ఇల్లంతా చిందరవందరగా ఉందా? ఇంటిని సర్దుకోవడానికి 4 సింపుల్ టిప్స్..

ఫొటో సోర్స్, Getty Images
సెలవు రోజు ఇంట్లో ఉంటే, ఇల్లంతా పనికి రాని వస్తువులతో నిండిపోయినట్లు అనిపిస్తుంది.
ఇంట్లో ఉండే వస్తువుల్లో చాలా వరకు వీటితో ప్రత్యేకంగా ఏమవసరం ఉంది? అనిపిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో, ఇల్లంతా చిందరవందరగా ఉన్నప్పుడు ఇంటిని సర్దుకోవడం గురించి ఆలోచనలు వస్తాయి.
ఇంట్లో వస్తువుల్ని శుభ్రంగా, ఒక పద్దతి ప్రకారం ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఉత్సాహంగా అనిపిస్తుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, ఇంటిని సర్దుకునేటప్పుడు ఏది ఉంచాలి? ఏది పడేయాలి? అనేది నిర్ణయించుకోవడం అంత తేలిక కాదు.
ఇంటిని సర్దుకోవడానికి ఉపయోగపడే 4 సులువైన మార్గాల గురించి నిపుణులు బీబీసీ రేడియో4 కార్యక్రమంలో వివరించారు. అవేంటంటే..


ఫొటో సోర్స్, Getty Images
1. చిన్నవాటితో మొదలుపెట్టండి
ఇంటిని సర్దుకోవడం చాలామందికి పెద్ద సవాల్. అందుకే ఇల్లు చక్కదిద్దడానికి ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం ముఖ్యం.
ముందుగా పాత బహుమతులు, ఇకపై ఉపయోగం లేదని భావించే వస్తువుల్ని పారేయడంతో మొదలుపెట్టండి.
ఇల్లు సర్దుకునేటప్పుడు నెమ్మదిగా కదలడం ముఖ్యమని బ్రిటిష్ రియాలిటీ పోటీ టీవీ సిరీస్ 'ఇంటీరియర్ డిజైన్ మాస్టర్స్' జడ్జ్ మిషెల్ ఒగుండెహిన్ చెప్పారు.
"మంచిది. వీటితో అవసరం లేదు. ఇవన్నీ పడేయాలి అనుకోకండి. ఒక్కో వస్తువును పట్టుకుని, పరిశీలించి, ఆలోచించి అడుగు వేయండి" అని ఆమె చెప్పారు.
ఇంట్లోని లివింగ్ రూమ్ టేబుల్ డ్రాయర్ లేదా అల్మారా నుంచి ప్రారంభించి క్రమంగా ముందుకు వెళ్లాలి. దీని వల్ల పని తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తుందని మిషెల్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
2. వాడని వస్తువులను ఏం చేయాలో ముందే నిర్ణయించుకోండి
మీరు పడేయాలనుకుంటున్న వస్తువులను ఏం చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.
వస్తువులను తీసివేయడానికి ముందు లేదా ఇల్లు సర్దుకోవడానికి కొన్ని రోజుల ముందు వాటి గురించి ప్లాన్ చేయండి. అవసరమైతే ఒక కాగితం మీద పనికిరాని వస్తువుల జాబితా తయారు చేసుకోండి.
"మీ ఇంట్లో, హాల్‌లో చెత్తకుప్ప పేరుకుపోవడం మీకు నచ్చదు" అని ప్రొఫెషనల్ ఆర్గనైజర్, డీక్లట్టర్ హబ్ సహ వ్యవస్థాపకురాలు ఇంగ్రిడ్ జేన్సన్ అన్నారు.
డీక్లట్టర్ హబ్ అనేది 60,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీ.
నిరుపయోగంగా ఉన్న వస్తువులను దానం చేయడం, రీసైక్లింగ్ చేయడం లేదా పారేయడం వంటి ప్రత్యామ్నాయాలలో ఏదైనా చేయవచ్చని జేన్సన్ చెప్పారు.
