బీడ్: 'ఇక వైద్యం చేయించుకోలేను', అంటూ ఈ మహిళలు చిన్న వయసులోనే గర్భసంచి ఎందుకు తీయించుకుంటున్నారు?

కవిత వయసు 29 సంవత్సరాలు, బీడ్ జిల్లా, చెరకు , హిస్టెరెక్టమీ
    • రచయిత, ప్రజక్త దులప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్రలోని బీడ్‌లో గర్భసంచి తీయించుకుంటున్న మహిళల విషయం గత పదేళ్లుగా చర్చనీయాంశంగా ఉంది.

గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సల (హిస్టెరెక్టమీ)పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడం వల్ల, గణాంకాలు, రిపోర్టులు అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వివరణలూ వస్తున్నాయి.

ఇంతకీ బీడ్‌లోని బాధిత మహిళల ఆరోగ్య పరిస్థితి ఏమిటి? చెరకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు ఇప్పటికీ ఎందుకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

బీడ్‌కు చెందిన కవితకు రుతుక్రమంలో అధిక రక్తస్రావం అయింది. హిస్టెరెక్టమీ చేయించుకోవడానికి జిల్లా సర్జన్ (సివిల్ సర్జన్) అనుమతి కావాలి. కానీ, కవిత అనుమతి పొందలేకపోయారు. బీడ్‌లో మహిళలకు గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలపై పరిమితులు ఉన్నాయి.

40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలకు వారి ప్రాణాలకు ముప్పు ఉంటేనే గర్భసంచి తీయించుకునేందుకు హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇస్తుంది. ఈ నిబంధన 2019 నుంచి బీడ్‌లో అమల్లో ఉంది.

అనవసరమైన గర్భాశయ శస్త్రచికిత్సలకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

"సాధారణ స్త్రీ జననేంద్రియ వ్యాధులకు హిస్టెరెక్టమీ అనేది ప్రాథమిక చికిత్సగా కాకుండా చివరి ప్రయత్నంగా ఉండాలి" అని మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, "గ్రామీణ, పెద్దగా చదువుకోని, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన మహిళల్లో, ముఖ్యంగా చిన్న వయసులోనే ఇలాంటి శస్త్రచికిత్సలు పెరుగుతున్నాయి".

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, చికిత్సలకు సంబంధించిన ఆప్షన్లను అందించడం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలను మార్గదర్శకాలు నొక్కి చెబుతున్నాయి.

చెరకు కార్మికుల జిల్లాగా పిలిచే బీడ్‌లో హిస్టెరెక్టమీ రేటు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉందని గమనించిన తర్వాత ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. అందువల్ల, గర్భాశయ శస్త్రచికిత్సలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు పారదర్శకతను కొనసాగించడం తప్పనిసరి.

2018 నుంచి మహిళా కార్మికుల సమస్యలను బీబీసీ నిరంతరం అనుసరిస్తోంది.

మహారాష్ట్ర, కవిత, చెరకు కార్మికులు,
ఫొటో క్యాప్షన్, తనకు పన్నెండేళ్ల వయసులోనే వివాహమైందని కవిత చెప్పారు.

'40-50 కిలోల బరువు నెత్తిన పెట్టుకుని నిచ్చెన ఎక్కాలి'

కవిత వయసు 29 సంవత్సరాలు. మేం ఆమెను కలిశాం, అప్పటికే ఆమె గర్భాశయాన్ని తీయించుకున్నారు. అక్టోబర్‌లో చెరకు కోతకు తిరిగి వెళ్లడానికి ఆమె సిద్ధమవుతున్నారు. కవిత గత 15 ఏళ్లుగా ఈ పని చేస్తున్నారు. దసరా తర్వాత, అక్టోబర్‌లో కర్ణాటకలోని చెరకు తోటల్లో పనికి వెళ్లి, ఫిబ్రవరి-మార్చిలో తిరిగి గ్రామానికి వస్తుంటారామె.

తనకు పన్నెండేళ్ల వయసులోనే వివాహమైందని కవిత చెప్పారు. పిల్లల బాధ్యత ఉండటంతో చదువు ఆపేశారు. కవిత తల్లిదండ్రులు కూడా చెరకు కోయడానికి వలస వెళుతుంటారు. కవితతో పాటు ఆమె భర్త కూడా ఇదే పనికి వెళ్లడం మొదలుపెట్టారు. కవితకు 20 ఏళ్లు నిండకముందే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. చిన్న వయసులోనే ప్రసవించడంతో, ఆమెను నిరంతరం ఏదో ఒక అనారోగ్యం బాధపెడుతూ ఉండేది.

