భీమవరం: అమెరికాలో మరోసారి 'ఇండియా ష్రింప్ యాక్ట్' బిల్లు, ఆంధ్ర రొయ్యకు కొత్త కష్టం తప్పదా?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
అమెరికా సుంకాలతో భారత ఆక్వా రంగం ఇబ్బందిపడుతోంది. తాజాగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా సెనెటర్లు 'ఇండియా ష్రింప్ యాక్ట్'ను ప్రవేశపెట్టడంపై ఏపీలోని ఆక్వా రైతులు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిదారులు నిరాశ చెందుతున్నారు.
ఇండియా నుంచి దిగుమతి చేసుకునే రొయ్యలపై దశల వారీగా సుంకాలు పెంచాలంటూ గతవారం సెనెటర్లు బిల్ క్యాసిడీ, సిండీ హైడ్ స్మిత్ అమెరికన్ సెనెట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు.
'లూసియానాలోని రొయ్యలు, క్యాట్‌ఫిష్ రంగాన్ని ఇండియా నుంచి దిగుమతయ్యే రొయ్యల నుంచి కాపాడేందుకు వాటిపై అధిక సుంకాలు అవసరమని' క్యాసిడీ అభిప్రాయపడ్డారు.
2023లో సెప్టెంబర్ 28న కూడా ఆయన 'ఇండియా ష్రింప్ యాక్ట్'ను ప్రవేశపెట్టారు.
అప్పుడు ఈ బిల్లును ఫైనాన్స్ కమిటీకి రెఫర్ చేశారు. ఇప్పుడు మరోసారి బిల్లును సెనేట్ ముందుకు తీసుకొచ్చారు.


ఫొటో సోర్స్, Getty Images
అసలేమిటీ ఇండియా ష్రింప్ యాక్ట్?
భారత్ నుంచి రొయ్యల దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించాలంటూ అమెరికాలో బిల్లు ప్రవేశపెట్టడంపై ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులు, ఎగుమతిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి దారుణమైన పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని అమెరికాకి ప్రధానంగా రొయ్యలు ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్ భీమవరం ప్రాంతానికి చెందిన ఎక్స్‌పోర్టర్లు అంటున్నారు.
''అమెరికాలో అలాంటి చట్టం వస్తే భారత ఎగుమతులపై భారం పడటం ఖాయం. రొయ్యల రైతులకు, ఎగుమతిదారులకు చాలా విపత్కర పరిస్థితి. ఇక అమెరికాకి రొయ్యలు ఎగుమతి చేయలేని పరిస్థితి నెలకొంటుంది'' అని ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యదర్శి బోసు రాజు బీబీసీతో అన్నారు.
''ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు.. ఏపీలో ఆక్వా పరిస్థితి దారుణంగా ఉంది" అని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈఏఐ) ఏపీ విభాగం కార్యదర్శి, కాకినాడకు చెందిన దిలీప్ బీబీసీతో అన్నారు.
"వాస్తవానికి అక్కడి స్థానిక రొయ్యల రైతుల పరిరక్షణ కోసం సదరన్ ష్రింప్ ఎలయన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ క్రమంలోనే WTO నిబంధనల ప్రకారం.. యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నారు. అది చెల్లిస్తున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ ఈ చట్టాలు ఏమిటో అర్థం కావడం లేదు'' అని అమెరికాతో సహా విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే భీమవరం ప్రాంతానికి చెందిన జగదీష్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ తోట జగదీష్ బీబీసీతో అన్నారు.
"ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో అమెరికాకి రొయ్యలు ఎగుమతి నష్టాల దిశగా ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టి అమలు చేస్తే పుండు మీద కారం చల్లినట్టే" అని ప్రధానంగా అమెరికాతో సహా పలు విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే భీమవరానికి చెందిన ఆనంద్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జోగి వర్మ బీబీసీతో అన్నారు.

ఇప్పటికే ఉన్న సుంకాలు ఎంతంటే..
"ఈ ఏడాది జులై 27 నుంచి.. భారత్ నుంచి అమెరికాకి వెళ్లే ఎగుమతులపై 25% సుంకం, ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం ప్రతీకారం సుంకం విధిస్తూ వస్తున్నారు. దీంతో టారిఫ్ మొత్తం 50 శాతం.. దీనికి అదనంగా కౌంటర్‌వైలింగ్ డ్యూటీ 5.77శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 4.46శాతం... మొత్తంగా కలిపి మొత్తంగా 60.23శాతం సుంకం విధిస్తున్నారు" అని జగదీష్ బీబీసీకి వెల్లడించారు.
ఇప్పటికే ఇక్కడి నుంచి ఓడల్లో రెండు, మూడు నెలల కిందట బయలుదేరిన కంటైనర్లపై కూడా ఈ సుంకాల భారం పడుతోందని జగదీష్ చెప్పారు. ఇక ఇప్పుడు పెట్టిన ఇండియా ష్రింప్ యాక్ట్ నిజంగానే అమల్లోకి వస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, 2023లో కూడా లూసియానా సెనెటర్ క్యాసిడీ ఇలాంటి బిల్లు పెట్టారు. దాన్ని అప్పుడు ఫైనాన్స్ కమిటీకి రెఫర్ చేశారు. ఇప్పుడు మరోసారి బిల్లు ప్రవేశపెట్టారు.
భీమవరంలోనే రూ.2 వేల కోట్ల నిల్వలు ఉండిపోయాయి..
''ఇప్పటికే ట్రంప్ సుంకాలు అమల్లోకి రావడంతో ఎగుమతులు తగ్గి నిల్వలు పెరిగిపోయాయి. మా వద్ద భారీగా నిల్వలు ఉన్నాయి. నా అంచనా మేరకు మా ఏరియాలోనే రూ.2 వేల కోట్ల విలువైన ఉత్పత్తి ఉంది. ఇప్పుడు దీని వాల్యూ 60 పర్సంట్ పడిపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి'' అని తోట జగదీష్ బీబీసీతో అన్నారు.

