బాలకృష్ణ వ్యాఖ్యల వివాదం: ఆర్.నారాయణమూర్తి ఏం చెప్పారు?

నందమూరి బాలక‌ష్ణ, వైఎస్ జగన్, చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి

ఫొటో సోర్స్, I&PR/R Narayanamurty

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సెప్టెంబర్‌ 25న హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

జగన్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్‌ మీడియాలో వైసీపీ కార్యకర్తల పోస్టులు కొనసాగుతున్నాయి.

బాలకృష్ణ వ్యాఖ్యలకు స్పందనగా విదేశాల్లో ఉన్న నటుడు చిరంజీవి పేరిట ఓ ప్రకటన విడుదలైంది.

అందులోని అంశాలు ఏపీలో రాజకీయ చర్చకు తెరలేపాయి.

తాజాగా ఇదే విషయంపై, ఆరోజు చిరంజీవితో పాటు సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులతో కలిసి సమావేశంలో పాల్గొన్న నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సభలో అసలేం జరిగింది?

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గురువారం నాటి సభలో గత వైసీపీ ప్రభుత్వంలో సినీరంగం ఇబ్బందులను ఎదుర్కొందని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు.

'సినిమా టికెట్ల పెంపుపై చిరంజీవి, సినీ హీరోలను దర్శకులను తీసుకుని అప్పట్లో సీఎంగా ఉన్న జగన్‌ వద్దకు వెళ్తే అవమానించారు. వారి కార్లను గేటు దగ్గరే ఆపేసి దిగి రమ్మన్నారు. ముందు పోసాని కృష్ణమురళి వంటి వాళ్లను కూర్చోపెట్టారు. ఆ తర్వాత ఆ మీటింగ్‌కి సీఎం రాకుండా సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి కలుస్తారని చెబితే, చిరంజీవి గట్టిగా రియాక్ట్‌ అయ్యారు. దాంతో సీఎం వచ్చారు'' అని కామినేని అసెంబ్లీలో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ, సినిమా

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.NCBN.OFFICIAL

ఫొటో క్యాప్షన్, ఏపీ అసెంబ్లీ (ఫైల్)

మిగతావన్నీ ఓకే కానీ, అది అసత్యం: బాలకృష్ణ

కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కామినేని చెప్పినదాంట్లో మిగతా వన్నీ ఓకే కానీ.. చిరంజీవి గట్టిగా మాట్లాడారన్న వ్యాఖ్యలను మాత్రం ఖండించారు.

అలాగే, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి మరో పదం వాడారు.

''చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన (మాజీ సీఎం జగన్) వచ్చారన్నది అబద్ధం. గట్టిగా ఎవ్వరూ అడగలేదు అక్కడ.. ఈయనవి అసత్యాలు (కామినేనిని ఉద్దేశించి)'' అని బాలకృష్ణ అసెంబ్లీలో అన్నారు.

ఇప్పుడు ప్రభుత్వంలో కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ కార్యక్రమ పేర్ల జాబితాలో తనది తొమ్మిదో పేరు వేశారంటూ అసహనం ప్రదర్శించారు.

చిరంజీవి, సినిమా టికెట్లు, బాలకృష్ణ

ఫొటో సోర్స్, @KChiruTweets

చిరంజీవి ప్రకటనలో ఏముంది?

బాలకృష్ణ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో నటుడు చిరంజీవి పేరిట ఓ ప్రకటన విడుదలైంది. అందులో, ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సుదీర్ఘ వివరణతో పాటు బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఖండించినట్లు ఉంది.

ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నందున పత్రికా ప్రకటన ద్వారా ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. నిజంగా ఆయనే స్పందించారా లేదా అన్న చర్చ కూడా చాలాసేపు నడిచింది. అయితే, ఆ ప్రకటన ప్రస్తుతం చిరంజీవి సినిమా మీడియా వ్యవహారాలు చూస్తున్న పీఆర్వో నుంచే వచ్చిందని తెలిసింది.

ఆ లేఖలో ఏముంది?

''అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్‌ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, నా పేరు ప్రస్తావనకు తెచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో సినీ టికెట్ల ధరల పెంపుదల గురించి అప్పటి వైసీపీ ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, ఇందుకు మీరే చొరవ తీసుకోవాలని కొందరు సినీ ప్రముఖులు నా వద్దకు వచ్చారు. దాంతో నేను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడాను. నాటి సీఎం జగన్‌.. వన్‌ టు వన్‌ కలుస్తానన్నారని, లంచ్‌‌కి రమ్మని ఆహ్వానించారని ఆయన నాతో చెప్పారు.

నేను వెళ్లినప్పుడు నన్ను జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. లంచ్‌ సమయంలో సమయం ఇస్తే మా సినీ ప్రముఖులు వస్తారని నేను చెప్పగా అందుకు జగన్‌ అంగీకరించి, డేట్‌ ఫిక్స్‌ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణతో ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ అనే నిర్మాత ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు" అని చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు.

''నేను ఆ రోజు ఆర్‌. నారాయణ మూర్తితో సహా మరికొంతమంది వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాం. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్‌ రేట్స్‌ పెంచడానికి కారణమైంది'' చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు..

చిరంజీవి ప్రకటన దరిమిలా బాలకృష్ణను టార్గెట్‌ చేస్తూ చిరంజీవి అభిమానుల కంటే ఎక్కువగా వైసీపీ అభిమానులే గతంలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మరోవైపు, చిరంజీవిని తక్కువ చేయాలని బాలకృష్ణ అలా మాట్లాడలేదని, అప్పట్లో అందరూ ఇబ్బంది పడిన విషయాలనే ఆయన ప్రస్తావించారని బాలకృష్ణ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ విషయంపై సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి బీబీసీతో మాట్లాడుతూ, ''చిరంజీవి ఆ ప్రకటనలో చెప్పిన విషయాలన్నీ వందశాతం నిజం'' అని అన్నారు.

