తెలంగాణ: చెరువంతా ఎర్రని రంగు.. ఎందుకిలా... అసలేమైంది?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నల్లకుంట చెరువులోని రంగుమారిన కలుషిత నీరు వరి పొలాలను ముంచెత్తిందంటూ సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామాన్ని బీబీసీ సందర్శించింది.


ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్-నర్సాపూర్ జాతీయ రహదారిపై ఈ గ్రామం ఉంది. రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలు చేరి నల్లకుంట చెరువులోని నీరు తీవ్రంగా కలుషితమైందని, ఈ నీరే పంట పొలాలను ముంచెత్తిందంటూ ఆ వీడియోలో రైతు ఆందోళన వ్యక్తం చేశారు.
''పర్యావరణాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇక్కడ గాలి, నీరు పూర్తిగా కలుషితమయ్యాయి'' అంటూ అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
నల్లకుంట చెరువు దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడ రెండు నిమిషాలు కూడా ఉండలేక పోయాను. ముక్కుకు కర్చీఫ్ కట్టుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించాల్సి వచ్చింది. నల్లకుంటలోని నీరంతా ఎరుపు రంగులోకి మారిపోయింది.
ఈ చెరువు దాదాపు 22 ఎకరాల్లో విస్తరించింది. చెరువుకు ఒకవైపు ఎయిర్ ఫోర్స్ అకాడమీ గోడ ఉంది. మూడువైపులా చెరువు చుట్టూ తిరిగి పరిశీలించినప్పుడు, నీరంతా ఎరుపు రంగులోనే కనిపించింది.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ వైపున్న గోడ కింద నుంచి నల్లకుంటలోకి నీరు వచ్చేందుకు వీలుగా ఇన్ లైట్ జాలీలు కనిపించాయి.

రైతుల ఆరోపణలపై 'హెటిరో' ఏం చెబుతోంది?
నల్లకుంట చెరువులోకి రసాయన వ్యర్థ జలాలు చేరడం వల్లే నీరంతా కలుషితంగా మారిందని స్థానిక రైతులు చెబుతున్నారు.
''కలుషిత జలాలు, హెటిరో డ్రగ్స్ యూనిట్-1 నుంచి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ప్రాంతంలోకి వస్తున్నాయి. అక్కడి నుంచి నల్లకుంటలోకి ఆ నీరు చేరుతోంది'' అని స్వేచ్ఛా రెడ్డి అనే రైతు బీబీసీకి చెప్పారు.
ఆయన అయిదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు చెప్పారు.
నల్లకుంట చెరువును బీబీసీ సందర్శించినప్పుడు, హెటిరో డ్రగ్స్ నుంచి కాలుష్య జలాలు చెరువులోకి వస్తున్నట్లు రైతులు చెప్పారు.
అయితే, తమ కంపెనీ నుంచి కాలుష్య వ్యర్థ జలాలు నల్లకుంటలోకి చేరుతున్నాయన్న రైతుల ఆరోపణలను హెటిరో డ్రగ్స్ కంపెనీ ఖండించింది. దీని గురించి హెటిరో డ్రగ్స్ కంపెనీ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ నాగరాజు బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.
''మా కంపెనీ నుంచి ఎలాంటి వ్యర్థ జలాలను బయటకు పంపడం లేదు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్(వ్యర్థ జలాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేసే వ్యవస్థ) మాకు ఉంది. కంపెనీలో ఉత్పత్తయ్యే కాలుష్య జలాలను మేమే శుద్ధి చేసి వాడుకుంటున్నాం'' అని ఆయన చెప్పారు.
హెటిరో నుంచి ఎరుపురంగులోని కాలుష్య జలాలు, నల్లకుంటలోకి వస్తున్న విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.
నల్లకుంటకు, హెటిరో డ్రగ్స్ పరిశ్రమకు మధ్య ఎయిర్‌ఫోర్స్ ప్రాంతం ఉంది. అక్కడ పూర్తిగా చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది.
కాలుష్య జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించినప్పటికీ, ఎయిర్ ఫోర్స్ స్థలంలోకి ప్రవేశించడంపై నిషేధాజ్ఞలు ఉండటంతో ఆ ప్రాంతంలోకి వెళ్లలేకపోయాం.

