యూసుఫ్ పఠాన్ భూఆక్రమణపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, అసలు విషయమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
వడోదరలో కబ్జా చేసిన స్థలాన్ని వదిలేయాలంటూ మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను గుజరాత్ హైకోర్ట్ ఆదేశించింది.
ప్రసిద్ధ వ్యక్తులు, సెలబ్రిటీలు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు, వారికి మినహాయింపు ఇస్తే తప్పుడు సందేశం సమాజంలోకి వెళ్తుందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
యూసుఫ్ పఠాన్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింన హైకోర్టు, ఆ భూమిని ఆక్రమణ నుంచి తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది.
యూసుఫ్ పఠాన్ ఆక్రమించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను కార్పొరేషన్ ప్రారంభించిందని సెప్టెంబర్ 12న వడోదర మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు చెప్పారు.
ఆగస్ట్ 21న హైకోర్ట్ ఈ తీర్పును ఇవ్వగా, ఈ తీర్పు ఉత్తర్వును సెప్టెంబర్ 2న కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

13 ఏళ్ల నాటి కేసు
ఈ ప్లాట్‌ను తనకు కేటాయించాలని కోరుతూ 2012 మార్చిలో యూసుఫ్ పఠాన్ దరఖాస్తు చేసుకున్నారు. 978 చదరపు మీటర్ల ఈ ప్లాట్, తన బంగ్లాకు ఆనుకుని ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని తనకు కేటాయించాలని దరఖాస్తులో పేర్కొన్నారు.
వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ 2012 మార్చి 30న ఈ ప్లాట్ గురించి అధ్యయనం చేసి దీన్ని యూసుఫ్ పఠాన్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
దీని ధరను చదరపు మీటరుకు రూ. 57,270గా నిర్ణయించింది.
రెండు నెలల తర్వాత కార్పొరేషన్ జనరల్ బాడీ కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.
భూమిని వేలం లేకుండా కేటాయించాల్సి ఉన్నందున, కార్పొరేషన్ ఈ సిఫార్సును గుజరాత్ ప్రభుత్వానికి పంపింది. గుజరాత్ ప్రభుత్వం 2012 జూన్‌లోనే కార్పొరేషన్ సిఫార్సును తిరస్కరించింది.
అయినప్పటికీ యూసుఫ్ పఠాన్ ఆ భూమిని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు.
ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలని 2024 జూన్‌లో యూసుఫ్ పఠాన్‌కు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నోటీసు జారీ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఈ నోటీసును సవాలు చేస్తూ యూసుఫ్ పఠాన్, గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

యూసుఫ్ పఠాన్ పిటిషన్‌లో ఏముంది?
యూసుఫ్ పఠాన్ ఈ విషయంలో 2024 జూన్ 20న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
''ఈ కేసు 10 ఏళ్ల కంటే పాతది. నోటీస్ పంపించిన స్థలం నా ఆధీనంలోనే ఉంది. కాబట్టి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ నాకు 'ఆక్రమణ తొలగించాలి', 'ప్లాట్ ఖాళీ చేయాలి' అనే నోటీసులు ఇవ్వడానికి బదులుగా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉండాల్సింది. ఈ భూమిని కొనుగోలు చేసే అవకాశం నాకు ఇవ్వాలి'' అని తన పిటిషన్‌లో యూసుఫ్ పఠాన్ కోరారు.
ఈ భూమి, మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందినది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమ్మకుండా అడ్డుకోలేదని కూడా తన దరఖాస్తులో యూసుఫ్ పఠాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టులో ఏం జరిగింది?
సెలబ్రిటీలు అనేవారు రోల్ మోడళ్లుగా ఉంటారు కాబట్టి వారికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందని తన 28 పేజీల తీర్పులో జస్టిస్ మౌనా ఎం భట్ వ్యాఖ్యానించారు.
చట్టాన్ని ఉల్లంఘించినప్పటికీ ఇలాంటి వ్యక్తులకు మినహాయింపు ఇస్తే సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్తుందని, ప్రజలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందని అన్నారు.
పిటిషనర్ ఆక్రమించిన స్థలం ఆయన ఆధీనంలో ఉండేందుకు అనుమతించలేమని పేర్కొంటూ యూసుఫ్ పఠాన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
యూసుఫ్ పఠాన్ ఎవరు?
2007, 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు యూసుఫ్ పఠాన్. ఆయన 2024లో రాజకీయాల్లో అడుగుపెట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెహరంపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. అక్కడ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిని ఓడించారు.
గత 25 ఏళ్లలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ స్థానంలో ఓడిపోవడం ఇదే మొదటిసారి.
యూసుఫ్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా చాలా ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా శతకం సాధించిన భారత బ్యాటర్‌గా యూసుఫ్ పఠాన్‌కు పేరుంది.
2010లో రాజస్థాన్ రాయల్స్ తరపున ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













