సొంత జట్టుపై అసంతృప్తి.. భారత్‌పై పొగడ్తలు - పాక్ మాజీ క్రికెటర్ల మాటలు విన్నారా

షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్

ఆసియా కప్ సూపర్ 4‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమిపై ఆ దేశ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ ఆటగాళ్ల ప్రదర్శన పేలవంగా ఉందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుమాజీ చైర్మన్ రమీజ్ రాజా విమర్శించారు.

ఆదివారం దుబయి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

పాకిస్తాన్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ 74 పరుగులతో చెలరేగడంతో భారత్ 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మొదటి 10 ఓవర్లు మినహా మిగతా ఎక్కడా భారత్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

ఆ పది ఓవర్లలోనూ భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం వల్ల పాకిస్తాన్ 172 పరుగులు చేయగలిగింది.

పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత బ్యాట్‌ను తుపాకిలా చూపిస్తూ చేసిన విన్యాసాలపై అభ్యంతరం వ్యక్తమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ జట్టు, భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత బ్యాటర్లతో పాకిస్తాన్ బౌలర్ వాగ్వాదం

కెప్టెన్సీపై ఆగ్రహం

జట్టు ఎంపికతో పాటు కెప్టెన్సీపైనా షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు.

పాకిస్తానీ స్ట్రీమింగ్ సర్వీస్ ట్యాప్‌మాడ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన షోయబ్ అక్తర్ జట్టు ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తాడు.

"ఆటగాళ్ల ఎంపిక సరిగ్గా లేదు. మేం వద్దని చెప్పిందే వాళ్లు( సెలక్టర్లు) చేస్తున్నారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంచుకోవాలి" అని చెప్పాడు.

బౌలర్ల ఎంపికపైనా ఆయన ప్రశ్నలు గుప్పించాడు.

"వాళ్లు ఏమాలోచిస్తున్నారు? ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పులో వాళ్ల ప్రమాణాలు ఏంటి? కోచ్‌ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కెప్టెన్‌కు తానేం చేస్తున్నాడో తెలుస్తోందా?" అని షోయబ్ ప్రశ్నించాడు.

"కెప్టెన్సీ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అతను ఆడుతున్న స్థానం సరైనదేనా. అతను బ్యాటింగ్ చేసేందుకు ఆరో స్థానంలో వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు?" అని అక్తర్ అన్నాడు..

భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ జట్టు, భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాపై సీనియర్లు విమర్శలు గుప్పించారు

బౌలర్లకు ఏమైంది?

పాకిస్తాన్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ ఎప్పుడూ బలంగా ఉండేది. అయితే ఆసియా కప్‌లో పాక్ జట్టు బౌలర్ల ప్రదర్శనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

"పరుగులు కట్టడి చేయడానికి స్పిన్నర్లు, వికెట్లు తీయడానికి ఫాస్ట్ బౌలర్లు అవసరం. అయితే పాక్ జట్టు బౌలర్లను సరిగ్గా ఉపయోగించడం లేదు. ఆరు ఓవర్ల తర్వాత స్పిన్నర్ల పాత్ర కీలకం. గతంలో ఇదంతా బాగానే ఉండేది. అయితే ఈసారి బౌలింగ్ పేలవంగా మారింది" అని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఓ టీవీ కార్యక్రమంలో చెప్పాడు.

"నవాజ్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే జట్టు మాత్రం అయూబ్‌ను ఫుల్ టైమర్‌గా నవాజ్‌ను పార్ట్ టైమ్ బౌలర్‌గా మార్చింది. ఇది కెప్టెన్ చేస్తున్న పొరపాటు" అని అఫ్రిది అన్నాడు.

కెప్టెన్‌కు అర్థం కాకపోతే కోచ్‌ను సంప్రదించాలని సూచించాడు.

జట్టు బౌలింగ్ చేసేటప్పుడు ప్రారంభ ఓవర్లలో చాలా బలహీనంగా ఉందని మరో పాక్ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ ఏఆర్‌వై న్యూస్ చానల్‌తో చెప్పాడు.

"170 పరుగులు చాలా మంచి స్కోరు. ఈ స్కోరుతో గెలవాలంటే ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థుల్ని కట్టడి చేయాలి. మొదటి 6 ఓవర్లలోనే 60-70 పరుగులు ఇస్తే మ్యాచ్ 70 శాతం ఓడిపోయినట్లే" అని ఆమిర్ అన్నాడు.

"బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని చెప్పడం అన్యాయం. స్పిన్నర్ బాగా బంతులు విసురుతున్నప్పుడు.. ఆ బాల్స్‌ను అర్థం చేసుకోవడానికి బ్యాటర్లు బ్యాక్‌ఫుట్ ‌మీద ఆడతారు. ఈ విషయాన్ని అబ్రార్ అర్థం చేసుకోలేదు. ఈ మ్యాచ్‌లో రెండు తప్పులు జరిగాయి. ఒకటి, నవాజ్‌ను హారిస్ కంటే ముందు పంపడం రెండోది అతనితో బౌలింగ్ చేయించకపోవడం" అని ఆమిర్ చెప్పాడు.

భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ జట్టు, భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబ్రార్

పాకిస్తాన్ ఆట తీరు

గత మ్యాచ్ కంటే ఈసారి పాకిస్తాన్ బ్యాటింగ్ బాగానే ఉందని మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు.

"పాకిస్తాన్ మొదట్లో పరుగులు బాగానే చేసింది. దాన్ని అలాగే కొనసాగించి ఉంటే 180-190 పరుగులు చేసి ఉండేది. అప్పుడు భారత్‌కు కష్టంగా ఉండేది" అని రమీజ్ రాజా తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ అన్నాడు.

బౌలర్లు శ్రమించినప్పటికీ ఫీల్డర్లు సులభమైన క్యాచ్‌లను వదిలేయడం ఓటమికి ప్రధాన కారణంగా వివరించారు.

పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా జట్టు వ్యవహారశైలిని ప్రశ్నించాడు.

"సల్మాన్ అలీ ఆగా గ్రౌండ్‌లోనే కెప్టెన్. కోచ్ కెప్టెన్‌కు ప్లాన్ చెప్తారు. పాక్ జట్టు 200 పరుగులు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఫీల్డింగ్ కూడా చెత్తగా ఉంది" అని కమ్రాన్ అక్మల్ ‘ది గేమ్ ప్లాన్’ అనే యూట్యూబ్ చానల్‌తో చెప్పాడు.

అసలు పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థలోనే లోపం ఉందనేది అక్మల్ అభిప్రాయం.

"చైర్మన్, సెలక్టర్, కోచ్ ఎవరైనా కావచ్చు. వాళ్లెవరూ దేశవాళీ క్రికెట్‌లో జోక్యం చేసుకోకూడదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో సిస్టమ్ ఎలా ఉందో చూడండి. భారత్ రంజీ ట్రోఫీని ఛాంపియన్స్ కప్‌గా మార్చిందా? చెప్పండి. మన అతి పెద్ద వైఫల్యం ఏంటంటే మనం ఏటా సిస్టమ్‌ను మార్చేస్తున్నాం. ఇదే పాక్ క్రికెట్‌కు అతిపెద్ద క్యాన్సర్" అని అక్మల్ అన్నాడు.

భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ జట్టు, భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఆటతీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రమీజ్‌ రాజా అసహనం వ్యక్తం చేశారు

భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీలు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్లందంరూ భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు.

ఓపెనర్ల పార్ట్‌నర్‌షిప్ భారత జట్టు విజయానికి బాటలు వేసింది.

"వాళ్లు పరుగుల్ని సాధించిన విధానం అద్భుతంగా ఉంది. పక్కా ప్రణాళికతో ఆడుతూ పెద్ద షాట్లు కొట్టారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది" అని పాక్ సీనియర్ క్రికెటర్ రమీర్ రాజా చెప్పాడు.

"అవుటవుతాననే భయం లేకుండా, ఏ బంతిని కొడితే స్టేడియం బయట పడుతుందని కచ్చితంగా తెలిసిన ఓపెనర్ ఉంటే జట్టుకు చాలా ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. గిల్ క్లాస్ ఆటగాడు. ఎలాంటి శ్రమ లేకుండా మంచి షాట్లు కొడతాడు" అంటూ రమీజ్ రాజా భారత ఓపెనర్లకు కితాబిచ్చాడు.

"ఈ మ్యాచ్‌లో దుబే, అక్షర్ బ్యాటింగ్‌కు రాలేదు. వాళ్లిద్దరూ ఒంటి చేత్తో 70-80 పరుగుల చేసి జట్టును గెలిపించగలరు. అక్షర్ పటేల్ స్ట్రైక్ రేట్ అద్బుతంగా ఉంది" అని కమ్రాన్ అక్మల్ చెప్పాడు.

భారత బ్యాట్స్‌మెన్‌ను అఫ్రిది ప్రశంసించాడు.

స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటింగ్ లైనప్ ప్రపంచంలోనే అత్యంత బలమైనదంటూ అఫ్రిది మెచ్చుకున్నాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)