హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పుతో భారత్ కంటే అమెరికాకే నష్టం ఎక్కువా?

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
- రచయిత, అభయ్ కుమార్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్-1బీ వీసా హోల్డర్ల కోసం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
ఈ ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్క కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుదారు వార్షిక ఫీజు కింద లక్ష డాలర్లను (సుమారు రూ.88 లక్షలను) అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
2025 సెప్టెంబర్ 21 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.
అయితే, కొత్తగా ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు ఏటా చెల్లించాల్సిన వార్షిక ఫీజు కాదని.. కొత్తగా హెచ్-1బీ పొందేవారు చెల్లించాల్సిన 'వన్ టైం' ఫీజు అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివెట్ స్పష్టం చేశారు.
వచ్చే హెచ్-1బీ వీసా లాటరీ సైకిల్‌లో తొలిసారిగా ఈ ఫీజును అమలు చేయనున్నారు.
ఇప్పటి వరకు అయితే, ఈ ఫీజు సుమారు 1,500 డాలర్లు అంటే రూ.1.32 లక్షలు.
కొత్త దరఖాస్తులకు ఈ నిబంధన వర్తిస్తుందని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ చెప్పారు.
ఇప్పటికే హెచ్-1బీ వీసాలున్నవారు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని.. అలాగే హెచ్-1బీ వీసా ఉన్నవారు ఎవరైనా అమెరికా బయట ఉంటే వారు అమెరికాలోకి ఇప్పుడు ప్రవేశిస్తే మళ్లీ ఈ ఫీజు చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు.
అమెరికాలో పనిచేయాలని కలలు కంటున్న లక్షల మంది భారత నిపుణులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది.

భారత్‌కు ఇది ఎందుకు పెద్ద విషయం?
భారత ఇంజనీర్లు, డాక్టర్లు, డేటా సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణుల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
హెచ్ -1బీ వీసా చాలా కాలంగా వారికి అమెరికాలో పనిచేసేందుకు కీలకంగా ఉంటోంది.
అమెరికా ఆవిష్కరణలకు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు భారత నిపుణులు వెన్నెముకగా ఉంటున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
''వారు చాలా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నా" అని ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత టెక్ కంపెనీలనుద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
''ఒక విదేశీ ఇంజనీర్‌కు లక్ష డాలర్లు చెల్లించి ఇక్కడకు తీసుకురావడం కమర్షియల్‌గా లాభదాయకమా లేదా? వారిని తిరిగి పంపి, ఒక అమెరికా పౌరుడిని నియమించుకోవడం మంచిదా లేదా? అన్నది ఇప్పుడు కంపెనీలు నిర్ణయించుకోవాలి'' అని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ అన్నారు.
ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) హెడ్ అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
''నిషేధం మాదిరే దీని ప్రభావం ఉండనుంది. కేవలం సరదా కోసం మన వాళ్లు అక్కడికి వెళ్లడం లేదు. వారి టెక్నాలజీని, సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. భారత్ కూడా నష్టాలు ఎదుర్కొంటుంది. కానీ, అంతకంటే ఎక్కువ అమెరికా ఇబ్బంది పడుతుంది. కొంతకాలం తర్వాత అమెరికాకు ఇది అర్థమవుతుంది'' అని అన్నారు.
భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే 50 శాతం నుంచి 80 శాతం అమెరికాలోని స్థానిక వ్యక్తులను నియమించుకున్నాయని అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కొత్త ఉద్యోగాలను సృష్టించడం కుదరదని చెప్పారు.
హెచ్-1బీ వీసా పొందేవారిలో భారతీయులే అత్యధికం
హెచ్-1బీ వీసా గ్రహీతలలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐసీ) డేటా ప్రకారం, 71 శాతం వీసాలు భారతీయ పౌరులకు, 11.7 శాతం చైనా పౌరులకు జారీ చేశారు.
అంటే దీని ప్రకారం కొత్త నిబంధన వల్ల భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
హెచ్1-బీ వీసాకు సంబంధించి అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. హెచ్-1బీ ప్రొగ్రామ్‌పై పడే తదనంతర పరిణామాలను సంబంధిత భారత సంస్థలతో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని, ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై ఇప్పటికే స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని పేర్కొంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. ఈ ఇబ్బందులను అమెరికా గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
భారతీయ కంపెనీలపై ప్రభావం
ఈ ఆదేశాలపై భారత ఐటీ-బీపీఎం ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ బాడీ నాస్కామ్ తీవ్ర విచారణ వ్యక్తం చేసింది.
''ఇటువంటి మార్పులు అమెరికాలోని ఆవిష్కరణలను, ఉపాధి వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తోన్న భారతీయ ఉద్యోగులపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది'' అని నాస్కామ్ తెలిపింది.
భారత టెక్నాలజీ కంపెనీలకు ఇది పెద్ద సవాలుగా మారనుందని నాస్కామ్ చెప్పింది. అమెరికాలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి. వీటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు క్లయింట్లతో కలిసి కొత్త ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చిన సమయాన్ని కూడా నాస్కామ్ ప్రశ్నించింది.
భారత అతిపెద్ద ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోలు దీర్ఘకాలంగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడ్డాయి.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి బహుళ జాతీయ కంపెనీలు భారతీయ నిపుణులపై ఆధారపడ్డాయి.
2024కు చెందిన యూఎస్‌సీఐసీ డేటా ప్రకారం.. ఈ కంపెనీలు అత్యధిక సంఖ్యలో హెచ్-1బీ వీసాలను పొందాయి.

