అభిషేక్ శర్మ: నానమ్మ మాట నిజమైందా.. ప్లాస్టిక్ బ్యాట్ నుంచి టీమిండియా ఓపెనర్ వరకు..

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
- రచయిత, భరత్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. నా సహచరులందరూ టీమిండియా తరపున ఆడుతున్నారని నేను అమ్మకు చెప్పేవాడిని. నేను భారత్‌కు ఆడలేకపోయాను. ఎందుకిలా జరిగిందో నాకు తెలియదు. బహుశా అది దైవ నిర్ణయం కావచ్చు. కానీ, మా అమ్మ "నువ్వు ఆడలేకపోయావు. కానీ, నీ కొడుకు దేశం తరఫున ఆడతాడు అని చెప్పేది"
ఇది గుర్తొచ్చినప్పుడల్లా రాజ్‌కుమార్ శర్మ భావోద్వేగానికి గురవుతారు. ఎందుకంటే ఆయన తల్లి మాట ఇప్పుడు నిజమైంది.
"ఇది నాకు చాలా మంచి సమయం. గర్వంగా ఉంది. పిల్లలు తమ కాళ్లపై నిలబడాలని, వారు ఎంచుకున్న రంగంలో రాణించాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు" అని ఆయన అన్నారు.
"మా వాడు చాలా ఏళ్ల క్రితం బ్యాట్ పట్టుకున్నాడు. చాలా కష్టాలు పడ్డాడు. వాడిప్పుడు దేశం తరపున ఆడుతున్నాడు. మ్యాచ్‌లను గెలిపిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది"
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై తుపాను ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్‌శర్మకు రాజ్‌కుమార్ శర్మ తండ్రి మాత్రమే కాదు కోచ్ కూడా. కొడుకు కెరీర్‌లో ప్రతీ అడుగులోనూ వెన్నంటి ఉన్న తండ్రి, ఇప్పుడు అతని విజయాన్ని కూడా చూస్తున్నారు.


ఫొటో సోర్స్, RAJ KUMAR SHARMA
మూడేళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్ ఇచ్చిన తండ్రి
ఈ విజయ గాథ 22 ఏళ్ల క్రితం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మొదలైంది. మూడు నాలుగేళ్ల వయసులో అభిషేక్ తన తండ్రి ఆడే బరువైన బ్యాట్ ఎత్తడానికి ప్రయత్నించాడు.
"నేను క్రికెట్ ఆడేవాడిని. నా క్రికెట్ కిట్ ఇంట్లోనే ఉండేది. అభిషేక్ మూడు, నాలుగేళ్లప్పుడు కిట్‌లోని వస్తువులతో ఆడుకునేవాడు. ఒకసారి బ్యాట్ తీసుకున్నాడు. అయితే అది బరువుగా ఉండటంతో పైకి లేపలేకపోయాడు. దీంతో నేను వాడికి ప్లాస్టిక్ బ్యాట్ కొనిచ్చాను" అని రాజ్‌కుమార్ శర్మ బీబీసీతో చెప్పారు.
"ఆ ప్లాస్టిక్ బ్యాట్‌తోనే మంచి షాట్లు కొట్టేవాడు. వాడికి మాటలు కూడా సరిగ్గా రావు. అయినా నాన్న బంతి వేయి అనే వాడు. బాల్ వేయాలని వాడి అక్కలను అడిగేవాడు. బౌలింగ్ చేయమని నా భార్యని అడిగేవాడు. అలా ఆడుతూ ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు" అని రాజ్ కుమార్ శర్మ చెప్పారు.
క్రికెట్ పట్ల ఉన్న అభిరుచి, విలక్షణ బ్యాటింగ్ శైలితో అభిషేక్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా వేగంగా ఎదుగుతున్నాడు.

ఫొటో సోర్స్, RAJ KUMAR SHARMA
కెరీర్ ఇప్పటివరకు...
చిన్నదే కావచ్చు, అయినప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడి 35.40 సగటుతో 708 పరుగులు చేశాడు. టీ20ల్లో ఇది మంచి యావరేజ్. అతని స్ట్రైక్ రేట్ 197.21. ఏ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌కైనా ఇది అద్భుతమైన స్ట్రైక్ రేట్.
టీ20లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన రికార్డు అభిషేక్ పేరిట ఉంది. 331 బంతుల్లో 50 సిక్సర్లు కొట్టడం ద్వారా 366 బంతుల్లో ఈ ఘనతను సాధించిన వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.
అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, యువరాజ్ సింగ్ స్టయిల్ ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్‌తో సూపర్ 4 మ్యాచ్ తర్వాత అభిషేక్‌తో మాట్లాడాడు వీరేంద్ర సెహ్వాగ్.
"నువ్వు 70 పరుగులకు చేరుకున్నప్పుడు దాన్ని సెంచరీగా మార్చుకో" అని సలహా ఇచ్చాడు.
