అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి, ఎవరు ఏం చెప్పారు?

అమెరికన్ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలోని పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్‌కి చెందిన వ్యక్తి మరణించారు. అయితే, కాల్పులు జరిగిన 15 రోజుల వరకూ కుటుంబ సభ్యులకు సమాచారం లేదని వారు ఆరోపిస్తున్నారు.

మరోవైపు తాను జాతి వివక్ష బాధితుడినని మరణానికి ముందు సోషల్ మీడియాలో బాధితుడు పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.

పోలీసులు మాత్రం, ఆయన వేరే వారిని కత్తితో పొడుస్తున్నందున ఆపడానికే కాల్పులు జరిపామని చెబుతున్నారు.

సెప్టెంబరు 3న ఘటన జరగ్గా సెప్టెంబరు 17న విషయం బయటకు వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేరాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఏం జరిగింది?

మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన నిజాముద్దీన్ 2016 నుంచీ అమెరికాలో ఉంటున్నట్టు, చదువుకోవడానికి వెళ్లి, అక్కడే పని చేస్తున్నట్టు ఆయన తండ్రి హసనుద్దీన్ మీడియాతో చెప్పారు.

హసనుద్దీన్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే తనకు ఈ ఘటన గురించి అధికారిక సమాచారం లేదని చెబుతున్నారాయన. ఘటన జరిగిన 15 రోజుల తరువాత నిజాముద్దీన్ స్నేహితుడు ఒకరు తనకు కాల్ చేసి విషయం చెప్పినట్టు ఆయన మీడియాకు చెప్పారు.

నిజాముద్దీన్ 2021 నుంచీ అదే గదిలో ఉంటున్నట్టు తండ్రి చెప్పారు. తన కుమారుడు ఒక ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్నారనీ, తనను కొందరు వేధిస్తున్నారనీ తండ్రి ఆరోపించారు.

అక్కడి రూమ్మేట్లు, కంపెనీ ప్రతినిధులపై హసనుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటన నిజాముద్దీన్ పనిచేసిన 'కంపెనీ కుట్ర' అని ఆరోపించారు.

''అక్కడి వారు మా అబ్బాయిని 6 నెలలుగా వేధిస్తున్నారు. అబ్బాయి రూమ్మేట్లు దగ్గరలో ఉండే ఒక పోలీసు అధికారితో కలసి వేధిస్తున్నారు. వారంతా తెల్ల జాతివారు. ఆగస్టు 15న ఫుడ్ పాయిజన్ చేశారు. దాంతో మా వాడికి వాంతులు కూడా అయ్యాయి. తరువాత మా అబ్బాయి కోర్టుకు వెళ్తే, గది ఖాళీ చేయమని చెప్పింది. తరచూ ఏసీ ఆపేసేవారు. ఇదంతా కంపెనీ కుట్ర. కంపెనీలోని కొందరు మా వాడిని వేధిస్తున్నారు. అబ్బాయి వీసా గడువు ముగిసింది. దానికి దరఖాస్తు చేశారు. ప్రస్తుతం అద్దె కడుతూనే రూమ్‌లో ఉంటున్నారు. నేను ఆగస్టు 15, సెప్టెంబరు 1,2 తేదీల్లో మాట్లాడాను. మాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. 15 రోజుల వరకూ నాకు తెలియలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలి. మా అబ్బాయి మృతదేహాన్ని నాకు అప్పగించాలి'' అని హసనుద్దీన్ మీడియాతో చెప్పారు.

అమెరికా, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియాలో పోస్టు

కొన్నిరోజుల ముందు నిజాముద్దీన్ చేసిన లింక్డిన్ పోస్టులోని మాటలు తండ్రి మాటలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఆ పోస్టులో, తాను జాతి వివక్ష ఎదుర్కొంటున్నట్టు తీవ్ర ఆరోపణలు చేశారు నిజాముద్దీన్. అందులో పలువురిపై ఆరోపణలు చేశారు. ఆయన లింక్డిన్ అకౌంట్ మొత్తంలో అదొక్కటే పోస్టు ఉంది.

''నేను జాతివివక్ష, జాతి ద్వేషం, జాతి వేధింపులు, హింస, జీతంలో మోసం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించడం, ఇంకా న్యాయాన్ని అడ్డుకోవడం వంటి వాటికి బాధితుడిని. ఇంక చాలు, శ్వేతజాతి ఆధిపత్యం, జాతివివక్షతో కూడిన శ్వేత అమెరికన్ల మనస్తత్వానికి ముగింపు పలకాలి. కార్పొరేట్ అణచివేతకు కూడా ముగింపు పలకాలి. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ కఠినమైన శిక్ష విధించాలి. నన్ను నా ప్రస్తుత నివాసం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నా సహోద్యోగులు, నా యజమాని, నా క్లయింట్, డిటెక్టివ్, ఇంకా వారి వర్గం వారందరూ ప్రధానంగా బాధ్యులు. నేనేమీ సాధువును కాదని నాకు తెలుసు, కానీ వారు తాము దేవుళ్లమని భావించడం మానేయాలి'' అని ఆ పోస్టులో ఉంది.

ఈ పోస్టుతో పాటు దాదాపు 20 పత్రాలను అప్‌లోడ్ చేశారు నిజాముద్దీన్. అయితే ఆరోపణల తీవ్రత, వాటికి ప్రాథమిక ఆధారాలు, వారిని స్పందన కోసం సంప్రదించే అవకాశం ప్రస్తుతం లేనందున, నిజాముద్దీన్ పనిచేస్తున్న కంపెనీ పేరు, ఆయన, ఆయన తండ్రి ఆరోపించిన పేర్లను ఇక్కడ రాయడం లేదు.

