ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు.. శాశ్వత గుర్తింపు ఎప్పుడిస్తారు? దీనికోసం ఏం చేయాలి?

భీమిలి ఎర్రమట్టి దిబ్బలు
ఫొటో క్యాప్షన్, ఎర్రమట్టి దిబ్బలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖపట్నం భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కింది.

సుమారు 18 వేల సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితుల సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ ఎర్రమట్టి దిబ్బలు.

తాజాగా యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కడం వీటి ప్రాధాన్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

అయితే, శాశ్వత గుర్తింపు ఎప్పుడిస్తారు? దాని వలన వచ్చే ప్రయోజనాలేంటి? అసలు యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం ఏం చేయాలి? పర్యావరణవేత్తలు, జియాలజీ నిపుణులు ఏమంటున్నారు?

ఎర్రమట్టి దిబ్బలు

ఎర్రమట్టి దిబ్బలు ప్రపంచంలోనే అరుదు

యునెస్కో తాత్కాలిక జాబితాలో ఏపీకి చెందిన ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలతో పాటు మహారాష్ట్రలోని పంచగాని-మహాబలేశ్వర్‌ ప్రాంతంలోని డెక్కన్‌ ట్రాప్స్, కర్ణాటక ఉడుపిలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు, నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కాల క్లిఫ్స్ కూడా ఉన్నాయి.

భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కోలో చోటు దక్కడంలో పర్యావరణవేత్తలు, పరిశోధకులతో పాటు ఏయూలోని జియాలజీ విభాగం కీలక పాత్ర పోషించింది.

1950 నుంచే ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యాన్ని జియాలజీ విభాగం గుర్తించి, పరిశోధనలు చేయడం ప్రారంభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యునెస్కో ప్రొసీజర్ క్లిష్టమైనదని పర్యావరణవేత్త సోహన్ హట్టంగడి చెప్పారు.

"ఎర్రమట్టి దిబ్బలు వంటి అరుదైన ప్రదేశాలను కాపాడుకోవడం భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం. యునెస్కో గుర్తింపు వస్తే అది సులభం. కాకపోతే... యునెస్కో శాశ్వత గుర్తింపు పొందాలంటే అంత సులభమేమి కాదు" అని సోహన్ హట్టంగడి బీబీసీతో అన్నారు.

"పరిమాణం (సైజ్), ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం, ఎంత అరుదు?.. అనే మూడు ప్రమాణాలను ప్రాథమికంగా యునెస్కో చూస్తుంది. అయితే, ఈ ప్రాథమిక అంశాలు విషయంలో మనం గట్టెక్కుతాం" అని సోహన్ హట్టంగడి అన్నారు.

యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కిన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన జియాలజీ ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు బీబీసీతో మాట్లాడారు.

"తాత్కాలిక గుర్తింపు ఒక ఏడాది ఉంటుంది. ఈ ఏడాది కాలంలో ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం వస్తుంది. వారు సైట్‌ను సర్టిఫై చేస్తేనే శాశ్వత గుర్తింపు వస్తుంది. ఇప్పుడు జాబితాలో చోటు దక్కిన ఏడు ప్రదేశాలతో కలుపుకొంటే ప్రస్తుతం భారతదేశంలో 69 ప్రదేశాలు తాత్కాలిక జాబితాలో ఉండగా, దాదాపు 45 ప్రదేశాలు శాశ్వత గుర్తింపు పొందాయి" అని తెలిపారు.

ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు

ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ఏం చేయాలి?

యునెస్కో తాత్కాలిక జాబితాలో దక్కిన చోటు, శాశ్వత జాబితాలోకి మారాలంటే ఏం చేయాలో సోహన్ హట్టంగడి, ప్రొఫెసర్ యుగంధరరావు వివరించారు.

ఎర్రమట్టి దిబ్బలకు ఇప్పటివరకు అధికారిక సరిహద్దులు లేవని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ఎర్రమట్టి దిబ్బలకు దక్షిణంగా ఐఎన్ఎస్ కళింగ, ఉత్తరంగా భీమిలి కోఆపరేటివ్ సొసైటీ, పశ్చిమాన లే-అవుట్లు వస్తున్నాయి. దీంతో ఎటు చూసినా ఎర్రమట్టి దిబ్బలకు ఇబ్బందే ఉంది. దీంతో ఈ ప్రాంతం ముప్పులో ఉంది అని చెప్పొచ్చు" అని సోహన్ హట్టంగడి బీబీసీతో అన్నారు.

సోహన్ హట్టంగడి
ఫొటో క్యాప్షన్, పర్యావరణవేత్త సోహన్ హట్టంగడి

అలాగే గతంలో జరిగిన తవ్వకాలలో మానవ అవశేషాలు, పరికరాలు, క్యాంపింగ్ సైట్లు బయటపడ్డాయని సోహన్ హట్టంగడి తెలిపారు.

ఈ ప్రదేశం పర్యటకం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు పరిశోధనల కోసం శాస్త్రవేత్తలకు అప్పగించాలని అన్నారు.

అలాగే మరికొన్ని సూచనలు కూడా చేశారు.

ఎర్రమట్టి దిబ్బలు
ఎర్రమట్టి దిబ్బలు
ఫొటో క్యాప్షన్, ఎర్రమట్టి దిబ్బలు

శాశ్వత గుర్తింపుతో కలిగే ప్రయోజనాలు

వేల సంవత్సరాల కిందట గడ్డ కట్టిన సముద్రం మీదుగా వీచిన గాలుల వలన ఒడ్డున ఉన్న ఇసుక పెద్ద ఎత్తున పేరుకుపోయి ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి.

