మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయా? ఈ చిన్నచిన్న పరీక్షలతో ఇంట్లోనే తెలుసుకోవచ్చు..

ఊపిరితిత్తులు, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డేవిడ్ కాక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మన ఆరోగ్యం గురించి మన ఊపిరితిత్తులు(లంగ్స్) చాలా విషయాలు చెప్పగలవు. అంతేకాకుండా, మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంది.

మీ ఊపిరితిత్తుల వయసు ఎంత అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు శ్వాసించే ప్రతిసారీ, మీ ఊపిరితిత్తులు కాలుష్యం, సూక్ష్మక్రిములు, దుమ్ము, అలెర్జీ కారకాలను ఎదుర్కొంటాయి. దీంతో ఊపిరితిత్తులకు నెమ్మదిగా హాని జరుగుతుంది, వేగంగా వాటి కాలవ్యవధి తగ్గుతుంది.

ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైనవి కాబట్టి, వాటి పరిస్థితి మీ శరీరంలోని మిగిలిన భాగాల వయసు(కాల వ్యవధి)ను కూడా ప్రభావితం చేస్తుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తుల పనితీరులో మార్పులపై అంతర్జాతీయ శ్వాసకోశ నిపుణుల బృందం 2025 మేలో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.

20వ శతాబ్దంలోని దాదాపు 30,000 మంది పురుషులు, మహిళల నుంచి సేకరించిన డేటా ఆధారంగా, ఊపిరితిత్తులు 20 నుంచి 25 ఏళ్ల వయస్సు వరకు చాలా చురుగ్గా ఉంటాయని గుర్తించారు.

అంతేకాదు, స్త్రీలలో ఊపిరితిత్తుల సామర్థ్యం సాధారణంగా పురుషుల కంటే కొంచెం ముందుగానే ఉత్తమ స్థాయికి చేరుకుంటుంది, ఆపై అది తగ్గడం ప్రారంభమవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఊపిరితిత్తుల ఆరోగ్యం, వైద్యం, పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

లంగ్స్ ఆరోగ్యంగా ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడమనేది వయసుతో పాటు జరిగే జీవసంబంధమైన ప్రక్రియలా కనిపిస్తుందని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్, స్టడీ హెడ్ జుడిత్ గార్సియా-అమెరిచ్ అన్నారు.

"ధూమపానం, వాయు కాలుష్యం, ఉబ్బసం వంటివి ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతాయి" అని జుడిత్ చెప్పారు.

"ఈ వయసులో (20- 25 సంవత్సరాలు) మీ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత మెరుగ్గా ఉంటే, ఆ తరువాత శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి మీ నిరోధకత అంత మెరుగ్గా ఉంటుంది" అని ఆమె తెలిపారు.

ఇంతకీ, మీ ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి? మీరు వాటిని మెరుగైన స్థితికి తీసుకురాగలరా?

ఇలా చేసుకోవచ్చు..

మీరు ఇంట్లో ఒక సాధారణ పద్ధతిని అనుసరించడం ద్వారా మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని చెక్ చేయవచ్చు. దీని కోసం మీకు ఇవి అవసరం:

• పెద్ద ప్లాస్టిక్ బాటిల్

• బకెట్ లేదా టబ్

• రబ్బరు పైపు

ఇప్పుడు ఏం చేయాలంటే:

  • ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో 200 ఎంఎల్ నీటిని పోసి, ఆ నీటి మట్టం వద్ద పెన్నుతో గీత గీయండి.
  • మరో 200 ఎంఎల్ నీటిని పోసి, మరో గీత గీయండి. అలా బాటిల్ నిండిపోయే వరకు ఇలా చేయండి.
  • ఇప్పుడు మీరు తీసుకున్న బకెట్ లేదా టబ్‌ను నీటితో నింపి, పూర్తిగా నింపిన బాటిల్‌ను దానిలో తలకిందులుగా ముంచండి.
  • బాటిల్‌ను అలాగే ఉంచి, రబ్బరు ట్యూబ్‌ను బాటిల్ మూతిలోకి జొప్పించండి.
  • ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకొని ట్యూబ్‌లోకి ఊదండి.
  • ఇలా ఊదినప్పుడు సీసాపై గీసిన ఎన్ని గీతలను నీరు దాటిందో లెక్కించండి.
  • ఇలా ఎన్ని గీతల వరకు ఊదారో ఆ సంఖ్యను 200 mlతో గుణించండి (ఉదా. మూడు గీతలైతే ఫలితం 600ml). ఇదే మీ ఊపిరితిత్తుల ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ (ఎఫ్‌వీసీ) లేదా వైటల్ లంగ్ కెపాసిటీ(ఊపిరితిత్తుల సామర్థ్యం).
ఆరోగ్యం, ఊపిరితిత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి స్పైరోమీటర్ మరింత కచ్చితమైన మార్గం.

