ఉత్కంఠభరితంగా సాగిన ఓవల్ టెస్టులో భారత్ విజయం, విజృంభించిన సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఫొటో సోర్స్, Getty Images
ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 367 పరుగులకు ఆలౌటైంది.

ఫొటో సోర్స్, Getty Images
హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో పోరాడినా భారత బౌలర్లు విజృంభించడంతో గిల్ సేనకు విజయం వరించింది. ఈ టెస్టులో 9 వికెట్లు తీసిన మొహమ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
చివరి టెస్టులో భారత్ విజయం సాధించడంతో అండర్సన్-తెందూల్కర్ సిరీస్ 2- 2తో డ్రాగా ముగిసింది.

ఫొటో సోర్స్, Getty Images
చివరి రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా, భారత విజయానికి నాలుగు వికెట్లు అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, భారత బౌలర్లు 28 పరుగులే ఇచ్చి చివరి నాలుగు వికెట్లు తీశారు. గాయపడిన క్రిస్ వోక్స్ చివర్లో చేతికి కట్టు కట్టుకొని వచ్చి మరీ బ్యాటింగ్‌కు దిగాడు.
భారత బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ చేసిన 57 పరుగులే ఆ ఇన్నింగ్స్‌లో అత్యధికం.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 396 పరుగులు సాధించి, ఇంగ్లండ్‌కు 374 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
సిరాజ్ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. చివరి టెస్టు విజయంతో భారత్ సిరీస్‌ను 2- 2తో డ్రా చేసుకుంది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్ స్పెల్ మ్యాచ్‌ను మార్చేసింది. ఏడు వికెట్లు చేతిలో ఉండి, విజయానికి 60, 70 పరుగులే అవసరమైన సందర్భంలో ఇలాంటివి చాలా తక్కువ జరుగుతాయి. మేం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది, మావైపు కొంత అదృష్టం కూడా ఉంది'' అని అన్నాడు.
క్రిస్ వోక్స్ గురించి గిల్ మాట్లాడుతూ "అతను ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయడానికి అలా వస్తాడని ఊహించలేదు. అతనికి నిజంగా ప్రశంసలు" అని అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "ఈ సిరీస్ అద్భుతంగా సాగింది, ఐదు మ్యాచ్‌లు ఐదు రోజుల వరకు జరిగాయి. రెండు జట్లు చాలా శ్రమించాయి. నిబద్ధత చూపించాయి. మేం సిరీస్ గెలవలేకపోవడం నిరాశపరిచింది కానీ, టెస్ట్ క్రికెట్‌ను ఇష్టపడే వ్యక్తిగా, ఈ ఫార్మాట్ ఇప్పటికీ చాలా ప్రత్యేకమనే దానికి ఈ సిరీస్ గొప్ప ఉదాహరణ. టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని భావించే వారికి అది నిజం కాదని ఈ సిరీస్ నిరూపించింది'' అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














