‘కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో దీపికా పదుకొణె నటించడం లేదు’ అంటూ వైజయంతి మూవీస్ ట్వీట్.. సోషల్ మీడియాలో దీనిపై ఎందుకింత చర్చ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు.
దీనికి కారణం ఆమె 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో నటించకపోవడమే.
కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
దీంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైజయంతి మూవీస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను నిర్మించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా త్వరలో తీయబోతుంది.
దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ నిర్మాణంలో కల్కి 2898 ఏడీ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు నటించారు.
ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ఈ ఏడాది చివరిలో ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సినిమా రీరిలీజ్ కార్యక్రమం సందర్భంగా చెప్పారు.

కానీ, సీక్వెల్ ప్రారంభానికి ముందే దీపికా పదుకొణె ఈ మూవీలో నటించడం లేదని వైజయంతి మూవీస్ ప్రకటించింది.
వైజయంతీ మూవీస్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో.. ''కల్కి 2898ఏడీ''కి రాబోతున్న సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కావడం లేదు. చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలి సినిమా నిర్మాణంలో ఆమెతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ, రెండో సినిమాలో ఆమెతో కలిసి పనిచేసే అవకాశం కనిపించలేదు. కల్కి 2898 ఏడీ లాంటి చిత్రాలకు అంకితభావం, అంతకుమించి కావాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో ఆమె చేయబోయే చిత్రాలకు శుభాకాంక్షలు'' అంటూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘కల్కి 2898 ఏడీ’లో సుమతి క్యారెక్టర్‌లో కనిపించిన దీపిక
కల్కి 2898 ఏడీలో సుమతి క్యారెక్టర్‌లో దీపికా పదుకొణె కనిపించారు. ఈ సినిమాలో కొన్నిసార్లు కథ అంతా దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
అయితే, రెండో భాగంలో భైైరవ, కర్ణ యాంగిల్ అని, ప్రభాస్ చుట్టూ కథ నడుస్తుందని దర్శకుడు చెప్పారు.
ప్రస్తుతం దీపికా పదుకొణె ఏ కారణంతో ఈ మూవీలో నటించడం లేదో తెలియనప్పటికీ, దీనిపై పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేశారని, రోజుకు 7 గంటలే షూటింగ్‌కు అందుబాటులో ఉంటానన్నారని.. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో ఆమెను తీసుకోలేదని కథనాలు వచ్చాయి.
ఇవి ఎంతవరకు వాస్తవమనేది బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు. దీనిపై అటు నిర్మాణ సంస్థ నుంచి కానీ, దీపికా పదుకొణె నుంచి కానీ అధికారిక స్పందన రాలేదు.
వైజయంతి మూవీస్ కూడా దీపికా పదుకొణె ఎందుకు ఈ సినిమాలో నటించడం లేదో స్పష్టంగా చెప్పలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోషల్ మీడియా యూజర్లు ఏమంటున్నారు?
మరోవైపు దీపికా పదుకొణె ఈ సినిమా సీక్వెల్‌లో నటించకపోతుండటంపై సోషల్ మీడియా యూజర్లు కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె పర్‌ఫార్మెన్స్ చాలా బాగుందని, తన క్యారెక్టర్‌లో ఆమె లీనమై నటించారని, ఆమె పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టమని కొందరు సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.
దీపిక లేకుండా కల్కి 2898 ఏడీ సినిమాను ఊహించుకోలేమని, సీక్వెల్‌కు అతిపెద్ద లాస్ అంటూ కూడా చెబుతున్నారు.
ప్రభాస్ నుంచి దీన్ని ఊహించలేకపోతున్నామని, స్పిరిట్, వంగ ఇష్యూను కల్కిలోకి తీసుకు రాకూడదని ఒక యూజర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
ఈ మూవీలో అత్యంత కీలకమైన దీపిక పాత్ర విషయంలో నాగ్ అశ్విన్ ఇలా చేయకూడదని, ఇది స్టోరీపై ప్రభావం చూపిస్తుందని రాశారు.
'' ఈ విధంగా కావడం బాధాకరం. పని గంటలు తగ్గించడంతో పాటు ఫీజుల పెంపుదల డిమాండ్ చేయడం అత్యంత దారుణమైన విషయం. ఏ పని విషయంలోనైనా అంకితభావం, స్థిరత్వం కావాలి. దార్శనికతకు అనుగుణంగా అంకితభావం ఉన్నప్పుడు అసలైన సమర్థత బయటికి వస్తుంది. ఆరోగ్య విషయాలపై దృష్టిపెట్టడం అవసరమే. కానీ, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల వెనుకాలనున్న సమష్టి ప్రయత్నాన్ని గౌరవించాలి. ప్రాజెక్టు డిమాండ్లకు అనుగుణంగా పనిచేయడమే ప్రొఫెషనలిజం'' అని ఓ యూజర్ రాశారు.
