పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన కెనడా, ఆస్ట్రేలియా, యూకే.. ఇజ్రాయెల్ ఏమందంటే..

పాలస్తీనా, ఇజ్రాయెల్, కెనడా , ఆస్ట్రేలియా, యూకే

ఫొటో సోర్స్, x

పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తున్నట్లు కెనడా, ఆస్ట్రేలియా, యూకే ప్రకటనలు చేశాయి.

పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన తొలి జీ7 దేశంగా కెనడా నిలిచింది.

ఈరోజు నుంచి ''పాలస్తీనా దేశాన్ని కెనడా గుర్తిస్తోంది'' అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

''పాలస్తీనాను దేశంగా కెనడా గుర్తిస్తోంది. పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్.. రెండింటి శాంతియుత భవిష్యత్తు నిర్మాణంలో కెనడా భాగస్వామ్యం అందిస్తుంది'' అని ఆయన రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన రెండో జీ7 దేశంగా నిలిచింది.

ఈవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కెనడా, ఆస్ట్రేలియా రెండూ పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్లు ప్రకటించాయి.

పాలస్తీనాను సార్వభౌమ రాజ్యంగా గుర్తించాలనే కెనడా నిర్ణయాన్ని ఆస్ట్రేలియా అనుసరించిందని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ రాశారు.

ఇది కెనడా, బ్రిటన్‌లతో చేసిన సంయుక్త ప్రయత్నంలో భాగమని, టూ స్టేట్ సొల్యూషన్(రెండు దేశాల)ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు.

దీనికి సంబంధించి అల్బనీస్ లేఖ విడుదల చేశారు.

పాలస్తీనా, ఇజ్రాయెల్, కెనడా , ఆస్ట్రేలియా, యూకే

ఫొటో సోర్స్, Australian government

ఫొటో క్యాప్షన్, అల్బనీస్ లేఖ

పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తున్నాం: కీర్ స్టార్మర్

పాలస్తీనా దేశాన్ని యూకే అధికారికంగా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు.

"శాంతి, టూ స్టేట్ సొల్యూషన్‌ (రెండు దేశాల) ఆశను పునరుద్ధరించేందుకు యునైటెడ్ కింగ్‌డమ్ అధికారికంగా పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తోందని ఈ దేశ ప్రధాన మంత్రిగా స్పష్టం చేస్తున్నా" అని ఆయన ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.

మనం కోరుకుంటున్న శాంతియుత భవిష్యత్తును తీసుకొచ్చేందుకు మన ప్రయత్నాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఇతర దేశాలకు పిలుపునిచ్చారు.

అలాగే, గాజాలో హమాస్ వద్దనున్న బందీల విడుదల, హింసను నిలువరించడం గురించి కూడా ఆయన పునరుద్ధాటించారు.

పాలస్తీనా, ఇజ్రాయెల్, కెనడా , ఆస్ట్రేలియా, యూకే

ఇది అద్భుతం: పాలస్తీనియన్లు

టామ్ బెన్నెట్

వెస్ట్‌బ్యాంక్‌లోని రామల్లా నుంచి..

నేను రామల్లాలో ఉన్నాను. ఇది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఒక నగరం, జెరూసలెంకి ఉత్తరాన కొండల మధ్యన ఉంటుంది.

ఇది పాలస్తీనీయుల పాలనా రాజధాని. చాలా దేశాలు తమ ప్రతినిధుల కార్యాలయాలు లేదా దౌత్య కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి.

కొద్దిసేపటి కిందట నగరం మధ్యన ఒక రద్దీ వీధిలో.. పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తూ యూకే ప్రకటన చేసిన నేపథ్యంలో, ఇక్కడ ఆశావాద వాతావరణం కనిపించింది.

"ఇది అద్భుతం" అంటున్నారు 30 ఏళ్ల మొహమ్మద్ హసీబ్. "యూరప్ దేశాలన్నీ మా దేశాన్ని గుర్తించి ఈ యుద్ధం ఆగేలా చూడాలని ఆశిస్తున్నాం."

"ఇప్పటికైనా జరిగింది, ఇది వృథా పోదు" అని మరో మహిళ అన్నారు.

కానీ, యూకే ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ మరింత కఠినంగా వ్యవహరించవచ్చని ఇక్కడ కొందరు ఆందోళన చెందుతున్నారు.

ఇజ్రాయెల్ ఏమందంటే..

పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తూ యూకే, కొన్ని ఇతర దేశాలు చేసిన ఏకపక్ష ప్రకటనను ఇజ్రాయెల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేసింది.

'ఈ ప్రకటన శాంతిని ప్రోత్సహించదు, దీనికి విరుద్ధంగా- ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరపరుస్తుంది. భవిష్యత్తులో శాంతియుత పరిష్కారాన్ని సాధించే అవకాశాలను దెబ్బతీస్తుంది' అని తెలిపింది.

గతంలో, పాలస్తీనాకు గుర్తింపుపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు.

గత నెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు లేఖ రాస్తూ "ఈ యూదు వ్యతిరేక అగ్నికి ఆజ్యం పోస్తున్నారని" ఆరోపించారు.

ఈ చర్య అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి తర్వాత 'రివార్డు' ఇస్తున్నట్లుగా ఉందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

అయితే, దీనికి ఫ్రెంచ్ ప్రభుత్వం బదులిస్తూ, "ఇలాంటి సమయాల్లో గందరగోళం, పరిస్థితుల తారుమారు కంటే బాధ్యతను, అక్కడి తీవ్రతను పరిణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఫ్రెంచ్ ప్రభుత్వం బదులిచ్చింది.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ "ఇజ్రాయెల్‌కు ద్రోహం" చేశారని, ఆస్ట్రేలియా యూదు సమాజాన్ని కూడా వదిలేశారని నెతన్యాహు ఆరోపించారు.

పాలస్తీనాను గుర్తించే విషయంలో యూకే, ఫ్రాన్స్, కెనడాలతో కలిసి నడవాలని ఆస్ట్రేలియా నిర్ణయించినందున నెతన్యాహు "దూషిస్తున్నారని" ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)