ఇజ్రాయెల్‌ ఒంటరి అవుతోందా? ‘పాలస్తీనా రాజ్యం’ గుర్తింపుకు పెరుగుతున్న మద్దతు ఇచ్చే సందేశం ఇదేనా?

గాజాలో యుద్ధం, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (ఫైల్)
    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజాలో యుద్ధం కొనసాగుతోంది కానీ, ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ కూడా ఒకప్పటి 'దక్షిణాఫ్రికా పరిస్థితి'లోకి తిరిగి వెళుతుందా?. (ఆ సమయంలో రాజకీయ ఒత్తిడితో పాటు ఆర్థిక, క్రీడా, సాంస్కృతిక వేదికలపై దక్షిణాఫ్రికాను బహిష్కరించడంతో దాని వర్ణ వివక్ష విధానాన్ని విరమించుకుంది).

లేదా, దౌత్యపరమైన ఒత్తిడిని తట్టుకొని, ప్రపంచంలో ఇజ్రాయెల్ స్థానానికి శాశ్వత హాని లేకుండా గాజా, వెస్ట్ బ్యాంక్‌లో నెతన్యాహు ప్రభుత్వం తన ప్రణాళికలను కొనసాగిస్తుందా?.

ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా బహిష్కరణ దిశగా నెతన్యాహు నడిపిస్తున్నారని మాజీ ప్రధానులు ఎహుద్ బరాక్, ఎహుద్ ఓల్మెర్ట్‌లు ఆరోపించారు.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌తో, నెతన్యాహు అరెస్టు భయం లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

మరోవైపు, ఐక్యరాజ్యసమితిలో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడాతో సహా అనేక దేశాలు పాలస్తీనాను ఒక రాజ్యంగా గుర్తించాలని యోచిస్తున్నట్లు తెలిపాయి.

ఇటీవల ఖతార్‌లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడితో కోపంగా ఉన్న గల్ఫ్ దేశాలు దోహాలో సమావేశమయ్యాయి. ఈ దేశాలలో కొన్నింటికి ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడా సంబంధాలను పునఃపరిశీలించే యోచనలో ఉన్నాయి.

ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ఫోటోలు గాజా నుంచి వెలువడటం, ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై దాడి చేయడానికి ఇంకా సిద్ధమవుతుండటంతో, మరిన్ని యూరోపియన్ ప్రభుత్వాలు ప్రకటనలను దాటి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాజా, ఇజ్రాయెల్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను కొనసాగిస్తోంది.

బెల్జియం ఆంక్షలు

సెప్టెంబర్ ప్రారంభంలో బెల్జియం కీలక ఆంక్షలను ప్రకటించింది. వీటిలో వెస్ట్ బ్యాంక్‌లోని అక్రమ యూదు స్థావరాల నుంచి దిగుమతులను నిలిపివేయడం, ఇజ్రాయెల్ కంపెనీలతో ఒప్పందాలను సమీక్షించడం, ఆ స్థావరాలలో నివసిస్తున్న బెల్జియన్లకు కాన్సులర్ యాక్సెస్‌ను పరిమితం చేయడం వంటివి ఉన్నాయి.

అదనంగా, ఇజ్రాయెల్ మంత్రులైన ఇటామర్ బెన్-గ్విర్, బెజాలెల్ స్మోట్రిచ్, అలాగే వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై హింసకు పాల్పడిన యూదులను 'పర్సనా నాన్ గ్రాటా(ఆహ్వానం లేని వ్యక్తులు)'గా ప్రకటించింది.

బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా కొన్ని దేశాలు ఇప్పటికే ఇలాంటి చర్యలు తీసుకున్నాయి.

మరోవైపు, వెస్ట్ బ్యాంక్‌లో స్థిరపడి, హింసాత్మకంగా ప్రవర్తించే యూదులపై బైడెన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను, డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటిరోజే ఎత్తివేశారు.

