‘‘నానమ్మ చెప్పిన కథల స్ఫూర్తితో ‘మైరావణ’ నవల రాస్తే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది’’

మై రావణ నవల

ఫొటో సోర్స్, Prasad suri

ఫొటో క్యాప్షన్, ప్రసాద్ సూరి 25ఏళ్లకే తను రాసిన మైరావణ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"మైరావణ కథ కాదు, కదలిక" అన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత ప్రసాద్ సూరి.

'మైరావణ' అనే నవలకు ప్రసాద్ సూరికి 2025 ఏడాదిగానూ ఈ అవార్డు దక్కింది.

"సముద్రపు గాలితో చుట్టేసింది నా జీవితం. చదువుపై ఆశ, పుస్తకాల కోసం దాచుకున్న డబ్బులు, చేపల కోసం సముద్రంపై ప్రయాణం" అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు సూరి.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ ఆర్కియాలజీలో పీజీ చదువుతున్నారు.

"నా ఉహలే నా బలం. వాటిని ఎవరు ఆపలేకపోయారు. అవే ఇప్పుడు నా కథలయ్యాయి" అన్నారు.

మత్స్యకార వర్గం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న ప్రసాద్ సూరి మూడు నవలలు రాశారు. అందులో రెండోది మైరావణ.

ప్రసాద్ సూరి అనేది కలం పేరు. అసలు పేరు...సూరాడ ప్రసాద్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మైరావణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, ప్రసాద్ సూరి, మత్స్యకారుల జీవితాలు

సముద్రమే మా జీవితం

"ప్రసుత్తం నేను చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను, కానీ నా జీవితం అంతా సముద్రం చుట్టూనే ఉంటుంది" అని ప్రసాద్ సూరి చెప్పారు.

సూరాడ ప్రసాద్ పుట్టింది ఉమ్మడి విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండలంలోని మత్స్యకార గ్రామమైన వాడనర్సాపురంలో.

సూరి తల్లిదండ్రులు సూరాడ చంద్రరావు, నూకరత్నం.

చేపల వేటతో జీవనం సాగించే వీరు అక్కడ నుంచి పల్నాడు జిల్లా మాచర్లకు వలస వెళ్లిపోయారు.

ఉమ్మడి విశాఖలో ఇంటర్ వరకు చదువుకున్న ప్రసాద్, ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చదివేందుకు హైదరాబాద్ వెళ్లారు.

ప్రస్తుతం ఎంఏ ఆర్కియాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

ఇంటర్మీడియట్ చదువుకునే వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తనకు మత్స్యకారుల జీవితం, వారు ఎదుర్కొనే వివక్ష, ఆర్థిక అసమానతలు వంటి విషయాలపై అవగాహన ఏర్పడిందని ప్రసాద్ బీబీసీతో అన్నారు.

మైరావణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, ప్రసాద్ సూరి, మత్స్యకారుల జీవితాలు
ఫొటో క్యాప్షన్, మైరావణ నవలలో వాడబలిజల జీవన స్థితిగతులు, వాళ్లు ఎదుర్కొన్న వివక్ష గురించి రాశారు.

చిన్నప్పుడు విన్న కథలతో వందేళ్ల అధ్యయనం

ప్రసాద్ సూరి చిన్నతనంలో రాంబిల్లిలోని నాన్నమ్మ వద్ద ఉండేవాడు.

పడుకునే ముందు నానమ్మ చెప్పే కథలు వినడం అలవాటు.

ప్రసాద్ సూరి మత్స్యకారుల్లోని వాడబలిజ సామాజిక వర్గానికి చెందినవారు.

వాడబలిజలకు సంబంధించిన కథలే ఆమె కూడా చెప్పేవారు.

అంటే వాడబలిజిల కులవృత్తైన ఓడలను తయారు చేయడం, ఓడలపై వ్యాపారం, ఆ తర్వాత చేపల వేట వృతిలోకి మారడం వంటి ఆమె చెప్పిన విషయాలను ప్రసాద్ సూరి బాగా ఆకళింపు చేసుకున్నారు.

ఆమె చెప్పిన విషయాల ఆధారంగానే ఆ తర్వాత వాడబలిజల వందేళ్ల చరిత్రను అధ్యయనం చేశారు.

"మైరావణ నవలలో కూడా వాడబలిజల జీవన స్థితిగతులు, కాలక్రమంలో వారి వృత్తిలో వచ్చిన మార్పులు, కన్నీళ్లు, రాజకీయాలు వంటి అంశాలనే నేను రచించాను." అని ప్రసాద్ సూరి చెప్పారు.

