ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్: ఆకాశ్ దీప్ తన అక్క ఆరోగ్యం గురించి ఏం చెప్పాడు?

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్, ఆకాశ్ దీప్, ఇంగ్లండ్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

"నేను ఎవరితోనూ చెప్పలేదు. మా అక్కకు క్యాన్సర్"

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్‌కు చరిత్రాత్మక విజయం అందించిన తర్వాత ఆకాశ్‌దీప్ ఈ విషయం చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఆకాశ్‌దీప్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ టెస్ట్ మ్యాచ్ భారత్ గెలవడంతో సిరీస్‌లో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి.

మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో తన లక్ష్యం ఒక్కటేనని, తన అక్క మొహంలో చిరునవ్వు తీసుకురావాలని భావించానని ఆకాశ్‌ చెప్పాడు.

మ్యాచ్ తర్వాత కామెంటేటర్‌ ఛతేశ్వర్ పుజారాతో మాట్లాడాడు ఆకాశ్.

"నీ దగ్గర బంతి ఉంది. చేతిలో స్టంప్స్ ఉన్నాయి. ఆరు వికెట్లు తీశావు. మీ ఇంట్లో వాళ్లందరూ ఆనందంగా ఉన్నారా?" అని ఛతేశ్వర్ పుజారా అడిగారు.

ఈ ప్రశ్నకు స్పందించిన ఆకాశ్‌ "నేనింత వరకు ఎవరికీ చెప్పని విషయం ఏంటంటే నా అక్క రెండు నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది" అని ఆకాశ్ దీప్ చెప్పాడు.

"ఆమె మానసిక పరిస్థితినిబట్టి చూస్తే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆనందం ఆమెకు చాలా పెద్ద విషయం" అని ఆకాశ్‌దీప్ అన్నాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మ్యాచ్‌కు ముందు తన మనసులో ఏముందో ఆకాశ్ దీప్ చెప్పాడు.

"నేను ఈ మ్యాచ్‌ను ఆమెకు అంకితం చేసి ఆడాను. ఆమె మొహంలో చిరునవ్వు తీసుకురావాలి" అని అన్నాడు.

"నా ఈ ప్రదర్శన నీకోసమే అక్కా. నేను బంతి పట్టుకున్న ప్రతీసారి నా కళ్ల ముందు నీ మొహమే కదలాడేది. నీ మొహంలో ఆనందం చూడాలని అనుకున్నాను. మేమంతా నీకోసం ఉన్నాం" అని అన్నాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్, ఆకాశ్ దీప్, ఇంగ్లండ్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

తొలి టెస్ట్‌లో ఆడేందుకు అవకాశం రాలేదు

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకాశ్ దీప్‌కు ఆడేందుకు అవకాశం రాలేదు.

జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆడేందుకు అవకాశం దక్కింది.

తనను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని నిరూపించడంతో పాటు రెండు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు.

ఇంగ్లండ్ గడ్డ మీద జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో187 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకోవడం ద్వారా భారతీయ బౌలర్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను నమోదు చేశాడు.

తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాడు.

"భారత్‌లో ఇలాంటి వికెట్లపై మేము చాలా మ్యాచ్‌లు ఆడాం. వికెట్‌తో ఏం జరుగుతుందనే దాని గురించి నేను పట్టించుకోలేదు. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. వేగం పెంచి సరైన ప్రాంతంలో బాల్ వేయాలని అనుకున్నాను" అని ఆకాశ్‌దీప్ చెప్పాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కీలక బ్యాటర్ జో రూట్‌ను ఆకాశ్ దీప్ అవుట్ చేశాడు. ఆకాశ్ వేసిన ఈ బాల్ గురించి చాలా చర్చ జరిగింది.

"జో రూట్‌కు మొదట బాల్స్ నేరుగా వేశాను. అయితే అతన్ని అవుట్ చేసిన బంతిని బౌలింగ్ ఎండ్‌లో ఉన్న క్రీజు చివరి నుంచి, అంటే ఒక మూలగా సంధించాను. ఆ బంతి విషయంలో నేను అనుకున్నదే జరిగింది" అని ఆకాశ్ చెప్పాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్, ఆకాశ్ దీప్, ఇంగ్లండ్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

లార్డ్స్ టెస్ట్ గురించి..

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను రెండు ఇన్నింగ్స్‌లోనూ ఆకాశ్‌ దీప్ అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు.

‘‘హ్యారీ బ్రూక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్‌ను కవర్ చేస్తూ బాగా డిఫెన్సివ్‌గా ఆడాడు. ఆయనకు ఎలా బాల్ వేయాలో తెలియక రెండు మూడు ఓవర్లు అయోమయానికి గురయ్యా. అయితే గుడ్ లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయాలనే నా లక్ష్యానికి అనుగుణంగానే బౌలింగ్ చేశాను" అని ఆకాశ్ వివరించాడు.

ఎడ్జ్‌బాస్టన్ విజయంతో భారత జట్టు సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తుందని, ఈ విజయం అందుకు స్ఫూర్తి అందించిందని ఆకాశ్ దీప్ భావిస్తున్నాడు.

ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ జులై 10 నుంచి లార్డ్స్‌లో జరగనుంది.

లార్డ్స్‌లో ఆడేందుకు తనకు అవకాశం లభిస్తే, ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడినట్లే ఆడతానని ఆకాశ్ దీప్ చెప్పాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్, ఆకాశ్ దీప్, ఇంగ్లండ్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ దీప్ గతేడాది టెస్టుల్లో అడుగు పెట్టాడు.

బిహార్ కుర్రాడు

ఆకాశ్ దీప్ 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగు పెట్టాడు.

బిహార్ రాజధాని పట్నా నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోహ్తాస్ జిల్లాలోని బడ్డి అతని స్వగ్రామం.

రంజీ ట్రోఫీలో అతను బిహార్‌కు బదులు పశ్చిమ బెంగాల్ తరపున ఆడాడు.

2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు.

ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించిన తర్వాత ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అతన్ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆకాశ్‌దీప్ ఇప్పటి వరకు భారత్ తరపున 8 టెస్ట్‌మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీశాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)