గుత్తా జ్వాల: 30 లీటర్ల చనుబాలు దానం చేసిన బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్.. ఎవరెవరు దానం చేయొచ్చు?

గుత్తా జ్వాల, బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, GUTTA JWALA

‘‘తల్లి పాలు ప్రాణాలను కాపాడతాయి. దానం చేసిన తల్లిపాలు నెల తక్కువగా పుట్టిన , అనారోగ్యంగా ఉన్న పిల్లల ప్రాణాలను కాపాడగలవు. మీరు తల్లిపాలు దానం చేయగలిగితే, వాటి అవసరం ఉన్న ఒక కుటుంబానికి మీరు హీరో అవుతారు. దీని గురించి ప్రజలు మరింత అవగాహన కల్పించుకొని మిల్క్ బ్యాంకులకు తోడ్పడాలి"

రెండోసారి తల్లి అయిన ప్రముఖ క్రీడాకారిణి జ్వాలా గుత్తా సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా రిపోర్టుల ప్రకారం, గుత్తా జ్వాలా దాదాపు 30 లీటర్ల పాలను మిల్క్ బ్యాంకుకు దానం చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో, తాను దానం చేసిన పాల ఫోటోలను కూడా షేర్ చేశారు. మరింతమంది మహిళలు చనుబాలను దానం చేయాలని సూచించారు.

నెలలు నిండక ముందే పుట్టిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు దానం చేసిన తల్లిపాలు చాలా అవసరం. ప్రసవం సమయంలో తల్లిని కోల్పోయిన పిల్లలకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి.

దానం చేసిన తల్లిపాలను అవసరమునప్పుడల్లా ఉపయోగించుకునేలా మిల్క్ బ్యాంకులో ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు.

పాలిచ్చే తల్లులు తమ దగ్గర అధికంగా పాలు ఉంటే, నిబంధనల ప్రకారం వాటిని మిల్క్ బ్యాంకులకు దానం చేయచ్చు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుత్తా జ్వాల, బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

‘తగినంత సరఫరా లేదు’

తల్లిపాలను కేవలం స్వచ్ఛందంగానే డొనేట్ చేయాలి. ఆరోగ్యవంతమైన శిశువుకు అవసరమైన దానికన్నా అధికంగా పాలను ఉత్పత్తి చేసే మహిళలు మాత్రమే దానం చేయాలి.

తమ పిల్లల కోసం కూడా తల్లులు తమ చనుబాలను బ్యాంకుల్లో నిల్వ ఉంచుకొని అవసరం కొద్దీ వాడుకోవచ్చు.

తల్లిపాలు శిశువులకు అత్యుత్తమ పోషకాహార వనరు అని డిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో నీయోనేటాలజీ డిపార్టుమెంటు హెడ్ డాక్టర్ ప్రొఫెసర్ సుష్మా నంగియా అన్నారు.

‘‘ఒకవేళ ఏదైన కారణం వల్ల శిశువుకు తల్లిపాలు అందుబాటులో లేకపోతే అప్పుడు దానం చేసిన బ్రెస్ట్ మిల్క్‌ను వాడతాం’’ అని ఆమె అన్నారు.

భారతదేశంలో తల్లిపాల దానంపై జాతీయ స్థాయిలో డేటా లేకపోయిన కొన్ని మిల్క్ బ్యాంకులలో నిర్వహించిన పరిశోధనలు వల్ల కొంత డేటా అందుబాటులో ఉంది.

ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ప్రకారం, భారత్ లో దానం చేసిన తల్లిపాల సేకరణ కోవిడ్ సమయంలో తగ్గిపోయింది. పాశ్చురైజ్డ్ డోనార్ హ్యూమన్ మిల్క్ ( పీహెచ్‌డీఎమ్)కు డిమాండు పెరిగింది.

ఎనభై బెడ్లు ఉన్న ఒక నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)కు సగటున నెలకి 15 లీటర్ల పాశ్చురైజ్డ్ డోనార్ హ్యూమన్ మిల్క్ అవసరం ఉంటుందని ఆ ఆర్టికల్ పేర్కొంది.

