ఎయిర్‌ఫోర్స్ వన్ To ది బీస్ట్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణించే విమానం, కార్ల ప్రత్యేకతలు.. వాటిలో ఏముంటాయో తెలుసా?

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడి హోదాలో రెండోసారి డోనల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు.
అధ్యక్షుడి కోసం భారీ భద్రతా చర్యల్లో భాగంగా డజన్ల కొద్దీ సిబ్బంది, అత్యాధునిక రక్షణ పరికరాలు కూడా ఆయనతో పాటే బ్రిటన్ చేరుకున్నాయి.
అధ్యక్షుడి భద్రతను పర్యవేక్షించే సొంత సీక్రెట్ సర్వీస్‌తో పాటు వేల మంది స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాట్లకు కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.
2019లో అధ్యక్షుడి హోదాలో డోనల్డ్ ట్రంప్ తొలిసారి బ్రిటన్‌లో పర్యటించినప్పుడు ఆయన భద్రత కోసం 6 వేల మంది మెట్రోపాలిటన్ పోలీసు అధికారులను మోహరించారు. దీని కోసం రూ. 40.76 కోట్లకు పైగా ఖర్చైంది.
యూనివర్సిటీ ఆఫ్ యూటాలో కన్జర్వేటివ్ యాక్టివిస్ట్, ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య తర్వాత ట్రంప్ భద్రతను మరింత కట్టదిట్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడి విదేశీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఆయన రాకకు ''కొన్ని వారాల ముందే'' ప్రారంభం అవుతాయని, ఇందులో భాగంగా అధ్యక్షుడి భద్రతకు ఎలాంటి ముప్పు ఉండొచ్చు వంటి అంశాలతో పాటు నిఘా ఏర్పాట్లపై స్థానిక పోలీసులతో చర్చిస్తారని సీక్రెట్ సర్వీస్ వ్యవహారాల నిపుణులు, రచయిత రోనల్డ్ కెస్లర్ చెప్పారు.
దాదాపు 60 మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నేరుగా అధ్యక్షుడిని నిరంతరం సంరక్షిస్తుంటారు. దీంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, గగనతలం నుంచి దాడులు జరగకుండా చూసేందుకు స్థానిక పోలీసులను మోహరిస్తారు.
అధ్యక్షుడి బృందంలో వందలాది మంది సిబ్బంది, సహాయక సిబ్బంది ఉండే అవకాశం ఉంది.


ఫొటో సోర్స్, Toby Melville - WPA Pool/Getty Images
గగనతల వైట్‌హౌస్
ఎయిర్‌ఫోర్స్ వన్ అని పిలిచే అత్యాధునిక వసతులతో రూపొందిన బోయింగ్ 747 -200బి విమానంలో భార్య మెలానియాతో కలిసి ట్రంప్ బ్రిటన్ చేరుకున్నారు.
బోయింగ్ 747-200బి సిరీస్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండు విమానాల్లో ఇదొకటి.
వీటి టెయిల్ కోడ్ 280000,29000( టెయిల్‌కోడ్ ప్రత్యేక విమానాల గుర్తింపు కోసం ఇచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్)
బయటికి ప్రయాణికుల విమానంలా కనిపిస్తున్నప్పటికీ, ఇందులో ఉండే అత్యాధునిక ఎలక్ట్రిక్ పరికరాలు, రక్షణ వ్యవస్థల దృష్ట్యా ఎయిర్‌ఫోర్స్ వన్‌ను మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌గానే పరిగణించాల్సి ఉంటుంది.
వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం శత్రు రాడార్లను జామ్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది.
ఇందులో క్షిపణులను దారి మళ్లించే వ్యవస్థ ఉంది.
అత్యవసర సమయాల్లో నిరంతరాయంగా ప్రయాణించేందుకు వీలుగా గాలిలోనే ఇంధనం నింపుకోగలదు.

ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోని మూడు అంతస్తుల్లో 4 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటుంది.
ఇందులో అధ్యక్షుడితో పాటు ఆయన సహచరులు, సిబ్బంది ఉంటారు.
విమానంలో అధ్యక్షుడికి ప్రత్యేకంగా కేటాయించిన విలాసవంతమైన ప్రత్యేకమైన గది, చిన్న సైజు హాస్పిటల్, అందులోనే ఆపరేషన్ చేసేందుకు అవసరమైన టేబుల్, మీడియా, వీఐపీలు, సెక్యూరిటీ, సెక్రటేరియల్ సిబ్బంది ఉండేందుకు అనువుగా దీనిని రూపొందించారు.

