సూపర్‌ సిక్స్: ఏవి అమలయ్యాయి, ఏవి కాలేదు?

నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, NaraChandrababuNaidu/Whatsapp Channel

ఫొటో క్యాప్షన్, ''సూపర్ సిక్స్ సూపర్ హిట్'' సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు తాము అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పేరిట ఆరు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చాయి.

కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ సూపర్‌ సిక్స్‌‌పై నాడు ఆ పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల సమయంలో ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

మేనిఫెస్టో విడుదల సభలో అప్పట్లో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్ధ్‌ నాథ్‌ పాల్గొన్నప్పటికీ మేనిఫెస్టో ప్రతిని మాత్రం ఆయన పట్టుకోలేదు.

కాగా, సెప్టెంబర్‌ 10న అనంతపురంలో ''సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌'' పేరిట ఎన్డీయే కూటమి పార్టీల తొలి ఉమ్మడి సభను నిర్వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అన్నింటినీ అమలు చేశామన్న సీఎం

జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్‌ ఈ సభలో పాల్గొన్నారు.

సూపర్‌ సిక్స్‌ను సూపర్‌ హిట్‌ చేశామని చెప్పేందుకే తాము ఈ సభను నిర్వహించామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

మరోవైపు విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అదే రోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు కాకుండానే విజయోత్సవాలను నిర్వహిస్తున్నారంటూ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు.

బస్సు ప్రయాణం చేసిన చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, NaraChandrababuNaidu/Whatsapp Channel

సూపర్‌ సిక్స్‌ అమలు ఏ దశలో ఉందంటే

ఈ నేపథ్యంలో అసలు సూపర్‌ సిక్స్‌ పేరిట ఏయే పథకాలను ప్రకటించారు.. ఇప్పటి వరకు వాటి అమలు ఏ దశలో ఉందో ఓసారి చూద్దాం.

ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్‌ 6 పథకాలు:

సూపర్ సిక్స్‌లో తొలి పథకం

''తల్లికి వందనం'' పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ రూ.15,000 ఇస్తామని, వారి తల్లుల అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

గత ఏడాది ఈ పథకం అమలు చేయలేదు.

ఈ ఏడాది నుంచి ఇస్తామని 2025–26 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు ప్రతిపాదించిన ప్రభుత్వం... జూన్‌ 12 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఈ పథకం వర్తింపజేస్తోంది.

అయితే రూ.15వేలకు బదులు రూ.13వేలు అకౌంట్‌లో చేస్తూ మిగిలిన రూ.2వేలను విద్యావ్యవస్థ అభివృద్ధి నిధి (స్కూలు అభివృద్ధి ఖాతా) కింద జమ చేసుకుంటోంది.

ఈ పథకం కింద రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.8,745 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

సూపర్ సిక్స్ పథకాల్లో రెండవది

దీపం 2.0 పథకం ద్వారా ప్రతి ఏటా వైట్‌ రేషన్‌ కార్డు ఉన్న మహిళలకు మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని సూపర్‌ సిక్స్‌లో భాగంగా హామీ ఇచ్చారు.

గత ఏడాది 2024 దీపావళి సందర్భంగా ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించి.. ఆ ఏడాది డిసెంబర్‌లోనే ఒక సిలిండర్‌ డబ్బులు జమ చేసి పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రెండో సిలిండర్‌ పంపిణీ చేశారు. ఆగస్టు నెల నుంచి నవంబర్‌ వరకు నాలుగు నెలల కాలంలో మూడో సిలిండర్‌ పంపిణీకి శ్రీకారం చుట్టారు.

దీపం–2 పథకం కింద ఇప్పటివరకు రూ.1,704 కోట్లు ఖర్చు చేసి.. 2.45 కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించారు.

కాగా, ఇటీవల సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుపై జరిగిన సమీక్షలో పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ మాట్లాడుతూ.. మూడో విడతలో కూడా ఇప్పటికి 65లక్షల మందికి సిలిండర్లు పంపిణీ చేశామని వెల్లడించారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు
ఫొటో క్యాప్షన్, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు
సూపర్ సిక్స్ పథకాల్లో మూడవది

స్త్రీశక్తి పేరిట ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు.

మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

స్త్రీ శక్తి పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 2.6 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామనీ సగటున ప్రతి రోజూ దాదాపు 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అనంతపురం పర్యటన సందర్భంగా తెలిపారు.

ఇందుకోసం దాదాపు రూ.2 వేల కోట్లను భరిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అనంతపురం పర్యటనలో చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 129 ఆర్టీసీ డిపోలు ఉండగా, 60 డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోందన్నారు.

సూపర్ సిక్స్ పథకాల్లో నాలుగవది

'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు.

2024లో ఈ పథకం అమలు చేయలేదు.

2025 బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించి తొలి విడతగా ఏడు వేల రూపాయలను ఈ ఏడాది ఆగస్టు నెల 2వ తేదీన రైతుల అకౌంట్లలో జమ చేశారు.

మిగతా డబ్బులను కూడా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు మూడు విడతలుగా ఇస్తామని హామీనిచ్చారు. ఇందులో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ రూ.6 వేలు.. అన్నదాత సుఖీభవ కింద రూ.14 వేలు కలిపి ఇస్తామని చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు 2న మొదట విడతగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్‌ రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు జమ చేశారు.

మిగిలిన డబ్బుల్ని మరో రెండు విడతలుగా జమ చేస్తామని ప్రకటించారు.

రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిపి రూ.7 వేలు రైతుల అకౌంట్‌లలో జమ చేస్తామన్నారు.

మూడో విడతగా అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిపి రూ.6 వేలు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ డబ్బులు ఇంత వరకు రైతుల ఖాతాలో వేయలేదు.

కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఈ ఏడాది తొలి విడతగా ఇప్పటికే రూ.7 వేలు ఇచ్చామని చెప్పారు. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశామని ఆయన అనంతపురం సభలో తెలిపారు.

సూపర్ సిక్స్ పథకాల్లో ఐదవది

రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌లో హామీ ఇచ్చారు.

మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశామనీ, నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించారు.

అలాగే, 8 లక్షల మంది ఉద్యోగాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, మిగిలిన నిరుద్యోగ యువతకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు.

సూపర్ సిక్స్ పథకాల్లో ఆరవది

18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500 ఇస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని ఇప్పుడు ఎక్కడా ప్రస్తావించడం లేదు ప్రభుత్వం.

మొత్తంగా సూపర్‌ సిక్స్‌లో.. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్ధికీ 13 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలను కూటమి అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చే దీపం–2.0 పథకాన్ని 2024 చివరి నుంచి అమల్లోకి తెచ్చింది.

అయితే, మరో రెండు నగదు బదలీ పథకాలైన మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఎక్కడా స్పష్టతనివ్వడం లేదు.

నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, NaraChandrababuNaidu/Whatsapp Channel

ఆ రెండింటి బదులు...

నిరుద్యోగులకు రూ.3000 భృతి, మహిళలకు రూ.1500 భృతిపై ఎక్కడా మాట్లాడని కూటమి ప్రభుత్వం.. ఆ రెండింటి బదులు ఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ పోస్టుల భర్తీని సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చింది.

లోకేష్‌తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్

ఫొటో సోర్స్, X/tgbharath

ఫొటో క్యాప్షన్, లోకేష్‌తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్

‘అందుకే పీ–4’

సూపర్‌ సిక్స్‌లో పేర్కొన్న ఆరు హామీలే కాదు.. అంతకంటే ఎక్కువే ప్రభుత్వం చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

మహిళకు నెలకు రూ. 1500 ఇవ్వడం కంటే ఆ కుటుంబాన్ని మొత్తం దత్తత తీసుకుని వారికి ఆర్ధిక చేయూతనిచ్చే విధంగా పీ–4 పథకం ప్రవేశపెట్టామని చెప్పారు.

ఆ హామీ కంటే బెటర్‌గా పీ–4 ఉపయోగపడుతుందని, పీ–4తో రాష్ట్రంలోని పేదల ఇళ్లల్లో సరికొత్త వెలుగులు వస్తాయని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగ భృతిపై మాట్లాడుతూ.. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఆ భృతి కంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా చేస్తున్నామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)