LED బల్బును మింగేసిన చిన్నారి... ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న ఆ బల్బును ఎలా బయటకు తీశారంటే...

- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శిశువులు, చిన్నపిల్లలు పెరిగే క్రమంలో వస్తువులను నోట్లో పెట్టుకోవడం, రుచి చూడడం అనేది సాధారణమే. అయితే, ఈ ప్రవర్తన పిల్లల శరీరానికి హానికరమైన వస్తువులను మింగే పరిస్థితికి దారితీయవచ్చు.
నాణేలు, బొమ్మలు, బటన్ బ్యాటరీలు, నగలు మొదలైన వస్తువులు పిల్లల కడుపులోకి వెళ్లి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇటువంటి ఘటనలు కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగాయి.
మూడున్నర సంవత్సరాల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న లోహంతో కూడిన ఎల్ఈడీ బల్బును ముంబయిలోని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు విజయవంతంగా బయటకుతీశారు.
ఈ రకమైన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండడం, పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.


మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన మూడేళ్ల బాలుడు గత మూడు నెలలుగా దగ్గుతోపాటు, శ్వాస తీసుకోవడంలో కష్టపడుతున్నాడు. రాహుల్ (గోప్యత కోసం పేరు మార్చాం) మొదట్లో న్యుమోనియాతో బాధపడుతున్నట్లు నిర్ధరణ కావడంతో అనేక యాంటీబయాటిక్స్ కోర్సులతో చికిత్స చేశారు.
అనేకమందులు వాడి చూసినా బాలుడి సమస్యలు తగ్గకపోవడంతో మరిన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది. సీటీ స్కాన్ చేయగా...ఎడమ బ్రాంకియస్ లోపల ఒక లోహపు ముక్క ఉన్నట్లు గుర్తించారు.
ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ ప్రయత్నాలు విఫలమైన తరువాత, ఆ బాలుడిని ముంబయిలోని జస్లోక్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ బ్రాంకోస్కోపీ చేయడంతో బాలుడు మింగింది లోహపు ముక్కతో కూడిన ఎల్ఈడీ బల్బనీ, అది బ్రాంకియస్‌లో ఉందనీ తేలింది.
ఆ తర్వాత మినీ థొరాకోటమీ అనే చికిత్సను నిర్వహించి, బాలుడు మింగిన ఎల్ఈడీ బల్బును విజయవంతంగా తొలగించారు. దీంతో చిన్నారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడింది.
"మేం చేసిన శస్త్రచికిత్సలలో ఇది అత్యంత అరుదైనది. ఎల్ఈడీ బల్బ్ ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లిపోయింది. సంప్రదాయ వైద్య విధానాల ద్వారా దీన్ని తీయలేకపోయాం. మినీ థొరాకోటమీ ద్వారా ఈ ఎల్ఈడీ బల్బును తొలగించి, చిన్నారిని రక్షించాం" అని జస్లోక్ ఆసుపత్రి థొరాసిక్ సర్జన్ డాక్టర్ విమేశ్ రాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సిడ్నీ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో పిల్లలు బటన్ బ్యాటరీ మింగిన కేసులు 400 కంటే ఎక్కువ నమోదయ్యాయి.
ఒక సందర్భంలో, రెండేళ్లు నిండని ఓ బాలుడు 20 మి.మీ. బ్యాటరీను మింగేయడంతో, కేవలం రెండు గంటల్లోనే ఆహారనాళం వాచిపోయింది.
బ్యాటరీని సకాలంలో తొలగించకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రమాదం 8 రెట్లు పెరుగుతుంది. ఇలాంటి సందర్భాలలో 9% కేసుల్లో పిల్లలు మరణించారు.
అమెరికాలోని కొలరాడోలో ఒక చిన్నారి నాణెం మింగడంతో అతనిని పిల్లల ఆసుపత్రిలో చేర్చారు.
చాలా సందర్భాల్లో నాణెం శరీరం నుంచి సహజంగానే బయటకు వెళుతుంది. కానీ అది ఆ పిల్లాడి అన్నవాహికలో ఇరుక్కుపోయింది.
ఇలా ఇరుక్కుపోయిన వస్తువులను 24 గంటల్లోపు తొలగించాలని, లేకుంటే రక్తస్రావం లేదా గాయాలు అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
పిల్లలు ఏ వస్తువులు మింగే ప్రమాదం ఉంది?
- నాణేలు
- బటన్ బ్యాటరీలు (బటన్ సెల్)
- చిన్న బొమ్మలు లేదా వాటి ముక్కలు
- ఆభరణాలు
- పెన్సిల్ కొనలు, పిన్నులు, క్లిప్పులు


