శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో తల్లిదండ్రులతో కలిసి లొంగిపోయిన 29 మంది పిల్లలను చంపేసి, పూడ్చిపెట్టారా?

- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
ఒక సామూహిక సమాధిలో లభ్యమైన పిల్లల ఎముకలు, ఆటబొమ్మలు, స్కూల్ బ్యాగులపై 'ద అసోసియేషన్ ఆఫ్ డిజెపియర్డ్ పర్సన్స్ ఫ్రమ్ ద నార్త్ అండ్ ఈస్ట్' అనుమానాలు వ్యక్తం చేసింది.
శ్రీలంకలోని జాఫ్నాలో ఈ సామూహిక సమాధిని గుర్తించారు.
ఈ సమాధిలోని మానవ అవశేషాలు యుద్ధం చివరి దశలో ఆర్మీకి లొంగిపోయిన 29 మంది పిల్లలవా? అనే కోణంలో ఈ సంఘం అనుమానాలు వ్యక్తం చేసింది.
శ్రీలంక మిలటరీ ఈ అనుమానాలను తోసిపుచ్చింది.

పిల్లల అస్థిపంజరాలు
జాఫ్నాలోని చెమ్మని-సీథూపతి స్మశానంలో ఇప్పటివరకు 40 అస్థిపంజరాలు గుర్తించారు. వీటిలో 34 బయటకు తీశారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు, బయటకు తీసిన ఈ అస్థిపంజరాలను ఒక ఫోరెన్సిక్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో జాఫ్నా యూనివర్సిటీలో ఉంచారని న్యాయవాది ఎస్. నిరంజన్ చెప్పారు.
సామూహిక సమాధుల తవ్వకాలను బాధితుల తరఫున నిరంజన్ పర్యవేక్షిస్తున్నారు.
సామూహిక సమాధుల తవ్వకాల్లో లభించిన ఆధారాలను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచినట్లు ఆయన తెలిపారు.

లొంగిపోయిన ఆ 29 మంది పిల్లల్ని చంపేశారా?
సీథూపతి సామూహిక సమాధి నుంచి పిల్లల అస్థిపంజరాల వెలికితీత కొనసాగుతోంది.
యుద్ధం చివరి దశలో తమ తల్లిదండ్రులతో కలిసి లొంగిపోయిన 29 మంది పిల్లలు కనిపించకుండా పోయారని నార్త్ అండ్ ఈస్ట్ డిజెపియర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లీలాదేవి ఆనంద నటరాజ చెప్పారు.
కనిపించకుండా పోయిన పిల్లల పేర్లు, వివరాలతో ఒక జాబితాను లీలాదేవి తయారు చేశారు.
వీరంతా ఏమయ్యారో, వీరికి ఏం జరిగిందో నేటికీ తెలియదని ఆమె చెప్పారు.
మరోవైపు, సీథూపతి సామూహిక సమాధి నుంచి పిల్లల అస్థిపంజరాలు లభ్యం అవుతున్నాయి.
వీటితో పాటే పిల్లలు వాడిన స్కూల్ బ్యాగులు, బొమ్మలు, బూట్లు, దుస్తులు వంటి ఆధారాలు కూడా దొరికాయి.
కనిపించకుండా పోయిన పిల్లలను హత్య చేసి, పూడ్చి పెట్టి ఉంటారని 'ది మిస్సింగ్ పర్సన్స్ అసోసియేషన్' అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఇవన్నీ నిరాధార ఆరోపణలని, సైన్యం పూర్తిగా ఖండిస్తోందని బీబీసీతో శ్రీలంక మిలటరీ మీడియా అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ వరుణ గమేజి అన్నారు.
తల్లిదండ్రులతో కలిసి లొంగిపోయిన 29 మంది పిల్లలను అదృశ్యం చేశారనే ఆరోపణల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈ సమాధానం చెప్పారు.

