తిరుపతి: అడవిలో 4 మృతదేహాలు.. చనిపోయినవారు ఎవరు? భార్యాపిల్లలను వెతుక్కుంటూ సౌదీ నుంచి వచ్చిన భర్త ఏం చెప్తున్నారు?

తిరుపతి అడవిలో మిస్టరీ మృతదేహాలు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తిరుపతి జిల్లాలో నాలుగు మృతదేహాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.

పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒకేచోట నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది.

చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను, సమీపంలోని ఒక గుంతలో పూడ్చిన మరో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గుంతలో ఉన్న రెండు మృతదేహాలు చిన్నారులవి.

విచారణలో ఇవన్నీ తమిళనాడుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారివని అధికారులు ధ్రువీకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎలా బయటపడింది?

స్థానిక గొర్రెల కాపరి ఒకరు సెప్టెంబర్ 14న ( ఆదివారం) అడవిలో గొర్రెలు మేపడానికి వెళ్లినప్పుడు చెట్టుకు వేలాడుతున్న శవాలను చూశారని పోలీసులు చెప్పారు.

వెంటనే ఆయన అటవీ అధికారులకు సమాచారం అందించగా, వారు పాకాల రెవెన్యూ అధికారులను, ఆపై తమను అప్రమత్తం చేశారని పోలీసులు చెప్పారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా.. చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలతో పాటు సమీపంలో గుంతలో మరికొన్ని వస్తువులు, అవశేషాలు కనిపించాయి.

తవ్వకాలు జరుపగా ఆ గుంతలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.

జయమాల

మందుల చీటీతో..

ఘటనా స్థలం వద్ద పోలీసులకు మందుల చీటీలు దొరికాయి. ఈ క్లూ ఆధారంగా వారు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రిస్క్రిప్షన్ తమిళనాడులోని తంజావూరు వైద్యుడు రాసినట్లుగా గుర్తించి ఆయనను సంప్రదించారు.

సెల్వన్ అనే వ్యక్తి మానసిక సమస్యల కారణంగా తన దగ్గర వైద్యం పొందుతున్నారని ఆ వైద్యుడు తెలిపారు.

అయితే, తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిక్కచ్చేరి పోలీస్ స్టేషన్‌లో వెంకటేష్ అనే వ్యక్తి జులై 4వ తేదీన తన భార్య జయమాల, కుమార్తెలు కనపడటం లేదని ఫిర్యాదు చేశారు.

తన భార్యకు అన్న వరుసయ్యే సెల్వన్‌పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఫిర్యాదుదారు వెంకటేష్‌కు సమాచారమిచ్చారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మృతులు తమిళనాడుకు చెందినవారే అని తేలింది. తర్వాత తహసీల్దారు సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు.

చెట్టు దగ్గర వేలాడుతున్న మృతదేహం క్రిస్టెన్సన్ అలియాస్ కలై సెల్వన్ (37)దిగా.. అక్కడే ఉన్న మరో మృతదేహం జయమాల (33), గుంతలో పాతిపెట్టిన చిన్నారులు దర్శిని (7), వర్షిణి (3)లుగా వెంకటేష్ గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

జయమాల, దర్శిని, వర్షిణి తన భార్యాపిల్లలే అని వెంకటేష్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

అక్కడే పోస్ట్‌మార్టం

గొర్రెల కాపరుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సెల్వన్, జయమాల మృతదేహాలు తరలించడానికి వీలుకాకపోవడంతో ఘటనా స్థలంలోనే డాక్టర్లు సోమవారం పోస్టుమార్టం నిర్వహించారని పోలీసులు తెలిపారు.

అప్పటికే చీకటి పడటంతో దర్శిని (7), వర్షిణి (3) మృతదేహాలను మరుసటి రోజు గుంతల్లో నుంచి బయటకు తీసి, వెంకటేష్ గుర్తించిన తర్వాత ఆయన సమక్షంలోనే మంగళవారం అక్కడే పోస్టుమార్టం నిర్వహిచారు. అక్కడే ఖననం చేశారు.

పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్
ఫొటో క్యాప్షన్, పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్

పట్టుకుంటే విడిపోయే స్థితిలో మృతదేహాలు...

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ వివరాలను బీబీసీకి చెప్పారు.

''తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిక్కచ్చేరికి చెందిన వెంకటేష్ సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ తను సంపాదించిన డబ్బులను తిక్కచ్చేరిలో ఉంటున్న భార్యకు పంపేవారు. ఆ డబ్బుతో భార్య జయమాల, తనకు వరుసకు సోదరుడు(పెద్దమ్మ కొడుకు) అయ్యే సెల్వన్‌తో కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. అలా ఆ వ్యాపారంలో నష్టపోయి దాదాపు కోటి రూపాయల వరకు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ ఫైనాన్స్ వ్యవహారాలపై సెల్వన్‌పై ఇప్పటికే తమిళనాడులో చీటింగ్ కేసు నమోదైంది.

వారు చనిపోయి 15 నుంచి 20 రోజులు అయ్యుంటుంది. మృతదేహాలు ముట్టుకుంటేనే విడిపోతున్నాయి'' అని పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

సెల్వన్
ఫొటో క్యాప్షన్, సెల్వన్

''మృతదేహాలను తాకితే విడిపోతున్నాయి. అందుకే అక్కడే పోస్టుమార్టం చేసి, అక్కడే ఖననం చేశాం. పిల్లలు ఇద్దర్నీ చంపేసి గుంతలో పూడ్చారు. మిగతా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారా లేక వారిని ఎవరైనా హత్య చేశారా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుంది.

చనిపోయిన మహిళ భర్త జులైలో.. తన భార్యా పిల్లలు కనిపించడం లేదని తమిళనాడులో మిస్సింగ్ కేసు పెట్టారు.

సెల్వన్ మీద అనుమానం ఉంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చి వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నాం.

వెంకటేష్, అతని బంధువులను కూడా విచారించాం. తమకు శత్రువులు ఎవరూ లేరని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలియట్లేదన్నారు. ఈ ఫైనాన్స్ విషయంలో సెల్వన్ మీద అక్కడ ఒక చీటింగ్ కేసు నమోదైంది.

దీంతో అది సూసైడ్ అయిఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత హత్యా లేక ఆత్మహత్య అని తేలుతుంది'' అని ఆయన వివరించారు.

వారంతా అయిదు నెలలుగా ఎక్కడున్నారు?

''సౌదీలో ఉంటున్న వెంకటేష్ మే నెలలో ఇంటికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇంటి దగ్గరికి బంధువులు వెళ్లి ఆరా తీయగా వారక్కడ కనిపించలేదు.

దీంతో జూన్ 27న ఇండియాకు వచ్చిన ఆయన పలు ప్రాంతాల్లో వెతికి జులై 4న తిక్కచ్చేరిలో కేసు పెట్టారు.

వాళ్లు మే నుంచి కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టారు. కనీసం 15- 20 రోజులు ముందు వాళ్లు చనిపోయి ఉండొచ్చు.

అప్పటివరకు వారంతా ఎక్కడో ఉండొచ్చు'' అని సీఐ పాకాల సుదర్శన్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)