లోహ వస్తువులు, నాణేలు లేదా పెద్ద సైజు విత్తనాలను మింగడం వల్ల చిన్నపిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందా అనే దాని గురించి జస్లోక్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ విమేశ్ రాజ్‌పుత్‌తో మాట్లాడింది బీబీసీ.
జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో రోబోటిక్ థొరాసిక్ సర్జన్‌గా డాక్టర్ రాజ్‌పుత్ పనిచేస్తున్నారు.
"ముందుగా మన శరీరంలోని రెండు ముఖ్యమైన నాళాల గురించి తెలుసుకోవాలి. ఒకటి ట్రాకియా (శ్వాసనాళం), మరొకటి ఇసోఫాగస్ (ఆహారనాళం). ఏదైనా వస్తువు ఇసోఫాగస్‌లో పడితే, అది సాధారణంగా మలంతోపాటు బయటకు వస్తుంది. చాలా అరుదుగా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కానీ శ్వాసనాళంలోకి వెళ్లితే మాత్రం ప్రాణాంతకం కావచ్చు . చిన్నారికి వెంటనే వైద్య చికిత్స అవసరం. కొన్నిసార్లు అది కఫం నుంచి బయటకు వస్తే.. మంచిదే. కానీ చిన్న పిల్లల్లో ఇలా జరగడం కష్టం. అందుకే, చిన్న పిల్లలను ఇలాంటి వస్తువుల నుంచి ఎప్పుడూ దూరంగా ఉంచాలి" అని డాక్టర్ రాజ్‌పుత్ వివరించారు.
పిల్లలు ఏవైనా వస్తువులను మింగినప్పుడు ఏం చేయాలి?
ఇదే ప్రశ్నను నవీ ముంబయిలోని అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ స్పెషలిస్ట్, పీడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ విజయ్ యెవాలేను అడిగాం.
"వెంటనే వైద్య చికిత్స అందించాలి. కొంతమంది పిల్లలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. వారు నాణెంలాంటి వస్తువును మింగినట్లయితే, భయపడకుండా వైద్య చికిత్స చేయించాలి. వస్తువు బయటకు వచ్చేలా లేదా వాంతి అయ్యేలా పిల్లలకు ఏదైనా ఆహారం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది" అని ఆయన అన్నారు.
‘‘ఏదైనా వస్తువు అన్నవాహికలోకి చేరితే, పిల్లలు ఏడుస్తారు. కాసేపటి తర్వాత ఏడుపు ఆపేస్తారు. అప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లి ఛాతీ, ఉదరం ఎక్స్-రే తీసుకొని వైద్యులు సూచించిన చికిత్స తీసుకోవాలి. ఒకవేళ ఆ వస్తువు పిల్లల శ్వాసనాళంలోకి ప్రవేశించినట్లయితే, పిల్లవాడు ఏడుస్తాడు కానీ స్వరం భిన్నంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అరుదైన సందర్భాల్లో, శిశువు నీలం రంగులోకి మారవచ్చు. కాబట్టి, వెంటనే వైద్యుడి సహాయం తీసుకోవాలి" అని డాక్టర్ రాజ్‌పుత్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏంటి?
" వస్తువు ఏదైనా అన్నవాహిక గుండా వెళితే, 90 శాతం కేసుల్లో అది కడుపులోకి వెళుతుంది. అప్పుడు అరటిపండ్లు వంటి అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న పండ్లు తినడం లేదా విరేచనాలు కావడానికి మందులు తీసుకోవడం వల్ల అది మలం గుండా వెళ్ళడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో, ఎగువ జీర్ణశయాన్ని చెక్ చేస్తారు. ఇందులో, వస్తువును తొలగించడానికి కడుపులోకి కెమెరాను పంపుతారు. అరుదైన సందర్భాల్లో, శస్త్రచికిత్స అవసరం" అని విమేశ్ రాజ్‌పుత్ తెలిపారు.
"ఒకవేళ పిల్లలు మింగిన వస్తువేదైనా శ్వాసనాళంలో చిక్కుకుంటే, చికిత్స అవసరం. అది కఫంతో బయటకు రాకపోతే, బ్రాంకోస్కోపీ చేస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో, ఛాతీ శస్త్రచికిత్స చేస్తారు" అని ఆయన అన్నారు.
ఇటువంటి సందర్భాలలో సకాలంలో చికిత్స ఎంత ముఖ్యమో, ఈ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