మరో రిపోర్టు ప్రకారం, 2025 జులైలో 639 మంది పాలిచ్చే తల్లులు మొత్తం 192 లీటర్ల పాలను తిరుచ్చిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి దానం చేశారు. ఆ ఆసుపత్రి నియోనేటల్ యూనిట్‌లోని 634 నవజాత శిశువులకు ఇవి ఎంతో ఉపయోగ పడ్డాయి.

గుత్తా జ్వాల, బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

‘‘తల్లిపాల దానంపై అవగాహన పెరగాలి’’

భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల బ్యాంకును 1989లో ముంబయిలోని లోకమాన్య తిలక్ ఆసుపత్రిలో స్థాపించారు.

2019 వరకు, దేశంలో కేవలం 22 తల్లిపాల బ్యాంకులు ఉండేవి. కానీ, 2021 నాటికి ఆ సంఖ్య 90కి పెరిగింది.

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి బ్యాంకులు సుమారు 100 వరకు ఉంటాయని నిపుణుల అంచనా. అయితే తగినంత తల్లిపాలను సేకరించేందుకు ఈ బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయని రిపోర్టులు వెల్లడించాయి.

దిల్లీలో కేవలం రెండు ప్రభుత్వ మిల్క్ బ్యాంకులు ఉన్నాయి. ఒకటి లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో, మరొకటి ఎయిమ్స్‌లో.

దిల్లీలోని ప్రభుత్వేతర అమారా మిల్క్ బ్యాంకు‌లో హెడ్ డాక్టర్‌గా పని చేస్తున్న రఘురాం మలయా ప్రకారం, తమ మిల్క్ బ్యాంకుకు ప్రతీ నెల సుమారు 40 లీటర్ల తల్లిపాలు విరాళంగా వస్తాయని చెప్పారు. ఇది డిమాండు కన్నా చాలా తక్కువ.

‘‘మాది ఒక ఎన్జీవో. అవసరాన్నిబట్టి దిల్లీలో దాదాపు 100 ఆసుపత్రులకు చనుబాలను సరఫరా చేస్తుంటాం. నియోనేటల్ యూనిట్లలోని శిశువులకు తల్లిపాల డిమాండు చాలా ఎక్కువ. కానీ, మేం తగినంత సరఫరా చేయలేకపోతున్నాం’’ అని డాక్టర్ రఘురాం అన్నారు.

మిల్క్ కిట్స్‌ ద్వారా ఇళ్ల నుంచి నేరుగా బ్రెస్ట్ మిల్క్‌ను అమారా మిల్క్ బ్యాంక్ సేకరిస్తుంది.

‘‘తల్లిపాల దానం గురించి ప్రజల్లో అవగాహన పెరగాలి. ఇవి ఎందరో శిశువుల ప్రాణాలను కాపాడగలవు’’ అని డాక్టర్ రఘురాం అన్నారు.

డాక్టర్ సుష్మా నంగియా మాట్లాడుతూ, "పాల బ్యాంకులకు తగినంతగా తల్లిపాలు అందడం లేదు. తల్లి పాల దానం గురించి మనం అవగాహన పెంచుకోవాలి. కానీ అది స్వచ్ఛందంగా జరిగేలా చూసుకోవాలి. తమ పిల్లల అవసరాలను తీర్చగలిగిన, మంచి ఆరోగ్యంతో ఉన్న తల్లులు మాత్రమే తమ పాలను దానం చేయాలి" అని అన్నారు.

గుత్తా జ్వాల, బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ప్రాణరక్ష

భారత్‌లో తల్లిపాల దానానికి సంబంధించి స్పష్టమైన నియమాలు ఉన్నాయి.

ఆ నియమాల ప్రకారం దేశంలో బ్రెస్ట్ మిల్క్ అమ్మకం, కొనుగోలు నిషేధం.

నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన శిశువుల అవసరాలను తీర్చడానికి దానం చేసిన తల్లిపాలు తగినంతగా లేవని అంచనాలు సూచిస్తున్నాయి.

గర్భం ధరించిన తర్వాత 37 వారాలకు ముందే పుట్టిన శిశువులను ప్రీమెచ్యూర్ బేబీగా పరిగణిస్తారు. భారతదేశంలో జన్మించే శిశువులలో ఒక శాతంలోపు పిల్లలకు నియేనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చడం అవసరమవుతుంది.