ఆమె పాత్రలో ఎవరు నటించబోతున్నారు? అంటూ మరికొందరు యూజర్లు ప్రశ్నిస్తున్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
కొందరు స్పిరిట్ వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్‌లో కూడా తొలుత దీపికా పదుకొణె నటిస్తుందని అనుకున్నారు. కానీ, దీపికా పదుకొణె స్థానంలో ఈ సినిమాలో ఫీమేల్ లీడ్‌గా త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగా.
ఆ సమయంలో సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీపికా పదుకొణె పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. డర్టీ పీఆర్ గేమ్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మండిపడ్డారు.
ఆ తర్వాత, ఓ ఈవెంట్ సందర్భంగా వోగ్‌అరేబియాతో (voguearebia) మాట్లాడిన దీపికా పదుకొణె ఎవరి పేర్లను ప్రస్తావించకుండా.. ఎప్పుడైనా క్లిష్టపరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు తన అంతరాత్మ మాట వినేందుకు ప్రయత్నించి, నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉండటం వల్ల తనకు శాంతి కలుగుతుందని అన్నారు.
అయితే, స్పిరిట్ మూవీ నుంచి కూడా దీపికా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో స్పష్టంగా తెలియలేదు.
రెమ్యునరేషన్ విషయంలో విభేదాల కారణంగానే మూవీ నుంచి తప్పించారని ఫిల్మ్‌ఫేర్ రిపోర్టు చేసినట్లు ఎన్‌డీటీవీ మూవీస్ తన కథనంలో పేర్కొంది. అలాగే, రోజులో 6 గంటల కంటే ఎక్కువ సేపు షూట్ చేసేందుకు దీపిక అంగీకరించలేదని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం కల్కి 2898 ఏడీ నుంచి దీపికా నటించకపోవడంపై కూడా ఇలాంటి కథనాలే వస్తున్నాయి.
ఈ రెండు మూవీల్లోనూ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రెగ్నెంట్‌గా ఉంటూనే ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. అంకితభావం లేదంటే ఎలా?’
గత ఏడాదినే దీపికా పదుకొణె పాపకు జన్మనిచ్చింది. ఆమె కూతురికి దువా అనే పేరు కూడా పెట్టారు.
కల్కి 2898 ఏడీ మూవీ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్లలో ఆమె ప్రెగ్నెన్సీతో కనిపించారు. ఆ సినిమాలో కూడా ఆమెది ప్రెగ్నెంట్ క్యారెక్టర్‌నే.
ప్రెగ్నెన్సీ లాంటి కీలక సమయాల్లో ఆమె మూవీని ప్రమోట్ చేశారని, అంకితభావం లేదా భాగస్వామ్యం విషయంలో కచ్చితంగా ఎలాంటి లోపం లేదని ఓ యూజర్ అన్నారు.
అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది వర్కింగ్ ఉమెన్ ఆఫీసులకు వస్తుంటారని మరో యూజర్ రాశారు. దీనికి అంకితభావం, విలువతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రమోషన్లకు వచ్చినందుకు కూడా వారికి పేమెంట్ ఉంటుందన్నారు.
అయితే, పని గంటల విషయంపై దీపికా పదుకొణె తన ఆందోళనను అంతకుముందు నుంచి వ్యక్తపరుస్తూ వస్తున్నారు.
వారానికి 90 గంటలు వర్కింగ్ అవర్స్ ఉండాలని, ఆదివారాలు కూడా పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్‌పర్సన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఏడాది జనవరిలో నటి దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
ఉన్నత స్థానాల్లో ఉన్నవారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు షాక్‌కి గురిచేశాయని రాశారు. అలాగే, మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్పేలా #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జతచేశారు.
ప్రస్తుతం ఆమె ఈ సినిమాల నుంచి తప్పుకున్నందుకు కారణం కూడా పని గంటల తగ్గింపు డిమాండేనని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే, దీపికా పదుకొణె నుంచి అధికారిక స్పందనైతే ఇంకా రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














