స్వామి చైతన్యానంద కేసు: శృంగేరి మఠం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఏంటి..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆశయ్ యెడ్గే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఎస్ఆర్ఐఎస్ఐఐఎం) క్యాంపస్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.
దాదాపు రెండు నెలల కిందట, అక్కడి మహిళా విద్యార్థులు అప్పటి ఇన్‌స్టిట్యూట్మేనేజర్‌గా ఉన్న పార్థసారథి అలియాస్ స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
కర్ణాటకలోని శృంగేరి శారద పీఠం ఈ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తోంది. స్వామి చైతన్యానంద సరస్వతిపై ఆరోపణల తర్వాత, పోలీసులు, జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగాయి.
దిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాలు నమోదయ్యాయి. వీరిలో 17 మంది విద్యార్థులు చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపులు, అసభ్యకరమైన భాష వాడకం, బెదిరింపులు, అవాంఛిత శారీరక సంబంధాల ఆరోపణలు చేశారు.
దిల్లీలోని వసంత కుంజ్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. చైతన్యానంద సరస్వతికి చెందిన నకిలీ దౌత్య నంబర్ ప్లేట్ ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దిల్లీలోని శారద ఇన్‌స్టిట్యూట్‌లో భద్రతా ఏర్పాటు గురించి, పక్క బిల్డింగులోని ఒక సెక్యూరిటీ గార్డుతో బీబీసీ మాట్లాడింది.
పేరు చెప్పడానికి ఇష్టపడని అక్కడి సెక్యూరిటీ గార్డు బీబీసీతో మాట్లాడుతూ.. "చైతన్యానంద కేసు తర్వాత, ఇన్‌స్టిట్యూట్‌లోని భద్రతా సిబ్బందిని మార్చారు. ప్రైవేట్ బౌన్సర్లను నియమించారు. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు" అని అన్నారు.
క్యాంపస్ నుంచి వెళ్లిపోతున్న విద్యార్థులతో మాట్లాడటానికి ప్రయత్నించాం. అందులో పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు విద్యార్థులు మాట్లాడుతూ "శారద ఇన్‌స్టిట్యూట్‌లో వంద మందికి పైగా విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) చదువుతున్నారు. వీరిలో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) స్కాలర్‌షిప్ పథకం కింద ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు" అని అన్నారు.
వారు మాతో వివరంగా మాట్లాడటానికి నిరాకరించారు. అయితే క్యాంపస్‌లో ప్రస్తుతం వాతావరణం ఉద్రిక్తంగా ఉందని అంగీకరించారు.


ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎస్ఆర్ఐఎస్ఐఐఎం ఇన్‌స్టిట్యూట్ సెప్టెంబర్ 24న ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.
ఎడ్యుకేషన్, అకౌంట్స్‌కు సంబంధించి జరిపిన ఆడిట్‌లో చైతన్యానంద చేసిన మోసం, ఫోర్జరీ, నేరపూరిత నమ్మక ద్రోహం వంటి అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో 2025 జులై 19న 300 పేజీలకు పైగా సాక్ష్యాలతో కూడిన క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. దిల్లీలోని వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నంబర్ 320/2025 నమోదైంది.
కాగా, ఆగస్టు 1న వర్సిటీ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ నుంచి పీఠం ఒక ఈమెయిల్ అందుకుందని, అందులో విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదుల గురించి పేర్కొన్నారని తెలిపింది. ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు, మహిళా విద్యార్థులకు అనుచిత వాట్సాప్ సందేశాల వంటివి చైతన్యానందపై ఈ ఫిర్యాదులలో ఉన్నాయని పేర్కొంది.
దీనికి ప్రతిస్పందనగా పీఠం ఆదేశాల మేరకు పాలక మండలి విద్యార్థులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది.
ఆ తర్వాత, చట్టపరమైన చర్యలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పీఠం తదుపరి ప్రకటన(ఆగస్టు 2)లో పేర్కొంది. స్వామి చైతన్యానంద సరస్వతికి శృంగేరి పీఠంతో సంబంధం లేదనీ స్పష్టం చేసింది.