ఇవి తీరప్రాంత పరిసరాలు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ప్రయోగశాల లాంటివని ప్రొఫెసర్ యుగంధరరావు అన్నారు.

శాశ్వతంగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరితే భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు.

ఎర్రమట్టి దిబ్బలు
భీమిలి ఎర్రమట్టి దిబ్బలు

భవిష్యత్తు తరాల కోసం...

అరుదైన ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవడమంటే.. మన చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంతో మన కర్తవ్యం నిర్వహిస్తున్నట్లేనని ప్రొఫెసర్ యుగంధరరావు అన్నారు.

"జియాలజీ ప్రాముఖ్యాన్ని రాబోయే తరాలకు తెలియజేయాలంటే, ఎర్రమట్టి దిబ్బలను సంరక్షించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం వీటి సరిహద్దులు నిర్ధరించడం, పరిశోధనలకు వేదిక చేయడం, ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యం వివరిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచడం...ఇవన్నీ ఏడాది పాటు సక్రమంగా జరిగితే భీమిలి ఎర్రమట్టి దిబ్బలు ప్రపంచ వారసత్వ జాబితాలో శాశ్వత స్థానం పొందే అవకాశం మరింత బలపడుతుంది" అని ప్రొపెసర్ యుగంధరరావు బీబీసీతో చెప్పారు.

ఎర్రమట్టి దిబ్బలపై ఏయూ జియాలజీ విభాగం 1950 నుంచి పరిశోధనలు చేస్తోందని యుగంధరరావు బీబీసీతో అన్నారు.

"ఎర్రమట్టి దిబ్బలను 'బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ'లో మనం ఎక్కువగా చూస్తాం. కానీ, ఇవి అపురూప సంపద. నిజానికి ఎర్రమట్టి దిబ్బలపై సరిపడినంత పరిశోధనలు జరగలేదు. ఎర్రమట్టి దిబ్బలను చరిత్ర చెప్పే చిహ్నలుగా చూడాలి" అని ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు తెలిపారు.

వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్ ఎర్రమట్టి దిబ్బలు సందర్శించినప్పుడు..
ఫొటో క్యాప్షన్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్ ఎర్రమట్టి దిబ్బలు సందర్శించినప్పుడు..

ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఏర్పడ్డాయంటే...

ఎర్రమట్టి దిబ్బలపై ఎన్నో పరిశోధనలు చేసిన, పుస్తకాలు కూడా రచించిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. రాజశేఖర్ రెడ్డి ఈ విషయాలను తన ‘ఏ మోనోగ్రాఫ్ ఆన్ పొటెన్షియల్ జియో పార్క్స్ ఆఫ్ ఇండియా’పుస్తకంలో రాశారు.

ఈయన ఏయూ జియాలజీ విభాగంలో పని చేశారు.

"దాదాపు 18 వేల సంవత్సరాల క్రితం చివరి గ్లేసియర్ పీరియడ్ (భూతలం మంచుతో కప్పబడిన సమయం)లో ఏర్పడ్డాయి. వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటాం. కానీ, నిజానికి ఇవి ఇసుక దిబ్బలు. సముద్రం పై నుంచి వీచిన గాలితో తీరం వద్ద మేటలు వేసిన ఇసుక దిబ్బలే ఇవి. జియలాజికల్‌గా ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారతాయి. అలా ఒక చోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. ఇక్కడ దిబ్బల్లోని ఇసుక మట్టి రంగులో ఉండటం వలన కూడా వీటిని మట్టి దిబ్బలు అనడం అలవాటైపోయింది" అని ఆ పుస్తకంలో ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

ఇసుక దిబ్బలకు ఎర్ర రంగు ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆ పుస్తకంలోనే వివరించారు.

"ఇసుక మేటలు వేసిన తర్వాత, సముద్ర గాలి వీచే దిశ కారణంగా అవి దిబ్బలుగా (DUNES) రూపొందుతాయి. ఇవి ఏర్పడినప్పుడు, ఇప్పుడు సముద్ర ఇసుక ఏ రంగులో ఉందో ఆ రంగులోనే ఉండేవి. అయితే, సముద్ర గాలి తీసుకొచ్చిన ఇసుకలో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా క్వార్జ్ (quartz), గార్నెట్ (garnet), సిలిమనైట్ (sillimanite), మొనాజైట్ (monazite), జిర్కోన్ (zircon), హెమటైట్ (Hematite) మొదలైనవి. ఇవన్నీ కూడా కొండలైట్ (khondalite) ఖనిజం నుంచి వచ్చినవి. ఇవి చర్య పొందినప్పుడు ఎరుపు రంగుని ఇచ్చే మినరల్స్. ముఖ్యంగా హెమటైట్... ఇందులో ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఈ ఇసుక దిబ్బల్లోని హెమటైట్‌తో పాటు ఇతర మినరల్స్‌తో నీరు చర్య పొంది ఐరన్ కలర్ (రెడ్ కలర్) విడుదల చేస్తాయి. దీంతో, ఆ ఇసుక క్రమంగా ఎరుపు రంగులోకి మారుతుంది. అందుకే వీటిని ఎర్రదిబ్బలు లేదా ఎర్రమట్టి దిబ్బలు అంటారు" అని ఆ పుస్తకంలో వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)