ఈ పిల్లలకు దానం చేసిన తల్లిపాలు చాలా అవసరం.

‘‘ఏ బిడ్డకైనా సొంత తల్లి పాలే అత్యుత్తమం. ఈ పాలే శిశువులను చాలా రోగాల నుంచి కాపాడగలవు. ఏదైనా కారణం వల్ల తల్లిపాలు అందుబాటులో లేకపోతే, దానం చేసిన తల్లిపాలను వాడచ్చు. ఇవి తల్లిపాలకు బదులు కావు, కేవలం ఒక గ్యాప్ సపోర్ట్‌లాగా పని చేయగలవు’’ అని డాక్టర్ నంగియా అన్నారు.

ఇలాంటి పాలు అవసరం ఉన్న పిల్లలకు మిల్క్ బ్యాంకుల నుంచి పాలు అందిస్తారు. ఇక్కడ తల్లుల నుంచి సేకరించిన పాలను జాగ్రత్తగా పాశ్చురైజ్ చేస్తారు.

చనుబాలు, గుత్తా జ్వాల, బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

దానానికి అర్హతలు ఏంటి

తమ సొంత పిల్లల అవసరాలకు మించి అధికంగా పాలను ఉత్పత్తి చేసే మహిళలు మాత్రమే చనుబాలను దానం చేయవచ్చని డాక్టర్లు అంటున్నారు.

దానానికి ముందు, దానం చేసే మహిళకు వైద్య పరీక్ష అవసరం. దానం చేసే తల్లులకు హెపటైటిస్-బీ,సీ, హెచ్‌‌ఐవీ, సిఫిలిస్ వంటి వ్యాధుల కోసం రక్త పరీక్షలు జరుపుతారు. పొగాకు, మద్యం సేవించే మహిళలకు దానం చేసే అర్హత లేదు.

‘‘ఏ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న మహిళలు మాత్రమే చనుబాల దానానికి అర్హులు. అమలులో ఉన్న నియమ నిబంధనలను అనుసరిస్తూ మాత్రమే డొనేషన్లు జరగాలి’’ అని డాక్టర్ సుష్మా నంగియా అన్నారు.

చనుబాలను దానం చేయాలనుకున్న మహిళలు పాల బ్యాంకుకు వెళ్లి, తమ పాలను పరీక్షించుకుని, దానం చేయచ్చు. అందుకోసం కిట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

బ్రెస్ట్ మిల్క్ , గుత్తా జ్వాల, బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

చనుబాలను ఎలా తీస్తారు?

చనుబాలను ఒక స్టెరిలైజ్డ్ పంప్ ద్వారా తీసి, మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో బ్యాచ్‌ల వారీగా నిల్వ చేస్తారు. సేకరించిన ఈ బ్రెస్ట్ మిల్క్‌లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చంపడానికి పాశ్చురైజ్ చేస్తారు.

తర్వాత సరైన ఉష్ణోగ్రతలో నిల్వచేసి ఉంచితే మూడు నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే వీటిని దానం చేసిన మూడు నెలలలోపు ఉపయోగించుకోవచ్చు.

‘‘తల్లిపాలను సరిగ్గా తీసి, సరైన ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. ఇది అధునాతన పాల బ్యాంకులో మాత్రమే సాధ్యమవుతుంది’’ అని డాక్టర్ సుష్మా నంగియా అన్నారు

‘‘దేశంలో ఇలాంటి మిల్క్ బ్యాంకులు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి దిల్లీలాంటి పెద్ద నగరంలో కేవలం రెండు బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఉన్నాయి. కానీ వీటి అవసరం ప్రతీ నియోనేటల్ ఐసీయూకు ఉంది. సమీప ఆసుపత్రుల నుంచి చనుబాలను సేకరించి పాశ్చురైజ్ చేసి, పంపిణీ చేసే ఒక పెద్ద బ్రెస్ట్ మిల్క్ సెంటర్‌ను స్థాపించడం అవసరం. ఒక్క మిల్క్ బ్యాంకు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నఎన్ఐసీయూల అవసరాలను తీర్చగలదు" అని డాక్టర్ నంగియా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)