GST దెబ్బకు జోరు మీదున్న ఆన్‌లైన్ గేమ్ ఇండస్ట్రీ కుప్పకూలుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం గేమింగ్ ఇండస్ట్రీ మనుగడకే ముప్పు అని, దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి చావుగంట మోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కౌన్సిల్ నిర్ణయంతో ఇండియన్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, క్యాసినోల షేర్లు అమాంతం పడిపోయాయి.
దేశంలో సుమారు 900లకి పైగా ఉన్న గేమింగ్ స్టార్టప్ కంపెనీలు ఆటగాళ్ల నుంచి వసూలు చేస్తున్న ఫీజులో కొద్ది మొత్తాన్ని పన్నులుగా చెల్లిస్తున్నాయి. అయితే, గేమింగ్ లావాదేవీల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల ఆటగాళ్ల నుంచి సేకరించిన అన్ని రకాల ఫీజులు, కమిషన్లు అన్నీ పన్ను పరిధిలోకి రానున్నాయి.
ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే జీఎస్టీ, ఆదాయ పన్ను, గేమింగ్ ప్లాట్‌ఫాం కమిషన్ వంటివి కలిపి ఆటగాళ్లు గెలుచుకున్న మొత్తంలో 50 శాతానికి పైగా చెల్లించాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు, ఒక ఆటగాడు వంద రూపాయలు ఆట కోసం వెచ్చిస్తే, అందులో 28 రూపాయలు జీఎస్టీ, రూ.5 నుంచి రూ.15ల వరకు గేమింగ్ ప్లాట్ ఫాం కమిషన్, గెలుచుకున్న మొత్తంపై 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం ప్రపంచ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, ఆటగాళ్లను నిర్వీర్యం చేస్తుందని కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించిన న్యాయ సంస్థ ఖైతాన్ అండ్ కో భాగస్వామి సుదీప్త భట్టాచార్జీ అన్నారు. వ్యాట్ లేదా జీఎస్టీ మధ్యస్తంగా ఉంటుందని, అందులోనూ గేమింగ్ ప్లాట్ ఫాం ఫీజు, కమిషన్లపైనే పన్ను ఉంటుందన్నారు.
''ఇది గేమింగ్ పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా నిధుల సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉంది'' అని భట్టాచార్జీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
గత ఐదేళ్లలో భారీ వృద్ధి
గత ఐదేళ్లుగా భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ దాదాపు 28 శాతం నుంచి 30 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరల్లో ఉండడం, మొబైల్ డేటా చౌకగా లభిస్తుండడం వంటి కారణాలతో గేమింగ్ ఇండస్ట్రీ దాదాపు 2.5 బిలియన్ డాలర్ల (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. టైగర్ గ్లోబల్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు సైతం గేమింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాయి.
''కానీ ఇప్పుడు, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో గేమింగ్ ఇండస్ట్రీ వృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుంది. స్టార్టప్ కంపెనీలను వివిధ స్థాయిల్లో ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుంది. వినియోగదారుల సంఖ్య, ఆదాయం, పెట్టుబడిదారుల విశ్వాసం, ఇలా చాలా విషయాలపై ప్రభావం చూపుతుంది'' అని ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ కంపెనీ అయిన గేమర్ జీ ఫౌండర్ అండ్ సీఈవో సొహమ్ థాకర్ అన్నారు.
''ఈ నిర్ణయం పెట్టుబడిదారులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు చాలా గేమింగ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో కాకుండా విదేశాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.'' అని ఆయన అన్నారు.
''వేల కోట్ల ఇండస్ట్రీని ఒక్క దెబ్బతో నాశనం చేశారు. అలాగే అక్రమంగా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఈ నిర్ణయం కలిసొస్తుంది.'' అని పోకర్ హై ప్రమోటర్ గౌరవ్ గగ్గర్ అభిప్రాయపడ్డారు.
''ఈ నిర్ణయం సహేతుకమైనది కాదు. అత్యంత దారుణం, రాజ్యాంగ విరుద్ధం'' అని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ తెలిపింది. ఆన్‌లైన్ గేమింగ్‌ను జూదంతో కలపడం ద్వారా 60 ఏళ్లుగా ఉన్న చట్టాలను విస్మరించినట్లైందని అభిప్రాయపడింది.
భారత్‌లో చాలా రాష్ట్రాల్లో జూదంపై నిషేధం ఉంది. కానీ ఆన్‌లైన్ గేమ్స్‌ను చాలా రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. వాటిని నైపుణ్యానికి సంబంధించిన గేమ్స్‌గా భావిస్తున్నాయి.
