karur: 'పొద్దున్నే పెళ్లిచూపులకు వెళ్లాలి.. ఇంతలోనే'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని కరూర్ జిల్లా వేలుసామిపురంలో టీవీకే నాయకుడు, నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి చిన్నారులు, మహిళల సహా 39 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడివున్న వేలాది చెప్పులు, తువాళ్లు, వాటర్ బాటిళ్లు తొక్కిసలాట తీవ్రతకు అద్దంపడుతున్నాయి.
కరూర్ చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు.
మరోవైపు, టీవీకే నాయకుడు విజయ్ కూడా మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపారు.


విజయ్‌ను అరెస్టు చేస్తారా?
విజయ్‌ను అరెస్టు చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ, ''హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిషన్ వేశాం. ఆ కమిషన్ మొత్తం సంఘటనపై విచారణ జరిపి, పూర్తిస్థాయి నివేదిక అందజేస్తుంది. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తుది నివేదికను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి'' అని చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రధాన కార్యదర్శి ఆనంద్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) డేవిడ్‌సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, CMO
చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచారు.
వాస్తవానికి, కరూర్‌లో సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల సమయంలో ర్యాలీ నిర్వహణకు అనుమతి తీసుకున్నారని, కానీ విజయ్ సాయంత్రం వచ్చారని ఈ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీకి వెల్లడించారు.

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
''ఉదయం నుంచి వచ్చిన వారెవ్వరూ తిరిగివెళ్లలేదు. నేను జనసమూహంలో చిక్కుకుపోయాను. కొంతమంది యువకుల సాయంతో బయటపడ్డాను'' అని తమిళనాడులోని కరూర్ జిల్లా వేలుసామిపురంలో తమిళ నటుడు, టీవీకే నాయకుడు విజయ్ ప్రచార ర్యాలీ సందర్బంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రత్యక్ష సాక్షి దుర్గాదేవి బీబీసీతో చెప్పారు.
''ఎవరికీ తిండి కానీ, తాగడానికి నీళ్లు కూడా దొరకలేదు. పిల్లలు స్పృహ కోల్పోవడం నా కళ్లతో చూశాను'' అని మరో ప్రత్యక్ష సాక్షి లక్ష్మి తెలిపారు.
టీవీకే ర్యాలీకి వెళ్లి, తొక్కిసలాట సంఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్న వేలుసామిపురం నివాసి దుర్గాదేవితో బీబీసీ మాట్లాడింది.
''ఉదయం జనం పలుచగానే ఉన్నారు. కానీ, విజయ్ రావడం ఆలస్యమైంది. జనం బాగా పెరిగిపోయారు. బయట పట్టణాల నుంచి అధిక సంఖ్యలో జనం వచ్చారు. ప్రచార ర్యాలీ నిర్వహించాలనుకున్న ప్రదేశంలో నిన్నటి నుంచే దుకాణాలను మూసేశారు. బయటి నుంచి వచ్చిన వారికి ఆహారం కానీ, తాగునీరు కానీ దొరకలేదు. సాయంత్రం తొక్కిసలాట జరగడానికి ముందే చాలామంది స్పృహ కోల్పోయారు'' అని దుర్గాదేవి వివరించారు.
తాను ప్రాణాలతో బయటపడ్డానంటే అది కేవలం కొంతమంది యువకుల సాయం వల్లేనని ఆమె చెప్పారు.
''ఉదయం నుంచి ఇక్కడకు వచ్చిన వారిలో ఏ ఒక్కరూ వెనక్కి వెళ్లిపోలేదు. సమయం గడిచేకొద్దీ జనాల రద్దీ పెరిగిపోయింది. సాయంత్రానికల్లా పరిస్థితి అదుపుతప్పింది. తొక్కిసలాట జరిగింది. నేను అందులో చిక్కుకుపోయాను. మా ఊరికి చెందిన కొంతమంది యువకుల సాయంతో బయటపడి భవనంపైకి ఎక్కేశాను. అందుకే గాయాల్లేకుండా బయటపడగలిగాను'' అని దుర్గాదేవి అన్నారు.
పిల్లలు స్పృహ కోల్పోయారు...
వేలుసామిపురం గ్రామానికే చెందిన లక్ష్మి బీబీసీతో మాట్లాడుతూ, ''ఉదయానికి జనం రద్దీ లేదు. ప్రారంభంలో ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. కానీ, రద్దీ పెరిగిపోవడంతో సరిగ్గా నిర్వహించలేకపోయారు. చాలామంది పిల్లలు స్పృహ కోల్పోవడం నా కళ్లతో చూశాను'' అని చెప్పారు.

'ఇంటికి తిరిగొచ్చాడు కానీ.. ప్రాణాలతో లేడు'
పెళ్లిచూపుల సందడి ఉండాల్సిన, కరూర్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ రవి ఇంట్లో ఇప్పుడు కుటుంబ సభ్యుల రోదనలు కనిపిస్తున్నాయి.
''నా కొడుకు కొంతకాలంగా బిజినెస్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. కావాల్సినవన్నీ కొనుక్కొస్తానని వెళ్లాడు. ర్యాలీ చూడటానికి స్నేహితులతో కలిసి వెళ్తున్నానని, చూసి వచ్చేస్తానని చెప్పాడు. తొక్కిసలాట జరిగిందని తెలిసి, సెల్‌ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. కానీ.. తిరిగొచ్చాడు, ప్రాణాలతో మాత్రం లేడు'' అని రవి తల్లి రోదిస్తున్నారు.
విజయ్ ర్యాలీకి వెళ్లి, తొక్కిసలాటలో దిండిగల్ జిల్లా వేదసందుర్‌కు చెందిన తమరాయ్ కన్నన్ ప్రాణాలు కోల్పోయారు. అతనికి వివాహమై ఏడాది కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం ఆయన భార్య నిండుగర్భిణి.
కరూర్ జిల్లా విశ్వనాథపురానికి చెందిన హేమలత, ఆమె ఇద్దరు పిల్లలు సాయిలేచన, సాయిజీవ కూడా తొక్కిసలాట మృతుల్లో ఉన్నారు. సాయిలేచన కరూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల్లో 28 మంది కరూర్ జిల్లాకు చెందినవారే. వారిలో ఏడుగురు ఏమూరు గ్రామస్థులు.
ప్రస్తుతం కరూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 61 మంది చికిత్స పొందుతున్నారు. కరూర్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో 52 మంది క్షతగాత్రులను చేర్పించారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు. మరణాల సంఖ్య పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