"వాడబలిజలకు ప్రత్యేకమైన చరిత్ర, పురాణం ఉన్నాయి. దాన్ని తెలియజెప్పేలా జానపద శైలిలో 'మైరావణ' రాయాలని నిర్ణయించుకున్నా. రాంబిల్లి మత్స్యకార పల్లె ప్రాంతంలోని ఓ కుర్రాడి మానసిక ఘర్షణని నవలలో చూపించా. జీవనోపాధికి ఉన్న ఊరిని వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లి చెల్లాచెదురైన మా మత్స్యకారుల వెతల్ని కూడా చూపించే ప్రయత్నం చేశాను. మా మహిళలపై చూపే వివక్షని ఎలుగెత్తాను. మూడేళ్లు అధ్యయనం చేసి ఈ నవలను ఒక వందేళ్ల చరిత్రలా రాశాను." అని చెప్పారు.

మైరావణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, ప్రసాద్ సూరి, మత్స్యకారుల జీవితాలు

ఫొటో సోర్స్, Prasad suri

ఫొటో క్యాప్షన్, చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం తనకు ఇష్టమని ప్రసాద్ చెప్పారు.

మత్స్యకారులకు గుర్తింపు ఇది

"మా తల్లిదండ్రులు, తాతముత్తాతలకు చదువు లేకపోయినా నాకు ఎందుకో చిన్నతనం నుంచి చదువంటే ఆసక్తి. నా ఆలోచనల్ని బొమ్మల రూపంలో గీయడమంటే ఇష్టం కూడా. ఎదుగుతున్న కొద్ది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోని ప్రముఖ రచనల్ని, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులున్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పుస్తకాలు కొనేవాడిని. పుస్తకాలు చదవడంతో పాటు చిన్న చిన్న కథలు రాసేవాడిని" అని ప్రసాద్ చెప్పారు.

తొలిసారిగా 19వ ఏటనే 'మై నేమ్ ఈజ్ చిరంజీవి' అనే నవల రాశారు.

"నేను ఎవరు?", "నా ఉనికి ఏమిటి?", "నన్ను సమాజం ఎలా చూస్తోంది?" అనే ప్రశ్నలకి నేను సమాధానం వెదుక్కుంటూ చేసిన ప్రయాణమే ఈ నవల. తొలి నవల బాగా రాశానని పేరు రావడంతో....రెండో నవల 'మైరావణ' మొదలైంది. ఈ రెండో నవలతోనే సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని ప్రసాద్ సూరి చెప్పారు. మూడో నవల పేరు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇది ఒక యువకుడి ప్రేమ, వ్యక్తిత్వం, విలువలు మధ్య జరిగే అంతర్గత పోరాటంపై రాశాను" అని తన తొలి నవల అనుభవం గురించి ఆయన వివరించారు.

"మూడో నవల రాస్తూ, రెండో నవల ఎన్ని కాపీలు అమ్ముడైయ్యింది, బాగా జనాల్లోకి వెళ్లిందా లేదా అనేది కూడా మర్చిపోయాను. నా శ్రేయాభిలాషి ఒకరు ఈ అవార్డుకు మైరావణను పంపించారు. దానికే అవార్డు వచ్చింది. ఇది మత్స్యకారులందరికి గుర్తింపే" అని ప్రసాద్ సూరి అన్నారు.

మైరావణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, ప్రసాద్ సూరి, మత్స్యకారుల జీవితాలు

ఫొటో సోర్స్, Prasad suri

ఫొటో క్యాప్షన్, మైరావణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మత్స్యకారులకు దక్కిన గుర్తింపుగా భావిస్తానని ప్రసాద్ సూరి చెప్పారు.

'కళ్లతో చూసినది రాసినందుకే ఈ అవార్డు'

ఈ యువ పురస్కారం 35 ఏళ్ల లోపు సాహితీవేత్తలకు ఇస్తారు. ప్రసాద్ సూరి వయసు ప్రస్తుతం 25.

"బెస్తలు, జాలర్లు, పల్లెకార్లు మత్స్యకారులు, గంగపుత్రులు, అగ్నికుల క్షత్రియులు, ఇలా పేరు ఏదైనా మా మత్స్యకారుల జీవితాలన్నీ ఒకలాగే ఉంటాయి" అని ప్రసాద్ సూరి అన్నారు.

"మత్స్యకార గ్రామాల్లో, కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులుంటాయో నేను బాల్యం నుంచి చూస్తూనే ఉన్నాను. మా కష్టాలు, చేపల వృత్తితో మేం పడే బాధలు కళ్లారా చూశాను. అనుభవించాను. వాటిలో చాలా వరకు మైరావణ నవలలో ప్రతిబింబించేలా రాశాను. నాకు మైరావణ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తెచ్చిపెడుతుందని ఊహించలేదు." అని ప్రసాద్ సూరి చెప్పారు.

