ప్రజ్ఞా సామర్థ్యం)పై ప్రభావం పడుతుందని చైనాకు చెందిన టియాంజిన్ నార్మల్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం తేల్చింది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ షార్ట్ వీడియో ఫార్మాట్ (SVF) రాజ్యమేలుతోంది.

తక్కువ నిడివి గల వీడియోలుగా యూజర్లకు అయిదేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన రీల్స్ ఇప్పుడు భారత షార్ట్ వీడియో ఫార్మాట్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాయని మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ శ్రీనివాస్ వెల్లడించారు.

తాము సర్వే చేసిన వారిలో, ప్రతీ వందమందిలో 97 మంది రోజూ షార్ట్ ఫామ్ వీడియోలు చూస్తున్నారని, తమ ఇతర ప్లాట్‌ఫామ్స్ ఎఫ్‌బీ, యూట్యూబ్‌లతో పోలిస్తే ఇన్‌స్టా వైపే యూజర్లు మొగ్గు చూపుతున్నారని, సర్వేలో పాల్గొన్నవారిలో 92 శాతం మంది యూజర్లు ఇన్‌స్టా రీల్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారని తాము నిర్వహించిన ఐపీఎస్ఓఎస్ అధ్యయనం తేల్చిందని మెటా ప్రకటించింది.

నిద్ర, మానసిక ఆరోగ్యంపై ప్రభావం

షార్ట్ వీడియో అడిక్షన్ అనేది ఇప్పుడు ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పు వంటిదని టియాంజిన్ నార్మల్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనానికి నేతృత్వం వహించిన, సైకాలజీ ప్రొఫెసర్ క్వింగ్ వాంగ్ అన్నారు.

''చైనాలో షార్ట్ వీడియోల రోజువారీ సగటు సమయం 151 నిమిషాలు. 95.5 శాతం ఇంటర్నెట్ యూజర్లు వీటిని చూస్తారు. రీల్స్ అతిగా చూడటం వల్ల అటెన్షన్, నిద్ర, మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు డిప్రెషన్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది'' అని ఆయన హెచ్చరించారు.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల్లో, పెద్దల్లో వేర్వేరు ప్రభావాలు

రీల్స్ ఎక్కువగా చూడటం వల్ల పిల్లల్లో ఒకే అంశంపై దృష్టి సారించలేకపోవడం, అన్నీ తమకు నచ్చినట్లుగానే జరగాలని కోరుకునే మనస్తత్వం పెరగడం వంటివి జరుగుతాయని బీబీసీతో హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెప్పారు.

''రీల్స్ చూస్తున్నప్పుడు పిల్లలు తమకు నచ్చిన వాటిని చూస్తుంటారు. నచ్చని వాటిని వెంటనే పైకి తోసేస్తారు. బోరింగ్ అనిపించిన వాటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంటారు. దీన్నే వాళ్లు జీవితానికి కూడా ఆపాదించుకుంటారు. అంతా తమకు నచ్చినట్లుగానే జరగాలని అనుకుంటారు. వేర్వేరు అంశాలకు సంబంధించిన రీల్స్ ఒక్కొక్కటిగా వస్తూ పోతుంటాయి. ఇలా వారి దృష్టి ఒక అంశం నుంచి మరో అంశానికి వెంటవెంటనే మారుతుంది. ఫలితంగా దేనిపై శ్రద్ధ పెట్టలేరు'' అని ఆయన వివరించారు.

పెద్దవారు నిరంతరం రీల్స్ చూడటం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని ఆయన అన్నారు. రీల్స్ అలా చూస్తుండటం వల్ల బ్రెయిన్ పెద్దగా ఎంగేజ్ అవ్వకపోవడం కారణంగానే ఇలా జరుగుతుందని సుధీర్ కుమార్ చెప్పారు.

పిల్లల్లో, పెద్దల్లో వేర్వేరు ప్రభావాలు ఉంటాయని ఇతర అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి.

డోపమైన్

ఫొటో సోర్స్, Getty Images

డోపమైన్ క్షీణత..

యూజర్లు తమకు నచ్చినవి లేదా ఉద్వేగభరితమైన రీల్స్ చూస్తున్నప్పుడు మెదడు డోపమైన్‌ను విడుదల చేస్తుందని బీబీసీతో హైదరాబాద్‌లోని పేస్ హాస్పిటల్‌ కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్ డాక్టర్ సంధ్య మనోరెంజ్ చెప్పారు.

