శ్రేయస్ అయ్యర్: ఆసియాకప్‌కు ఈ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయకపోవడంపై వివాదం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్‌జట్టును ప్రకటించారు.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఆడే జట్టుకి శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది సెలక్షన్ బోర్డ్.
అయితే ఇప్పుడు జట్టు ఎంపిక గురించి కాకుండా, శ్రేయస్ అయ్యర్‌కు టీమ్‌లో చోటు దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది.
కొన్ని రోజులుగా శ్రేయస్ అయ్యర్ ఆటతీరు చాలా బావుంది. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, 2025 ఐపీఎల్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున ఆడాడు శ్రేయస్.
ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబయి, అబుదాబీలో జరగనుంది.


ఫొటో సోర్స్, Getty Images
శ్రేయస్ పై అగార్కర్ ఏం చెప్పారు?
శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనలో ఎలాంటి లోపం లేదని జట్టు ఎంపిక తర్వాత టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు.
"ఇది అయ్యర్ తప్పు కాదు. అతనికి అవకాశం వచ్చే వరకు వేచి చూడాలి. మీరు చెప్పండి. అతన్ని జట్టులోకి తీసుకోవడానికి ఎవరిని పక్కన పెట్టాలి" అని అగార్కర్ ప్రశ్నించారు.
"యశస్వి జైస్వాల్ కూడా జట్టులోకి ఎంపిక కాలేదు. అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు పైగా బౌలింగ్ కూడా చేస్తాడు. వీళ్లిద్దరిలో ఒకరికే జట్టులో చోటు లభిస్తుంది. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ ఇదే జరిగింది. జట్టులో అతనికి చోటు దక్కకపోవడం అతని తప్పు కాదు" అని అగార్కర్ చెప్పారు.
శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కలేదు కానీ టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ జట్టుకు ఎంపికయ్యాడు. అంతే కాదు టీ ట్వంటీ జట్టుకు అతను వైస్ కెప్టెన్ కూడా.
శుభ్‌మన్ గిల్ 2024లో శ్రీలంకలో చివరిసారిగా టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు.
అక్షర్ పటేల్ స్థానంలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
"గిల్ ఇంగ్లండ్‌లో బాగా ఆడతాడని అనుకున్నాం. అయితే అతను మా అంచనాలకు మించి రాణించాడు" అని అగార్కర్ చెప్పాడు.
అయ్యర్‌ను జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు "శ్రేయస్ అయ్యర్ అంటే నాకూ గౌరవం ఉంది. అయితే ఆయన కోసం ఎవరినీ తప్పించమంటారు. ఇందులో మా తప్పేం లేదు" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అద్భుత ప్రతిభ కనబరిచినా దక్కని చోటు
ఈ ఏడాది ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ 17 ఇన్నింగ్స్‌లో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు.
అతని స్ట్రైక్ రేట్ 175 కంటే ఎక్కువగా ఉంది.
ఈ టోర్నీలో ఆరు హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2011లో క్రిస్ గేల్, 2023లో సూర్య కుమార్ యాదవ్ తర్వాత ఐపీఎల్ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ స్థానాలు పటిష్టంగా ఉన్నాయి. మూడో స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
సౌతాఫ్రికా టూర్‌లో తిలక్ వర్మ అంచనాలకు మించి రాణించాడు.
రెండు సెంచరీలతో198.48 స్ట్రైక్ రేటుతో 280 పరుగులు చేశాడు.
అయితే ఐపీఎల్‌లో తిలక్ వర్మ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. మొత్తం 13 ఇన్నింగ్స్‌లో 31.18 యావరేజ్, 138.30 స్ట్రైక్ రేటుతో 343 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు
శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన స్పందన వస్తోంది.
"శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోలేదా. షాకింగ్ డెసిషన్" అని మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ టీమ్ సభ్యుడు అభిషేక్ నయ్యర్ జట్టు ఎంపిక తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
"నేను ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతుంటే అతన్ని రిజర్వ్ ఆటగాడిగానైనా ఎందుకు ఎంపిక చేయలేదు. 20 మంది సభ్యుల జట్టులో అతనికి చోటెందుకు దక్కలేదో నాకు అర్థం కావడం లేదు. 20 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక చేయకుండా శ్రేయస్‌కు ఏం సందేశం ఇస్తున్నారు" అని అభిషేక్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.
"ఏడాది కాలంగా ఐపీఎల్ సహా వైట్‌బాల్ క్రికెట్‌మ్యాచ్‌లలో శ్రేయస్ కంటే బాగా ఎవరూ ఆడలేదు. అయినప్పటికీ అతనికి ఆసియా కప్‌లో చోటు దక్కలేదు. ఇదంతా చూస్తుంటే అయ్యర్ మొహం ఎవరికీ నచ్చనట్లుంది" అని జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎక్స్‌లో రాశారు.
"ఇది శ్రేయస్ అయ్యర్ తప్పు కాదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. అయితే ఆయన 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. మూడో వికెట్ కీపర్ ద్రువ్ జురేల్ సహా మరో ఐదుగురు ఆటగాళ్లను అదనంగా ఎంపిక చేశారు. మూడు వారాలు జరిగే టోర్నమెంట్‌లో ఆడే జట్టు కోసం మూడో వికెట్ కీపర్‌ను ఎంపిక చేయడం అసంపూర్తిగా ఉంది. శ్రేయస్ లాంటి అద్బుతమైన బ్యాట్స్‌మెన్‌ను పట్టించుకోకపోవడం వెర్రితనం" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్ రాశారు.
"శ్రేయస్ అయ్యర్ కోసం జట్టు నుంచి ఎవరిని తప్పించాలి అనేది ప్రశ్న కాదు. అసలు ప్రశ్న ఏంటంటే శ్రేయస్ అయ్యర్‌ను తప్పించి అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేశారు? ఇది అసలు ప్రశ్న" అని క్రికెట్ విశ్లేషకుడు రమేష్ శ్రీవాస్తవ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
యూఏఈలోనే ఎందుకు జరుగుతున్నాయి?
ఆసియా కప్ టోర్నీకి భారత్ అధికారికంగా ఆతిథ్యం ఇస్తోంది. అయితే బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పందం ప్రకారం, భారత్ లేదా పాకిస్తాన్‌లో ఏదైనా టోర్నీ జరిగినప్పుడు మూడేళ్ల పాటు తటస్థ వేదిక మీద టోర్నీ నిర్వహించాలి. అందుకే ఈసారి మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతున్నాయి.
టోర్నీలో 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 11 మ్యాచ్‌లు దుబయిలో 8 మ్యాచ్‌లు అబుదాబీలో జరుగుతాయి.
టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ ఆప్గానిస్తాన్, హాంగ్‌కాంగ్ మధ్య సెప్టెంబర్ 9న జరగనుంది.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, జితేష్ శర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ , రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్
- టోర్నీలో భాగంగా సెప్టెంబర్10న భారత్ జట్టు యూఈఏతో తలపడుతుంది.
- ఆసియా కప్‌లో హై ఓల్టేజ్ ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగుతుంది.
- గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో జరుగుతుంది.
- గ్రూప్ దశ తర్వాత, ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు సూపర్4కు చేరతాయి.
- సూపర్4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 20 నుండి 26 వరకు జరుగుతాయి.
- గ్రూప్ A లో భారత్ అగ్రస్థానంలో ఉంటే, దాని సూపర్-4 మ్యాచ్‌లన్నీ దుబయ్‌లో జరుగుతాయి.
- భారత్ రెండో స్థానంలో ఉంటే, దాని సూపర్-4 మ్యాచ్‌లలో ఒకటి అబుదాబీలో జరుగుతుంది.
- మిగిలిన రెండు మ్యాచ్‌లు దుబయ్‌లో జరుగుతాయి.
- ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబయ్‌లో జరుగుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