వయసుతో పాటు తగ్గుదల

"ఈ పరీక్ష మీరు ఎంత గాలిని బయటికి ఊదగలరో పరిశీలిస్తుంది. దీనినే వైటల్ కెపాసిటీ అంటారు" అని కెంట్ విశ్వవిద్యాలయంలోని శ్వాసకోశ వ్యాయామ క్లినిక్ హెడ్ జాన్ డికిన్సన్ చెప్పారు.

"ఈ పదాన్ని మొదట 1840లలో బ్రిటిష్ సర్జన్ జాన్ హచిన్సన్ ఉపయోగించారు. తక్కువ మొత్తంలో గాలిని వదలగల వ్యక్తుల ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని ఆయన గమనించారు" అని తెలిపారు.

అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి, ఎప్పుడూ ధూమపానం చేయకపోయినా, పెరుగుతున్న వయసు కారణంగా వారి ఎఫ్‌వైసీ ప్రతి పదేళ్లకు 0.2 లీటర్లు తగ్గుతుంది.

సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి ఎఫ్‌వైసీ 3 నుంచి 5 లీటర్ల మధ్య ఉంటుంది. ఇంట్లో చేసే ఈ పరీక్షలో మీకు రీడింగ్ తక్కువగా వచ్చినా, పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని జాన్ డికిన్సన్ అంటున్నారు.

ఎందుకంటే, రీడింగ్‌లు వాస్తవంగా చూపించాల్సిన దానికంటే తక్కువగా చూపించి ఉండొచ్చని అన్నారాయన.

ఆరోగ్యం, ఊపిరితిత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అథ్లెట్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ఊపిరితిత్తుల సామర్థ్యం పరిశీలిస్తుంటారు.

ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

"ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా తగ్గితే, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు రావొచ్చు" అని గార్సియా-ఐమెరిక్ చెప్పారు.

"ఈ పరిస్థితి క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)గా వృద్ధి చెందుతుంది. దీనిని ఊపిరితిత్తుల తక్కువ పనితీరు స్థాయిగా పరిగణిస్తారు" అని అన్నారు.

కానీ, ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తే ఇది శ్వాసకోశ వ్యాధులకే పరిమితం కాదు. అధిక రక్తపోటు, ఆటోఇమ్యూనిటీ, బలహీనత, జీవక్రియ రుగ్మతలు, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలలో క్షీణత వంటి లక్షణాలను కూడా చూపిస్తుంది.

ఊపిరితిత్తులు గుండె, రక్త ప్రసరణతో పాటు, రోగనిరోధక వ్యవస్థకూ అనుసంధానమై ఉండటమే దీనికి ఒక కారణమని కెనడాలోని మెక్‌మాస్టర్ వర్సిటీలో ఏజింగ్, ఇమ్యూన్ సిస్టం ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ డాన్ బోడిష్ చెప్పారు.

బోడిష్ ప్రకారం, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కణాలను రోగనిరోధక కణాలు తొలగించలేకపోతే, అది ఇన్‌ఫ్లమేషన్‌ (ఏదైనా ఒక భాగం ఎర్రబడటం, వాపు రావడం, నొప్పి పుట్టడం) పెంచుతుంది.

ఇది ఊపిరితిత్తులలో మచ్చలకు దారితీస్తుంది, దీనిని పల్మనరీ ఫైబ్రోసిస్ అని పిలుస్తారు. ఇది ఊపిరితిత్తులు గట్టిపడేలా చేస్తుంది, అలా గట్టిపడడం వాటి పనితీరు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఊపిరితిత్తుల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో మీరు చేయగలిగే మరో పరీక్ష, మీ 'రెస్టింగ్ బ్రీతింగ్ ఫ్రీక్వెన్సీ చెక్ చేయడం' అని డికిన్సన్ చెప్పారు. అంటే, మీరు మళ్లీ శ్వాస తీసుకోవడానికి ముందు ఎంతసేపు శ్వాస వదలగలరు.

