భారత్‌లోనే పుట్టాడు, కానీ భారతీయుడు కాదు.. ఈయన కథేంటి?

భారత్, పౌరసత్వం, తమిళనాడు
ఫొటో క్యాప్షన్, భారత పౌరసత్వ చట్టం ప్రకారం, బిడ్డ పుట్టుకతో పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా భారతీయులై ఉండాలి.
    • రచయిత, శారద. వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాహిసన్ రవీంద్రన్ ఎప్పుడూ తాను భారతీయుడినే అనుకునేవారు.

అంతర్యుద్ధం సమయంలో భారతదేశానికి వచ్చిన శ్రీలంక శరణార్థి తల్లిదండ్రులకు 1991లో తమిళనాడులో జన్మించారు రవీంద్రన్. ఆయన భారత్‌లోనే పెరిగారు, చదువుకున్నారు.

ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న రవీంద్రన్ వెబ్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వద్ద భారతీయ పాస్‌పోర్ట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులూ ఉన్నాయి.

కానీ, తన పాస్‌పోర్ట్ చెల్లదంటూ ఏప్రిల్‌లో రవీంద్రన్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ శ్రీలంకకు చెందినవారు కాబట్టి, రవీంద్రన్ పుట్టుకతో భారత పౌరుడు కాదని అధికారులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

గతంలో భారతదేశంలో జన్మించిన ఎవరైనా భారత పౌరసత్వం పొందేందుకు అర్హులు. కానీ, 1987లో జరిగిన చట్ట సవరణల ప్రకారం, 1987 జులై 1 తర్వాత జన్మించిన పిల్లలు భారత పౌరులు కావాలంటే, తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరు భారత పౌరులై ఉండాలి.

అయితే, ఈ చట్టం గురించి తనకు తెలియదని, తన తల్లిదండ్రులు శ్రీలంకకు చెందినవారనే విషయం ఎప్పుడూ దాచలేదని రవీంద్రన్ మద్రాస్ హైకోర్టుకు గతవారం తెలిపారు.

"పుట్టుక ద్వారా పౌరసత్వం" దానికదే రాదని తెలుసుకున్న తర్వాత, 'సిటిజెన్‌షిప్ త్రూ నేచురలైజేషన్' ద్వారా దరఖాస్తు చేసుకున్నానని చెప్పారాయన.

శ్రీలంక తమిళ శరణార్థులు, అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1980లలో అంతర్యుద్ధం సమయంలో వేలాది మంది శ్రీలంక తమిళ శరణార్థులు భారతదేశానికి వచ్చారు.

ఏ దేశానికీ చెందని వ్యక్తి..

ప్రస్తుతానికి, రవీంద్రన్ "ఏ దేశానికీ చెందని వ్యక్తి(స్టేట్‌లెస్ పర్సన్)" అయ్యారు.

1980లలో అంతర్యుద్ధం సమయంలో భారత్‌కు వచ్చిన వేలాది మంది శ్రీలంక తమిళ శరణార్థుల పోరాటానికి ఈయన కేసు ఉదాహరణగా నిలుస్తుంది.

తమిళనాడు ప్రభుత్వం ప్రకారం, నేడు వారిలో 90,000 మందికి పైగా తమిళనాడులో నివసిస్తున్నారు. కొందరు శరణార్థి శిబిరాల్లో ఉండగా, మరికొందరు బయట నివసిస్తున్నారు.

చారిత్రక సంబంధాలు, భాష, సాంస్కృతిక సారూప్యతలు, శ్రీలంకకు భౌగోళిక సామీప్యత కారణంగా తమిళనాడును చాలామంది ఎంచుకున్నారు.

ఇప్పుడు రవీంద్రన్ వంటి వారు 22,000 మందికి పైగా ఉన్నారు, వీరంతా 1987 తర్వాత శ్రీలంక తమిళ తల్లిదండ్రులకు భారతదేశంలో జన్మించారు. దశాబ్దాల తర్వాత కూడా, వారి పౌరసత్వ స్థితి ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

ఈ సమస్యకు ఒక కారణం ఏమిటంటే, భారత్ 1951 యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ లేదా దాని 1967 ప్రోటోకాల్‌పై సంతకం చేయలేదు. కాబట్టి, శ్రీలంక శరణార్థులను భారత్ అక్రమ వలసదారులుగా పరిగణిస్తుంది.

2019 పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సమీప దేశాల నుంచి కొంతమంది మైనారిటీలకు భారత పౌరసత్వం పొందడాన్ని సులభతరం చేస్తుంది. కానీ, ఇందులో శ్రీలంక తమిళులను చేర్చలేదు.

తమిళనాడులో శ్రీలంక తమిళుల సమస్య చాలా భావోద్వేగభరితమైనది. అనేక రాజకీయ పార్టీలు వారికి సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాయి. కానీ, చాలామంది శరణార్థులకు పౌరసత్వం ఇప్పటికీ కలగానే ఉంది.

భారత్ 2022లో కె.నళిని అనే శ్రీలంక తమిళ మహిళకు మొదటి పౌరసత్వం ఇచ్చింది. ఆమె 1987 చట్ట సవరణకు ఏడాది ముందు జన్మించారు. అప్పటి నుంచి, మరో 13 మంది తమిళులకు మాత్రమే పౌరసత్వం లభించింది.

తన కేసుకు కూడా త్వరలో పరిష్కారం దక్కుతుందని రవీంద్రన్ ఆశిస్తున్నారు. తాను భారతదేశానికి విధేయుడినని, శ్రీలంకకు తిరిగి వెళ్లే ఆలోచనే లేదని ఆయన చెబుతున్నారు.

భారత్, పౌరసత్వం, తమిళనాడు, శ్రీలంక, తమిళులు

పాస్‌పోర్టు ఎలా ఇచ్చారు?

పోలీస్ వెరిఫికేషన్ తర్వాతే రవీంద్రన్‌కు కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చారని, ఆ పోలీసులకు రవీంద్రన్ తల్లిదండ్రుల శ్రీలంక నేపథ్యం గురించి తెలుసని ఆయన న్యాయవాది శరవణన్ అంటున్నారు.

కానీ, తరువాత భారతదేశంలో విదేశీయుల నమోదును పర్యవేక్షించే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) ఆయన తల్లిదండ్రుల మూలాన్ని పోలీసులకు తెలియజేసిందని శరవణన్ చెప్పారు.

ఆ తర్వాత.. మోసం, ఫోర్జరీ, తప్పుగా భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండటం వంటి ఆరోపణలపై రవీంద్రన్‌ను అరెస్టు చేశారు. బెయిల్ పొందడానికి ముందు ఆయన 15 రోజులు కస్టడీలో గడిపారు.

మరిన్ని చర్యలు తీసుకుంటారనే భయంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 8న తదుపరి విచారణ జరిగే వరకు రవీంద్రన్‌పై చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది.

"ఇన్నేళ్లలో నేను భారతీయుడిని కాదని నాకు ఎవరూ చెప్పలేదు" అని రవీంద్రన్ బీబీసీకి చెప్పారు.

"నన్ను మొదటిసారి 'స్టేట్‌లెస్ పర్సన్' అని పిలిచినప్పుడు, నేను నమ్మలేకపోయాను" అన్నారాయన.

ఇప్పుడు, కోర్టు తనకు మద్దతుగా నిలుస్తుందని రవీంద్రన్ ఆశిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)