ఆంధ్రప్రదేశ్: అరకులో కాఫీ తోటలు ఎందుకు నరికేస్తున్నారు, ఏమిటీ బెర్రీ బోరర్?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఘుమఘుమలాడే అరకు కాఫీ గింజలపై బెర్రీ బోరర్ అనే పురుగు దాడి చేసింది. గింజలోని గుజ్జును తినేస్తూ.. మొత్తం తోటలనే నాశనం చేస్తోంది. ఏజెన్సీలో బెర్రీ బోరర్ సోకిన కాఫీ తోటలను ఉద్యానవన శాఖ రెడ్ జోన్‌గా ప్రకటించింది.
అరకు, పాడేరు వెళ్లే టూరిస్టుల లిస్టులో కాఫీ తోటల విజిట్ కూడా ఉంటుంది. కానీ, ఇప్పుడు చాలా తోటలకు బెర్రీ బోరర్ సోకడంతో టూరిజంపై కూడా దీని ప్రభావం పడుతుందేమోనని అధికారులు ఆందోళనలో ఉన్నారు.
ప్రస్తుతానికి, బెర్రీ బోరర్ మొదటగా కనిపించిన అరకు మండలంలోని పకనకుడి, మాలిసింగరం, మాలివలస, మాడగడ, తురాయిగూడ, చినలబుడు, కొర్రాయి గ్రామాల్లోని కొన్ని కాఫీ తోటల చుట్టూ రెడ్ రిబ్బన్లు కట్టారు. కొన్ని తోటలను నరికేశారు.
అసలు బెర్రీ బోరర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అరకు కాఫీ బ్రాండ్‌కు ఇబ్బందికరమా? కాఫీ తోటల రైతులు ఏమంటున్నారు? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.


ఫొటో సోర్స్, Chetti Bindu
తొలిసారి తెగులు..
1920లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైంది.
ఆ తర్వాత 1960ల నాటికి 10 వేల ఎకరాలు, 2002 నాటికి 32 వేల ఎకరాలు, 2008కి 64 వేల ఎకరాలు, 2016కి 84 వేల ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఏజెన్సీవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది.
కాఫీ తోటల పెంపకం మొదలైన 105 ఏళ్లలో ఏనాడూ కాఫీ తోటలు తెగుళ్ల బరిన పడలేదని ఇక్కడి రైతులు చెబుతున్నారు. కానీ, ఈ ఏడాది బెర్రీ బోరర్ దాడితో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు.

బెర్రీ బోరర్ ప్రభావానికి గురైన పకనకుడి, చినలబుడు గ్రామాల దగ్గరున్న కాఫీ తోటలను బీబీసీ సందర్శించింది. కాఫీ తోటల రైతులతో, ఉద్యానవన శాఖ అధికారులతో మాట్లాడింది.
"ఎప్పుడూ లేనిది..ఈ ఏడాది బెర్రీ బోరర్ అనే పురుగు మా తోటలపై దాడి చేసింది. ఆగస్ట్ 11న అరకులోయ మండలం పకనగూడలో మొదటి సారి ఈ బెర్రీ బోరర్ కనపడినా..సెప్టెంబర్ రెండోవారానికి ఎక్కువ తోటలను చుట్టేసింది. ఇలా వివిధ మండలాల్లో దాదాపు 2 వేల ఎకరాల్లో సోకినట్టు మాకు తెలుస్తోంది. అధికారులైతే 200 ఎకరాలే అంటున్నారు" అని పకనకుడి గ్రామానికి చెందిన కాఫీ తోటల రైతు గోపాల్ బీబీసీతో చెప్పారు.

ఈ పురుగు ఏం చేస్తుందంటే..
బెర్రీ బోరర్ పురుగు కాఫీ కాయలు, పళ్లకి సోకి.. ఆ తర్వాత తన సంతతిని పెంచుకుంటుందని వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్ సునీత చెప్పారు.
"బెర్రీ బోరర్ నులిపురుగు మాదిరిగా చిన్న సైజులో ఉంటుంది. ఇది కాఫీగింజ కొనభాగంలో రంధ్రాన్ని చేస్తుంది. ఆపై పిండిలాంటి పదార్థాన్ని బయటకు పంపుతుంది. కాఫీ గింజ గట్టిపడ్డ కాయలనే ఎంచుకుని పురుగు తన సంతతిని పెంచుకుంటుంది. అలా, కాఫీ పంటను పూర్తిగా నాశనం చేస్తుంది" అని వివరించారామె.
బెర్రీ బోరర్ దాడితో పంట నాణ్యత తగ్గిపోతుందని, నివారించకపోతే అరకు కాఫీ సాధించుకున్న అంతర్జాతీయ ఖ్యాతికి కూడా ఇబ్బందికరమేనని అధికారులు, కాఫీ రైతులు ఆందోళన చెందుతున్నారు.
'మా తోటలకు ఎప్పడూ తెగుళ్లు రాలేదు. ఇప్పుడు బెర్రీ బోరర్ పురుగు వచ్చింది. ఈ ఏడాది మా కష్టం కూడా మిగిలేలా లేదు" అని చినలబుడు గ్రామానికి చెందిన కొర్రా రాములు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Chetti Bindu
అరకు తోటల్లోకి ఈ బెర్రీ బోరర్ ఎలా వచ్చింది?
అరకు/అల్లూరి జిల్లా కాఫీ తోటలకు తొలిసారిగా బెర్రీ బోరర్ ఎలా సోకిందన్న అంశంపై అధికారులు ఇంకా స్పష్టమైన నిర్ధరణకు రాలేదు.
"సాధారణంగా, కాఫీ తోటల సాగుకు విత్తనాలను ఐటీడీఏ, కాఫీ బోర్డులే ఏర్పాటు చేస్తాయి. అధిక దిగుబడుల పేరుతో కొన్ని ప్రైవేటు కాఫీ కంపెనీలు కూడా విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న విత్తనాలలో ఈ పురుగు జాడ ఉందని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ సాగుతోంది" అని కాఫీ బోర్డ్ ఉన్నతోద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు.
కాఫీ గింజలు తీసుకెళ్లేందుకు తెచ్చే గోనె సంచుల ద్వారా కూడా బెర్రీ బోరర్ పురుగు వచ్చే అవకాశముందని కాఫీ తోటల లైజనింగ్ విభాగంలో పనిచేసే ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
ఈ బెర్రీబోరర్ నివారణకు ఐటీడీఏ, ఉద్యాన శాఖలతో పాటు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు కాఫీ తోటల్లో సమగ్ర సర్వే నిర్వహించారు.

