IndvsPak: పాకిస్తాన్‌ను ప్రత్యర్థి జట్టు అనొద్దని ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎందుకు అన్నాడు?

2025 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2025 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడించింది
    • రచయిత, ప్రవీణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ 15 ఓవర్ల తర్వాత నేను చూడటం మానేశాను. ఎందుకంటే, భారత్, పాకిస్తాన్ మధ్య పోటీయే కనిపించలేదు’

ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం ఇది.

సెప్టెంబర్ 21 ఆదివారం జరిగిన ఆసియా కప్ భారత్-పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్‌లో కూడా అలాంటి కథే పునరావృతమైంది.

భారత్ మరోసారి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది.

ఈ మ్యాచ్ తర్వాత, సోనీ లివ్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ జట్టు ఇకపై భారత్‌తో పోటీపడలేదని అంగీకరించాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆసియా కప్-2025లో పాకిస్తాన్‌తో పోటీపడిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ సునాయాసంగా ఓడించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియా కప్-2025లో పాకిస్తాన్‌తో పోటీపడిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ సునాయాసంగా ఓడించింది

‘భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ లేదు’

మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదని, ఇక దానిపై ప్రశ్నలు వేయడం ఆపాలని అన్నాడు.

''భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ అంటూ మీరు (రిపోర్టరులు) ప్రశ్నించడం మానేయాలి. ఎందుకంటే, నా అభిప్రాయం ప్రకారం.. రెండు జట్లు 15 నుంచి 20 మ్యాచ్‌లు ఆడి అందులో ఒక జట్టు ఏడెనిమిది మ్యాచ్‌లలో గెలిస్తే అది బాగానే క్రికెట్ ఆడుతోందని చెబుతాం. కానీ అదే 13-0(13 ఆడి అన్నీ ఓడిపోవడం) లేదా 10-1(11 మ్యాచ్‌లలో ఒక జట్టు పది గెలిస్తే ఇంకోటి ఒకటే గెలవడం) అయితే ఆ జట్టు పోటీ ఇస్తున్నట్లు కాదు'' అని సూర్యకుమార్ అన్నాడు.

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

రెండు దేశాల మధ్య ఇప్పటివరకూ 15 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 11 మ్యాచ్‌లను భారత్ గెలిచింది. పాకిస్తాన్ కేవలం మూడు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది.

గత సోమవారం, సెప్టెంబర్ 15న సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. భారత్‌తో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ కంటే భారత్‌తో అఫ్గానిస్తాన్ ఆడిన మ్యాచ్‌నే చూడటానికి ఇష్టపడతానని చెప్పాడు.

సౌరవ్ గంగూలీ చెప్పిన అభిప్రాయాన్నే ఫిబ్రవరి 21న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తర్వాత వసీం అక్రం కూడా వ్యక్తంచేశాడు.

''పాకిస్తాన్ ఇలా ఆడుతున్న ఆటను చూడటం కష్టంగా మారింది. గత నాలుగైదు సంవత్సరాలుగా పాకిస్తాన్ భారత్‌తో పోటీపడలేకపోతోంది'' అన్నాడు అక్రం.

పాకిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ చివరిసారిగా మూడేళ్ల క్రితం భారత్‌ టీమ్‌ను ఓడించింది

వన్డే మ్యాచ్‌లో ఆ విజయం సాధించి ఏడేళ్లయింది

ఏ ఫార్మాట్‌లోనైనా భారత్ క్రికెట్ జట్టును పాకిస్తాన్ జట్టు ఓడించి మూడేళ్లు దాటింది. టీ20లు, వన్డే మ్యాచ్‌ల్లో భారత్ చేతిలో పాకిస్తాన్‌కు వరుసగా ఏడో ఓటమి ఇది.

2022 సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలవడమే చివరిసారి.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించట్లేదు. 2012-13 మధ్యకాలంలో, పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇరు జట్లు ఆడాయి. అదీ 1-1తో డ్రాగా ముగిసింది.

అప్పటి నుంచి, రెండు దేశాల టీమ్‌లు ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే పోటీపడుతున్నాయి.

2010 నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ల రికార్డు ప్రకారం.. రెండు జట్లు 18 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాయి. వీటిలో భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలవగలిగింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అయితే, 2017‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి టైటిల్‌ను పాకిస్తాన్ గెలుచుకుంది.

కానీ, అప్పటి నుంచి వన్డేలో భారత్‌పై విజయం కోసం ఎదురుచూస్తోంది.

భారత్, పాక్ ఆటగాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

'భారత్‌తోనే కాదు...ప్రపంచంలో ఎవరితోనూ పోటీపడలేరు...'

సెప్టెంబర్ 21న భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత్ క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ, భారత్ టీమ్ ప్రతి విభాగంలోనూ పాకిస్తాన్ కంటే బలంగా ఉందన్నారు.

''పాకిస్తాన్ టీమ్ సకాలంలో వికెట్లు తీయలేకపోయింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రారంభించగానే, పాకిస్తాన్ మ్యాచ్ నుంచి నిష్క్రమించింది. భారత్ జట్టు చాలా బలంగా ఉంది'' అని రవిశాస్త్రి చెప్పాడు.

మే నెలలో జరిగిన పహల్గాం దాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత తొలిసారిగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి.

బహుశా, తీవ్రమైన పోటీ లేకపోవడం వల్ల రెండు మ్యాచ్‌ల్లోనూ చర్చలు ఆట మీద కంటే మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత ఏమి జరిగిందనే దానిపైనే ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు.

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లకూ గ్యాలరీల్లో ప్రేక్షకుల మధ్య ఖాళీ కుర్చీలు కనబడటం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లపై అభిమానుల ఆసక్తి కూడా తగ్గుతోందని తెలుస్తోంది.

ఆదివారం నాటి మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత్ జట్టు అభిమాని ఒకరు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, ''అభిషేక్ శర్మ ఒక్కడే పాకిస్తాన్ జట్టును ఓడించాడు. పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకోగలదని నేను అనుకోను. భారత్ ఫైనల్‌లో శ్రీలంక లేదా బంగ్లాదేశ్‌తో తలపడుతుందని భావిస్తున్నాను'' అని అన్నారు.

''భారత్ టీమ్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ పోటీపడలేదు'' అని అతను వ్యాఖ్యానించారు.

అదేవిధంగా సోనీ లివ్ కార్యక్రమంలో, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ, ''మీరు (పాకిస్తాన్ టీమ్) ఇలా ఆడితే ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో పోటీపడలేరు'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)