తెలంగాణ: మహిళల ఆధ్వర్యంలో నడిచే ఈ పెట్రోల్ బంక్‌ నష్టాల నుంచి లాభాల బాట ఎలా పట్టింది?

నారాయణపేట జిల్లాలో మహిళలు నడిపే పెట్రోల్ బంకు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నేను ఇప్పుడు నెలకు రూ.13 వేలు సంపాదిస్తున్నా. మా పెద్దమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనుకుంటోంది. చదివించగలనో లేదో అనుకున్నా. కానీ ఇప్పుడు చదివిస్తాననే నమ్మకం, ధైర్యం వచ్చాయి'' అంటూ ఆనందం వ్యక్తం చేశారు లక్ష్మి.

ఆమె నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం జంక్షన్ వద్దనున్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు.

మహిళలు పెట్రోల్ బంకుల్లో పనిచేయడం ఇప్పుడు సాధారణమే. కానీ, ఈ పెట్రోల్ బంకును నడిపిస్తున్నది మహిళలే.

తెలంగాణలోనే తొలిసారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకును ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోజంతా బిజీ.. బిజీ..

పెట్రోల్ బంకును మహిళలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో చూసేందుకు నారాయణపేట వెళ్లింది బీబీసీ.

నారాయణపేట-హైదరాబాద్ రహదారి పక్కన ఈ పెట్రోల్ బంకు ఉంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా వాహనదారులు వస్తూనే ఉన్నారు.

తమ వాహనాల్లో పెట్రోలు, డీజిల్ పోయించుకుంటున్నారు.

పెట్రోల్ బంకును మహిళలే నడిపిస్తుంటంతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటంతో బాగా నమ్మకం ఏర్పడిందని నారాయణపేటకు చెందిన మహమ్మద్ హుస్సేన్ చెప్పారు.

''నేను హైదరాబాద్, మహబూబ్ నగర్, విజయవాడ, బెంగళూరు.. ఇలా అన్నిచోట్లకు వెళ్తా. ఈ పెట్రోల్ బంకులో క్వాలిటీ బాగుంటుందనే నమ్మకం ఏర్పడింది'' అని బీబీసీతో చెప్పారు.

మహిళలు నడిపే పెట్రోల్ బంకు

‘ఆగిపోతుందేమో అనుకున్నాం, కానీ..’

ఈ పెట్రోల్ బంకును 2025 ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా 2025లో కోయ శ్రీహర్ష ఉన్నప్పుడు జిల్లా మహిళా సమాఖ్య తరఫున పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది.

''హైదరాబాద్ రోడ్డు పక్కనే ఖాళీగా ఉన్న ఆరు గుంటల స్థలాన్ని డీఆర్డీఏకు అప్పగించారు.

తర్వాత పెట్రోలు బంకు ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ కంపెనీతో మాట్లాడారు హర్ష సారు'' అని పెట్రోల్ బంకు మేనేజర్ శీలం చంద్రకళ బీబీసీతో చెప్పారు.

తర్వాత శ్రీహర్ష బదిలీపై వెళ్లడంతో మూడు నెలలపాటు దీనికి సంబంధించిన ప్రక్రియ ముందుకు కదల్లేదని ఆమె చెప్పారు.

కొత్త కలెక్టర్‌గా వచ్చిన సిక్తా పట్నాయక్‌ను కలిసి పెట్రోల్ బంకు ఏర్పాటు ప్రతిపాదనను తెలియజేయడంతో బీపీసీఎల్ కంపెనీతో మాట్లాడి పనులు ముందుకు కదిలేలా చేశారామె.

''ఇంత వరకు వచ్చి మొత్తం ఆగిపోతుందేమో.. మా పెట్రోల్ బంకు అనే కల ఇక్కడే నిలిచిపోతుందేమో అని చాలా బాధ పడ్డాం. సిక్తా మేడమ్ చొరవ తీసుకుని చేశారు'' అని చంద్రకళ బీబీసీతో చెప్పారు.