"రాత్రికి రాత్రే చెరకు కట్టలను కట్టి ట్రక్కుల్లో ఎక్కించేవారు. ఒక్కో కట్ట 40 నుంచి 50 కిలోల బరువు ఉంటుంది. ఈ కట్టలను ఎత్తుకొని చెక్క నిచ్చెన ఎక్కాలి. పనిలో చురుగ్గా లేకపోతే, రోజుకూలీపై ప్రభావం పడుతుంది" అని కవిత చెప్పారు.

బీడ్, మహారాష్ట్ర, హిస్టెరెక్టమీ, చెరకు కార్మికులు
ఫొటో క్యాప్షన్, చెరకు కట్టలను నెత్తిన పెట్టుకుని చెక్క నిచ్చెన ఎక్కి ట్రక్కుల్లో లోడ్ చేయాలని కవిత చెప్పారు.

'మందులకే వారానికి రూ. 1,200 ఖర్చు'

శస్త్రచికిత్సకు రెండేళ్ల ముందు రుతుస్రావం, గర్భాశయ సంబంధిత సమస్యలతో కవిత గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, చికిత్స తీసుకున్నారు.

"నాకు గర్భాశయ వ్యాధి ఉంది. విపరీతంగా రక్తస్రావం అయ్యేది. ఏడాదిన్నర పాటు వైద్యం కోసం చాలా ఖర్చు చేశాను. విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. సరిగ్గా తినలేకపోయేదాన్ని. ఏదోలా లేచి చెరకు కోయడానికి వెళ్లేదాన్ని. ఒక రోజు సెలవు తీసుకోవాలనుకున్నా కాంట్రాక్టర్ ఒప్పుకునేవారు కాదు" అని కవిత తెలిపారు.

"పనిలో భారీ బరువులు ఎత్తొద్దని, వంగి పనిచేయొద్దని వైద్యులు సూచించారు. కానీ, నాకు మరో మార్గం లేదు. కాంట్రాక్టర్ దగ్గర ముందుగానే డబ్బులు తీసుకున్నా. కాబట్టి పని చేయాల్సిందే" అని అన్నారామె.

చెరకు కోతకు వెళ్లే ముందు, కార్మికులు కాంట్రాక్టర్ నుంచి ముందస్తుగా అడ్వాన్సులు తీసుకుంటారు. జంటకు(భర్త, భార్య) కలిపి ఈ మొత్తాన్ని ఇస్తారు. కాంట్రాక్టర్, ఆ జంటలోని పురుషుడికి మధ్యే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి.

గత 10–12 ఏళ్లుగా కవిత నుంచి ఆమె భర్త దూరంగా ఉంటున్నారు. ఆమె ఒంటరి కూలీ. అందువల్ల ఆమెకు సగం అడ్వాన్స్ మాత్రమే ఇస్తారు.

"చెరకు కట్టలు కట్టాలి, ట్రక్కుల్లోకి ఎక్కించాలి. 40 కిలోలకుపైగా బరువులు ఎత్తుకుని పైకెక్కడం వల్ల తల తిరుగుతూ ఉండేది. కొన్నిసార్లు పైనుంచి కింద పడ్డాను కూడా. చాలాసార్లు మూర్ఛపోయాను. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. భారీ బరువులు ఎత్తడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగేది. ఏడాదిన్నర పాటు వారంవారం రూ.1,200 మందులకు ఖర్చు చేయాల్సి వచ్చేది" అని కవిత చెప్పారు.

ప్రతి ఏటా చికిత్స కోసం దాదాపు రూ. 60,000 ఖర్చు చేస్తానని ఆమె చెబుతున్నారు. అన్ని మందులు వాడినప్పటికీ, సరైన ఉపశమనం లభించడం లేదని ఆమె అంటున్నారు. కవిత అనారోగ్యం తీవ్రం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా, ఆమె గర్భాసంచిని తీయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే, ఆమె వయసు రీత్యా హిస్టెరెక్టమీ చేయలేమని వైద్యులు చెప్పారు.

"నాకు 29 ఏళ్లే కావడంతో వారు భయపడ్డారు. సోనోగ్రఫీ పరీక్ష చేసి, నా గర్భాశయం నల్లగా మారి, దెబ్బతిన్నదని వైద్యులు నాకు చెప్పారు. అది ప్రమాదకరమని, నా ప్రాణాలనూ కోల్పోవచ్చని చెప్పారు. క్యాన్సర్ ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు, చాలా భయమేసింది" అని కవిత అన్నారు.

బీడ్, కవిత, గర్భాశయ సర్జరీ

ఫొటో సోర్స్, Prajakta Dhulap/BBC

'ఆధార్ కార్డులో 40 ఏళ్లుగా నమోదు'

"ఆపరేషన్‌కు ఎంత ఖర్చవుతుందని అడిగాను. దాదాపు 30 వేలు అవుతుందని డాక్టర్ చెప్పారు" అని కవిత అన్నారు.

