జీఎస్టీ 2.0: భారత దేశంలో పండుగ కొనుగోళ్లకు ఊపునిస్తుందా?

జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వం, ధరలు తగ్గుదల, దసరా పండుగ ఆఫర్స్

ఫొటో సోర్స్, Vishnu Vardhan

ఫొటో క్యాప్షన్, జీఎస్టీ సవరణలు ప్రకటించిన తర్వాత ఆటోమొబైల్ కంపెనీల షేర్లు 6 నుంచి 17 శాతం పెరిగాయి
    • రచయిత, నిఖిల్ ఇనాందార్, అర్చన శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో కోట్ల మంది భారతీయుల రోజువారీ ఆర్థిక భారం కొంత తగ్గనుంది.

నిత్యావసరాలైన పాలు, బ్రెడ్ వంటి వాటితోపాటు జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రాణాధార ఔషధాలు లాంటి వాటిపై పన్నును పూర్తిగా తొలగించారు.

చిన్న కార్లు, టెలివిజన్లు, ఎయిర్‌ కండిషనర్ల మీద పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. ఇతర సాధారణ వస్తువులైన హెయిర్ ఆయిల్, సబ్బు, షాంపూ వంటి వాటిపై 12 లేదా 18 శాతానికి బదులుగా 5 శాతం పన్ను మాత్రమే ఉంటుంది.

వస్తు సేవల పన్నుల శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు.

దీని వల్ల పన్నుల విధానం సరళీకృతంగా మారుతుందని...ఇంటి ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు.

విజయ దశమి పండుగ సందర్భంగా ప్రజలు కొత్త కార్లు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో జీఎస్టీ రేట్లు తగ్గించడం పండగ సీజన్‌లో కొత్త వస్తువుల కొనుగోలుకు ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

పన్ను తగ్గింపు వల్ల వినియోగ వస్తువులైన ప్యాకేజ్డ్ ఫుడ్, దుస్తుల అమ్మకాలు ఈ నాలుగు నెలల్లో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కార్ల, బైకుల కొనుగోళ్లకు ఊపు

అమెరికా విధించిన 50శాతం సుంకాల ప్రభావాన్ని జీఎస్టీ సవరణ తగ్గించవచ్చు.

ప్రజలకు డబ్బు మిగలడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఏడాది బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబులను మార్చడం ద్వారా రాయితీలు, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ కోతలు కొనుగోళ్లు పెరగడానికి సానుకూలంగా ఉన్నాయి.

రిలయన్స్, హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి సంస్థలు పన్నుల తగ్గింపు లాభాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా అమ్మకాల్ని పెంచుకుంటున్నాయి.

ఆగస్టులో ప్రధాని మోదీ ప్రకటన తర్వాత కార్ల తయారీ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కార్ల కంపెనీల షేర్లు 6-17 శాతం పెరిగాయి.

జీఎస్టీ సవరణల తర్వాత కార్ల గురించి అడిగే వారి సంఖ్య పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 30 నుంచి 40శాతం పెరుగుతాయని భావిస్తున్నట్లు ముంబయిలోని హీరో మోటోకార్ప్ షోరూమ్ డీలర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

"ధరలు తగ్గడంతో తొలిసారి బైక్ కొంటున్న వారి నుంచి ఎంక్వైరీలు ఎక్కువగా వస్తున్నాయి" అని హీరో మోటోకార్ప్ సంస్థ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ బీబీసీకి వివరించారు.

ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి "తక్కువ ధర మోడళ్ల" విషయంలోనే ఉండేదని ఆయన అన్నారు.

తాను ఈ ఏడాది 200సీసీ బైక్ కొనాలని భావిస్తున్నట్లు విశాల్ పవార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెప్పారు.

"పండుగ డిస్కౌంట్లు, పన్నుల కోత వల్ల ఏదైనా కొనడానికి ఇదే మంచి సమయం. ఈ దసరా పండగ సందర్భంగా నేను బైక్ కొంటున్నాను" అని ఆయన అన్నారు.

జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వం, ధరలు తగ్గుదల, దసరా పండుగ ఆఫర్స్

ఫొటో సోర్స్, Vishnu Vardhan

ఎంత తగ్గిందో చెప్తున్నారా?

ఇకపై తమ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయని వినియోగ వస్తువుల తయారీ సంస్థలు కూడా ఆశాభావంతో ఉన్నాయి.

పన్ను తగ్గింపుతో పాటు దేశావ్యాప్తంగా ఈ ఏడాది పంటలు బాగా పండటంతో ఎయిర్ కండీషనర్ల వంటి వస్తువుల మార్కెట్ మెట్రో నగరాలను దాటి విస్తరిస్తుందని భావిస్తున్నట్లు గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సవ్యసాచి గుప్తా చెప్పారు.