మహిళలు నడిపే పెట్రోల్ బంకు

పెట్రోలు బంక్ నిర్వహణ ఇలా

ప్రస్తుతం పది మందితో నడుస్తోందీ పెట్రోల్ బంకు. వీరిలో ఆరుగురు మహిళలు కాగా, మరో నలుగురు పురుషులు.

రోజంతా మహిళలే నిర్వహిస్తుండగా.. రాత్రి షిఫ్ట్‌లో పురుషులు పనిచేస్తుంటారు.

''సెక్యూరిటీ కారణాలతో, అధికారుల సూచనతో రాత్రి వేళ నిర్వహణ బాధ్యత పురుషులకు అప్పగించాం'' అని చంద్రకళ చెప్పారు.

పెట్రోల్ బంకు ఏర్పాటుకు బీపీసీఎల్ రూ.1.10 కోట్లు పెట్టుబడి పెట్టింది. జిల్లా సమాఖ్య నుంచి రూ.35 లక్షలు వెచ్చించి పెట్రోల్, డీజిల్ కొనడం, బంకు స్థలంలో భూమి చదును చేయించడం వంటి పనులు చేశారు.

''ఈ పెట్రోల్ బంకు రావడానికి చాలా కష్టపడ్డాం. చాలా మంది వెనక్కి లాగే మాటలు అనేవారు. ఎన్నో సంవత్సరాలపాటు ట్రై చేసినా పెట్రోల్ బంకు రాదు. టెండర్లు ఉంటాయి అంటూ నిరుత్సాహపరిచారు'' అని చెప్పారు చంద్రకళ.

''ఆడవాళ్లు.. మీ వల్ల ఏం అయితది'' అంటూ చాలామంది ఎగతాళి చేశారని చెప్పారు.

అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రయత్నించడంతో కల సాకారమైందని చెప్పారామె.

పెట్రోల్ బంకు

నష్టాలను అధిగమించి లాభాల్లోకి..

మొదట్లో నష్టాలు వచ్చి ఇబ్బందులు ఎదురైనా.. తర్వాత నిలదొక్కుకుని లాభాల బాటలోకి వచ్చినట్లు చంద్రకళ చెబుతున్నారు.

ఆమె గతంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేశారు.

''మొదట పెట్రోలు బంకు పెట్టినప్పుడు ఎవాపరేషన్ లాస్ కారణంగా నష్టం వచ్చింది. నష్టం ఎక్కడ వస్తుందనేది తెలుసుకున్నాం. దాన్ని అధిగమించి లాభాల్లోకి వచ్చాం'' అని బీబీసీతో చెప్పారు చంద్రకళ.

మొదట్లో రోజుకు 1500 లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ విక్రయించేవాళ్లమని ఆమె వివరించారు.

''నెలవారీగా లెక్కలు తీస్తే పెట్రోల్ బాగా షార్టేజ్ వచ్చింది. బంకు పెట్టినప్పుడు ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటుందని, ఎవాపరేషన్ లాస్ వస్తుందని బీపీసీఎల్ సిబ్బంది చెప్పారు'' అని అన్నారు.

ఇప్పుడు ఈ పెట్రోలు బంకులో రోజుకు నాలుగు వేల నుంచి ఐదు వేల లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు.

బీపీసీఎల్ పెట్రోల్ బంకు

లీటరుకు డీజిల్‌పై రూ.2.05, పెట్రోల్‌పై రూ.3.43 కమీషన్ లభిస్తోంది.

''మాకు నెలకు రూ. 2-3 లక్షల వరకు లాభం వస్తోంది. ఈ ఆరు నెలల్లో రూ.13.83 లక్షల లాభం వచ్చింది'' అని చంద్రకళ చెప్పారు.

పెట్రోల్ బంకు నిర్వహణలో మహిళలు విజయవంతమయ్యారని అన్నారు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వర్.

''జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, మహిళల శ్రమకు ఫలితంగా పెట్రోల్ బంకు లాభాల బాట పట్టింది. జిల్లా మహిళా సమాఖ్య ఆర్థికంగా బలోపేతమవుతోంది. జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం'' అని బీబీసీతో చెప్పారు గాంగ్వర్.

పెట్రోల్ బంకు

‘ఇప్పుడు ఆ భయం లేదు’

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వారిలో లక్ష్మి ఒకరు. ఆమె భర్త మార్కెట్ యార్డులో కూలీగా పనిచేస్తుంటారు.

సీజన్ ఆధారంగా ఆయనకు పని లభిస్తుంది. అన్-సీజన్‌లో పనుల్లేక ఇబ్బందులు పడేవాళ్లమని లక్ష్మి చెబుతున్నారు.

ఆమె ముగ్గురు పిల్లలను చదివించుకునేందుకు పెట్రోల్ బంకు ఆసరాగా మారిందని చెబుతున్నారు.

''నేను పదో తరగతి వరకు చదువుకున్నా. మా అమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతానంటోంది. చదివిస్తానో.. లేదో.. అని భయమేసింది. కానీ, ఇప్పుడు ఆ భయం లేదు'' అని లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆమెకు నెలకు రూ.13వేలు జీతం లభిస్తోంది.

మరో మహిళ అంజమ్మది ఇదే పరిస్థితి. ముగ్గురు పిల్లలను చదివించేందుకు కూలి పనులకు వెళ్లి ఇబ్బందులు పడ్డామని ఆమె చెప్పారు.

''ఇప్పుడు ఆర్థికంగా నా కాళ్ల మీద నేను నిలబడి పిల్లలను చదివించుకుంటున్నా'' అని అంజమ్మ చెప్పారు.

రోజంతా నిలబడి పనిచేయాలంటే ఇబ్బంది కదా.. అని అడగ్గా.. ''మనం రిస్క్ అనుకుంటే ఏదైనా రిస్కే సర్. మేం అలా అనుకోవడం లేదు. మాకు ఒక హోదాలో ఉండాలని ఉండేది. అందుకే గట్టిగా నిలబడ్డాం'' అని బీబీసీతో చెప్పారు.

పెట్రోల్ బంకు

సీఎన్జీ ఫిల్లింగ్ సెంటర్ దిశగా ప్రయత్నం

మహిళా పెట్రోల్ బంకుకు వాహనదారులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. 2025 సెప్టెంబరు 8న ఒక్కొక్కరు రూ. 2 లక్షల అమ్మకాలు చేసినట్లుగా చెప్పారు చంద్రకళ.

ఈ పెట్రోలు బంకు వల్ల మిగిలిన చోట్ల అమ్మకాలు పడిపోవడంతో కొందరు తమను ఇబ్బంది పెట్టాలని చూశారని ఆమె అన్నారు.

"కొందరు పెట్రోల్ కొట్టించుకుని వెళ్లి, మళ్లీ బాటిళ్లతో పెట్రోల్ తెచ్చి... చూడండి ఇది ఫేక్ పెట్రోల్ అనేవారు. వేరొక చోట నుంచి బాటిల్‌లో తెచ్చి అది మంచిదని చెప్పేవారు. అప్పటికప్పుడు వారి ముందే ఫ్యూయల్ డెన్సిటీ (సాంద్రత) తనిఖీ చేసి చూపించాం. మా పెట్రోల్ ఎలా ఉందో, వాళ్లు తెచ్చింది ఎలా ఉందో చూడండని అడిగేవాళ్లం. దాంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయేవారు. ఎదురు దెబ్బలు కొట్టినా నెగ్గుకుని వచ్చినం'' అని చంద్రకళ చెబుతున్నారు.

భవిష్యత్తులో సీఎన్జీ ఫిల్లింగ్ సెంటర్, టీ స్టాల్ వంటివి కూడా జిల్లా మహిళా సమాఖ్య తరఫున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారామె.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)