ఓజీ మూవీ రివ్యూ: గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్.. సుజిత్ మ్యాజిక్ వర్కౌటైందా?

ఫొటో సోర్స్, DVV Entertainment/facebo
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
హరిహర వీరమల్లు నిరాశపరిచిన తరువాత ఓజీ మీద అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి.
మరి సినిమా ఎలా ఉంది?
పవన్‌కల్యాణ్ చాలా రకాల సినిమాలు చేశారు. అయితే, సాలిడ్ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ చేయలేదు.
కేజీఎఫ్, సలార్ తరహాలో హైఎలివేషన్స్, హైప్ ఉన్న పాత్రను పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దర్శకుడు సుజిత్ ఆ కోరిక తీర్చారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇది అభిమానుల సినిమా, పవన్ కొత్త అవతారం.


ఫొటో సోర్స్, facebook.com/DVVMovies
కథ ఏంటంటే..
జపాన్‌లోని ఒక యోధుడి కొడుకు గంభీర (హీరో).
సకల యుద్ధ విద్యల్లో నిష్ణాతుడు. విద్య నేర్పించిన గురువు చనిపోతే, చిన్నప్పుడే జపాన్ వదిలి ఇండియా పారిపోతాడు.
ఓడలో సత్య (ప్రకాష్‌రాజ్) ఆశ్రయమిస్తాడు. అప్పటి నుంచి సత్య కుటుంబానికి గంభీర రక్షకుడిగా మారతాడు.
కథ 1990కి వస్తే సత్య దాదాకి బొంబాయిలో సొంత పోర్ట్ ఉంటుంది.
అక్కడికి ఒక కంటైనర్‌లో ఆర్డీఎక్స్ వస్తుంది.
దీన్ని సత్య కొడుకు అడ్డుకుంటాడు.
సత్య దాదా ప్రత్యర్థి మిరాజ్కర్ కొడుకు జిమ్మి కంటైనర్‌ని వదిలేయమని కోరతాడు.
ఈ ఘర్షణలో సత్య కుమారుడు చనిపోతాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
సత్య కొడుకు మరణం వెనుక ఏం జరిగింది?
ఆర్డీఎక్స్ వెనుక ఉన్న వరల్డ్ మాఫియా ఎవరు?
కంటైనర్‌ని ఎలాగైనా బయటికి తెస్తానని వచ్చిన మిరాజ్కర్ పెద్ద కొడుకు ఇమ్రాన్ హష్మి విలనిజం ఏంటి?
వీళ్లందర్నీ హీరో ఎలా ఫినిష్ చేశాడు?
అసలు గంభీర సొంత తండ్రిలా భావించే ప్రకాష్‌రాజ్ కుటుంబాన్ని వదిలి అజ్ఞాతంలోకి ఎందుకెళ్లాడు?
ఇవన్నీ సినిమాలో తెలుసుకోవాల్సిందే.

ఫొటో సోర్స్, facebook.com/DVVMovies
మేకింగ్‌లో సుజిత్ మ్యాజిక్ పనిచేసిందా?
నిజానికి ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు చూసేశారు.
సినిమా చూసినంత సేపు చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటాయి. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ చెడ్డవాడికి, మంచివాడికి జరిగే సంఘర్షణే.
గాడ్‌ఫాదర్ నుంచి నాయకుడు, బాషా , కేజీఎఫ్, సలార్ అన్నింటిలోనూ అటుఇటుగా కథ ఒకటే. ఎమోషన్స్ మారుతాయి.
హీరో, విలన్ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్, కానీ మంచిచెడుల తేడా ఉంటుంది.
చిన్నప్పుడు ఆదరించిన కుటుంబానికి రక్షకుడిగా మారడం కూడా కొత్త కథ కాదు.
కుటుంబపరంగా అయితే ఆత్మ బంధువు (ఎన్టీఆర్), కుటుంబానికి హింసని కలిపితే సింహాద్రి, మాఫియాతో మిక్స్ చేస్తే బాషా. అంతే తేడా.
కథలో కొత్తగా ఏమీ లేనపుడు మేకింగ్‌తో గేమ్ ఆడాలి.
దర్శకుడు సుజిత్ చేసింది ఇదే.
తోడుగా కెమెరా, మ్యూజిక్ నిలిచాయి.
అభిమానులకి ఫీస్ట్. పవన్‌ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా దర్శకుడు చూపించాడు.
ఒక రకంగా ఇది సుజిత్ సినిమా. ప్లస్, మైనస్ రెండూ ఆయనే. అభిమానులనే దృష్టిలో పెట్టుకున్నాడు కానీ.. అందరికీ నచ్చాలని తీయలేదు.
ఎలివేషన్స్ సూపర్ కానీ, డెప్త్ మిస్సయ్యింది.
కారణం క్యారెక్టర్లలో బలం లేకపోవడం, సరైన సన్నివేశాలు రాసుకోకపోవడం.
సెకెండాఫ్‌లో వచ్చే పోలీస్‌స్టేషన్ సీన్ తరహాలో నాలుగైదు ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్.