అమెరికన్ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అమెరికా పోలీసులు ఏమంటున్నారు?

ఘటనపై అమెరికాలోని స్థానిక పోలీసులు స్పందించారు. ఘటన జరిగిన తరువాత సెప్టెంబరు 4వ తేదీన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కొద్దిరోజుల తరువాత శాంటా క్లారా పోలీస్ చీఫ్ మోర్గాన్ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

వారు పెట్టిన ట్వీటులో ఇలా ఉంది.

''సెప్టెంబర్ 3, ఉదయం 6:18 గంటలకు, శాంటా‌క్లారా పోలీసులకు, ఐసెన్‌హోవర్ డ్రైవ్ 1800 బ్లాక్‌లో ఒక ఇంట్లో కత్తిపోట్లు జరుగుతున్నాయంటూ ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచాడని కాల్ చేసిన వ్యక్తి తెలిపాడు. ఎస్‌సీపీడీ (శాంటాక్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్) అధికారులు అక్కడికి చేరుకుని నిందితుడిని ఎదుర్కొనే క్రమంలో అది కాల్పులకు దారి తీసింది. నిందితుడిని ఒక స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆయన మరణించినట్లు ప్రకటించారు. కత్తిపోట్ల బాధితుడిని ఒక స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనలో అధికారికి ఎటువంటి గాయాలు కాలేదు. దీనిపై శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, శాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్ కలసి దర్యాప్తు చేస్తున్నాయి'' అని ప్రకటించారు.

తిరిగి సెప్టెంబరు 6న ఆ పోలీసు శాఖ చీఫ్ మోర్గాన్ ప్రెస్ మీట్ పెట్టారు.

''పోలీసులు అక్కడకు వెళ్ళాక, మా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, మా ఆఫీసర్ కాల్పుల వల్ల అక్కడ మరింత నష్టం జరగకుండా, కనీసంగా ఒక ప్రాణాన్ని కాపాడాం. బహుశా మరిన్ని ప్రాణాలను స్పష్టంగా కాపాడామని మేం నమ్ముతున్నాం. ఫోన్ వచ్చిన వెంటనే అక్కడకు చేరుకున్న ఆఫీసర్‌కి లోపల పెద్ద గందరగోళ శబ్ధం వినిపించింది. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ నలుగురు ఉన్నారు. అందులో నిందితుడు (నిజాముద్దీన్) బాధితుడిని కత్తితో పొడుస్తూ, నేలకు తొక్కిపెడుతున్నాడు'' అంటూ కాల్పుల జరిపిన పోలీసు అధికారి శరీరంపై ఉన్న కెమెరా(బాడీ క్యామ్) ఫుటేజీ నుంచి ఒక ఫోటోను చూపించారు పోలీసులు.

''ఈ గొడవలో లేని మరో ఇద్దరు రూమ్మేట్లు కూడా అక్కడ ఉన్నారు. అధికారి హెచ్చరికలతో ఆపడానికి ప్రయత్నించినా నిందితుడు వినిపించుకోలేదు. బాధితుడిపై కత్తి ఎత్తాడు. కత్తి ఉన్న చేయి బాధితుడి వైపు కదులుతుండగా, పోలీసులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు'' అంటూ కత్తి కనిపించే మరో ఫోటో చూపారు పోలీసులు.

''మిగిలిన ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. బాధితుడితో పాటు వారినీ బయటకు పంపాం. నిందితుడిని ఒక స్థానిక ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు ప్రకటించారు. ఉదయం 7:22 గంటలకు బాధితుడిని మరొక స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన చేతులు, ఛాతీ, ఊపిరితిత్తులు, కడుపుపై కత్తిపోట్లకు చికిత్స అందిన తరువాత, డిశ్చార్జ్ చేశారు. బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. అదృష్టవశాత్తూ, పోలీసులకు గాయాలు కాలేదు'' అని శాంటా క్లారా పోలీస్ చీఫ్ మోర్గాన్ అన్నారు.

పోలీసులు, అమెరికా, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

''సాక్షి చెప్పినదాని ప్రకారం, దాడి సమయంలో నిందితుడు రెండు కత్తులను ఉపయోగించారు, మొదటి కత్తి హ్యాండిల్ విరిగిపోయింది. నిందితుడు రెండో కత్తి తీసుకున్నారు. కాల్పులు జరిపిన పోలీసు అధికారి రాబర్ట్ ఆల్‌సాప్‌కి 12 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన క్రైసిస్ ఇంటర్వెన్షన్‌లో శిక్షణ పొందారు. ఆయన శరీరంపై ఉన్న కెమెరా(బాడీ క్యామ్)లో కాల్పులు సహా మొత్తం ఘటన రికార్డు అయి ఉంది. బాధితుడి బంధువులను గుర్తించి, వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏ ప్రాణం పోవడం అయినా విషాదమే. దీనివల్ల ప్రభావితమైన అందరికీ మా సానుభూతి. కానీ అదే సమయంలో, అత్యంత కష్టమైన పరిస్థితులలో ముప్పు తప్పించిన, ఎదుర్కొన్న అధికారి ధైర్యాన్ని అభినందిస్తున్నాం. ఆయన నిర్ణయం మరెవరూ గాయపడకుండా, చనిపోకుండా చూసింది. మా అధికారులు ఇలాంటి వాటిపై శిక్షణ పొందుతారు. ఇలాంటి కాల్పుల ఘటనపై నిబంధనల ప్రకారం, మా డిపార్ట్‌మెంట్, శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ద్వారా పూర్తి దర్యాప్తు జరుగుతున్నందున కాల్పులు జరిపిన పోలీసును సెలవులో పంపాం'' అని ప్రకటించారు మోర్గాన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)