రాక్ సాల్ట్ గుండె, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాక్ సాల్ట్ (రాతి ఉప్పు) అనేది సహజ ఖనిజం. సముద్రపు ఉప్పు మాదిరి దీన్ని సముద్రం నుంచి తీయరు, రాక్స్ (ఖనిజ గనుల) నుంచి తీస్తారు.
భారత్‌లో ముఖ్యంగా దీన్ని ఉపవాస (వ్రత్) సమయంలో వాడుతుంటారు. దీన్ని స్వచ్ఛ మైనదిగా భావిస్తారు.
దీని రంగు తెలుపు లేదా లేత గులాబి రంగు లేదా నీలం రంగుల్లో ఉంటుంది.
సోడియం క్లోరైడ్ మాత్రమే కాక, అదనంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఈ ఉప్పులో ఉంటాయి.
ఈ ఉప్పు హిమాలయా ప్రాంతంలో (భారత్, నేపాల్, పాకిస్తాన్) దొరుకుతుంది. అందుకే, దీన్ని తరచూ హిమాలయన్ పింక్ సాల్ట్ అని పిలుస్తుంటారు.
భారత్‌లో రాక్ సాల్ట్ మైన్లు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉన్నాయి.
అమెరికా మ్యాగజీన్ 'ఫుడ్ అండ్ వైన్' ప్రకారం.. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖేవ్రా సాల్ట్ మైన్ రాక్ సాల్ట్‌కు ప్రధాన సోర్స్.

రాక్ సాల్ట్‌లో సోడియం తక్కువ
రాక్ సాల్ట్‌ను మార్కెట్‌లో పింక్ సాల్ట్‌గా, హిమాలయన్ సాల్ట్‌గా, లైట్ సాల్ట్‌గా లేదా తక్కువ సోడియం సాల్ట్‌గా అమ్ముతుంటారు.
ఎక్కువగా ఉప్పు తినే అలవాటు ఉన్న వారికి ఈ ఉప్పును ఒక పరిష్కారంగా చూస్తున్నారు.
హిమాలయాల్లో వెలికితీసే ఈ ఉప్పులో సాపేక్షంగా తక్కువ సోడియం ఉండి, మెగ్నేషియం, పొటాషియం వంటి మరిన్ని ఖనిజాలు ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
'' రాక్ సాల్ట్‌ను మితంగా ఉపయోగించినప్పుడు ఆరోగ్యానికి మంచిది. కాల్షియం, మెగ్నేషియం, పొటాషియం వంటి అత్యవసరమైన ఖనిజాలు దీనిలో ఉన్నాయి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు ఇవి సాయపడతాయి. హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తాయి. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో సాయపడతాయి'' అని ఎయిమ్స్‌లో డైటీషియన్‌గా పనిచేసిన, వన్ డైట్ టుడే ఫౌండర్ డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.
ఈ సాల్ట్‌ను మితంగా వాడటం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
మెరుగైన ఆరోగ్యం కోసం పచ్చళ్లు, పాపడ్‌లు, జామ్‌లు వంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో పాటు టేబుల్ సాల్ట్‌ను కూడా తినకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
''మనం వస్త్రాలు మార్చుకునే మాదిరిగా, వివిధ రకాల ఆహార పదార్థాలను తింటున్న తరహాలోనే.. ఉప్పు తినడాన్ని కూడా మార్చుకోవాలి. తక్కువ సోడియం ఉప్పు అన్న పేరుతో రాక్ సాల్ట్‌ను ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమే'' అని ఎస్ఏపీ డైట్ క్లినిక్ ఫౌండర్, సీనియర్ కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ అదితి శర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఏ ఉప్పులో అయిన ప్రధాన మూలకం సోడియం. మన శరీరాలకు ఇది చాలా అవసరం.
సోడియం శరీరంలో నీటిని సరైన స్థాయిలో నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలను సరఫరా చేయడంలో ఇది చాలా కీలకం.
సోడియం మన నరాలకు మెరుపు వేగమైన ప్రతిస్పందనను అందిస్తుంది. అయితే, మితంగా ఉప్పును తీసుకుంటూ ఉండాలని ఎల్లప్పుడూ వైద్యులు సిఫారసు చేస్తుంటారు.
మితంగా తీసుకోవడమనేది చాలా కీలకమని డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అవయవాలకు హాని కలుగుతుందని తెలిపారు.
'' రాక్ సాల్ట్‌లో అసలు అయోడిన్ ఉండదు. ఈ ఉప్పుకు అతిపెద్ద లోపమిదే. అయోడిన్ లోపం వల్ల గాయిటర్(థైరాయిడ్ గ్రంథి సమస్య కారణంగా మెడ వద్ద వాపు)కు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు, అధిక రక్తపోటు, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. ఇది మెటబాలిజంపై (జీవక్రియపై) కూడా ప్రభావం చూపుతుంది'' అని డాక్టర్ అను అగర్వాల్ వివరించారు.