ఫొటో సోర్స్, facebook.com/DVVMovies
సినిమా ప్రారంభం నుంచి గంభీర పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. హీరోని బలంగా ఢీకొనే విలన్ ఉన్నప్పుడు ఎత్తులుపై ఎత్తులు రక్తికడతాయి.
ఇమ్రాన్ హష్మి స్టైలిష్‌గా ఉన్నాడు కానీ, బలం చాలలేదు. కూతురి కిడ్నాప్‌తో హీరోని రప్పించడం అరిగిపోయిన ఎత్తుగడ.
సుజిత్ సమస్య ఏమంటే రెండు సినిమాలకి సరిపడే క్యారెక్టర్లు, కథ రాసుకుంటాడు.
ఎక్కడ ఎంత చెప్పాలో తెలియక తికమకపడతాడు.
సాహోలో జరిగిన నష్టం ఇదే. అనేక మంది విలన్లతో గందరగోళం.
ఈ సినిమా కూడా ఎక్కడో జపాన్‌లో ప్రారంభమవుతుంది.
మధ్యలో రకరకాల దేశాల్లో తిరుగుతూ ఉంటుంది.
రకరకాల క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతూ ఉంటారు.
అర్జున్‌దాస్‌కి ఒక ప్లాష్ బ్యాక్, విలన్‌కి , శ్రీయారెడ్డికి ఇంకో ప్లాష్‌బ్యాక్.
ఇవి కాకుండా సన్నివేశాలు ముందుకి వెనక్కి. సినిమాలో చాలా మంది ఉంటే ఎవరికీ ఒక రౌండప్ ఉండదు.
సింపుల్‌గా ఒక హీరో, ఒక కుటుంబానికి రక్షకుడు.
కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలో ఉన్నాడు.
తన వాళ్లకి ఆపద కలిగితే వస్తాడు. బొంబాయి గ్యాంగ్ వార్ నేపథ్యం.
ప్రజలను చంపడానికి ఆర్డీఎక్స్ వచ్చింది. దాని నుంచి నగరాన్ని కాపాడాలి.
ఈ మెయిన్ పాయింట్ నుంచి పక్కకు వెళ్లడంతో అనవసరమైన లగేజీ వల్ల కల్ట్ సినిమా రేంజ్‌కి కాకుండా, అభిమానుల్ని రంజింపచేసే సినిమాగా మారిపోయింది.

ఫొటో సోర్స్, facebook.com/DVVMovies
సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది తమన్ బీజీఎం.
హీరో ప్రతి ఎలివేషన్‌ని స్క్రీన్ మీద అదరగొట్టాడు.
కెమెరామెన్ల పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
ఎడిటింగ్ కూడా పర్‌ఫెక్ట్. నిడివి ఏ మూడు గంటలో ఉంటే కష్టమయ్యేది.
నటన విషయానికి వస్తే ఇమ్రాన్ హష్మి స్టైలిష్‌గా ఉన్నాడు.
అర్జున్‌దాస్ , శ్రీయారెడ్డి అద్భుతంగా చేశారు.
సినిమాలో డెప్త్ ఉన్న క్యారెక్టర్లు ఈ రెండే.
ప్రకాష్‌రాజ్‌కి ఈ రకం పాత్రలు కొట్టిన పిండి. పెద్దగా సీన్స్ లేకపోయినా తెరకి నిండుదనం వచ్చింది.
పవన్ విషయానికి వస్తే ఆయన ప్రత్యేకంగా ఈ సినిమా కోసం సమయం ఇచ్చినట్టు స్క్రీన్ మీద తెలుస్తోంది.
హరిహర వీరమల్లులా కాకుండా శ్రద్ధ కనిపిస్తుంది. కొత్త లుక్‌తో ఉన్నాడు. ఒకట్రెండు ఎమోషన్స్ సీన్స్‌లో బాగా నటించాడు.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఉన్న స్క్రీన్ స్పేస్‌లో నటించే అవకాశం లేదు.
శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్, జీవా, శ్రీకాంత్ అయ్యంగార్ గెస్ట్ ఆర్టిస్టుల కంటే కొంచెం ఎక్కువ.
అభిమన్యు సింగ్‌కి సెకెండాఫ్‌లో మంచి సీన్ పడింది.
స్క్రీన్ మీద నాన్‌స్టాప్‌గా హింస ఏరులైపారింది. రక్తం లేని సీన్ ఉండదు.
ఒకటే నరకడం, కాల్చడం.
ఇంటర్వెల్‌లో తల నరుకుడు బాహుబలిలో చూసిందే అయినా కొత్తగా అనిపిస్తుంది.
అభిమానులకి పూనకం వచ్చే సీన్.
మొత్తంగా అభిమానులకి అద్భుతం. సాధారణ ప్రేక్షకులకి జస్ట్ ఓకే.

ఫొటో సోర్స్, facebook.com/DVVMovies
ప్లస్ పాయింట్స్
1.పవన్ ఎలివేషన్స్, స్క్రీన్, ప్రజెన్స్
2.సంగీతం, కెమెరా
3.అర్జున్ దాస్, శ్రీయారెడ్డి నటన
4.సెకెండాఫ్ పోలీస్ స్టేషన్ సీన్
మైనస్ పాయింట్స్
1. ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన కథ
2. పాత్రలు పెరిగి, క్యారెక్టరైజేషన్ లోపించడం
3. విపరీతమైన హింస
4. ఎమోషనల్ డెప్త్ మిస్ అవడం
ఫైనల్‌గా ... రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ సంథింగ్ స్పెషల్.
అభిమానులకి పండగ విందు.
దసరా వాళ్లకి కొంచెం ముందుగా వచ్చింది.
గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