ఫొటో సోర్స్, US Secret Service via X
'ది బీస్ట్' లో ప్రయాణం
ఎయిర్‌ఫోర్స్ వన్ నేల మీదకు దిగిన తర్వాత అధ్యక్షుడు "ది బీస్ట్" అని పిలిచే ఆధునీకరించిన లిమోజీన్‌లో ప్రయాణిస్తారు.
విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్ అని పిలిచినట్లుగానే దీనిని కాడిలాక్ వన్ అని పిలుస్తారు.
సీక్రెట్ సర్వీస్ వాహనాల మాదిరిగానే అధ్యక్షుడు ప్రయాణించే లిమోజీన్‌లో రెండు వెర్షన్లు ఉన్నాయి.
ట్రంప్ బ్రిటన్ చేరుకోవడానికి ముందే వీటిని అమెరికన్ మిలిటరీ కార్గో విమానంలో బ్రిటన్‌కు చేర్చారు.
అధ్యక్షుడు ఒక వెర్షన్ బీస్ట్‌లో ప్రయాణిస్తుంటే, మరోటి ఆయన వెనుక ఖాళీగా వస్తుంది. అంటే అధ్యక్షుడు ఏ వాహనంలో ఉన్నారో బయట ఉన్న వారికి తెలియదు.
ఈ రెండు వాహనాలకు వాషింగ్టన్ డీసీ జారీ చేసిన 800-002 అనే లైసెన్స్ నంబర్ ప్లేట్లు ఉంటాయి.
అధ్యక్షుడు ప్రయాణించే లిమోజీన్ లోపల ఏమున్నాయనే దాని గురించి ఈ వాహన తయారీదారులైన జనరల్ మోటార్స్ సంస్థ కానీ, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది పెదవి విప్పలేదు.
అయితే, ఇప్పుడు అందులో ఉండే రక్షణ అంశాల గురించి మాకు కొంత సమాచారం తెలిసింది.
దీనికి ఆయుధాలను తట్టుకునే బలమైన బాడీ, బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉన్నాయి.
దీని వల్ల ఈ వాహనం బరువు 9 టన్నులు ఉంటుంది.
వాహనంలో రాత్రి పూట కూడా చూడగలిగే కెమెరాలు, శాటిలైట్ ఫోన్, టియర్ గ్యాస్ గ్రనేడ్ లాంచర్లు ఉన్నాయి.

"ది బీస్ట్" వెర్షన్ల గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలను బట్టి కారులో ఆక్సిజన్ సరఫరా, అత్యవసర పరిస్థితుల్లో అందించేందుకు అధ్యక్షుడి బ్లడ్‌గ్రూపుకు సంబంధించిన రక్తాన్ని భద్రపరిచిన రిఫ్రిజిరేటర్ ఉన్నాయి.
అధ్యక్షుడి మోటార్‌కేడ్‌లో భాగంగా 'ది బీస్ట్'తో పాటు డజను వాహనాలు, పోలీసు అవుట్ రైడర్లు, దాడి జరిగినప్పుడు ఎదుర్కొనే బృందాలు, రోడ్ రన్నర్ అని పిలిచే ఆయుధాలు నింపిన ఎస్‌యూవీ, కమ్యూనికేషన్ వెహికల్, వైద్యులు, మీడియా సిబ్బంది ఉండే వాహనాలు ఉంటాయి.
అధ్యక్షుడి వాహన శ్రేణిలో ఏ వాహనంలో అధ్యక్షుడు ఉన్నాడనేది ఎవరికీ తెలియదు.
"అధ్యక్షుడి వాహన శ్రేణి అండర్ పాస్ కిందకు వెళ్లినప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను ఒక కారులో నుంచి మరో కారులోకి మార్చవచ్చు" అని కెస్లర్ చెప్పారు.

ఫొటో సోర్స్, DANIEL LEAL/AFP via Getty Images
గగనతలంలో రక్షణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్కువగా విమానంలోనే ప్రయాణిస్తుంటారు.
అయితే ఇటీవల చిన్న చిన్న ప్రయాణాలకు లిమోజీన్ ఉపయోగిస్తున్నారు.
ఈ ఏడాది జులైలో స్కాట్లండ్‌కు 'ది బీస్ట్'లో వెళ్లారు.
అమెరికా అధ్యక్షుడి బ్రిటన్ పర్యటనలో హెలికాప్టర్ ఫ్లీట్ కూడా వెళ్లనుంది.
ఇందులో ఎయిర్‌ఫోర్స్ వన్ మాదిరిగానే మెరైన్ వన్ అని పిలిచే హెలికాప్టర్ ఉంది.
ఇది ప్రత్యేకమైనది కాకున్నప్పటికీ అధ్యక్షుడు ప్రయాణించే అమెరికన్ మెరైన్ కార్ప్స్ ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పవచ్చు.
ప్రస్తుత బ్రిటన్ పర్యటన కోసం సికోర్స్కీ వీహెచ్-3డీ సీ కింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెరైన్ వన్‌గా వచ్చింది.
గత వారం ఈ ఎయిర్‌క్రాఫ్ట్ విండ్సర్ క్యాజిల్‌పై ఎగరడం కనిపించింది.