సాగు తగ్గింది, కానీ..
"నిజానికి అమెరికా ట్రంప్ ఈ సుంకాలపై గత ఏప్రిల్ నుంచి ప్రకటనలు చేస్తూ జులైలో 25శాతం, ఆగస్టులో మరో 25శాతం అమలు చేస్తూ వచ్చారు. దాంతో ఇక్కడి రైతులు ముందుగానే సాగు తగ్గించేశారు. భీమవరం ప్రాంతంలో సగానికి సగం సాగు తగ్గించారు.
పైగా ఈ సీజన్‌లో ఎక్కువ వర్షాలు కురవడం వల్ల కూడా చాలా చోట్ల పురుగుపట్టి పంట దెబ్బతింది. దాంతో దిగుబడి బాగా తగ్గిపోయింది, లేదంటే ఈ సుంకాల ఎఫెక్ట్‌తో రైతులు నిజంగా రోడ్డు మీద కొచ్చేసే పరిస్థితి ఉండేది. అయితే, ఎగుమతిదారుల వద్దనున్న సరుకు పరిస్థితి మాత్రం ఆందోళనకరమే" అని ప్రాన్స్ ఫార్మర్స్ ఫెడరేషన్ కార్యదర్శి సుబ్బరాజు బీబీసీతో అన్నారు.
కానీ, సాగు బాగా తగ్గిందనే వాదనను ఏపీ మత్స్యశాఖ అధికారులు అంగీకరించడం లేదు. "కొద్దిమంది రైతులు తగ్గించి ఉంటారు. చాలామంది రొయ్యల రైతులు ప్రత్యామ్నాయంగా చేపల సాగుపై దృష్టిసారించారు" అని ఏపీ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ మొహమ్మద్ బీబీసీతో అన్నారు.

ఇతర దేశాలకు ఎగుమతులే ప్రత్యామ్నాయం
ఇక అమెరికాకి ఎగుమతులపై దృష్టి తగ్గించి ఇతర దేశాలకు ఎగుమతులపైనే దృష్టి సారించాలి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఆక్వా ఎగుమతిదారులు కోరుతున్నారు.
" ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ వంటి యూరోప్ దేశాల్లో ప్రస్తుతం 4 నుంచి 8 శాతం వరకు అమల్లో ఉన్న ఎక్స్‌పోర్ట్ డ్యూటీని జీరో చేస్తే 20 నుంచి 25 శాతం మార్కెట్ షేర్ అవుతుంది. ఈ దిశగా మాట్లాడుతున్నామని కేంద్రం చెబుతోంది.
నిజంగా అక్కడ ఎక్స్‌పోర్ట్ డ్యూటీ జీరో అయితే మన వద్ద నుంచి ప్రస్తుతం అమెరికాకి వెళ్తున్న 50 శాతం మార్కెట్‌లో 25 శాతం మార్కెట్ యూరప్ దేశాలకు షేర్ అవుతుంది. మిగిలిన 25 శాతంలో కొంత రష్యాకి పంపిస్తే మనం సేఫ్‌లోకి వెళ్లిపోతాం.
కానీ, రష్యా ఎగమతుల విధానంలో మార్పులు రావాలి, కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే అక్కడ అనుమతులు ఉన్నాయి. అక్కడ ఆ పరిస్థితి మారి రష్యాతో పాటు సౌత్ కొరియాకి ఎగుమతులు పెరిగితే మనం ఈ సంక్షోభం నుంచి చాలా వరకు బయటపడ్డట్టే '' అని ఆనంద్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జోగి వర్మ బీబీసీతో అన్నారు.

ఏపీలో 2 లక్షల 70వేల ఎకరాల్లో రొయ్యల సాగు ..
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం.
"ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం దాదాపు 5 లక్షల 76 వేలఎకరాలు కాగా కేవలం రొయ్య సాగు 2 లక్షల 70 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఏడాదికి చేపల, రొయ్యల ఉత్పత్తి 51.58 లక్షల టన్నులు కాగా సముద్ర, మంచినీటి రొయ్యల ఉత్పత్తి సుమారు 18 లక్షల టన్నుల వరకు ఉందని అంచనా" అని ఏపీ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ మొహమ్మద్ బీబీసీకి వివరించారు.

అమెరికాకే 60శాతం ఎగుమతులు
భారత్‌లో రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తైతే అందులో 60 శాతం ఉత్పత్తి ఏపీ నుంచే ఉంటోందని ఏపీ మత్స్యశాఖ జేడీ షేక్ మొహమ్మద్ బీబీసీకి తెలిపారు.
ఏపీ నుంచి అమెరికాకు సుమారు 60 నుంచి 65 శాతం రొయ్యలు ఎగుమతి అవుతుండగా.. మిగిలినవి చైనా, జపాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచే ఎక్కువగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయని ఆయన తెలిపారు.

''2023–24 లెక్కల ప్రకారం, భారత్ నుంచి 60,524 కోట్ల విలువైన 17.81 లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు 130 దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇందులో రొయ్యల వాటా రూ.40వేల కోట్లు.
ఇందులో ప్రధానంగా అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి.
2024లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన సముద్ర ఉత్పత్తుల విలువ 2.71 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 24 వేల 40 కోట్లు ) అని ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది.
‘‘ఇందులో సుమారు రూ.18 వేల 725 కోట్ల విలువైన రొయ్యలు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి'' అని ఏపీ మత్స్యశాఖ అధికారితో పాటు విశాఖలోని ది మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా)కి చెందిన ఓ అధికారి బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














