పాలస్తీనా రాజ్యం: యూరోపియన్ దేశాలు గుర్తించినా, అమెరికా మద్దతు లేకుండా సాధ్యమేనా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, టామ్ బాట్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించడం వందేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలో ఒక చారిత్రాత్మక అడుగు.
ఇది కూడా దౌత్యపరమైన(డిప్లొమాటిక్) జూదం కూడా. ఎందుకంటే, ప్రధాన యూరోపియన్ శక్తులు ఈ ఘర్షణ అతి తీవ్రమైన స్థాయికి చేరిందని, అందువల్ల ఇంతకుముందు తాము తీసుకోని నిర్ణయం.. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయి.
గాజాలో సంక్షోభం నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇజ్రాయెల్, హమాస్ రెండింటినీ విమర్శిస్తూ "శక్తి కంటే హక్కు గెలవాలి" అని అన్నారు.
సౌదీ అరేబియా మద్దతుతో యూకేతో కలిసి నడుస్తూ, మేక్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం.. 'టూ స్టేట్ సొల్యూషన్' ఆలోచనను సజీవంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల న్యాయమైన, ఉమ్మడి భవిష్యత్తుకు ఈ దీర్ఘకాల అంతర్జాతీయ శాంతి సూత్రమే ఏకైక మార్గమని వారు విశ్వసిస్తున్నారు.
దీనికి ప్రత్యామ్నాయంగా చెబుతున్న 'వన్ స్టేట్' సొల్యూషన్ అంటే.. ఇజ్రాయెల్ ఆధిపత్యం, పాలస్తీనియన్ల అణచివేత అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అభిప్రాయపడ్డారు.
పాలస్తీనియన్లు అందరినీ శిక్షించడం, వారిని ఆకలితో అలమటించేలా చేయడం లేదా జాతి హననానికి పాల్పడడం, ఏదీ సమర్థనీయం కాదని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది?
పాలస్తీనా గుర్తింపు ప్రణాళికపై ఇజ్రాయెల్ కోపంగా ఉంది, ప్రతిస్పందిస్తామని బెదిరిస్తోంది.
ఐక్యరాజ్యసమితి సమావేశం, యూకే, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాలస్తీనాను గుర్తించడం.. 2023 అక్టోబర్ 7 ఘటనకు హమాస్‌కు రివార్డ్ ఇస్తున్నట్లుగా ఉందని ఇజ్రాయెల్ అంటోంది.
వెస్ట్ బ్యాంకులోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకొని, గట్టిగా బదులివ్వాలని కొంతమంది ఇజ్రాయెల్ మంత్రులు అనుకుంటున్నారు. తద్వారా అక్కడ పాలస్తీనా రాజ్యం అసాధ్యం అవుతుందని వారు భావిస్తున్నారు.
పాలస్తీనియన్లను బహిష్కరించి, వారి స్థానంలో యూదు స్థావరాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫార్ రైట్ గ్రూపులతో సహా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం 'టూ స్టేట్ సొల్యూషన్'కు ముగింపు పలకాలనుకుంటోంది.
ఇక డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోంది, యూరోపియన్ చర్యను వ్యతిరేకిస్తోంది. న్యూయార్క్‌లో జరిగే సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కాకుండా పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను శిక్షిస్తున్నట్లుగా వ్యవహరించింది. దీంతో, ఆయన వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.
మిడిల్ ఈస్ట్ వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే విషయంలో వాషింగ్టన్, దాని యూరోపియన్ మిత్రదేశాల మధ్య చీలిక ఏర్పడినట్లుగా ఈ పాలస్తీనా సమావేశం, అమెరికా ప్రతిచర్య ప్రతిబింబిస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి కారణంగా తమకు వేరే మార్గం లేదని యూరోపియన్లు భావిస్తున్నారు.
మరోవైపు, గాజా నగరంలోకి ఇజ్రాయెల్ మూడో సైనిక విభాగాన్ని పంపుతోంది. ప్రతిరోజూ డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు హతమవుతున్నారు. హమాస్ వద్ద ఇప్పటికీ దాదాపు 50 మంది బందీలున్నారు, వారిలో కొందరు చనిపోయారు. వెస్ట్ బ్యాంక్‌లో హింసతో పాటు, ఇజ్రాయెల్ స్థావరాలు పెరుగుతున్నాయి.
అయితే, ఇజ్రాయెల్ మరింత సైనిక ఒత్తిడితో హమాస్ లొంగిపోతుందనడానికి సంకేతాలు చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్‌పై ఒత్తిడి?