ఇది ఇలాగే కొనసాగితే ఆ తర్వాత డోపమైన్ క్షీణత ఏర్పడుతుందని, శరీరంలోని ఇంద్రియాలు ప్రేరేపితం అయినప్పుడు మెదడు డోపమైన్‌ను విడుదల చేయలేని పరిస్థితి తలెత్తి, ఒక వ్యక్తి అనూహ్య ప్రవర్తనకు దారి తీస్తుందని ఆమె వివరించారు.

పార్కిన్సన్స్, ఏడీహెచ్‌డీ వంటి న్యూరలాజికల్ సమస్యలకు ముఖ్య కారణం డోపమైన్ కొరతేనని ఆమె హెచ్చరించారు.

డోపమైన్ అనేది మన మెదడులో ఉండే ఒక రసాయనం. దీన్నే ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్‌మీటర్ అంటే 'సంతోషాన్ని కలిగించే రసాయనం' అని అంటారు.

ఏదైనా మంచి పని చేసినప్పుడు, మనకు ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు, లేదా ఒక మంచి సినిమా చూసినప్పుడు మనకు ఆనందం, సంతోషం కలుగుతాయి కదా? ఆ సంతోషాన్ని కలిగించేదే ఈ డోపమైన్. సంతోషాన్ని కలిగించడంతో పాటు మన కదలికలు, మూడ్, జ్ఞాపకశక్తి వంటి వాటికి కూడా ఇది కీలకం.

మెదడులో సరైన మోతాదు డోపమైన్ ఉంటేనే మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాం. ఇది తక్కువగా ఉంటే నిరుత్సాహం, బద్ధకం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి.

ఇన్‌స్టా రీల్స్

ఫొటో సోర్స్, Getty Images

కొత్తదనమే కొంప ముంచుతోందా?

షార్ట్ వీడియోలకు అలవాటు పడటం వల్ల ఒక అంశంపై శ్రద్ధ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

రీల్స్ నిరంతరం కొత్తదనాన్ని, వైవిధ్యమైన కంటెంట్ అందిస్తాయి. వెంట వెంటనే ఒక సందర్భం నుంచి మరో సందర్భానికి మారుతుంటాయి.

కాబట్టి మీరు లోతైన ఆలోచన చేయకుండా కొత్తదనం వెంటే పరుగులు తీస్తారని దీనివల్ల మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ప్రభావితమవుతుందని డాక్టర్ సంధ్య చెప్పారు.

''ప్రిఫ్రంటల్ కార్టెక్స్ తనకు అందిన సమాచారం ఆధారంగా మన ప్రవర్తన, ఉద్వేగాలు, ఆలోచనలను రూపుదిద్దుతుంది. కానీ, వెంటవెంటనే స్క్రోల్ చేయడం వల్ల సమాచారాన్ని చదివే, దాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని ఇది క్రమంగా కోల్పోతుంది'' అని ఆమె వివరించారు.

20లలో ఉన్న వారిలో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా అభివృద్ధి చెందుతున్నందున షార్ట్ వీడియోలు వారి నిర్ణయశక్తిని ప్రభావితం చేయగలవని పలు ఎంఆర్‌ఐ అధ్యయనాలు సూచించాయి.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందంటే...

శరీరం పునరుత్తేజం పొందాలన్నా, శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లాలన్నా, వ్యక్తి నిరంతరం ఆరోగ్యంగా ఉండాలన్నా నిద్ర చాలా ముఖ్యమని డాక్టర్ సంధ్య అన్నారు.

స్క్రీన్ నుంచి వెలువడే బ్లూలైట్ కారణంగా రాత్రిపూట నిద్ర పట్టకపోవడంతో పాటు, రోజంతా బద్ధకంగా, నీరసంగా ఉంటుందని ఆమె చెప్పారు.

''రాత్రిపూట స్క్రీన్ చూస్తున్నట్లతే సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. మనం పడుకునే, నిద్రలేచే సమయం కలగాపులగం అవుతుంది. దీనివల్ల మన జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి కారణమయ్యే బ్రెయిన్‌లో హిప్పోకాంపస్ ప్రభావితం అవుతుంది. మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ దారిని గుర్తుపెట్టుకోవడానికి, లేదా ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వారి పేరు గుర్తుంచుకోవడానికి ఈ భాగం ఉపయోగపడుతుంది'' అని సంధ్య వివరించారు.

ఈ హిప్పోకాంపస్ సరిగ్గా పనిచేయకపోతే కొత్త విషయాలు నేర్చుకోవడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఇబ్బందిగా మారుతుందని ఆమె చెప్పారు.

ఈ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే రీల్స్ చూడటానికి పరిమితి విధించుకోవాలని డాక్టర్ సుధీర్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)