బ్రాండెడ్ ఔషధాలపై అమెరికా 100% సుంకాలు, భారత్ నష్టపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వెలుపల తయారయ్యే బ్రాండెడ్ మెడిసిన్లపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
కొత్తగా సుంకాలు విధించిన ఉత్పత్తుల జాబితాను ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు.
ఈ సుంకాలు 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ జాబితాలో హెవీ-డ్యూటీ ట్రక్‌లు, కిచెన్, బాత్‌రూమ్‌కు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి.
హెవీ-డ్యూటీ ట్రక్‌లపైన 25 శాతం సుంకం, కిచెన్, బాత్‌రూమ్ వస్తువులపైన 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రూత్ సోషల్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, truthsocial/Donald J. Trump
అమెరికా మార్కెట్‌కు ఫార్మాస్యూటికల్స్‌ను (ఔషధాలను) ఎగుమతి చేసే ప్రధాన దేశం భారత్. భారత ఎగుమతులపై ఇప్పటికే అమెరికా 50 శాతం సుంకం విధించింది.
'' 2025 అక్టోబర్ 1 నుంచి అన్ని బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్టులపై మేం 100 శాతం సుంకాన్ని విధించబోతున్నాం. ఇక్కడ తయారయ్యే ఔషధాలను మినహాయిస్తున్నాం'' అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ప్రకటించారు.
''2025 అక్టోబర్ 1 నుంచి అన్ని వంటింటి వస్తువులు (కిచెన్ క్యాబినెట్స్), బాత్‌రూమ్‌లో ఉపయోగించే వస్తువులు(బాత్‌రూమ్ వానిటీలు), వాటికి సంబంధించిన ఉత్పత్తులపై కూడా 50 శాతం సుంకం విధిస్తున్నాం. అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నీచర్ (దూది, స్పాంజ్‌తో తయారుచేసే సోఫాలు,కుర్చీలు తదితర ఫర్నీచర్) పై కూడా 30 శాతం సుంకం వేయనున్నాం. ఎందుకంటే, ఈ ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి అమెరికాలోకి గుమ్మరిస్తున్నారు. ఇది అన్యాయం. జాతి భద్రత కోసం తయారీ రంగాన్ని కచ్చితంగా కాపాడాల్సి ఉంది'' అని ఆయన రాశారు.
హెవీ-ట్రక్కులపై విధించిన సుంకాలను సమర్థించుకున్న ట్రంప్, '' అన్యాయమైన విదేశీ పోటీ నుంచి మన ట్రక్కు తయారీదారులను కాపాడుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో తయారై ఇక్కడికి దిగుమతయ్యే వాటిపై 2025 అక్టోబర్ 1 నుంచి 25 శాతం సుంకం విధించబోతున్నాం'' అని తెలిపారు.
''ఈ విధంగా మన ప్రముఖ ట్రక్కు తయారీ సంస్థలు పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్, ఫ్రయిట్‌లైనర్, మాక్ ట్రక్స్, ఇతర కంపెనీలు విదేశాల నుంచి ఎదురయ్యే అవాంతరాలను తట్టుకోగలవు'' అని తెలిపారు.

భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం
వాణిజ్య పరిశోధనా సంస్థ జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) ప్రకారం... ఫార్మా రంగం భారత అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతిరంగంగా నిలుస్తోంది.
ఏటా అమెరికాకు భారత్ సుమారు 12.7 బిలియన్ డాలర్ల విలువైన అంటే సుమారు రూ.1,12,660 కోట్ల రూపాయల విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తోంది.
ఈ ఔషధాలలో చాలావరకు జనరిక్ మందులే.
బ్రాండెడ్ ఔషధాలు కూడా భారత్‌కు ఎగుమతి అవుతున్నప్పటికీ, జనరిక్ మందులతో పోలిస్తే వీటి వాణిజ్యం తక్కువ.
డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా వంటి భారతీయ కంపెనీలు బ్రాండెడ్ మందులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.
ట్రంప్ సుంకాల వల్ల జనరిక్, బ్రాండెడ్ ఔషధాల ధరలు పెరుగుతాయని జీటీఆర్ఐ చెప్పింది.
అమెరికాకు పెద్ద ఎత్తున ఔషధాలను అమ్మే భారతీయ కంపెనీలు చాలా తక్కువ మార్జిన్లపై పనిచేస్తాయని జీటీఆర్ఐ తెలిపింది.
భారత ఔషధ కంపెనీల ఆదాయాలకు ప్రధాన వనరు ఉత్తర అమెరికానే.
వారి ఆదాయాల్లో మెజార్టీ, లాభాల్లో మూడోవంతు ఇక్కడ నుంచే వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఐర్లాండే లక్ష్యమా?
బ్రాండెడ్ మందులు ప్రధానంగా తయారయ్యే దేశాలలో ఐర్లాండ్ కూడా ఒకటి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో డజనుకు పైగా కంపెనీలకు ఐర్లాండ్‌లోనే ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని దశాబ్దాల కిందటే నెలకొల్పారు.
అమెరికా మార్కెట్ కోసం అక్కడ చాలా కంపెనీలు మందులను తయారు చేస్తున్నాయి.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే క్యాన్సర్ డ్రగ్ కీత్రుడాను మర్క్ ఫార్మా ఉత్పత్తి చేస్తుంది.
వెస్ట్ పోర్టులో ఎబ్వీ, బోటాక్స్ ఇంజెక్షన్లను తయారు చేస్తుంది.
ఎలి లిల్లీకి చెందిన కింసేల్ ప్లాంట్ ఊబకాయ ఔషధాలకు అమెరికాలో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు సాయపడుతుంది.
తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ ఫైజర్ వంటి అమెరికా కంపెనీలను ఐర్లాండ్ ఆకర్షిస్తోందని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారని రాయిటర్స్ తెలిపింది.
ఐర్లాండ్ విధానాలన్నీ ‘‘కుంభకోణం’’ లాంటివని, వాటిని ట్రంప్ యంత్రాంగం నిలిపివేస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ అన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
జనరిక్ ఔషధాలలో భారత్ ప్రధాన ఎగుమతిదారు
భారత్ ఒక్కటే అమెరికాలో సుమారు సగం వరకు జనరిక్ మందులను అమ్ముతోంది.
బ్రాండ్ పేరుతో వచ్చే ఔషధాల కంటే జనరిక్ మందులు చౌకైనవి.
భారత్ వంటి దేశాల నుంచి ఈ మందులు అమెరికాకు దిగుమతి అవుతున్నాయి.
10 ప్రిస్క్రిప్షన్లలో 9 ఈ మందులవే.
దీనివల్ల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు బిలియన్ డాలర్లు ఆదా అవుతున్నాయి.
2022లో భారత జనరిక్ మందుల వల్ల 219 బిలియన్ డాలర్లు ఆదా అయినట్లు కన్సల్టింగ్ సంస్థ ఐక్యూవీఐఏ అధ్యయనం తెలిపింది.
వాణిజ్య ఒప్పందం లేకపోవడంతో, ట్రంప్ సుంకాల వల్ల జనరిక్ మందులను తయారు చేసే కొన్ని భారత కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
దీనివల్ల అమెరికాలో ప్రస్తుతమున్న ఔషధాల కొరత మరింత తీవ్రతరవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