ఆర్.నారాయణమూర్తి, బాలకృష్ణ, చిరంజీవి, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, R Narayanamurty

ఆర్.నారాయణమూర్తి ఏమన్నారంటే..

'మీటింగ్‌ బ్రహ్మాండంగా జరిగింది. ఎవ్వరూ మమ్మల్ని అవమానించలేదు' అని ఆర్.నారాయణమూర్తి బీబీసీతో చెప్పారు.

ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు ఆయన్ను ఇదే విషయంపై ప్రశ్నలు వేయడంతో ఆయన స్పందించారు.

"అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందన సత్యం. అది నూటికి నూరుపాళ్లు సత్యం" అని నారాయణమూర్తి అన్నారు.

"వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో, పేర్ని నాని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవితో పాటు చాలామందిని ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకడిని. ఆ సమావేశంలో తాను కూడా ఉన్నాను కాబట్టి, అక్కడ ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది కాబట్టి చెబుతున్నా.

జగన్ ప్రభుత్వం మా సినిమా కళాకరులని గానీ, చిరంజీవిని గానీ ఎవరినీ అవమానించలేదు. చాలా గౌరవించారు. పరిశ్రమ పెద్దగా చిరంజీవి తీసుకున్న రోల్‌కు సెల్యూట్.

జగన్‌ చాలా సానుకూలంగా స్పందించారు. పేర్ని నానితో మాట్లాడి మీకేం కావాలో తీసుకోండి అన్నారు" అని నారాయణమూర్తి చెప్పారు.

అయితే, ఇప్పటికే ఇండస్ట్రీ సమస్యలు అలాగే ఉన్నాయని, ఇప్పటి ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తెలుగు సినీ ప్రముఖులు

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో క్యాప్షన్, అప్పటి ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు

అసలు ఆరోజు ఏం జరిగింది?

2022 ఫిబ్రవరి 10న నటులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌.నారాయణమూర్తి, అలీ తదితరులు వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలో కలిశారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, టికెట్ల ధరల పెంపు తదితర అంశాలపై మాట్లాడారు.

''ఇండస్ట్రీ వైపు మీ చల్లని చూపు ఉండాలి. మీరు తల్లిలాంటి పొజిషన్‌లో ఉన్నారని మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండీ'' అని చిరంజీవి నాటి సీఎం జగన్‌ను అభ్యర్థించారు.

చిరంజీవి చేతులు జోడించి మాట్లాడటం, అదే టైంలో జగన్‌ పక్కకి చూస్తున్నట్టు ఉన్న వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో అప్పట్లో వివాదమై ఇప్పటికీ చర్చనీయంగానే ఉంది.

"చిరంజీవితో దండం పెట్టించుకుంటారా? మేమేమిటో చూపిస్తాం, అంటూ అప్పట్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చాలాసార్లు ఆ ఘటనను ప్రస్తావించారు. ఆయన్ని కూడా ప్రాధేయపడొద్దని చెప్పండి, మన హక్కులు సాధించుకోవాలి" అంటూ చిరంజీవిని ఉద్దేశించి అప్పట్లో జరిగిన 'రిపబ్లిక్‌' సినిమా ఫంక్షన్‌లో పవన్‌ వ్యాఖ్యానించారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, అనంతరం చిరంజీవి స్పందనలపై పవన్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

''బాలకృష్ణ– చిరంజీవి ఎపిసోడ్‌పై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడేందుకు ఏముంటుంది, చిరంజీవి అంతా క్లియర్‌గా చెప్పారు కదా? బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి నేరుగా ప్రకటన ద్వారా ఖండించడంతోనే ఆ వ్యాఖ్యల వివాదం అక్కడితో ముగిసినట్టే, ఇంకేమీ ఉండదనే అనుకుంటున్నాను'' అని జనసేన సీనియర్‌ నాయకుడు ఒకరు బీబీసీతో అన్నారు.

పేర్ని నాని

ఫొటో సోర్స్, facebook/Perni Nani

ఫొటో క్యాప్షన్, మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని

వైసీపీ ఏమంటోంది?

ఆ సమావేశంలో పాల్గొనని బాలకృష్ణ.. దాని గురించి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో అన్నారు.

చిరంజీవి తాజా ప్రకటనతో అప్పుడు చేసినదంతా తప్పుడు ప్రచారమని ఇప్పటికైనా అర్ధమైందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఆ వీడియో బయటకు రావడం తప్పు: తమ్మారెడ్డి

''వైఎస్‌ జగన్‌ అప్పుడు ముఖ్యమంత్రి, ప్రోటోకాల్‌ నిబంధనలు ఎలా ఉంటాయో అలానే వెళ్లాలి. సీఎం ఇంటి ప్రాంగణంలో హీరోలు నడిచి వెళ్తే తప్పు ఎలా అవుతుంది? చిరంజీవి సహజంగానే ఎవరిపట్ల అయినా గౌరవంగా ఉంటారు. హుందాగా మాట్లాడతారు. ఆ విధంగా ఆ రోజు సీఎంగా ఉన్న జగన్‌తో కూడా అలా మాట్లాడారు. అయితే, ఆ వీడియో రిలీజ్‌ కావడం మాత్రం తప్పే '' అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)