గుండె: తెల్ల ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులో తక్కువ సోడియం ఉన్నప్పటికీ, సమృద్ధిగానే సోడియం ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరుగుతుంది. గుండె పోటుల ప్రమాదం పెరుగుతుంది. గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు రావొచ్చు.
కిడ్నీలు: రాక్ సాల్ట్‌ను ఎక్కువగా తినడం వల్ల వాటర్ రిటెన్షన్ (నీటి నిలుపుదల)కు కారణమవుతుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ నీటిని తొలగించేందుకు ఎక్కువగా పని చేయాలి. దీనివల్ల వాపు లేదా ఎడెమా వస్తుంది.
మెదడు: అయోడిన్ లోపం వల్ల నరాల సంకేతాలు సరిగ్గా పనిచేయవు. దీనివల్ల జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతాం.
హార్మోన్లు: రాక్ సాల్ట్ ఎక్కువ కాలం తింటే, టీ3, టీ4 హార్మోన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రాక్ సాల్ట్‌ను ఎలా, ఎంత తీసుకుంటే మంచిది?
ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసింది. 5 గ్రాముల కంటే తక్కువ అంటే, సుమారు ఒక టీస్పూన్ అంత.
ఆస్ట్రేలియాలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రకారం.. సగటు భారతీయుడు రోజూ సుమారు 11 గ్రాముల ఉప్పు తింటున్నారని తెలిసింది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు ఇది సుమారు రెండింతలు.
భారత్‌లో అధిక ఉప్పు వినియోగం ''కనిపించని మహమ్మారికి'' దారితీస్తుందని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అర్బన్ ప్రాంతాల్లో నివసించే భారతీయులు రోజూ సగటున 9.2 గ్రాముల ఉప్పును తింటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో రోజూ సుమారు 5.6 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని తెలిపాయి.
'' శరీరంలో ఏది ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదకరమే. దానిలో ఉప్పు ఒకటి'' అని డైటీషియన్ డాక్టర్ అను అగర్వాల్ తెలిపారు.
''ఇటీవల కాలంలో ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల ఉప్పు వినియోగం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారంలో అయోడిన్ సరైన స్థాయిలో ఉండేందుకు, ఇంట్లో వండిన ఆహారంలో సాధారణ ఉప్పును వినియోగించాలి. పాపడ్, పచ్చడి, పెరుగు వంటి వాటిల్లో సాధారణ ఉప్పుకు బదులు రాక్ సాల్ట్ వాడాలి. అప్పుడు సమతుల్యత ఉంటుంది'' అని డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.
రాక్ సాల్ట్‌ను తరచూ వినియోగించలేమని ఆమె తెలిపారు. వైద్యుని సూచన మేరకు మాత్రమే దీన్ని వాడాలన్నారు.
మీకు ఏమైనా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే, ఇది మీ ఆహారంలో పొటాషియం కంటెంట్‌ను పెంచుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
డీటాక్సిఫయర్‌లా పనిచేసే రాక్ సాల్ట్
రాక్ సాల్ట్‌ను హాలైట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది కేవలం కిచెన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. డీటాక్సిఫయర్‌లా(శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించే మూలకం) కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.
జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడం నుంచి గొంతు నొప్పులను తగ్గించడం, చర్మాన్ని మెరుగుపర్చడం, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం వరకు రాక్ సాల్ట్‌ను ఒక బహుముఖ సహజ నివారిణిగా చూస్తున్నారు.
'' డీటాక్సిఫైర్‌లా రాక్ సాల్ట్ పనిచేస్తుంది. వెచ్చని నీటిలో పరిమిత మోతాదులో తీసుకుంటే, జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది. దీన్ని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే, స్కిన్ పోర్స్ తెరుచుకుని, టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి. అలాగే, రక్తప్రసరణ మెరగవుతుంది'' అని మలేషియన్ న్యూట్రిషనిస్ట్ సాంగ్ విన్ వా చెప్పారు.
రాక్ సాల్ట్‌లో ఉండే ఖనిజాలు మెగ్నేషియం, సల్ఫర్ వంటివి శరీరానికి సహజంగా డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ జరిగేందుకు సాయపడతాయని అన్నారు.
పీహెచ్ లెవెల్స్ సమతుల్యమయ్యేందుకు సాయపడతాయని వివరించారు.
తిన్నా లేదా అప్లై చేసుకున్నా, రాక్ సాల్ట్ డీటాక్సిఫికేషన్‌ను మెరుగుపరుస్తుంది.
తేనె, కొబ్బరి నూనె, పెరుగులో ఎప్సమ్ ఉప్పును కలుపుకుని, నేచురల్ ఫేస్ లేదా బాడీ స్క్రబ్‌లా వాడుకోవచ్చు. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి, స్కిన్ టోన్ మెరుగయ్యేలా చూస్తుంది.
ఎప్సమ్ సాల్ట్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














