H -1B వీసా ఫీజును ఏకంగా రూ.88 లక్షలకు పెంచిన ట్రంప్.. ఇప్పటికే ఈ వీసాలున్నవారి పరిస్థితి ఏమిటో స్పష్టం చేసిన వైట్‌హౌస్

ఫొటో సోర్స్, gettyimages/x.com/Karoline Leavitt
హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంవత్సరానికి 1,00,000 డాలర్లు అంటే సుమారు 88 లక్షల రూపాయలకు పెంచే ఉత్తర్వుపై సంతకం చేశారు.
వ్యక్తులకు ఒక మిలియన్ డాలర్ (సుమారు రూ. 9 కోట్లు), కంపెనీలకు రెండు మిలియన్ డాలర్లు (సుమారు రూ. 18 కోట్లు) విలువైన గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసే ఆర్డర్‌పైనా ట్రంప్ సంతకం చేశారు.
అయితే, కొత్తగా ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు ఏటా చెల్లించాల్సిన వార్షిక ఫీజు కాదని.. కొత్తగా హెచ్-1బీ పొందేవారు చెల్లించాల్సిన 'వన్ టైం' ఫీజు అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివెట్ స్పష్టం చేశారు.
ఇప్పటికే హెచ్-1బీ వీసాలున్నవారు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని.. అలాగే హెచ్-1బీ వీసా ఉన్నవారు ఎవరైనా అమెరికా బయట ఉంటే వారు అమెరికాలోకి ఇప్పుడు ప్రవేశిస్తే మళ్లీ ఈ ఫీజు చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు.
‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’ కూడా ఇదే విషయం ఒక మెమొరాండంలో స్పష్టం చేసింది. దాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికా హెచ్-1బీ వీసాను 1990లో ప్రవేశపెట్టారు. నైపుణ్యం గల ఉద్యోగులకు ఇది అందిస్తారు. హెచ్-1బీ వీసా ఎక్కువగా ఉన్న వారిలో తొలిస్థానంలో భారతీయులు, తరువాతి స్థానంలో చైనీయులు ఉన్నారు.
కొత్త వలస విధానంలో భాగంగా హెచ్-1బీ వీసాపై ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అమెరికన్లు కానివారు అమెరికా ఉద్యోగాలను కొట్టేస్తున్నారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారు.
విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కోవడానికి తాను అనుమతించబోనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
'టెక్ కంపెనీలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి'
''వారు చాలా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నా" అని ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత టెక్ కంపెనీలనుద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
"హెచ్-1బీ వీసా వ్యవస్థ ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. ఈ వీసా అమెరికన్లు ఉద్యోగం చేయని రంగాలలో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం. అలాంటి వ్యక్తులు ఈ ఉద్యోగాలు చేయడానికి అమెరికాకు వస్తారు" అని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నారు.
"ఇప్పుడు, కంపెనీలు హెచ్-1బీ స్పాన్సర్ చేయడానికి దాదాపు 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనర్థం కంపెనీలు ఇక్కడికి అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను మాత్రమే పంపుతాయి. వారికి అంతకుమించిన అవకాశాలు లేవు" అని ఆయన అన్నారు.
హెచ్-1బీ కింద, అమెరికాకు వస్తున్న ఉద్యోగులు సంవత్సరానికి 60 వేల డాలర్లకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అమెరికన్ టెక్నాలజీ కంపెనీలలో పనిచేసే స్థానిక ఉద్యోగుల సగటు వార్షిక జీతం లక్ష డాలర్లు.
"ఇకపై హెచ్-1బీ వీసాలపై ట్రైనీలను నియమించుకోలేరు. ఆర్థికంగా ఇది సాధ్యం కాదు. శిక్షణ ఇవ్వాల్సి వస్తే, అమెరికా పౌరులకిస్తారు. అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజినీర్‌ను తీసుకురావాలనుకుంటే, హెచ్-1బీ వీసా కోసం సంవత్సరానికి లక్ష డాలర్లు (రూ.88 లక్షలు) చెల్లించాలి" అని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్ అన్నారు.
గత ఏడాది, హెచ్-1బీ వీసాకు ట్రంప్ మద్దతు ఇచ్చారు. కానీ, ఆయన మద్దతుదారులు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా అమెరికా ప్రయోజనం పొందడానికి ఇదే కారణమని ఈ వీసా మద్దతుదారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఏమంటున్నాయి?
"స్వల్పకాలంలో ఊహించని విధంగా అమెరికా మంచి లాభాలను చూస్తుంది. కానీ, దీర్ఘకాలంలో నష్టపోతుంది. దీనివల్ల అది కొత్త ఆవిష్కరణలపై తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది" అని ఇ-మార్కెట్ విశ్లేషకులు జెరెమీ గోల్డ్‌మన్ రాయిటర్స్‌తో అన్నారు.
వెంచర్ క్యాపిటల్ సంస్థ మెన్లో వెంచర్స్ భాగస్వామి అయిన డీడీఎస్, ఈ నిర్ణయం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడంలో అమెరికాకు ఇబ్బందులు పెంచుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"అమెరికా అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించలేకపోతే, దాని ఆవిష్కరణ సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది" అని ఆయన హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్-1బీ వీసా అంటే ఏమిటి, ఎవరికి ఇస్తారు?
నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం 1990లో ప్రారంభించిన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కింద అందించే వీసాల సంఖ్య 2004లో 84 వేలకు పెరిగింది.
ఈ వీసాను లాటరీ ద్వారా జారీ చేస్తారు.
ఇప్పటిదాకా హెచ్-1బీ కోసం వసూలు చేసే మొత్తం 1500 డాలర్లు. ( సుమారు. రూ. 1,32,000 )
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల సంఖ్య 3,59,000కి పడిపోయింది. నాలుగేళ్లలో ఇది అత్యల్పం.
ట్రంప్ కఠిన వలస విధానాల కారణంగా వీసా దరఖాస్తుల సంఖ్యలో ఈ తగ్గుదల కనిపించింది.
అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీలు అమెజాన్, టాటా, మెటా, యాపిల్, గూగుల్ హెచ్-1బీ వీసాల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందాయి.
2025 ప్రథమార్థంలో అమెజాన్.కామ్, దాని క్లౌడ్-కంప్యూటింగ్ యూనిట్ ఏడబ్ల్యూఎస్ 12,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసాలకు ఆమోదం పొందగా, మైక్రోసాఫ్ట్, మెటా 5,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసాలకు ఆమోదం పొందాయి.
వాస్తవానికి, ఈ వీసా అమెరికాలో ప్రత్యామ్నాయం లేని సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం.. అంటే ఎస్‌టీఈఎం రంగాలలో ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం.
కానీ, దీని వలన తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగుల ప్రవాహం పెరిగిందని, దీనివల్లే అమెరికా కంపెనీలు విదేశీయులను ఇష్టపడుతున్నాయని, స్థానిక ఉద్యోగాలను తగ్గించాయని విమర్శకులు అంటున్నారు.
హెచ్-1బీ వీసా గ్రహీతలలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి డేటా ప్రకారం, 71 శాతం వీసాలు భారతీయ పౌరులకు, తర్వాత 12 శాతం చైనా పౌరులకు జారీ చేశారు.
ఫిలిప్పీన్స్, కెనడా, దక్షిణ కొరియా పౌరులకు ఒక శాతం వీసాలు లభించాయి.

ఫొటో సోర్స్, Getty Images
గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ అంటే ఏంటి?
గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమానికి సంబంధించి ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వు ప్రకారం, మొదటి దశలో సుమారు 10 లక్షల గోల్డ్ కార్డులను జారీ చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు.
గోల్డ్ వీసాల కోసం పెట్టుబడిదారులు చేసే చెల్లింపులు అమెరికా రుణాలను వేగంగా చెల్లించేందుకు సహాయపడతాయని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
అమెరికాలో నివసించడానికి, కంపెనీలు భారీ మొత్తంలో వ్యాపారం చేయడానికి గోల్డ్ కార్డ్ వీసా అనుమతిస్తుంది.
శాశ్వత నివాసితులకు ఉండే గ్రీన్ కార్డ్ తరహాలో ఇది ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ వలసదారులకు హెచ్-1బీ వీసా ఖరీదైన వ్యవహారమవుతుంది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యూఎస్‌సీఐఎస్) ప్రకారం, దాదాపు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 50 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు.
ఇది భారత్‌కు నష్టాలు కలిగించవచ్చు. భారతీయ సంపన్నులు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్లి, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పౌరసత్వం తీసుకుంటున్నారు. అమెరికా వారికి ద్వారాలు తెరిచింది.
"భారతదేశంలో వ్యాపారం అంత సులభం కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో భారత్ చాలా దిగువన ఉంది. ఈ పరిస్థితుల్లో అమెరికా పౌరసత్వం కోరుకునే పెద్ద వ్యాపారవేత్తలకు ఇది ఒక పెద్ద అవకాశం" అని ఎపికల్ ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్, వీసా వ్యవహారాల నిపుణులు మనీష్ శ్రీవాస్తవ బీబీసీ ప్రతినిధి ఆనందమణి త్రిపాఠితో అన్నారు.
దీని వల్ల గ్రీన్ కార్డులు, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రయోజనాలు లభిస్తాయని, పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆయన అంటున్నారు. సంపన్నులు మరింతగా వలసపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి పౌరసత్వం ఇస్తుండడంతో భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
స్పందించిన భారత్..
హెచ్1-బీ వీసాకు సంబంధించి అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. తదనంతర పరిణామాలను సంబంధిత భారత సంస్థలతో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని, ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై ఇప్పటికే స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని పేర్కొంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
''సృజనాత్మకత, ఆవిష్కరణల వంటి అంశాల్లో భారత్, అమెరికాలోని సంస్థలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. నిపుణుల రాకపోకలతో సాంకేతిక, ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితోపాటు సంపద సృష్టి జరిగి ఇరుదేశాలూ లబ్ధి పొందాయి. ఇరుదేశాల ప్రజలతో ముడిపడిన అంశం కాబట్టి విధానకర్తలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.''
ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. ఈ ఇబ్బందులను అమెరికా గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