300 ఎకరాల ఆయకట్టు...
నల్లకుంట చెరువు నుంచి కాలుష్య జలాలు పక్కనే ఉన్న పొలాల్లోకి, అక్కడి నుంచి 2 కి.మీ దూరంలో ఉన్న రాజనాల చెరువులోకి వెళుతున్నాయి.
ఈ రెండు చెరువుల కిందట దాదాపు 300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ రైతులు వరి, కూరగాయలు పండిస్తున్నారు.
చెరువు పూర్తిగా కాలుష్యమయంగా మారిందని అక్కడి రైతులు చెప్పారు.
''ముందు చెరువు చాలా బాగుండేది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోంచి నీళ్లు వచ్చేవి. కంపెనీ వచ్చిన పదేళ్ల తర్వాత కాలుష్యం, వ్యర్థాలు రావడంతో పరిస్థితి మారిపోయింది'' అని బీబీసీకి మంగయ్య అనే మరో రైతు చెప్పారు.
తమ సమస్యను కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
కాలుష్యంతో కూడిన రంగు మారిన నీళ్లు, వరి పొలాల్లోకి రావడంతో పంట నాశనమవుతోందని స్వేచ్ఛారెడ్డి బీబీసీతో అన్నారు.
''ఇప్పుడు వరి గింజ ఈనే సమయం. కలుషితనీరు రావడంతో గింజ రావడం లేదు. మొక్కలు గడ్డిలా పెరిగి ఉత్త తాలు వస్తోంది. పంట నాశనం అవుతోంది. పెట్టుబడి కూడా రావడం లేదు'' అని చెప్పారు.

''చెరువు నీటినంతా తీసేశారు''
నల్లకుంట చెరువు, 2012లోనూ ఇదే తరహాలో పూర్తిగా కలుషితమైందని రైతులు చెప్పారు.
ఆ సమయంలో పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.
నల్లకుంటలోకి కాలుష్య జలాలు చేరాయని గుర్తించిన కాలుష్య నియంత్రణ మండలి, 2013 మార్చిలో హెటిరో సంస్థకు నోటీసులు జారీ చేసింది.
కాలుష్య జలాలను పూర్తిగా చెరువు నుంచి తొలగించాలని ఆదేశించింది.
''పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు నల్లకుంటలో చేరిన కాలుష్య జలాలను హెటిరో డ్రగ్స్ కంపెనీ తొలగించింది'' అని బోర్డుకు హెటిరో డ్రగ్స్ కంపెనీ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ 2013 అక్టోబరులో నివేదిక సమర్పించారు.
''అప్పట్లో మేం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ప్రభుత్వ ఆదేశాలతో వాటర్ ట్యాంకర్లు పెట్టి కలుషితమైన చెరువు నీటిని కంపెనీ తోడేసింది'' అని దోమడుగు గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఆ తర్వాత కూడా చాలాసార్లు కలుషిత నీటి సమస్య ఏర్పడిందని జైపాల్ రెడ్డి అనే మరో రైతు చెప్పారు.
''ఏటా ఇదే సమస్య వస్తోంది. కానీ ఈసారి తీవ్రంగా ఉంది. చెరువులో నీరు పూర్తిగా రంగు మారిపోయింది'' అని బీబీసీతో అన్నారు.

'రంగు మారడానికి వేరే కారణాలు ఉండొచ్చు'
చెరువులో నీరు రంగు మారడానికి కాలుష్యమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండొచ్చని బీబీసీతో హెటిరో డ్రగ్స్ కంపెనీ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ నాగరాజు చెప్పారు.
''చెరువు నీరు రంగు మారడానికి బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగే కూడా కారణం కావొచ్చు. పై లేయర్ వరకే రంగు కనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.
నీళ్ల నుంచి వస్తున్న ఘాటు రసాయన వాసనల గురించి బీబీసీ ప్రశ్నించగా, డొమెస్టిక్ (ఇళ్ల) వ్యర్థాలు చేరడం వల్ల కూడా కావొచ్చని సమర్థించుకున్నారు.
రసాయన జలాల కారణంగా నురగ కూడా పెద్దఎత్తున కనిపిస్తోందని అడగగా, తమ కంపెనీ నుంచి రసాయన వ్యర్థాలు చేరడం లేదంటూ బీబీసీకి చెప్పారు.

కాలుష్య నియంత్రణ మండలి ఏం చెబుతోంది?
నల్లకుంట కాలుష్య జలాల సమస్యపై సంగారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి చెందిన ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్(ఈఈ) కుమార్ పాఠక్‌ను బీబీసీ సంప్రదించింది.
''నల్లకుంటలో కాలుష్యంపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసింది. కంపెనీ, చెరువు పరిస్థితులను పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ హియరింగ్ పూర్తయింది. దీనికి సంబంధించి తుది నివేదిక రావాల్సి ఉంది'' అని ఆయన చెప్పారు.
చెరువులో బ్యాక్టీరియా, ఫంగే, ఆల్గే కలిశాయా అని బీబీసీ ప్రశ్నించింది.
''ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. దీనిపై ప్రముఖ సంస్థలతో అధ్యయనం చేయించాలని అనుకుంటున్నాం'' అని కుమార్ పాఠక్ తెలిపారు.
చెరువులోని నీటి విషయంలో ఏం చేయాలనే అంశంపై బోర్డు, టాస్క్‌ఫోర్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పాఠక్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