ఫొటో సోర్స్, Getty Images
''ఇలా అత్యధిక ఫీజును విధించడం వల్ల అమెరికాలో ప్రాజెక్టులను నిర్వహించడం భారత కంపెనీలకు కష్టంగా మారనుంది. అమెరికాలో ఐదేళ్ల అనుభవం ఉన్న ఐటీ మేనేజర్ 1,20,000 డాలర్ల నుంచి 1,50,000 డాలర్ల వరకు సంపాదిస్తుంటారు. హెచ్-1బీ వీసాదారులకు వేతనం 40 శాతం తక్కువగా, భారత్‌లో అయితే 80 శాతం తక్కువగా ఉంటుంది. ఈ ఫీజుల పెంపు వల్ల, కంపెనీలు భారత్ నుంచి రిమోట్‌గానే పని చేయాలని చెప్పొచ్చు. అంటే, హెచ్-1బీ దరఖాస్తులు తగ్గిపోతాయి. స్థానిక నియామకం తగ్గుతుంది. యూఎస్ క్లయింట్లకు ఎక్కువ ఖరీదైన ప్రాజెక్టులు, ఆవిష్కరణల్లో మందగమనం నెలకొంటుంది'' అని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
''ఈ ఆర్డర్ చట్టంగా మారి, కోర్టుల్లో నిలబడినప్పుడు భారతీయ నిపుణులు ఎక్కువగా నష్టపోతారు. అమెరికాకు వెళ్లే మార్గం వర్చ్యువల్‌గా ముగిసిపోతుంది. ఇది కేవలం భారత్‌నే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది'' అని చండీగఢ్‌కు చెందిన వీసా నౌ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రుపిందర్ సింగ్ తెలిపారు.
అయితే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
''డోనల్డ్ ట్రంప్ లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు, అమెరికా వినూత్నతను అణచివేసి, భారత వృద్ధికి సహకరిస్తుంది. ప్రపంచ ప్రతిభకు తలుపులు మూయడం ద్వారా అమెరికా తర్వాత తరం ల్యాబ్‌లను, పేటెంట్లను, ఆవిష్కరణలను, స్టార్టప్‌లను బెంగళూరు, హైదరాబాద్, పుణే, గురుగావ్‌లకు పంపిస్తుంది. భారత డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు, ఇన్నొవేటర్లు భారత పురోగతికి, అభివృద్ధికి తమవంతు సహకారం అందించేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. అమెరికాకు నష్టం, భారత్‌కు లాభంగా మారనుంది'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నిపుణులు ఏమంటున్నారు?
హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయంపై అమెరికాలోని నిపుణుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.
ఇలాంటి అధిక ఫీజులు విదేశీ నిపుణులను నిరోధించడమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చాలామంది భావిస్తున్నారు.
''ఈ చర్య వల్ల హెచ్-1బీ వీసాలు పోతాయి. అమెరికా అత్యంత విలువైన వర్కర్లకు ముగింపు పలుకుతుంది. ఇది ఊహించడానికే కష్టంగా ఉంది'' అని కాటో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ డేవిడ్ జే. బియర్ అన్నారు.
ఇది కేవలం అమెరికా ఉద్యోగులను దెబ్బతీస్తుందని, ఎందుకంటే, వారి వేతనాలను తగ్గించి, ధరలను పెంచనుందని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