అయితే జీఎస్టీ తగ్గించడం వల్ల గోద్రెజ్ లాంటి కంపెనీలు డిమాండ్ ఏ మేరకు ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ధరల తగ్గింపుకు సంబంధించిన లేబుల్స్ ముద్రించడంలో బిజీగా మారాయి.

"మేం పాత, కొత్త ధరలను పక్క పక్కనే ముద్రిస్తున్నాం. దాని వల్ల వినియోగదారుడికి ధర ఎంత తగ్గిందో తెలుస్తుంది" అని సవ్యసాచి గుప్తా బీబీసీకి చెప్పారు.

చిన్న బ్రాండ్లు, దుకాణదారులు తగ్గిన పన్నులకు అనుగుణంగా ధరల్ని సవరించే పని పూర్తి స్థాయిలో చేపట్టలేదు.

వారి వద్ద తగినంత సమయం, వర్కర్లు లేకపోవడంతో తగ్గిన ధరలతో ప్యాకింగ్ చేయడం కష్టంగా మారింది.

ముంబయిలోని ప్రఖ్యాత క్రాఫోర్డ్ మార్కెట్‌ నగరంలో అతి పెద్ద హోల్‌సేల్ రిటైల్ మార్కెట్.

ఇక్కడ సుగంధ ద్రవ్యాల నుంచి గుండీల వరకు అన్నీ అమ్ముతారు.

జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల గురించి ఈ మార్కెట్‌లో కొద్ది మంది దుకాణదారులకు మాత్రమే అవగాహన ఉంది.

అవగాహన ఉన్న వారిలోనూ అయోమయం కనిపిస్తోంది.

తాను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసిన వస్తువుల ధరల్ని సవరించిన శ్లాబులకు అనుకుణంగా ఎలా మార్చాలనే దాని గురించి సరఫరాదారులతో చర్చిస్తున్నట్లు టపాసుల దుకాణం నిర్వహిస్తున్న షేక్ రెహమాన్ చెప్పారు.

ఆయన దుకాణానికి పక్కనే ఉన్న బ్రైడల్ షోరూమ్‌లో నిరాశ కనిపిస్తోంది.

ప్రభుత్వం రెండున్నర వేల రూపాయల కంటే తక్కువ ఉన్న దుస్తులపై జీఎస్టీ తగ్గించింది. అంత కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులపై జీఎస్టీ 18శాతంగా ఉంది.

పెళ్లికి ధరించే దుస్తుల ధరలు రెండున్నర వేల రూపాయల కంటే ఎక్కువే ఉంటాయి. దీంతో నరేష్‌కు చెందిన బ్రైడల్ షోరూమ్‌లో దుస్తులు కొంటే 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

దీని ప్రభావం సరఫరా వ్యవస్థలతో పాటు డిజైనర్లు, చేనేత కళాకారులు, రిటైలర్లు, కస్టమర్లపై పడుతుంది.

"భారతీయులు పెళ్లికి ధరించే దుస్తుల మీద భారీగా ఖర్చు పెడతారు. పెళ్లిళ్ల సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే పన్నుల పెరుగుదల వల్ల ఈ ఏడాది కొనుగోళ్లు కాస్త మందగించవచ్చు" అని నరేష్ చెప్పారు.

జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వం, ధరలు తగ్గుదల, దసరా పండుగ ఆఫర్స్

ఫొటో సోర్స్, Vishnu Vardhan

ఫొటో క్యాప్షన్, జీఎస్టీ సవరణ గురించి దుకాణదారులకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు

జీఎస్టీ సవరణతో ఆర్థిక భారం

అయితే జీఎస్టీ తగ్గింపు ప్రభావం విస్తృత స్థాయిలో సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

"జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజల నెలవారీ ఖర్చులో మూడోవంతు ప్రయోజనం కలుగుతుంది. దీని వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది" అని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ చెబుతోంది.

జీఎస్టీ సవరణ ప్రభావం "తయారీ సంస్థలు ధరల తగ్గింపును ఏ మేరకు వినియోగదారులకు అందిస్తాయి" అనే దానిపై ఉంటుందని రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంపైనా ఉంటుందని అంచనా వేసింది.

జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది.

వస్తు సేవల పన్ను శ్లాబుల్లో మార్పుల వల్ల ఏడాదికి వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతామని ప్రభుత్వం అంచనా వేసింది.

అయితే మూడీస్ లాంటి రేటింగ్ ఏజన్సీస్ మాత్రం ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఖజానాపై భారం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాయి.

గతేడాది 20శాతం పెరుగుదలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు స్వల్పంగా పెరిగాయి. అయితే ఖర్చుల పెరుగుదల 20 శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఆర్థిక లోటు నియంత్రణ, ఆదాయ వ్యయాల మధ్య అంతరం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణంలో వేగానికి రానున్న రోజుల్లో బ్రేకులు వేయాల్సి రావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)