GST 2.0: ఇది ఆర్థిక అవసరమా లేక నరేంద్ర మోదీ ఎన్నికల రాజకీయమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ రేట్లను 'కొత్త తరం సంస్కరణలు'గా అభివర్ణించారు.

ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. కొత్త జీఎస్టీ రేట్ల అమలు వల్ల రోజువారీ వస్తువులు, ఆహార పదార్థాలు చౌకగా ఉంటాయని, "పేద, మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, వ్యాపారవేత్తలు" దీని నుంచి ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

"జీఎస్టీలో మినహాయింపుల వల్ల దేశ ప్రజలు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది" అన్నారు.

అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి ఎంఎస్ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు), దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని మోదీ అన్నారు.

అయితే, జీఎస్టీ 2.0 విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ మార్పుల వల్ల సామాన్యులకు ఎంత ప్రయోజనం కలుగుతుందనేది ఇపుడు ప్రశ్న.

సంస్కరణలు చాలా ఆలస్యమయ్యాయా? అవి భారత ఆర్థిక అవసరాలకు తగిన సమయంలో అమలులోకి వచ్చాయా లేక వాటివెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? అలాగే, ఈ సంస్కరణల ప్రభావం చిన్న, దేశీయ పరిశ్రమలకు ఎలా చేరుతుంది? అన్నవి ఈ సందేహాలలో కొన్ని.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
జీఎస్టీ, సామాన్యులు

ఫొటో సోర్స్, Vishnu Vardhan

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం?

కొత్త జీఎస్టీ శ్లాబులు, రేట్లు సామాన్యులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

"పాలు, వెన్న వంటి ప్రాథమిక ఆహార పదార్థాలతోపాటు కార్ల వంటి వాటి మీద పన్ను రేట్లు తగ్గించారు. ఇది సామాన్యుల పొదుపును పెంచుతుంది. ఉదాహరణకు, బీమా ప్రీమియంపై 18 శాతం పన్నును కూడా రద్దు చేశారు. దీని ఫలితంగా రూ. 50,000 ఆరోగ్య పాలసీపై ఏటా దాదాపు రూ. 9,000 ఆదా అవుతుంది" అని ఆర్థిక నిపుణుడు అశ్విని రాణా అన్నారు.

"అంతేకాకుండా, వాహనాల ధరలు కూడా తగ్గాయి. ఈ మిగుళ్లు కస్టమర్ కొనుగోలు శక్తిని నేరుగా పెంచుతాయి. మార్కెట్లో పన్నుల నుంచి ఆదా చేసిన ఈ డబ్బు డిమాండ్‌ను, ఉత్పత్తిని పెంచుతుంది" అన్నారు.

అయితే, ఈ మార్పు విస్తృత ప్రభావాన్ని చూపడానికి సమయం పడుతుందని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు శరద్ గుప్తా అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ 2.0, నరేంద్ర మోదీ, సంస్కరణలు

"జీఎస్టీ 2.0 వల్ల ఉత్పన్నమయ్యే ఈ ఆదాయ నష్టాన్ని బీమా కంపెనీలు ఏదో ఒక విధంగా భర్తీ చేసుకుంటాయి లేదంటే కస్టమర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను తగ్గిస్తాయి. అది సామాన్యులకు మంచిదికాదు" అన్నారు గుప్తా.

జీఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'రాజకీయ లక్ష్యాలపై దృష్టి'

జీఎస్టీ సంస్కరణలు అవసరమేనని, కానీ బీజేపీ ప్రభుత్వం వాటిని ఆలస్యంగా తీసుకొచ్చిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాబోయే ఎన్నికలను (బిహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్ వంటివి) దృష్టిలో ఉంచుకుని, తమ పట్ల మధ్యతరగతి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ సంస్కరణ ప్రకటనకు ముందుకొచ్చినట్లుగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

"మునుపటి ప్రభుత్వమే ఈ పన్నులను విధించిందని, బీజేపీ ప్రభుత్వం నేడు సామాన్యులను వాటి నుంచి విముక్తి చేసిందని ప్రధానమంత్రి ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే, ఈ జీఎస్టీ స్లాబ్‌లను ప్రస్తుత మోదీ ప్రభుత్వం 2017లో అమలు చేసింది. ఇప్పుడు వాటిలో చాలా ఆలస్యంగా మార్పులు జరిగాయి" అని శరద్ గుప్తా అన్నారు.