దౌత్యం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని చూపించే ప్రయత్నమే మేక్రాన్ వ్యూహం. మొదటి లక్ష్యం గాజాలో యుద్ధాన్ని ముగించడం, రెండవది దీర్ఘకాలిక పరిష్కారంగా రెండు రాజ్యాలు ఇజ్రాయెల్, పాలస్తీనా.
ఇజ్రాయెల్ విధానం విఫలమైందని, దీనివల్ల చాలామంది పౌరులు బాధలు పడుతున్నారని, బందీలు ప్రమాదంలో పడ్డారని యూరోపియన్ దేశాలు వాదిస్తున్నాయి.
తాజా ఐక్యరాజ్యసమితి సమావేశానికి సౌదీ అరేబియా నాయకత్వం వహించగా, అరబ్ లీగ్ మద్దతు ఇచ్చింది.
దౌత్యం హమాస్‌పై ప్రభావం చూపుతుందని ఫ్రాన్స్ వాదిస్తోంది. ఎందుకంటే, సమావేశంలో కీలక అరబ్ దేశాలు ఇప్పుడు ఆ గ్రూపును నిరాయుధీకరణ చేయాలని, దాని ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించాలని పిలుపునిచ్చాయి. అంతేకాదు, భవిష్యత్తులో పాలస్తీనీయుల నాయకత్వంలో హమాస్‌కు ఎలాంటి పాత్ర ఉండకూడదని కూడా స్పష్టం చేశాయి.
ఈ విధానం ఇజ్రాయెల్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుందని, సౌదీ అరేబియాతో సంబంధాలను సాధారణీకరించడానికి తలుపులు తెరిచి ఉంచుతుందని (నెతన్యాహు, ట్రంప్ చాలాకాలంగా కోరుకుంటున్నది) మేక్రాన్ విశ్వసిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
మేక్రాన్ నాయకత్వం?
అయితే, అమెరికా అభీష్టానికి విరుద్ధంగా పాలస్తీనాను గుర్తించే యూరోపియన్ దేశాల నిర్ణయం దౌత్యపరమైన (డిప్లొమాటిక్) జూదం వంటిది.
మేక్రాన్ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడం చూస్తుంటే, గాజా 'పీడకల'ను దూరం చేయడానికి, ఇజ్రాయెల్ పాలస్తీనియన్లకు ఉమ్మడి భవిష్యత్తును కనుగొనేందుకు ఆయన ప్రపంచ నాయకత్వ పాత్రను పోషించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
కానీ, శక్తిమంతుల పరంగా పరిశీలిస్తే, మేక్రాన్ అంత శక్తిమంతుడేమీ కాదు.
అమెరికా నాయకత్వం లేకుండా అంత ఒత్తిడి ఉండదు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికీ యూరోపియన్ విధానాన్ని తిరస్కరిస్తోంది. ట్రంప్ విడిగా అరబ్ నాయకులను కలుస్తారు. ఇది సోమవారం జరిగిన యూరోపియన్ నేతృత్వంలోని చర్చలకు భిన్నంగా ఉండొచ్చు.
ప్రధాన దేశాల మధ్య ఈ సమన్వయ లోపం కనిపిస్తోంది. గతంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది ఖతార్. అయితే, తన గడ్డ మీద హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మళ్లీ జోక్యానికి నిరాకరిస్తోంది.
మేక్రాన్, స్టార్మర్‌లు మిడిల్ ఈస్ట్‌లో తమ దేశాల వలస చరిత్రను ప్రస్తావించారు. 1948లో బ్రిటన్ పాలస్తీనాను వదిలిపెట్టిన తర్వాత, ప్రపంచం ఇజ్రాయెల్‌ను గుర్తించిన విధానాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు, పాలస్తీనియన్ల సొంత రాజ్యం హక్కును గుర్తిస్తున్నట్లు చెప్పారు.
పాలస్తీనియన్లు ఈ గుర్తింపును స్వాగతిస్తారు. కానీ, నేడు యూరప్ ప్రభావం పరిమితమని కూడా వారికి తెలుసు. వారి నిర్ణయాలు అంత ప్రభావం చూపలేవు.
పాలస్తీనా రాజ్య స్థాపన సాధ్యం కావాలంటే, అది ప్రపంచంలో శక్తిమంతమైన అమెరికా మద్దతుతోనే సాధ్యమవుతుంది.
ఇప్పటివరకైతే, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వేరే ప్రణాళికలు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