"ఇవన్నీ తర్వాత గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. కాసేపటి తర్వాత యువరాజ్ సింగ్ నీకు ఫోన్ చేసి ఇదే విషయం చెబుతుండొచ్చు" అని వీరేంద్ర సెహ్వాగ్ అభిషేక్ శర్మకు చెప్పాడు.
"అవును. మీరు చెప్పింది నిజమే. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆయన (యువరాజ్) కూడా అదే విషయం చెబుతారు" అని సెహ్వాగ్‌కు అభిషేక్ సమాధానమిచ్చాడు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 39 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్ మెరుపు వేగంతో సాగింది. అతను ఔటైన బంతికి అంత గొప్పదేమీ కాకున్నప్పటికీ తప్పుగా ఆడటం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
అభిషేక్ శర్మ ప్రయాణం
అభిషేక్ శర్మ తండ్రి బ్యాంకులో పని చేయడంతో పాటు క్రికెట్ కూడా ఆడేవారు. అభిషేక్ ఇద్దరు అక్కల్లో ఒకరు టీచర్, మరొకరు డాక్టర్.
"నేను గ్రౌండ్‌కు వెళ్లినప్పుడల్లా వాడు నాతో వచ్చేవాడు. నేను పెద్ద పిల్లలకు క్రికెట్‌లో శిక్షణ ఇచ్చేవాడిని. వాళ్లు వాడిని చూసినప్పుడు 'మీ వాడికి చాలా టాలెంట్ ఉంద’ని చెప్పేవాళ్లు" అని రాజేశ్ కుమార్ శర్మ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
"వాడు ఎక్కువగా స్ట్రైట్ బ్యాట్ ఆడతాడు. షాట్లు నేరుగా, బలంగా కొడతాడు. పెద్ద ఆటగాడవుతాడని అనిపిస్తుంది. ఆట మీద వాడికున్న ఆసక్తిని చూసిన తర్వాతే వాడిని క్రికెటర్‌ను చేయాలనుకున్నాను. నేను సెలక్టర్, రిఫరీ, కోచ్‌గా పనిచేశాను. వాడి అభిరుచి గుర్తించి నేనే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నాను" అన్నారు రాజ్ కుమార్ శర్మ.
అభిషేక్ క్రికెట్‌తో పాటు చదువులోనూ ప్రతిభ కనబరిచాడు. అమృత్‌సర్‌లోని దిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో చదివిన అభిషేక్ ప్రతీ క్లాసులోనూ 90శాతం మార్కులు సాధించాడు.
"అభిషేక్ తెలివైన విద్యార్థి. టోర్నమెంట్ల మధ్యలో స్కూలుకెళ్లి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించేవాడు. వాడికి ఏ తరగతిలోనూ తక్కువ మార్కులు రాలేదు. బీఏ కూడా పూర్తి చేశాడు" అని అభిషేక్ చదువు గురించి తండ్రి వివరించారు.

ఫొటో సోర్స్, RAJ KUMAR SHARMA
అభిషేక్ శర్మ జీవితంలో టర్నింగ్ పాయింట్
అభిషేక్ శర్మ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏది? ఆయన ప్రొఫెషనల్ సెటప్‌లోకి ఎప్పుడు ప్రవేశించారు?శుభ్‌మన్ గిల్‌తో అతని స్నేహం ఎలా ఎదిగింది?
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చాలా ఏళ్ల క్రితం అండర్-12, అండర్-14 జట్లను సెలెక్ట్ చేసి, ఒక క్రికెట్ క్యాంప్ ఏర్పాటు చేసింది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే ఈ క్యాంప్ లక్ష్యం. ఈ క్యాంప్‌కు హెడ్‌గా డి.పి.ఆజాద్ ఉండేవారు. ఆయన కపిల్ దేవ్‌కు కోచ్. పంజాబ్ క్రికెట్‌లో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది.
ఈ క్రికెట్ శిబిరం కోసం పంజాబ్‌వ్యాప్తంగా 30 మంది పిల్లల్ని ఎంపిక చేశారు. వారిలో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు.
''అప్పుడు వారిద్దరు చాలా చిన్న పిల్లలు. ఈ ఇద్దరికీ సహజ ప్రతిభ ఉందని ఆజాద్ జీ అన్నారు. నేను వారి మ్యాచ్ చూడటానికి వెళ్లాను. అక్కడ ఆజాద్, అరుణ్ బేడీ కూడా ఉన్నారు. బేడీ జీ నన్ను పక్కకు తీసుకెళ్లి ఈ 30 మంది పిల్లలలో వీరిద్దరూ చాలా ప్రత్యేకమైనవారని చెప్పారు. వీళ్లిద్దరూ భారత్ తరఫున ఓపెనింగ్ చేస్తారనే విషయాన్ని రాసి పెట్టుకోండి అని బేడీ నాతో అన్నారు'' అని రాజ్ కుమార్ శర్మ వివరించారు.