హెలికాప్టర్ ఫ్లీట్‌లో ఉండే వాటిని, వాటి డిజైన్ కారణంగా వైట్ టాప్స్ అని పిలుస్తారు.
వీటిలో క్షిపణి రక్షణ వ్యవస్థ, రాడార్ జామింగ్ సిస్టమ్స్, అణు పేలుళ్ల కుదుపులను తట్టుకునే ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమర్చి ఉంటాయి.
రక్షణ చర్యల్లో భాగంగా, మెరైన్ వన్ కూడా ఒకే మాదిరిగా ఉండే హెలికాప్టర్ల బృందంతో కలిసి ప్రయాణిస్తుంది.
మెరైన్ వన్‌ను గుర్తించకుండా ఉండేందుకే కొన్ని సందర్భాల్లో దాన్ని మిగతా హెలికాప్టర్లతో కలిపి తీసుకెళతారు.
మెరైన్ వన్‌తో పాటు ప్రయాణించే కాన్వాయ్‌లో గ్రీన్ టాప్స్ అని పిలిచే రెండు లేదా మూడు ఓస్ప్రే ఎంవీ-22 హెలికాప్టర్లు ఉంటాయి.
ఇవి విమానాలు ప్రయాణించే వేగంతో ప్రయాణించడంతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండవుతాయి.
ఓస్ప్రే యుద్ధ హెలికాప్టర్లలో అధ్యక్షుడి కార్యకలాపాలు చూసుకునేందుకు ఉద్దేశించిన సహాయ సిబ్బంది, ప్రత్యేక బలగాలు, ప్రయాణం మధ్యలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే దాన్ని ఎదుర్కొనేందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉంటారు.

ఫొటో సోర్స్, Warren Little/Getty Images
ఓస్ప్రే హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేటప్పుడు దానికి రెండు వైపులా ఉండే రోటార్ల వల్ల విపరీతమైన శబ్దం వస్తుంది.
2019లో ట్రంప్ బ్రిటన్ వచ్చినప్పుడు లండన్ గగనవీధుల్లో వాటి శబ్ధాలు మార్మోగాయి.
అధ్యక్షుడి ఇతర సిబ్బంది కూడా విమానాల్లోనే ప్రయాణిస్తారు. వీరిని ఇతర హెలికాప్టర్లలో తరలిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
డ్రోన్ల నుంచి ముప్పు
ప్రస్తుతం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. దీంతో ట్రంప్, మెలానియా దంపతులను కింగ్ చార్లెస్ 3, క్వీన్ కమిల్లా విండ్సర్ క్యాజిల్‌లో ఆతిథ్యమిస్తున్నారు.
విండ్సర్ క్యాజిల్ పరిధిలోని గగనతలంలో డ్రోన్లతో పాటు విమానాల రాకపపోకలపై కొన్ని పరిమితులు విధించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు చెప్పారు.
నేషనల్ పోలీస్ ఎయిర్ సర్వీస్ ఈ ఆంక్షల అమలును పర్యవేక్షిస్తుంది.
డ్రోన్ల నుంచి ముప్పు ప్రత్యేకమైనది, పైగా కొత్తగా దృష్టి సారించవలసిన అంశం కావడంతో వీటిపై సీక్రెట్ సర్వీస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని కెస్లర్ చెప్పారు. 2024 జులైలో అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగినప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల డ్రోన్ నిరోధక సామర్ధ్యం పేలవంగా ఉన్నట్లు తేలిందని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు రెండురోజుల పాటు బ్రిటన్‌లో పర్యటిస్తారు. అయితే ఇందులో ఆయన ప్రజలను కలిసే కార్యక్రమాలు ఏమీ లేవు.
ట్రంప్, మెలానియా దంపతులకు బ్రిటన్ రాజ కుటుబం బుధవారం విండ్సర్ క్యాజిల్‌లో రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా అమెరికా, బ్రిటన్‌కు చెందిన జెట్ విమానాలు, రెడ్ యారోస్ విమానాల ప్రదర్శనతో పాటు అధికారిక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
విండ్సర్ క్యాజిల్‌తో పాటు లండన్ నగరంలో ట్రంప్ రాకను వ్యతిరేకిస్తూ జరిగే నిరసన ప్రదర్శనల్లో వేల మంది పాల్గొంటారని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