ఈ చర్య కారణంగా ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్‌లో లక్షలాది మంది ఉద్యోగావకాశాలు కోల్పోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్‌లోని గేమింగ్ స్టార్టప్ కంపెనీల్లో ప్రస్తుతం 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2028 నాటికి గేమింగ్ సెక్టార్‌లో ప్రత్యక్షంగా 3 లక్షల 50 వేల మందికి, పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
ఊహించని విపత్తు
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం నేపథ్యంలో అనేక గేమింగ్ కంపెనీలతో బీబీసీ మాట్లాడింది. అయితే, ఈ నిర్ణయంలో స్థిరత్వం లోపించిందని కంపెనీలు అభిప్రాయపడ్డాయి.
''ప్రభుత్వం ఇండస్ట్రీకి సహకరించాల్సింది పోయి, చట్టపరంగా ఆమోదయోగ్యం కాని నిర్ణయం తీసుకుంది. ఇది చాలా దురదృష్టకరం.'' అని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ సీఈవో రొనాల్డ్ ల్యాండర్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
''ఇది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ప్రధాన మంత్రి కలకి విఘాతం'' అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగాల కల్పన, ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో పలుమార్లు ప్రశంసలు కురిపించారు.
''ఇలాంటి దోపిడీ పన్ను విధానాలను ఎదుర్కోవాలి. ఈ ప్రతిపాదనలను ఉప సంహరించుకునేందుకు న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉంది'' అని భట్టాచార్జి అన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్ను చట్టాలకు సవరణలు చేస్తే గేమింగ్ ఇండస్ట్రీ అంతా ఒక్కటై న్యాయపోరాటం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఇది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని, ఇందులో ఎలాంటి సమీక్షకు, ఉపసంహరణకు అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.

ఫొటో సోర్స్, FANATIC STUDIO VIA GETTY IMAGES
''మేము ప్రోత్సహించలేం''
కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ''ఒక పరిశ్రమను నాశనం చేయాలని కోరుకోవడం లేదు'' అని మంగళవారం రాత్రి జీఎస్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు.
''కానీ వారిని మేము ప్రోత్సహించలేము'' అని ఆమె అన్నారు.
కేంద్రం తీసుకున్న 28 శాతం పన్ను నిర్ణయం సరైనదేనని ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం విధించాలని పోరాటం చేస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ అయ్యర్ బీబీసీతో అన్నారు.
గేమింగ్ అనేది ఒక ఊహాజనితమైన చర్య అని అయ్యర్ అభిప్రాయపడ్డారు.
''వాటి వల్ల అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారనే కథనాలు ప్రతి వారం వస్తున్నాయి'' అని ఆయన అన్నారు.
''ఆన్‌లైన్ గేమ్స్‌ను జూదంగా భావిస్తూ జీఎస్టీ విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మీ నియంత్రణలో లేని వాటిపై పందెం కాస్తున్నారు.''
''మద్యం, సిగరెట్లను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే వాటిపై పన్నులు వేస్తున్నాం. ఇది కూడా అలాంటిదే.'' అని ఆయన అన్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసగా మారి గతంలో 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఫైసల్ మక్బూల్ వంటి వారు ఇంకా కఠిన నిబంధనలు రావాలని కోరుతున్నారు.
''ఇదొక వ్యసనం. చిన్నారులు, యువత ఎక్కువగా ఇందులో చిక్కుకుంటారు. అధికంగా పన్నులు విధించడంతో పాటు వయస్సు, ఆదాయం ఆధారంగా కూడా పరిమితులు విధించాలి. వాటిని పూర్తిగా నిషేధించాలని నేను కోరుకుంటున్నాను.'' అని మక్బూల్ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 17 ఏళ్ల విద్యార్థిని ప్యాంట్ కిందకు లాగి అండర్వేర్లో చేయి పెట్టిన వృద్ధుడు.. 10 సెకన్లలో జరిగినదాన్ని నేరంగా భావించలేమంటూ కోర్టు తీర్పు
- టైటానిక్ లాగా సముద్రంలో మునిగిపోయిన నౌకలెన్ని... వాటిలోని సంపద ఎంత?
- మెస్సాలినా: శృంగారంలో వేశ్యలతో పోటీపడి అపఖ్యాతి పాలైన రోమ్ సామ్రాజ్ఞి
- టైటానిక్: 25 ఏళ్లు గడచినా హీరో జాక్ మరణంపై ఆగని చర్చ
- ఛత్రపతి శివాజీ ‘గ్రేట్ ఎస్కేప్’: ఔరంగజేబ్ బంధించినపుడు 'ఆగ్రా జైలు' నుంచి ఎలా తప్పించుకున్నారు?