"మీరు బాగా శ్వాస తీసుకోండి. తర్వాత ఎంతసేపు గాలిని బయటకు వదులుతారో సెకన్లలో లెక్కించండి. మీరు కనీసం 11 సెకన్ల పాటు నెమ్మదిగా శ్వాస వదలగలగాలి" అని డికిన్సన్ చెప్పారు.

ఊపిరితిత్తుల పనితీరు క్షీణించడం వల్ల వయసు సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి.. గుండె జబ్బులు, ఆస్టియోపోరోసిస్, టైప్ 2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి కోల్పోవడం.

ఆరోగ్యం, ఊపిరితిత్తులు, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఊపిరితిత్తుల పనితీరు ఎలా మెరుగుపరచాలి?

కొన్ని చర్యలతో మీ ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుందని, వయసుతో పాటు అది క్షీణించే రేటు తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం: ఇది శ్వాసమార్గాల ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, శ్వాస కండరాలు బలపడతాయి.

ఉప్పు తగ్గించడం: అధిక ఉప్పు ఊపిరితిత్తుల ఇన్‌ఫ్లమేషన్‌, ఫైబ్రోసిస్‌ను పెంచుతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి.

చేప నూనె, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి, ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఇవి ఊపిరితిత్తుల అంచులను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.

ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే రసాయనాలకు గురికాకుండా ఉండటానికి ధూమపానం, వేపింగ్ (ఎలక్ట్రానిక్ సిగరెట్లు) రెండింటినీ మానేయాలని బోడిష్ సిఫార్సు చేస్తున్నారు.

బరువును అదుపులో ఉంచుకోవడం, అదనపు కొవ్వును నివారించడం కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి ఒక మార్గమని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డేనియల్ క్రెయిగ్‌హెడ్ సూచిస్తున్నారు.

ఆరోగ్యం, వైద్యం, ఊపిరితిత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మరికొన్ని మార్గాలు..

ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి మరొక మార్గం... ఇన్‌స్పిరేటరీ మజిల్ ట్రైనింగ్ (ఐఎంటీ). అంటే, మీ శ్వాస కండరాలు బలంగా పనిచేసేలా పరికరం ద్వారా శ్వాస తీసుకునే పద్ధతి. ఇది 1990ల మధ్యకాలం నుంచి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభావవంతమైన మార్గంగా గుర్తించారు.

దీనిని అథ్లెట్లు, గాయకులు, ఉబ్బసం లేదా సీఓపీడీ వంటి శ్వాస సమస్యలు ఉన్నవారు ఉపయోగిస్తున్నారు.

ఐఎంటీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుందని, రక్తపోటును తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.

'పవర్‌బ్రీత్' అనేది ఐఎంటీ కోసం యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ ఆమోదించిన పరికరం. కోవిడ్ నుంచి కోలుకోవడానికి సహాయపడే పరికరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని గురించి తెలిపింది.

శ్వాస కండరాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ 30 బ్రీత్ ఐఎంటీ రెండు సెషన్లు చేయడం సరిపోతుందని పరిశోధనలో తేలినట్లు క్రెయిగ్‌హెడ్ చెప్పారు.

ఆరోగ్యం, ఊపిరితిత్తులు, వాయిద్యాలు వాయించడం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పాడడం లేదా వాయిద్యం వాయించడం..

మరొక ఆప్షన్ ఏమిటంటే, పాడటం లేదా గాలి వాయిద్యం వాయించడం. న్యూయార్క్ నగరంలోని లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ సెంటర్ పరిశోధకులు ఉబ్బసం ఉన్నవారికి వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి వివిధ గాలి వాయిద్యాలను వాయించడం నేర్పించే పద్ధతిని అవలంబించారు.

సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన మెట్ కాస్గార్డ్ శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని. సీఓపీడీ ఉన్నవారికి పాడటం ఎలా సహాయపడుతుందో పరిశీలించే అనేక పరీక్షలలో ఆమె పాల్గొన్నారు.

ఊపిరితిత్తులకు జరిగే నష్టాన్ని పాడడం సరిచేయగలదని సూచించే ఎటువంటి ఆధారాలు లేవని కాస్గార్డ్ చెబుతున్నప్పటికీ, శ్వాసకోశ కండరాలను ఉపయోగించుకొనే సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇప్పటికీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె నమ్ముతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)