ఇలా చేసేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మనకు ఉపయోగం లేని మన్నికైన వస్తువుల్ని ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. నాణ్యతకు ప్రాధాన్యం
ఇంటిని సర్దుకోవడం అంటే, మీరు ఇష్టపడే వస్తువులను కూడా పడేయడం కాదు.
"మీరు ఉంచుకోవాలనుకునే వస్తువుల్ని మీ చుట్టూ పెట్టుకోండి" అని మిషెల్ సలహా ఇచ్చారు
"ఇంట్లో మీ చుట్టూ మీకు అవసరమైన వస్తువులు, మిమ్మల్ని ఉత్సాహపరిచే వస్తువుల్ని ఉంచుకోండి. అవి మీరు ఇంట్లో అడుగుపెట్టగానే ఆనందం కలిగిస్తాయి. అవి ఏవైనా కావొచ్చు. మీరు వేరే ప్రాంతంలో కొన్నవి, ఫోటోలు, పిల్లలు తయారు చేసిన బొమ్మలు, ఏవైనా కావొచ్చు" అని ఆమె తెలిపారు.
ఇంట్లో ప్రతీ వస్తువుకు ఒక నిర్దిష్ట స్థానం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని మిషెల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4.పాత జ్ఞాపకాలు - భావోద్వేగాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి
ఇంట్లో ఉన్న వస్తువుల్లో కొన్నింటితో ఉన్న భావోద్వేగ బంధం వల్ల వాటిని పడేయడం కష్టంగా ఉంటుంది.
అయితే భావోద్వేగాలు, జ్ఞాపకాలు వేర్వేరని ఛానల్ 4 షో 'ది హోర్డర్ నెక్స్ట్ డోర్' హోస్ట్ , సైకోథెరపిస్ట్ స్టెలియోస్ కియోసెస్ చెప్పారు.
భావోద్వేగం ఆ వస్తువుతో ముడిపడిన బంధాన్ని లేదా ప్రత్యేక క్షణాన్ని సూచిస్తుంది. అది ఒక సంబంధం, లేదా విజయం, లేదా ఒక ప్రత్యేకమైన క్షణం గురించి కావొచ్చు.
కానీ, జ్ఞాపకం అనేది ఆ వస్తువును చూసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞాపకాలు మన మదిలోకి వస్తాయి. పాత వస్తువులు, ఫోటోల వంటివి.
"మీరు మీ పిల్లల బొమ్మలను చూసినప్పుడు మీరు భావోద్వేగానికి గురవుతారు. ఎందుకంటే, అది మీరు వారితో ఆడుకున్న సమయాలను గుర్తు చేస్తుంది" అని కియోసెస్ వివరించారు.
పనికిరావని భావించే వస్తువులను పారవేయడానికి లేదా పక్కన పెట్టడానికి ముందు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఉదాహరణకు, మీ బిడ్డ మొదటిసారి ధరించిన బూట్లను తీసుకోండి.
"మీరు వాటిని పిల్లల కోసమైనా ఉంచాలని అనుకుంటారు. అయితే, వాస్తవం ఏంటంటే అవి మీ జ్ఞాపకాలు" అని డీక్లట్టర్ హబ్‌కు చెందిన జేన్సన్ చెప్పారు.
"ఎందుకంటే, మీరు మీ పిల్లలతో కలిసి షాపుకు వెళ్లి బూట్లు కొని వాటిని వాళ్ల కాళ్లకు వేసినప్పుడు ఆ సందర్భం మీకు ఆ బూట్లను చూడగానే గుర్తుకు వస్తుంది" అని జేన్సన్ అన్నారు.
అందుకే ఇల్లు సర్దేటప్పుడు పడేయాలని భావించే వస్తువులకు సంబంధించి నిజమైన కారణాలను గుర్తించండి.
కుటుంబం సభ్యులు ఆ వస్తువులను కోల్పోతారో, లేదో కూడా చూడండి.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వల్ల అన్ని జ్ఞాపకాలను భద్రపరచుకునే మార్గం ఉంది.
ఒక ఫోటో వెయ్యి మాటలకు సమానమైనప్పుడు, మనం నిజంగా ప్రతిదీ దాచి పెట్టుకోవాల్సిన అవసరం ఉందా?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














