తమిళనాడు: కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్ట్ ఆదేశాలు.. పర్యవేక్షణ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే

తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట దుర్ఘటనపై దర్యాప్తు బాధ్యతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది.
అలాగే, సీబీఐ విచారణపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
ఈ కమిటీలో మిగతా ఇద్దరు సభ్యులుగా తమిళనాడు డివిజన్‌లో పనిచేస్తున్న ఐజీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉంటారు. అయితే, వారిద్దరూ తమిళనాడుకు చెందనివారై ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
దర్యాప్తులో సేకరించిన అంశాలు, ప్రగతిపై సీబీఐ నెలవారీ నివేదికలను ఈ కమిటీకి సమర్పిస్తుంది. వాటిని కమిటీ పరిశీలించి సీబీఐకి తగిన దిశానిర్దేశం చేస్తుంది.
‘‘ఈ సమస్యలు పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయి. దేశాన్ని కదిలించిన ఈ సంఘటన (కరూర్ తొక్కిసలాట)పై నిష్పక్షపాత విచారణ జరగాలి. అందువల్ల, విచారణను సీబీఐకి అప్పగించడం అవసరం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన రెండు పిటిషన్‌లకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, అందుకు 8 వారాల గడువు ఇచ్చింది
ఇదే సందర్భంలో, మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించింది.
రాజకీయపార్టీల ర్యాలీల నిర్వహణకు ప్రామాణిక విధానం (ఎస్‌వోపీ) ఉండాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన మద్రాసు హైకోర్టు, తమిళనాడు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ర్యాలీల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను క్రిమినల్ రిట్ పిటిషన్‌గా ఎలా నమోదు చేశారో నివేదిక ఇవ్వాలని మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శకాలను కోరుతున్న ఆ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కరూర్ దుర్ఘటన ఎలా జరిగింది?
సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ నాయకుడు, సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది చిన్నారుల సహా 41 మంది మృతి చెందారు.
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికి సాయం అందజేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
ఈ ఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్ 27న కరూర్‌లోని వేలుసామిపురంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సమావేశానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. జనసందోహం ఎక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ఈ తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా చాలా మంది స్పృహ కోల్పోయి కింద పడిపోయారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి తదితరులు సంతాపం తెలిపారు.

అసలేం జరిగింది?
తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సాయంత్రం 7 గంటలకు వేలుసామిపురంలో ప్రచారం చేస్తున్నారు. విజయ్ మాట్లాడుతున్న సమయంలోనే కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు.
ఆయన తన ప్రచారం ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత, తొక్కిసలాటలో చాలామంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారని వార్తలొచ్చాయి.
తరువాత, సమావేశం జరిగిన ప్రదేశానికి అనేక అంబులెన్సులు వచ్చాయి. వాటిలో చాలా మందిని ఆసుపత్రులకు తరలించారు.

విజయ్ ఏమన్నారంటే..
"కరూర్‌లో మరణించిన మన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని కరూర్ సంఘటనపై టీపీకే అధినేత విజయ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
తమిళనాడు ప్రభుత్వం ఏమంది?
ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
"సెప్టెంబర్ 27న కరూర్ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది మరణించారని తెలిసి నేను చాలా బాధపడ్డాను, ఇంకా ఆ బాధలోనే ఉన్నా."
" ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలచివేసింది. పూడ్చలేని నష్టాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు నా ప్రగాఢ దుఃఖం, సానుభూతిని తెలియజేస్తున్నా. చికిత్స కోసం ఆసుపత్రులలో చేరిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను" అని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాని మోదీ సంతాపం
కరూర్ దుర్ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
''తమిళనాడులోని కరూర్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో జరిగిన దురదృష్టకర ఘటన తీవ్రంగా కలచివేసింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'' అని ప్రధాని మోదీ అందులో రాశారు.
''తమిళనాడు కరూర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా'' అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు.

సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ
టీపీకే నేత విజయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సంతాపం తెలిపారు.
"తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో జరిగిన సంఘటన విషాదకరం. ఇందులో చాలామంది తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాశారు.

బాధాకరమన్న రజినీకాంత్, కమల్ హాసన్
కరూర్ ఘటన హృదయ విదారకం, బాధాకరమైనదని నటుడు రజినీకాంత్ అన్నారు.
"కరూర్‌లో అమాయకులు ప్రాణాలను కోల్పోయిన వార్త హృదయ విదారకమైనది, తీవ్ర బాధాకరమైంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై నటుడు కమల్ హాసన్ స్పందించారు.
"నా హృదయం బాధతో నిండిపోయింది. కరూర్ నుంచి వస్తున్న వార్తలు దిగ్భ్రాంతికరమైనవి, బాధాకరమైనవి. నోట మాట రావడంలేదు" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