ఆ తర్వాత ఆజాద్ జీ కూడా తన దగ్గరికి వచ్చి 'మీ అబ్బాయిలో మంచి ప్రతిభ ఉంది. అతని బ్యాటింగ్ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఇద్దరు పిల్లలు భారత్‌కు ఆడతారు'' అని చెప్పినట్లు రాజ్ కుమార్ తెలిపారు.
ఈ ఇద్దరు కోచ్‌లు చెప్పిన మాటలు రాజ్ కుమార్ సంకల్పాన్ని బలపరిచాయి. అభిషేక్ కోసం ఆయన రాత్రింబవళ్లు పనిచేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఆయన, సెలవు పెట్టి మరీ అభిషేక్‌కు కోచింగ్ ఇచ్చేవారు.
అభిషేక్ అండర్-14 జట్టులో ఉన్నప్పుడు, అతనికి గంటకు 130-140 మైళ్ల వేగంతో బంతులు వేస్తూ ప్రాక్టీస్ చేయించేవారు. అంతకంటే వేగమైన బంతులు ఆడటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని అభిషేక్ చెప్పేవాడు.
పంజాబ్ అండర్-16 జట్టుకు అభిషేక్ కెప్టెన్సీ వహించాడు. ఒక సీజన్‌లో అతను 1,200 పరుగులు చేసి 57 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన తర్వాత బీసీసీఐ అతనికి 'నమన్' అవార్డును అందజేసింది.
ఆ తర్వాత, అండర్-19 నార్త్ జోన్ జట్టుకు కూడా అభిషేక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో నార్త్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. తర్వాత, నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరిన అభిషేక్ ప్రతిభ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో మరింత మెరుగుపడింది.
ఇదే క్రమంలో అండర్-19 టీమిండియాకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతని సారథ్యంలో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది.
రోజురోజుకు అభిషేక్ ఆటలో కనిపిస్తున్న ప్రదర్శనే, అతన్ని భారత క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్‌కు దగ్గర చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
యువరాజ్ సింగ్‌తో అభిషేక్ పరిచయం
రంజీ ట్రోఫీ కారణంగా అభిషేక్, యువరాజ్ కలిశారు. అభిషేక్, శుభ్‌మన్‌లకు రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం ఇవ్వాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ భావించింది.
యువరాజ్ సింగ్ తన అనారోగ్యాన్ని జయించి, తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం అది. బీసీసీఐ సూచనల మేరకు యువరాజ్, రంజీ ట్రోఫీలో ఆడాలనుకున్నారు.
అండర్-19 జట్టు నుంచి ఇద్దరు కుర్రాళ్లు వస్తున్నారని, వారిలో ఒకరు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, మరొకరు స్పిన్నర్ అని యువరాజ్ సింగ్‌కు సమాచారం ఇచ్చారు.
''జట్టులో ఇప్పటికే సరిపడినంత బౌలర్లు ఉన్నందున, తనకు బ్యాట్స్‌మన్ కావాలని సెలెక్టర్లను యువరాజ్ కోరారు. లేదు, ఇద్దరు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు చెప్పారు. ఒక మ్యాచ్‌లో ముగ్గురు, నలుగురు ప్లేయర్లు వెంటవెంటనే అవుటయ్యారు. మరోవైపు యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అభిషేక్‌ను క్రీజులోకి పంపమని యువీ చెప్పారు. అప్పటికి యువరాజ్ 40 పరుగులతో ఉన్నాడు. యువీ చూస్తుండగానే అభిషేక్ వేగంగా ఆడుతూ 100 పరుగులు చేశాడు'' అని రాజ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.
‘నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటావా’ అని అభిషేక్‌ను యువరాజ్ అక్కడే మైదానంలోనే అడిగారని రాజ్ కుమార్ చెప్పారు. యువరాజ్‌ను ఆదర్శంగా తీసుకొని, అతన్ని దేవుడిగా భావిస్తూ, అతన్ని చూసే ఆట నేర్చుకున్న అభిషేక్ సంతోషంగా దీనికి ఒప్పుకున్నాడని తెలిపారు.
వీరిద్దరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
''నువ్వు ఇంకా మారలేదు. కేవలం సిక్సర్లే బాదుతున్నావు. గ్రౌండ్ స్ట్రోక్స్ కూడా ఆడాలి'' అని అభిషేక్‌కు యువీ చెబుతున్న ఒక వీడియో వైరల్ అయింది.
‘‘అభిషేక్‌కు శిక్షణ ఇచ్చేది యువరాజ్. నా కొడుకును పూర్తిగా ఆయనే చూసుకుంటున్నారు. అతన్ని మానసికంగా, శారీరకంగా బలంగా మార్చాడు. ఒక్క రోజు కూడా అభిషేక్ ఖాళీగా ఉండకుండా ట్రైనింగ్ ఇచ్చాడు. వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ శిక్షణ ఇస్తే, ఒక ఆటగాడు ఎంత దూరం వెళ్లగలడో ఊహించుకోండి. ఇది ప్రారంభం మాత్రమే'' అని అభిషేక్ తండ్రి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