దీంతో, కవిత మిగతా ఆసుపత్రులకు వెళ్లడం ప్రారంభించారు. వయసు తక్కువగా ఉందని ప్రభుత్వాసుపత్రిలో కూడా వైద్యులు ఆపరేషన్‌కు నిరాకరించారని కవిత చెప్పారు.

"బీడ్ జిల్లాలో హిస్టెరెక్టమీ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. మీకు ఎక్కువ ఇబ్బందిగా ఉంటే, వయసు పెంచుకోమన్నారు. అందుకే ఆధార్ కార్డులో నా వయసు మార్పించుకున్నా" అని చెప్పారు కవిత.

వయసు 40 అని చూపించేలా నకిలీ ఆధార్ కార్డు తీసుకున్నారు కవిత. ఈ నకిలీ ఆధార్ ఉపయోగించి, ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హిస్టెరెక్టమీ చేయించుకున్నారు.

నకిలీ ఆధార్ కార్డు తయారు చేయడం నేరం. ఇది చట్టవిరుద్ధమని తెలుసా? అని మేం కవితను అడిగినప్పుడు, "నేను వైద్యులు చెప్పినట్లు మాత్రమే చేశాను" అని బదులిచ్చారామె.

దీనిపై మరాఠీ సివిల్ సర్జన్, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను బీబీసీ సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ వారు స్పందించేందుకు నిరాకరించారు.

వైద్యం కోసం కవిత అప్పు చేశారు.

"ఇప్పుడు జీవితమే కష్టంగా మారింది. నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నా. దానిని తిరిగి చెల్లించాలంటే మూడేళ్లు పని చేయాల్సి ఉంటుంది" అని ఆమె చెప్పారు.

బీడ్ జిల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత 5 సంవత్సరాల్లో 211 గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు జరిగాయని బీడ్ జిల్లా యంత్రాంగం చెబుతోంది. (ఫైల్ ఫోటో)

ప్రభుత్వ గణాంకాలు ఎలా ఉన్నాయి?

బీడ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో 211 మంది మహిళా కార్మికులు హిస్టెరెక్టమీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జులై 29న రాజ్యసభలో ఇదే గణాంకాలను సమర్పించింది.

కానీ, ఈ సంఖ్య చాలా తక్కువని మహిళా రైతు వేదిక కార్యకర్త సీమా కులకర్ణి చెప్పారు.

"మేం 2019, 2023లో రెండు అధ్యయనాలను ప్రచురించాం. 300 మంది మహిళలపై నిర్వహించిన సర్వేలో 8 శాతం మందికి గర్భాసంచి తొలగించినట్లు గుర్తించాం. 225 మంది మహిళలపై జరిపిన మరో అధ్యయనంలో కూడా సంఖ్య ఇలానే ఉంది. వారిలో 33 శాతం మంది మహిళలకు 2019 తర్వాత శస్త్రచికిత్స జరిగింది. అందుకే ప్రభుత్వ లెక్కింపు, రికార్డులు వాస్తవికత కంటే చాలా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నాం. అధికారిక డేటా చాలా పరిమితం" అని సీమా అన్నారు.

పూర్ణిమ, బీడ్ జిల్లా, చెరకు కార్మికులు
ఫొటో క్యాప్షన్, పూర్ణిమ నెలవారీ ఖర్చులు దాదాపు 5,000.

ప్రభుత్వం ఏమంటోంది?

గర్భాశయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పూర్ణిమ మాస్కే(30), తాను ఇకపై వైద్యం చేయించుకోలేనని అంటున్నారు.

"ఈ సమస్య రెండేళ్ల కిందట ప్రారంభమైంది. ఇప్పటివరకు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశాను" అని ఆమె చెప్పారు.

"ప్రతి 15 రోజులకు నాకు రూ. 2,500 మందులు అవసరం. ఒక్కో టాబ్లెట్ ధర దాదాపు రూ.150–200. నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా కూడా బయటే మందులు కొనాలి" అని పూర్ణిమ అన్నారు.

ఈ మందులను ప్రభుత్వ ఆసుపత్రులలోనే అందించాలని ఆమె కోరుతున్నారు.

మందుల లభ్యత గురించి బీడ్ జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్‌ను అడిగినప్పుడు, జిల్లా ఆరోగ్య అధికారి ద్వారా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు.

చెరకు మహిళా కార్మికుల బాధలు తీర్చేందుకు, తనిఖీలు నిర్వహించి వారికి హెల్త్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించామని కూడా ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)