అయితే... నేను ముందు నా కెరియర్ పై ఫోకస్ పెడతాను. వీలున్నప్పుడల్లా రచనలు చేస్తాను. నా జీవితంలో కనీసం 10 పుస్తకాలైనా రాయాలనేనది నా ఆలోచన అని ప్రసాద్ సూరి చెప్పారు.

మైరావణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, ప్రసాద్ సూరి, మత్స్యకారుల జీవితాలు

ఫొటో సోర్స్, Prasad suri

ఫొటో క్యాప్షన్, ప్రసాద్ సూరి తొలి నవల

‘జానపదం ద్వారా చెప్పాలనుకున్నాను’

తెలుగులో చాలా మంది రచయితలు, కథకులు వారు చెప్పాలని అనుకునే అంశాలను వాళ్ల గుంపులు, సముహాలు, వర్గాల చరిత్రలను కథలు, కవితలు, నవలల రూపంలో సమాజానికి పరిచయం చేస్తారు. నేను కూడా మా వాడబలిజిల సమాజపు చరిత్రని సాహిత్యపరంగా చెప్పాలని అనుకున్నాను.

"మా మత్స్యకార జనుల జాతి వెతలే నేను రాసిన 'మైరావణ' నవల. మూడేళ్ల క్రితం వచ్చింది 'మైరావణ' నవల. ఈ నవల విడుదలకి, అవార్డు రావడానికి మధ్య నేను మరో నవల కూడా రాశాను. ఈ అవార్డు వల్ల మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన ప్రచారం జరిగితే చాలు." అని ప్రసాద్ సూరి అన్నారు.

నా నవలల ద్వారా మా మత్స్యకారుల జీవితాన్ని చూపించాలనుకున్నాను. రాయబోయే నవలల్లో కూడా మత్స్యకారుల జీవితాలనే ప్రతిబింబించాలని అనుకుంటున్నాను.

మైరావణ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, ప్రసాద్ సూరి, మత్స్యకారుల జీవితాలు

ఫొటో సోర్స్, Mohammed Rafee/ facebook

ఫొటో క్యాప్షన్, ప్రసాద్ సూరి రానున్న రోజుల్లో చారిత్రక అంశాలపై పుస్తకాలు రాయాలనుకుంటున్నారు.

‘రాయడం నా ఆసక్తుల్లో ఒకటి’

ఇంకా తన జీవితం గురించి చిన్ననాటి ఆసక్తుల గురించి ఆయన అనేక విషయాలు బీబీసీతో పంచుకున్నారు.

స్కూల్ కి వెళ్లేటప్పుడు చిరుతిళ్లు కొనుక్కునేందుకు అమ్మానాన్న ఇచ్చిన డబ్బులు దాచుకుని...వాటితో నాకు ఇష్టమైన పుస్తకాలను మనియార్డర్ చేసి మరీ తెప్పించుకునేవాడిని.

మనియార్డరు చేసింది మొదలు...ఆ పుస్తకం ఇంటికి వచ్చే వరకు దాని కోసం కోసం ఎదురుచూడటం, పోస్ట్ మ్యాన్ సైకిల్ శబ్ధం వచ్చిన ప్రతిసారీ ఆశగా చూడటం...ఇలాంటివి భలే బాగుండేవి.

డిగ్రీ చదువు కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆంగ్ల సాహిత్యం పరిచయమైంది.

అప్పుడే అనిపించింది నేను పుట్టిన, పెరిగిన మత్స్యకార గ్రామాల్లోనే కథలున్నాయి కదా...వాటినే ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయకూడదనిపించింది.

"సముద్రపు ఒడ్డున నేను పెరిగిన గ్రామీణ వాతావరణం, అక్కడి ఊర్లు, నేను చూసిన మనుషులపైనే చాలా కథలు రాయాలని ఉంది. సాహిత్యం, చిత్రలేఖనం, చరిత్ర, సినిమాలంటే నాకు చాలా ఆసక్తి. రానున్న రోజుల్లో చారిత్రక నవలలు రాయాలనుకుంటున్నాను"

"ప్రస్తుతం 'మైరావణ' కి సమాంతరంగా నడిచే కథలా 'శివమ్' అనే నవల రాయడానికి పరిశోధన చేస్తున్నాను. అలాగే 'మైరావణ'ని ఇంగ్లీష్ లో తేవాలని ఉంది. విజయనగర సామ్రాజ్య నేపథ్యంలో పెద్ద నవల రాయాలని ఉంది. అయితే నాకు రాయడం మాత్రమే పని కాదు, నాకున్న అనేక ఆసక్తుల్లో ఇది కూడా ఒకటి." అని ప్రసాద్ సూరి చెప్పుకొచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)