అంత్యక్రియలు చేస్తారా?
డీఎన్‌ఏ పరీక్షల గురించి అడిగిప్పుడు బ్రిగేడియర్ వరుణ గమేజి ఇలా అన్నారు.
''వాటికి డీఎన్‌ఏ పరీక్షలు చేయడం, భద్రపరచడం వంటి చర్యలు తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. తల్లిదండ్రులతో కలిసి లొంగిపోయిన ఆ 29 మంది పిల్లలు ఒకవేళ ఇప్పుడు ఎక్కడో ఒకచోట జీవించి ఉంటే, వారిని గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు అవసరం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సమాధిలో లభ్యమైన ఈ అస్థిపంజరాలకు డీఎన్‌ఏ పరీక్షలు, అంత్యక్రియలు నిర్వహించాల్సి అవసరం లేదు'' అని ఆయన వివరించారు.
అసలు ఈ అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లకు ఏం శిక్ష పడింది? వంటి ప్రశ్నలు అందరిలో ఆసక్తి కలిగిస్తున్నాయి.
''ఇలా చేసిన వారికి శిక్ష పడాలి. మళ్లీ ఇలాంటివి జరుగకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. నేరం చేసిన వారిని శిక్షించాలి'' అని లీలాదేవి ఆనంద నటరాజ అన్నారు.

ఫొటో సోర్స్, SRI LANKA ARMY
సీథూపతి స్మశానం వద్ద భద్రత
సీథూపతి సామూహిక సమాధి తవ్వకం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. గత 40 ఏళ్లలో శ్రీలంకలో గుర్తించిన 20కి పైగా సామూహిక సమాధుల్లో ఇదొకటి.
అక్కడ పోలీసు భద్రతను పటిష్టం చేయడంతో పాటు సెక్యురిటీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
జాఫ్నా పోలీసుల రక్షణ మధ్య ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. అనుమతి ఉన్నవారు మినహా మిగతా ఎవరూ ఈ ప్రాంతంలో ప్రవేశించవద్దని జాఫ్నా కోర్టు నిషేధం విధించింది. దీన్ని 'క్రైమ్ జోన్'గా ప్రకటించారు.
నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జర్నలిస్టులకు అక్కడికి వెళ్లడానికి అనుమతి ఉంది. ఏ-9 రోడ్‌లోని సీథూపతి సామూహిక సమాధి ప్రాంతం ఎదుట వాహనాలను పార్క్ చేయడాన్ని కూడా పోలీసులు నిషేధించారు.
రాత్రిపూట కూడా తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
బాధితుల తరఫున లాయర్లు, ఈ ప్రాంతంలో తవ్వకాలను అన్ని వేళలా పర్యవేక్షిస్తున్నారు.
జాఫ్నాలోని వివాదాస్పద చెమ్మని స్మశానానికి సమీపంలోనే సీథూపతి సామూహిక సమాధిని గుర్తించి, తవ్వకాలు జరుపుతున్నారు.
శ్రీలంకలో 1990 అంతర్యుద్ధం సమయంలో అదృశ్యమైనవారిని సైన్యం చంపేసి, చెమ్మని ప్రాంతంలో పూడ్చిపెట్టిందని ఒక మాజీ సైనికుడు చేసిన ఆరోపణలతో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు.
అప్పుడు, ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో చాలా అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఒక దశలో ఈ ఆపరేషన్‌ను నిలిపేశారు.
ఇప్పుడు దీనికి సమీపంలోని సీథూపతి హిందూ స్మశానంలో సామూహిక సమాధిని గుర్తించి తవ్వకాలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో చెమ్మని ప్రాంతంలోని సామూహిక సమాధిలో కూడా మళ్లీ తవ్వకాలు జరుపుతారా అని లాయర్ నిరంజన్‌ను బీబీసీ ప్రశ్నించింది.
ఇప్పటివరకు తమకు అలాంటి ఉద్దేశం లేదని ఆయన సమాధానం చెప్పారు.
సీథూపతిలో తవ్వకం పనులు పూర్తయిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తామని, చెమ్మని స్మశానంలో తవ్వకాలు జరపాలని ఇంకా ఎవరూ తమను కోరలేదని ఆయన తెలిపారు.
చెమ్మని-సీథూపతి సామూహిక సమాధుల సమస్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని ఇటీవలే మీడియాకు శ్రీలంక మంత్రి నలింద జయతిస్సా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