బెల్జియం ప్రకటించిన వారం తర్వాత, స్పెయిన్ కూడా చర్యలకు ఉపక్రమించింది. దాని ఆయుధ నిషేధాన్ని చట్టంగా మార్చింది. పాక్షిక దిగుమతి నిషేధాన్ని ప్రవేశపెట్టింది. గాజాలో మారణహోమం లేదా యుద్ధ నేరాలతో సంబంధం ఉన్న వారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిరోధించింది. ఇజ్రాయెల్‌కు ఆయుధాలను తీసుకెళ్లే ఓడలు లేదా విమానాలు స్పానిష్ ఓడరేవులు లేదా గగనతలాన్ని ఉపయోగించకుండా నిషేధం విధించింది.

యూదు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని స్పెయిన్ పై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఆరోపణలు చేశారు. ఆయుధ వాణిజ్య నిషేధం ఇజ్రాయెల్ కంటే స్పెయిన్‌కు ఎక్కువ హాని కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్ ఎంపీలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఎంపీలు ఇటమార్ బెన్-గ్విర్ (ఎల్) , బెజాలెల్ స్మోట్రిచ్

ఇజ్రాయెల్‌ను ఆందోళనపరిచే సంకేతాలు

ఇజ్రాయెల్‌కు మరిన్ని ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌లోని కంపెనీల నుంచి 2 ట్రిలియన్ డాలర్ల నిధుల(సావరిన్ వెల్త్ ఫండ్)ను ఉపసంహరణ మొదలుపెట్టినట్లు ఆగస్టులో నార్వే ప్రకటించింది. సెప్టెంబర్ మధ్య నాటికి, 23 కంపెనీల నుంచి ఆ నిధులను ఉపసంహరించుకుంది కూడా. మరికొన్నింటి నుంచి కూడా ఉపసంహరించుకుంటామని ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.

ఇంతలో, ఇజ్రాయెల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యూరోపియన్ యూనియన్, రైట్-వింగ్ మినిస్టర్లపై ఆంక్షలు విధించాలని, ఇజ్రాయెల్‌తో దాని ఒప్పందంలోని కొన్ని వాణిజ్య అంశాలను పాక్షికంగా నిలిపివేయాలని యోచిస్తోంది.

సెప్టెంబర్ 10న యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో గాజాలో జరిగిన సంఘటనలు "ప్రపంచ మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేశాయని" అన్నారు.

మరుసటి రోజే, 314 మంది మాజీ యూరోపియన్ దౌత్యవేత్తలు, అధికారులు వాన్ డెర్ లేయన్, ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కయా క్లాస్‌‌లకు లేఖ రాశారు. అసోసియేషన్ ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేయడంతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

1960ల నుంచి 1990లో వర్ణవివక్ష ముగిసే వరకు దక్షిణాఫ్రికాపై విధించిన ఆంక్షలలో ఒక ముఖ్యమైన ఒత్తిడి రూపం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను బహిష్కరించడం.

ఇజ్రాయెల్ విషయంలో కూడా ఇప్పుడు అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో 'యూరోవిజన్ పాటల పోటీ' అంత ముఖ్యమైనదిగా అనిపించకపోవచ్చు కానీ, ఈ పోటీతో ఇజ్రాయెల్‌కు బలమైన సంబంధం ఉంది. 1973 నుంచి ఇది నాలుగు సార్లు గెలిచింది. ఇజ్రాయెల్‌ దానిలో భాగం కావడం యూదులకు అంతర్జాతీయ ఆమోదాన్ని చూపుతుంది.

కాగా, 2026లో ఇజ్రాయెల్‌ను పాల్గొనడానికి అనుమతిస్తే తాము పోటీ నుంచి వైదొలుగుతామని ఐర్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, స్లోవేనియా సూచించాయి. దీనిపై తుది నిర్ణయం డిసెంబర్‌లో వెలువడే అవకాశం ఉంది.

పాటల పోటీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 1970ల నుంచి ఇజ్రాయెల్ యూరోవిజన్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటోంది.