విద్యార్థులపై వేధింపులు, దుష్ప్రవర్తనను వివరిస్తూ ఎస్‌హెచ్‌ఓకి పీఠం నిర్వాహకుడు పీఏ మురళి ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. దీంతో, మరుసటి రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు బాధిత విద్యార్థుల నుంచి వాంగ్మూలాలను తీసుకోవడం ప్రారంభించారు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 75(2) (లైంగిక వేధింపులు), 79, 351(2) (క్రిమినల్ బెదిరింపు) కింద దిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడు స్వామి చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది.
డైరెక్టర్, నిర్వహణ కమిటీ సభ్యుని పదవి నుంచి స్వామి చైతన్యానంద సరస్వతిని తొలగించారు. విద్యా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, విద్యార్థుల సంక్షేమం, విద్యకు అగ్ర ప్రాధాన్యత ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ఫొటో సోర్స్, Delhi Police/ANI
ఎవరీ స్వామి చైతన్యానంద సరస్వతి?
స్వామి చైతన్యానంద సరస్వతి అసలు పేరు పార్థసారథి. ఒడిశాలో జన్మించిన ఈయన, గాడ్‌మేన్‌గా తనను తాను ప్రకటించుకున్నారు. ఆయన దిల్లీలో వసంత కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ మాజీ డైరెక్టర్.
కర్ణాటకలోని ప్రముఖ హిందూ సన్యాసుల సంస్థ అయిన శృంగేరి శారద పీఠంతో ఆయనకు సంబంధం ఉంది.
తనకు షికాగో విశ్వవిద్యాలయం వంటి సంస్థల నుంచి ప్రొఫెసర్‌షిప్‌లు, అఫిలియేషన్స్‌తో సహా ఆధ్యాత్మిక, విద్యాపరమైన అర్హతలు ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు.

ఫొటో సోర్స్, X/ANI
పోలీసులు ఏమన్నారు?
"ఆగస్టులో మాకు ఫిర్యాదు అందింది. చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నాం. ఎఫ్ఐఆర్ నమోదైంది, దర్యాప్తు కొనసాగుతోంది. మహిళా విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు" అని సౌత్-వెస్ట్ దిల్లీ డీసీపీ ఐశ్వర్య సింగ్ బీబీసీతో చెప్పారు.
వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఎర్రటి లగ్జరీ వోల్వో కారు పార్క్ చేశారు. ప్రస్తుతం నంబర్ ప్లేట్ లేకపోయినా, ఆ కారు స్వామి చైతన్యానంద సరస్వతిదిగా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Ashay Yedge
డీసీపీ ఐశ్వర్య సింగ్ మాట్లాడుతూ "నిందితుడైన చైతన్యానంద సరస్వతి వసంత్ కుంజ్‌లోని శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు, ఆయన కోసం గాలిస్తున్నాం. ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐక్యరాజ్యసమితి డిప్లమాటిక్ నంబర్ ప్లేట్‌తో ఉన్న వోల్వో కారును స్వాధీనం చేసుకున్నాం. ఫోర్జరీకి సంబంధించిన కేసు నమోదు చేశాం" అని చెప్పారు.
"నిందితుల కోసం దిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అంతటా దిల్లీ పోలీసు బృందాలు వెతుకుతున్నాయి" అని డిప్యూటీ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Ashay Yedge
ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఏం బోధిస్తారు?
ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆమోదం ఉంది.
ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ప్రకారం, శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌ను శృంగేరి శారద పీఠంతో అనుబంధంగా ఉన్న శంకర విద్యా కేంద్రం (ఎస్కేవీ) నిర్వహిస్తుంది. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న ఈ పీఠం, ఆది శంకరాచార్య స్థాపించిన నాలుగు అద్వైత వేదాంత మఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
శారద ఇన్‌స్టిట్యూట్ వివిధ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తుంది. సంప్రదాయ భారతీయ విలువలు, మోడర్న్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ మధ్య సమతుల్యతను కాపాడుతుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
భవనంలో ఏసీ తరగతి గదులు, పెద్ద ప్రయోగశాలలు, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని అక్కడి సిబ్బంది ధ్రువీకరించారు.
ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మూడు రోజుల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని అధికారులను కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