"ఈ పన్నులను బీజేపీ ప్రభుత్వమే విధించిందని ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ఇప్పుడు వాటిలో రాయితీలు ఇవ్వడం ద్వారా ప్రశంసలు పొందాలనుకుంటోంది బీజేపీ" అన్నారాయన.

రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ మాట్లాడుతూ "జీఎస్టీ విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఒప్పుకుంటాం. ప్రభుత్వానికి మద్దతు కూడా ఇస్తాం. కానీ, వాటిని ప్రవేశపెట్టిన సమయం గురించే అసలు ప్రశ్న" అన్నారు.

జీఎస్టీ, నరేంద్ర మోదీ

"ఆపరేషన్ సిందూర్ దేశంలో బాలాకోట్ స్ట్రైక్ మాదిరి వాతావరణాన్ని సృష్టించలేదు. ఇంకా, 'ఓట్ చోరీ' సమస్యను బీజేపీ సరిగా హ్యాండిల్ చేయలేకపోతుంది. అందువల్ల, జీఎస్టీలో మార్పులు, వాటి అమలు పై నిర్ణయం తీసుకోవడం ఆర్థిక ఉపశమనం కంటే రాజకీయ లక్ష్యాలను సాధించే ప్రయత్నంగా కనిపిస్తోంది" అన్నారు రషీద్.

దీనిపై శరద్ గుప్తా మాట్లాడుతూ "బీజేపీ ప్రభుత్వం, తన అత్యంత విశ్వసనీయ ఓటు బ్యాంకు దూరం కాకుండా కొత్త ఫార్ములాను పట్టుకోలేకపోయింది. పాత వ్యూహం పని చేయడం లేదు. అందుకే జీఎస్టీలో మార్పుతో, దూరమవుతున్న మధ్యతరగతి ఓటర్లు మళ్లీ తమకు దగ్గరవుతారని బీజేపీ ఆశిస్తోంది" అన్నారు.

చిన్నతరహా పరిశ్రమలు, జీఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'చిన్న తరహా పరిశ్రమల బలోపేతం'

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించాలంటే, స్వావలంబన సాధించడం అవసరమని, ఈ బాధ్యతలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

"దేశ ప్రజలకు ఏది అవసరమో, దానిని మనం దేశంలోనే తయారు చేయాలి" అని మోదీ పిలుపునిచ్చారు.

జీఎస్టీ మార్పుల పట్ల వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారని, వాటిని వినియోగదారుల వద్దకు చేర్చడానికి కృషి చేస్తున్నారని కూడా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశీయ పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

"జీఎస్టీ మినహాయింపు నుంచి చిన్నతరహా పరిశ్రమలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతాయి. ఆదా చేసిన పన్ను డబ్బు మార్కెట్లో వేరే చోట ఖర్చు అవుతుంది. డిమాండ్ పెరిగేకొద్దీ, ఉత్పత్తి పెరుగుతుంది. చిన్న పరిశ్రమలు కూడా సహాయక యూనిట్లుగా తమ పాత్రను బలోపేతం చేస్తాయి. ఈ సంస్కరణల ప్రభావం పండుగ సీజన్‌లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. డిమాండ్, ఉత్పత్తిని పెంచడం ద్వారా చిన్న పరిశ్రమలకు పరోక్ష ప్రయోజనాలను అందిస్తుంది" అని అశ్విని రాణా అన్నారు.

చిన్నతరహా పరిశ్రమలు కేవలం పన్ను మినహాయింపు ద్వారా బలోపేతం కావని శరద్ గుప్తా అంటున్నారు.

జీఎస్టీ 2.0, నరేంద్ర మోదీ

ఇతర దేశాల మాదిరిగా, దిగుమతి చేసుకున్న వస్తువులపై ప్రభుత్వం పన్నును ఎందుకు పెంచడంలేదని శరద్ గుప్తా ప్రశ్నిస్తున్నారు.

"మనం అమెరికాకు వస్తువులను పంపి 50 శాతం పన్ను చెల్లిస్తే, వారు ఇక్కడికి వస్తువులను పంపి, తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మన స్వదేశీ పరిశ్రమ మార్కెట్లో ఎక్కువ కాలం మనుగడ సాగించదు. స్వదేశంలో ఉత్పత్తిని పెంచడానికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడటానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి" అని అన్నారు శరద్ గుప్తా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)