హాలీవుడ్‌లో బహిష్కరణకు లేఖ

పాలస్తీనియన్లపై మారణహోమం, వర్ణవివక్షకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఫెస్టివల్స్, నిర్మాణ సంస్థలు, ప్రసారకర్తలను హాలీవుడ్‌లో బహిష్కరించాలని పిలుపునిస్తూ ఎమ్మా స్టోన్, జేవియర్ బార్డెమ్ వంటి స్టార్లతో సహా 4,000 మందికి పైగా ఒక లేఖపై సంతకం చేశారు.

అయితే, ఈ పిటిషన్‌ 'తప్పుదారి పట్టించేది'గా ఉందని ఇజ్రాయెల్ ఫిల్మ్, టీవీ నిర్మాతల అసోసియేషన్ సీఈవో ట్జ్వికా గాట్లీబ్ అన్నారు. వైవిధ్యభరితమైన కథలను ప్రోత్సహించే సృష్టికర్తలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

అంతేకాదు, క్రీడా ప్రపంచంలో కూడా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. వుల్టా డి ఎస్పానా సైక్లింగ్ రేసును నిరసనకారులు అడ్డుకున్నారు. ఇజ్రాయెల్-ప్రీమియర్ జట్టు ఉనికిని నిరసిస్తూ, శనివారం పోటీని అకస్మాత్తుగా ముగించి, పోడియం వేడుకను రద్దు చేశారు.

స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ఈ నిరసనలను "గర్వకారణం"గా అభివర్ణించారు. కానీ, ప్రభుత్వ చర్యలు అంతర్జాతీయంగా ఇబ్బంది కలిగించాయని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.

అదేవిధంగా, స్పెయిన్‌లో సొంత జెండా కింద ఆడలేరని ఇజ్రాయెల్ చెస్ ఆటగాళ్లకు చెప్పడంతో, ఏడుగురు ప్లేయర్లు పోటీ నుంచి వైదొలిగారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ 'దౌత్యపరమైన సునామీ'ని (మీడియా ఇలా పిలుస్తోంది) వ్యతిరేకిస్తోంది.

అణు బాంబులు, విమాన వాహక నౌకలు లేదా పెద్ద చమురు నిల్వలు లేని తన దేశం, గాజాలో ఇజ్రాయెల్ దాడిని ఆపలేదని స్పెయిన్ ప్రధానమంత్రి అన్నారు.

దీంతో స్పెయిన్ "జాతి నిర్మూలన బెదిరింపులకు దిగుతోంది'' అని నెతన్యాహు విమర్శించారు.

ఇజ్రాయెల్ అస్తిత్వ ముప్పు ఎదుర్కొంటున్నప్పటికీ, కొన్నిదేశాలు దానిని వ్యతిరేకించడం విచారకరమని ఇజ్రాయెల్ మంత్రి గిడియాన్ ఎక్స్ పోస్టులో తెలిపారు. బెల్జియం ఆంక్షల ప్రకటన తర్వాత ఆయన ఈ పోస్టు పెట్టారు.

సైక్లింగ్, రాజకీయాలు, రేసులు,

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సైక్లింగ్ ప్రధాన వార్షిక రేసుల్లో ఒకటైన వుల్టాకు పాలస్తీనా అనుకూల నిరసనల కారణంగా పదేపదే అంతరాయం కలిగింది.

దౌత్యంలో బలహీనతలు?

ప్రస్తుత పరిస్థితిపై విదేశాల్లో ఇజ్రాయెల్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2017 నుంచి 2021 వరకు జర్మనీలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేసిన జెరెమీ ఇస్సాఖారోఫ్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఇంత "బలహీనంగా" ఉండటం చూడలేదని అన్నారు.

చాలా చర్యలు విచారకరమని, అవన్ని ఇజ్రాయెలీలను లక్ష్యంగా చేసుకున్నట్లు అభిప్రాయపడ్డారు.

"ప్రభుత్వ విధానాలను లక్ష్యంగా చేసుకునే బదులు, ఇది చాలామంది ఇజ్రాయెలీలను దూరం చేసేలా ఉంది" అని జెరేమీ అన్నారు.