ఫొటో సోర్స్, Chetti Bindu
"బెర్రీ బోరర్ పురుగును గుర్తించి.. అది ఉన్న కాఫీ కాయలను లేదా పళ్లను తీసేసి.. నీళ్లలో మూడు నిముషాలు ఉడకబెట్టాలి. ఆ తర్వాత నాలుగైదు అడుగుల గొయ్యి తవ్వేసి పూడ్చాలి. ఇంతకముందు కర్ణాటక, తమిళనాడు, కేరళలో బెర్రీ బోరర్ పురుగు కనిపించేది. అరకు ప్రాంతంలో లేదు. ఇప్పుడు వచ్చింది. అది ఎలా వచ్చిందో నిర్థరించే పనిలో సైంటిస్టులు ఉన్నారు.
బెర్రీ బోరర్ పురుగు 50 గుడ్లు పెడుతుంది. 35 నుంచి 40 రోజుల్లో తోట మొత్తం వ్యాపిస్తుంది. అందువల్ల బెర్రీ బోరర్ సోకిన తోటలోని మొత్తం కాఫీ కాయలు కోస్తున్నాం. లేకుంటే మొత్తం ఏజెన్సీలోని 11 మండలాలకూ విస్తరించే ప్రమాదం ఉంది" అని ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Chetti Bindu
బెర్రీ బోరర్ నివారణపై ఉద్యాన శాఖ, కాఫీ బోర్డు, ఐటీడీఏ అధికారులు, ఉద్యోగులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పురుగు నివారణకు బవేరియా బేసియానా శిలీంధ్రాన్ని పిచికారీ చేయిస్తున్నామని, ట్రాప్స్ ఏర్పాటు చేసి పురుగులను ట్రాప్ చేస్తున్నామని కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్. రమేశ్ చెప్పారు.
"అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ ఉనికిని గుర్తించాం. ఈ కాయతొలుచు పురుగు నివారణకు బవేరియా బేసియానా శిలీంధ్రాన్ని అందజేస్తున్నాం" అని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సైంటిస్ట్ చెట్టి బిందు చెప్పారు.

మళ్లీ కోలుకుంటమో లేదో..
బెర్రీబోరర్ సోకిందని మా పొలంలోని పంటను మొత్తం పీకేశారు. కాఫీ కాయలను ఉడకబెట్టేసి.. ఆ కాయలను గోతిలో పూడ్చేశారని పకనకుడికి చెందిన గిరిజన రైతు గోపాల్ బీబీసీతో చెప్పారు. ఈ దెబ్బ నుంచి కోలుకుంటామో లేదోననే ఆందోళన వ్యక్తం చేశారు.
"సాధారణంగా డిసెంబర్, ఫిబ్రవరి మధ్య కాఫీ పంట చేతికొస్తుంది. కానీ, బెర్రీ బోరర్ వలన సెప్టెంబర్‌లోనే పండిపోతుంది. పైగా కాయలను లేదా పళ్లలో గుజ్జును బోరర్ పురుగు మొత్తం తినేస్తుంది. దీంతో ఆ కాయలకు, పళ్లకు మార్కెట్‌లో ధర పలకదు. ఈసారి నష్టపోయాం. ఇలాంటి తెగులు ఇప్పటివరకు కాఫీ తోటలలో చూడలేదు" అని సుంకరమెట్ట గ్రామానికి చెందిన ప్రశాంత్ బీబీసీతో అన్నారు.

అరకు కాఫీ బ్రాండ్ తగ్గనివ్వం: అధికారులు
‘‘బెర్రీ బోరర్ పురుగును కంట్రోల్ చేయగలిన ఇతర పురుగులు ఉంటే వాటిని డిపార్ట్‌మెంట్ సాయంతో రైతులకు అందజేస్తాం. బెర్రీ బోరర్ పురుగును పూర్తిగా అదుపులోకి తీసుకొస్తాం. అరకు కాఫీ బ్రాండ్‌ని నిలబెడతాం" అని సీనియర్ సైంటిస్ట్ సునీత చెప్పారు.
బెర్రీ బోరర్ వల్ల నష్టాన్ని చవిచూసిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి కర్ణ తెలిపారు. కిలోకు రూ.50 చొప్పున రైతులకు, ఎకరానికి రూ.5 వేల నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