పాలస్తీనాను ఒక రాజ్యంగా గుర్తించడం వల్ల ఎదురుదెబ్బ తగలవచ్చని, ఎందుకంటే ఇది వెస్ట్ బ్యాంక్‌ను విలీనం చేయాలని పిలుపునిచ్చే స్మోట్రిచ్, బెన్-గ్విర్ లాంటి వ్యక్తులకు బలాన్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనుమానాలు ఉన్నప్పటికీ, దౌత్యపరమైన ఒంటరితనాన్ని ఇజ్రాయెల్ తిప్పికొట్టలేదనే వాదనను జెరెమీ నమ్మడం లేదు.

"మేం ఇంకా దక్షిణాఫ్రికా పరిస్థితిలో లేం. బహుశా దాని ముందురోజుల్లో ఉన్నాం" అని అన్నారు.

ఇజ్రాయెల్ ఒక నిరాడంబరమైన దేశంగా మారకుండా నిరోధించడానికి మరిన్ని మార్పులు అవసరమని మరికొందరు భావిస్తున్నారు.

"ప్రపంచంలో మేం మళ్లీ మా స్థానాన్ని పొందాలి" అని మరొక మాజీ దౌత్యవేత్త ఇలాన్ బారుచ్ అన్నారు.

ఇజ్రాయెల్ ఆక్రమణను ఇకపై సమర్థించలేనని చెప్పి 2011లో దౌత్య విధుల నుంచి తప్పుకున్నారు బరూచ్.

అప్పటి నుంచి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శకుడిగా, 'టూ స్టేట్ సొల్యూషన్'కు మద్దతుదారుగా ఉన్నారాయన. ఇజ్రాయెల్‌పై ఆంక్షలు అవసరమని బారుచ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా కూడా అలాగే దారికి వచ్చిందని అన్నారు.

యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోంది, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శిస్తున్నారు.

అమెరికా గట్టి మద్దతు

యూరప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వచ్చే బలమైన ఒత్తిడిని స్వాగతించాలని బరూచ్ అన్నారు. ఇందులో కఠినమైన వీసా నియమాలు లేదా సాంస్కృతిక బహిష్కరణలు కూడా ఉండవచ్చని, "ఆ బాధకు సిద్ధంగా ఉన్నాను" అని ఆయన అన్నారు.

కానీ, కొంతమంది నిపుణులు ఇజ్రాయెల్ పూర్తి దౌత్య పతనానికి దగ్గరగా ఉందని అనుమానిస్తున్నారు.

'స్పెయిన్ కఠినమైన చర్యలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్న దేశాలు ఇప్పటికీ చాలా తక్కువ' అని ఇజ్రాయెల్ మాజీ శాంతి సంధానకర్త డేనియల్ లెవీ అన్నారు.

జర్మనీ, ఇటలీ, హంగేరీ వంటి దేశాలు వాటిని వ్యతిరేకిస్తున్నందున, వాణిజ్య ఒప్పందంలోని కొన్నింటిని తగ్గించడం లేదా ఈయూ హారిజన్ పరిశోధన కార్యక్రమం నుంచి ఇజ్రాయెల్‌ను నిరోధించడం వంటి ఈయూ పెద్ద చర్యలు అసంభవమని ఆయన వివరించారు.

మరోవైపు, ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి బలమైన మద్దతు కొనసాగుతోంది.

"అమెరికాకు ఇజ్రాయెల్‌తో సంబంధం బలంగా ఉంటుంది" అని అధికారిక పర్యటనకు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ ఒంటరితనం ‘మార్చలేనిది’ అని లెవీ ఇప్పటికీ భావిస్తున్నారు.

"నెతన్యాహు దారి తప్పుతున్నారు" అని ఆయన అభిప్రాయపడ్డారు. "కానీ, మనం ఇంకా రోడ్డు చివరకు వెళ్లలేదు" అని అన్నారు లెవీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)